Thursday, April 25, 2024

అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?

  • నమ్మేది ఎవరు ?  చేరేది ఎవరు ?
  • అసలు తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందా!

” తెలంగాణ ఉద్యమాన్ని పాతాళలోకం లోకి తొక్కడానికి యత్నించిన స్వర్గీయ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల.  తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి  పార్లమెంట్  లో ప్ల కార్డులు ప్రదర్శించి న వైయస్సార్ పార్టీ అధినేత ఏపీ సీఎం సోదరి షర్మిల. ఇప్పుడు తెలంగాణ ప్రజల కన్నీరును తుడిచేందుకు  వస్తున్నారట.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రక్తసంబంధం, అదే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటే నమ్మేది ఎవరు ? అనే సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ గడ్డ మీద పార్టీ నడపడం నా తరం కాదు అంటూ వెళ్ళిపోయిన  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి ఇదే గడ్డపై జెండా ఎగురవేస్తాను, కర్ర సాము చేస్తా. పాదయాత్ర చేసి రైతులు ,విద్యార్థులను సంతోషపెడతాను అంటున్న షర్మిల అక్క. నీ అన్న వీడిన  తెలంగాణ గడ్డపై ఎలా సాము చేస్తావు చెల్లెమ్మ అయ్యారే షర్మిలమ్మ.. మీ పార్టీలో చేరేది ఎవరు? మీ పార్టీ ని నమ్మేది ఎవరు? కాలమే  సమాధానం చెప్పాలి.

పార్టీ పెట్టడానికి పరిస్థితులు ఏమిటి ?

ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ ,జాతీయ పార్టీలు పెట్టుకునే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఈ నెల (ఫిబ్రవరి) 9న జరిగిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం లో ఆయన కూతురు వైఎస్ షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో ” రాజన్న రాజ్యం” తెస్తాను అంటూ రైతులు విద్యార్థులు సుఖంగా ఉన్నారా ? ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు జరుగుతుందా ?అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు పెట్టాల్సిన పరిస్థితులు ఏమున్నాయో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ? షర్మిలమ్మ కే తెలుసు కాబోలు!

దేశంలో 2293 రాజకీయ పార్టీలు !

దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన గుర్తించిన చిన్నా చితకా రాజకీయ పార్టీల సంఖ్య  2293 ఈ సంఖ్య 2019  మార్చి 19 నాటికి . కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది మాత్రం ఏడు జాతీయ పార్టీలుగా 59 ప్రాంతీయ పార్టీలు. నమోదయిన కొన్ని రాజకీయ పార్టీలు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం కావచ్చు అని అనుమానాలతో  ఎలక్షన్ కమిషన్ అనుమానిత పార్టీలపై నిఘా ఉంచి సమాచారం అందించాలని  గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాక్సెస్ ని ఈసీ ఆదేశించింది.

Also Read: ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’

రాజన్న రాజ్యం లో ఏం జరిగింది ?

2004 నుంచి  సెప్టెంబర్ 9 వరకు రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయన పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు దురదృష్టవశాత్తు ఆయన   మృతి చెందడంతో ఇదే ప్రభుత్వం 2014 వరకు  రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. వైఎస్సార్ పాలనలో ఆసరా పెన్షన్ పెరుగుదల ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయంబర్స్ మెంట్, రేషన్ కార్డుల జారీ, 108 అంబులెన్స్ సేవలు. పేదలకు  ఇందిరమ్మ ఇండ్లు, జలయజ్ఞం ప్రభుత్వ పథకాలతో ఇది పేదల సంక్షేమం కోసం రైతు సంక్షేమ ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందిన  విషయం వాస్తవం.  పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థిలోకానికి విద్య వైద్యం  అందించిన ఉచిత సేవలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని అభిమానించే వారు ఉన్నారు ఆదరించే వారు ఉన్నారు. ఇది అక్షర సత్యం. ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని   రాజకీయంగా  తొక్కి పెట్టడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారనే భావన తెలంగాణ వాదులలో నెలకొంది.  శాంతి చర్చల పేరిట నక్సలైట్లను  పిలవడం అర్ధవంతంగా చర్చలు వాయిదా పడడం తదనంతరం జరిగిన అనేక ఎదురుకాల్పుల్లో   చర్చలకు వచ్చిన ఒకరిద్దరు మినహా నక్సలైట్ నాయకులు మరణించడం,ఆ ఉద్యమం బలహీన పడడం  తదితర అంశాలు కాకతాళీయమే అయినా 15 శాతం ప్రజలలో వైఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన ఉందని చెప్పాల్సి వస్తుంది.

షర్మిల పట్ల వాత్సల్యం !

అత్యధిక శాతం  ప్రజల గుండెల్లో కొలువై ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు గా షర్మిల పట్ల మెజార్టీ ప్రజలు ప్రేమ అభిమానం వాత్సల్యాలు ఉన్నాయనేది వాస్తవం. వైయస్ జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర  ఓదార్పు యాత్రలు , కాంగ్రెస్ ప్రభుత్వంలో తను తన కుటుంబ సభ్యులు అనుభవించిన కష్టాలు నష్టాలు పట్ల ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకపోవడం  ఆడపడుచుగా ఆమెను తెలంగాణ ప్రజలు,అభిమానిస్తారు ఆదరిస్తారు, తప్ప ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీకి పట్టం కట్టే  అంత  రాజకీయ అజ్ఞానులు మాత్రం కాదని, అవగాహన లేని వాళ్ళు కాదనేది నిజం . ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్  మరో జాతీయ పార్టీ  బిజెపి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాయి.  దుబ్బాక లో  బిజెపి విజయం సాధించగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీతో పోటాపోటీగా ఓట్లు సీట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తమ ఉని కి  కోల్పోయాయి. త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు  రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు రానున్న తరుణంలో మరో ప్రాంతీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒక్క షర్మిల కే తెలియాలి. రైతు సమస్యలపై భూ కబ్జాలపై నిరుద్యోగ భృతి పై ఉద్యోగ సమస్యలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సాగు తాగు విద్యుత్ అంశాలపై ఏ ఒక్క పార్టీ రోడ్డెక్కిన సందర్భం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారే ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది.

Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?

ఆత్మ గౌరవం కోసం అలుపెరుగని పోరాట లు !!

ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రం, భావవ్యక్తీకరణ ,సంస్కృతి సాంప్రదాయాల ఉనికి,  ఆత్మగౌరవం, కనీస అవసరాల కోసం ,పోరాటం చేస్తే తప్ప ఏదీ సంక్రమించ లేదు. నిజాం పాలన దాష్టీకాలు, తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్లతో పోరాటం, స్త్రీలు తమ మానప్రాణాలకు రక్షణ కోసం వేలాది మంది అమరత్వం పొందారు. బైరాన్ పల్లి, పరకాల రక్తచరిత్రలు  పోరాట ల చరిత్రలో నిలిచిపోయాయి.

1948 సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ నేతృత్వంలో పోలీస్ చర్యలకు దిగితే తెలంగాణకు విముక్తి లభించిందని విషయం అందరికీ తెలిసిందే. 1947 ఆగస్టు 15న దేశప్రజల స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటూ మనం నిజాం ప్రభువు పాలనలో ఉన్నాం 1948  సెప్టెంబర్ 17 నుంచి 1952 వరకు మనకు మన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాక తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిన విషయం తెలిసిందే.1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అది మూడునాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. 1953 లో  ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం అంటు  మన ప్రాంతం నిర్బంధంగా కలుపుకొని 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు.  ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఆత్మగౌరవం స్వయం పరిపాలన కోసం చేపట్టిన పోరాటాలు ఎన్నో ఎన్నెన్నోఉన్నాయి. 1969లో ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 369 మంది అమరులయ్యారు. నాటి నుంచి 2014 జూన్  వరకు స్వయం పాలన కోసం జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలు, నిజంగా మరో స్వాతంత్ర్య సమరాన్ని మరిపించేదనేది జగమెరిగిన సత్యం.  ఈ పోరాటంలో అమరులైన  వారు తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర సమరయోధులే. 

మలిదశలో మాడి మసై నా పిల్లలు, కుటుంబాలు !

తెలంగాణ మలిదశ ఉద్యమంలో  తెలంగాణ రాష్ట్రం మా కోరిక అంటూ యువకులు విద్యార్థులు, ఉద్యోగులు ,బడుగు, బలహీన వర్గాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా  ప్రాణ త్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వంతు పోరాటం చేసి ,తాము కోరుకున్న తెలంగాణ దక్కుతుందో లేదో అని నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ బలవన్మరణాలు పొందిన వారికి ఈ తెలంగాణలో న్యాయం జరిగిందా ? అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలు పెట్టే వారు పరిశీలించాల్సిన అంశం.  చేతికి అంది వచ్చిన పిల్లలు తమ కళ్ల ముందే కాలి  బూడిదే  తిరిగి రాని లోకాలకు చేరిన వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోధిస్తున్న తల్లిదండ్రులు.  ఇంటిల్లిపాదికి అన్నీ తామై నిలిచి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చే పెద్దదిక్కును కోల్పోయి కన్నీరుమున్నీరుగా రోదిస్తూ దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు వెయ్యి కుటుంబాల్లో ఈ దైన్య స్థితి నెలకొంది.  నూతనంగా రాజకీయ ఆరంభించే నాయకగణం  అమరుల కుటుంబాలకు ఎలాంటి  అండదండలు కల్పిస్తారు అనే విషయం స్పష్టం చేస్తే ఆ పార్టీకి కొంతమేర ఆదరణ లభించవచ్చు. ప్రత్యేక రాష్ట్రం కోసం బలైన వెయ్యి మంది ఉద్యమ వేడి రగిల్చిన వారికి గుర్తింపు కోసం  ప్రత్యేక ప్రణాళిక ఆ పార్టీకి ఉండాలి.  చేయూతనివ్వాలి న బాధ్యత   ఆ పార్టీ చేపట్టాలి. విద్య ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు వారికి వారి కుటుంబ సభ్యులకు కల్పించాలి. మోడీ ప్రభుత్వ పాలనపై రైతు చట్టాలు అంశంపై రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వ పాలన తీరుతెన్నులపై నిరుద్యోగ భృతి అంశంపై తదితర అంశాలపై వైయస్ షర్మిలమ్మ స్పష్టమైన ప్రకటన చేస్తే  ఆమె పార్టీకి ఓ ప్రత్యేకత ఉండే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం

 ఆవిర్భవిస్తున్న పార్టీలు, అడ్రస్సు లు ఎక్కడ ?

ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీలు టిడిపి, టిఆర్ఎస్ మినహ ఏ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోలేదు అనేది తెలిసిన విషయం. ప్రముఖ మేధావి సీనియర్ ఐఏఎస్ ఎస్ అధికారి  డాక్టర్ జయప్రకాష్ నారాయణ తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లోక్ సత్తా  రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అనేకసార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఒకసారి ఆయనకు ఎమ్మెల్యేగా పదవి భాగ్యం లభించింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి 20 ఎమ్మెల్యే సీట్లు గణనీయమైన ఓట్లు సాధించిన ఆయన తనపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. జేఏసీ చైర్మన్ తెలంగాణ సాధన ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరామ్  జన సమితి పార్టీ. ఎన్టీ రామారావు తనయుడు స్వర్గీయ హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తెలుగుదేశం ఎన్టీఆర్,  డాక్టర్ చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ, తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలకృష్ణ రెడ్డి పార్టీ, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, సినీ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ  స్వర్గీయ మాజీ హోంమంత్రి  దేవేందర్ గౌడ్, స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రజా సమితి పార్టీ, విప్లవ పంతం గల  జనశక్తి, ప్రజా ప్రతిఘటన,   రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని తదితరులు ఆర్బాటంగా ఆవిర్భవింపజేసిన ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం వాటి అడ్రస్ లు వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.  

గుడ్డి  తెలంగాణ కాదు!

తెలంగాణ సమాజం చైతన్య వంతమైన ది మంచిచెడులు బేరీజు వేసుకుంటూ లక్ష్య సాధనకు అడుగులు ముందుకు వేస్తున్న యువత ఆదర్శంగా నిలుస్తుంది.  లక్ష్య సాధన కోసం మలిదశ తెలంగాణ పోరాట ఉద్యమంలో దశాబ్దం పైగా కాలంగా జరిగిన ఆందోళనలో ఉద్యమాలలో బస్సు ల  దగ్ధం చేయడం కానీ సీమాంధ్రులపై, వారి ఆస్తులపై రాష్ట్రంలో దాడులు జరగలేదు. ప్రాణ నష్టం జరగలేదు ఇది   తెలంగాణ సమాజంలో ఉన్న నిబద్ధత అని చెప్పాల్సిన అవసరం లేదు.  గతంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తెలంగాణ నాయకులు పార్టీ అధినేత తెలంగాణ అంశంపై యూ టర్న్ తీసుకోవడంతో వారు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు.  రాజన్న రాజ్యం తెస్తానని అంటూ చిలక పలుకులు పలికిన షర్మిలమ్మ పార్టీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఏం జరగనుందో  వేచి చూడడానికి తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది.

Surendra Kumar
Surendra Kumar
Sakalam Correspondent, Dharmapuri

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles