Tuesday, November 12, 2024

ఖమ్మంలో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

• మారనున్న రాజకీయ సమీకరణలు
• షర్మిలకు టీఆర్ఎస్ నేతల సహకారం?
• టీఆర్ఎస్ నుంచి వలసలకు ఆస్కారం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వెఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన అభిమానులు ఏపీలో వైపీపీ గూటికి చేరారు. తెలంగాణ విషయానికొస్తే 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలుగా బాణోతు మదన్‌లాల్‌, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అప్పటినుండి తెలంగాణలో వైసీపీ ఎన్నికల్లో పోటీచేయడంలేదు. దీంతో వైఎస్ ను ఎంతగానో అభిమానించే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వివిధ పార్టీలలో చేరిపోయారు. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు వైఎస్‌ కుమార్తె షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం కేంద్రంగా ప్రారంభించాలని వ్యూహ రచన చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓటు బ్యాంకును బేరీజు వేసుకున్న ఆమె లోటస్‌పాండ్‌లో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశం తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో ఆత్మీయ సమావేశాలను నిర్వహించడానికి పక్కాప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో నిర్వహించే సమావేశాల్లో మొదటగా ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల (ఫిబ్రవరి) 21న హైదరాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లాకు ర్యాలీగా చేరుకుని జిల్లాలోని నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించనున్నారు.

Also Read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

టీఆర్ఎస్ కు గడ్డుకాలం :

అయితే షర్మిల పెట్టనున్న పార్టీకి ఖమ్మం జిల్లాలో ప్రజల ఆదరణ స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మొదటగా నష్టపోయేది టిఆర్ఎస్ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంతో పాటు అన్ని గిరిజన రిజర్వ్ నియోజకవర్గాలు, సత్తుపల్లి నియోజక వర్గంలో షర్మిల పార్టీ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆయా నియోజకవవర్గాలలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎక్కువ ఉండటం, 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటు 3 గిరిజన నియోజక వర్గాల్లో వైసీపీ విజయం సాధించడం, సత్తుపల్లి నియోజక వర్గంలో స్వల్ప తేడాతో ఓటమిపాలు కావడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలహీన పడటం, టిఆర్ఎస్ లో కొనసాగుతున్న వర్గ విభేదాలతోపాటు రెండు పార్టీలలోని అసంతృప్తనేతలు సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లొ కొనసాగుతారా? షర్మిల పార్టీకి జై కొడతారా? అన్నది ఇప్పుడు జిల్లా అంతటా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీకి పొంగులేటి పరోక్షంగా సహాయ పడుతున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?

మారనున్న సమీకరణలు :

మొత్తంమీద షర్మిల ఈ నెల 21న ఖమ్మం లో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు పెద్ద ఎత్తున్న మారే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. షర్మిల పార్టీ ప్రకటనతో గతంలో చెల్లాచెదురైన క్యాడర్ నుంచి ఎంత మంది మళ్లీ షర్మిలకు జై కొడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షర్మిల పెట్టబోయే పార్టీతో ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బతగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles