Friday, December 9, 2022

కుక్కచావు

వ్యంగ్యరచన

నా భార్యను నా కళ్ళ ముందే అవమానించిన ఆ వెధవని ఊరికే వదిలెయ్యకూడదు. చంపేసి ఉప్పుపాతరేసి, పూడ్చేసి, అడపాదడపా శవాన్ని బయటికి తీసి మళ్ళీ మళ్ళీ చంపుతుండాలి. నా గొంతులో ప్రాణం ఉండగా వాడు చచ్చినా సరే వాణ్ణి ఒదలకూడదు. లేకపోతే వాడి హోదాని అడ్డంపెట్టుకొని, నా కళ్ళ ముందే నా ప్రాణాన్ని, నా జీవితాన్ని తాకి ‘‘యువర్ వైఫ్ ఈజ్ సెక్సీ’’ అంటూ నడుం మీద చెయ్యి వేస్తాడా. చూస్తాను! చూస్తాను! నాదంటూ ఒక రోజు రాకపోతుందా? ఆ వచ్చిన రోజు వాణ్ణి, వాడి పెళ్ళాన్ని నే ఒదల్ను. దిక్కున్న దగ్గర చెప్పుకోమంటాను, వెధవని. ఆ సంఘటన తలుచుకొంటేనే నా ఒళ్ళు జలదరిస్తోంది. పాపం పార్వతి నా నిస్సహాయతని గమనించి, అవమానాన్ని కన్నీటితో కళ్ళు పూడుకుపోగా బలవంతంగా దిగమింగుకుంది. వాడే కానీ నా పై అధికారి కాకపోయి ఉంటే అప్పటికప్పుడే పళ్ళు రాలగొట్టి ఉండేది. నేను మాత్రం ఊరుకొనేవాణ్ణా. వాడు ఏ టాయిలెట్ కో వెళ్ళినప్పుడు చూసి, బలంగా తల పట్టుకొని లెట్రిన్ లో ముంచేసేవాణ్ణి. ఆ తరువాత ఆ వెధవ జీవితంలో తలెత్తుకుని తిరిగేవాడు కాదు. తల పెకెత్తుకు తిరగడం సంగతలా ఉంచి తన మొహం తను అద్దంలో చూసుకొన్నా డోక్కుంటాడు.

Also read: గీతోపదేశం

ప్చ్, ఏం చేస్తాం. వాడదృష్టం అలాగుంది. కొందరు పెట్టిపుట్టారంటారు. వాడలాగే పుట్టాడు. కులానికి పెద్దవాడైనా, గుణంలో గుడిసేటివాడు. కాకపోతే పార్టీలో నలుగురి ముందూ నా పార్వతిని గిల్లుతాడా? గిల్లాడే అనుకోండి తనని పట్టుకొని అంత మాటండా? యువారేలక్కీఫెలో, యువర్ వైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ. నేనూ ఉన్నాను ఎందుకు, కల్సొస్తుంది కదానని కాకిని కట్టుకొన్నాను. నా ముందరెందుకు పనికొస్తుంది? అది పక్కనుంటే నాకు దిష్టి తగలకుండా ఉంటానికి తప్ప…అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొన్నాడు. అది చూసి ఆఫీసులో పనిచేసే లేడీస్ ‘పాపం బాస్’ అని జాలిపడతారనుకొన్నాడు వాడు. అప్పటికే వాడు చేసిన నానా యాగీ భరించిన వాళ్ళు  యీ జన్మకి వాడికిదే పనిష్మెంట్ అనుకొని ఉంటారు. ఎవరేమనుకున్నారో నాకు తెలుసు. నేనైతే ఈ లంజకొడుక్కి సుఖమే కష్టంలా అనిపిస్తుందేమోననుకొన్నాను. అయినా అధికారం క్రింద నలిగిపోయేవాళ్ళకి బాధ కానీ, అధికారానికెందుకు నొప్పి?

Also read: మృగరాజు

నాకైతే కన్నెత్తి దానికేసి చూడ్డానికి ధైర్యం చాలడం లేదు.

బాధతో, ఆవేశంలోఅది ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. అందుకు బదులుగా ఆ వెధవ దాని మోడెస్టీని దెబ్బతీసినప్పుడు నిస్సహాయంగా ఉండిపోయిన నన్ను అది పనిష్ చేస్తే బావుండేది. ఎలా పనిష్ చేస్తుంది? వాడూ మగాడే! నేనూ మగాణ్ణే..వాడు తన్ని రేప్ చేసినా, ‘‘డిడ్ యూ ఎన్ జాయ్ విత్ హిమ్’’ అని అడిగి, అవమానించి, దాన్ని శిక్షిస్తానేమోనని భయం. ఎలా? ఎలా? నా గిల్ట్ ఎన్ని సార్లు నా మొహం కడుక్కుంటే నన్ను ఒదిలి పోతుంది? ఈ ఒక్క జన్మకి సరిపోదు. గతం జన్మల్లోకి వెళ్ళి కడుక్కోవాలి. వచ్చే జన్మల్లోకి వెళ్లి కడుక్కోవాలి. అయినా నే దానికేసి చూడగలనా? నేనలాంటి వెధవ క్రింద పని చెయ్యను అని వాడి మొహాన రాజీనామా విసిరి వెయ్యగలనా? ఆ పని చెయ్యలేను. చెయ్యను. చెయ్యను కాక చెయ్యను. ఒరేయ్ రస్కెల్నికోవ్! నువు ఒక హంతకుడివి. హంతకుడి కంటే ఆత్మని చంపుకొన్నివాడు మహాపాపాత్ముడు. నిన్ను ఎన్ని జన్మలు ఖైదు చేసినా, ఎన్ని సార్లు ఉరితీసినా తప్పులేదు. నువు పరమ దుర్మార్గుడివి, పరమ పాపివి. నికృష్డుడివి. నీ ముందే నీ భార్యని ఆ అధికారి అవమానించడం కాదు రేప్ చెయ్యాల్సింది. అది చూసి నువ్వు సుఖించేవాడివి.

Also read: హెడ్డు ఎప్పుడు మారతాడు?

చీ…చీ. ఇలాంటి బ్రతుకు నాకొద్దు. కంటికి కన్ను, పంటికి పన్నుకి మించి దుర్మార్గమైన శిక్షలేదన్నారు. వాడికి తగిన శాస్తి చెయ్యాల్సిందే. వాడి భార్యనో, తల్లినో, కూతుర్నో, అక్కనో, చెల్లినో ఒదలకూడదు. ఒదలను.

అమ్మో ఇంకా ఏమైనా ఉందా? ఎన్ కౌంటరైపోనూ. కాదంటే ఆత్మహత్మ అయిపోదూ! కుక్కని కాల్చి చంపుతే, కుక్కని ఆత్మహత్య చేస్తే నేరం కాదు.

ఇలాగ నేను దిక్కులేని బ్రతుకు బ్రతకాల్సిందేనా?

దిక్కులేని చావు చావాల్సిందేనా?

Also read: సమాధిలోని హిట్లర్ మేల్కొన్నాడు!

Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 22245

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles