Monday, May 20, 2024

‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

తెలుగు సమాజానికి ఎప్పటినుంచో అవసరమైన ‘ఆమె’ కేంద్రిత రాజకీయాలు చివరికది షర్మిల ‘ఫ్యాక్టర్’ గా సంభవించడం శుభపరిణామం. ‘షర్మిల’ కు అర్ధం, ‘బ్లిస్ ఫుల్’, ‘హేపీ’, ‘మాడెస్ట్’, ‘షై’, అంటున్నారు, కనుక అదికూడా బాగానే ఉంది. సాధారణంగా ఇటువంటివి జరిగినప్పడు, ముందుగా సూక్ష్మదర్శిని వేసి ఆమె కేంద్రంగా ఇటీవల జరిగినవి ఏవో కొన్నిటిని ఆమె బయటకు రావడానికి కారణాలుగా చూపించడం సహజంగా జరుగుతూ వుంటుంది. అది అక్కడ ఆగదు. వెంటవెంటనే ఆ ఊహాగానాలకు ముగింపులు ఇవ్వడం కూడా వాటి వెన్నంటే ఉంటాయి. అవి ఉండకూడదు అని కాదు గానీ, ఇటువంటి ఆత్రుతలో అవశ్యం అయినవి కొన్ని విస్మరణకు గురవుతాయి. వాటిని దాటి లోపల ఇంకా ఉన్నవి ఏమిటో చూడ్డానికి ఈ వ్యాసం…

ఉన్న స్తబ్దుస్తితిలో అస్సలు ఈ పరిణామాల కదలికల ‘జేర్మినేషన్’ కు కారణమైన ‘జీవావరణం’ ఎట్టిది అనేది మొదటి ప్రశ్న. తేమ లేని చోట జీవి పుట్టదు. కనుక తేమ అదికూడా ఈ స్థాయి విస్పోటనానికి దారి తీసే అంత జాగా వొకటి ఉందని ఇన్నాళ్లుగా మనమూ గమనించలేదు. అది మనం అంగీకరించవలసిన మొదటి అంశం. ఇక, అందుకు దోహదపడిన ‘సోషల్ కెమిస్ట్రీ’ ఎట్టిది? అని అటుగా కూడా వెతకడానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆమె ‘ఎంట్రీ’ ని ఏ ‘వెలుగు’ లో చూడాలి అనే విషయంలో కొంత స్పష్టత రావచ్చు. అయితే, అవి మనకు అంగీకారం అవునా కాదా? అనేది మళ్ళీ వేరే కధ. ఉన్నట్టుండి ‘ఉప్పెన’ లా షర్మిల వార్తల్లో వ్యక్తి అయ్యేసరికి అందరం అటువైపుకు చూస్తున్నాము కానీ, మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం పట్టించుకోని ‘షర్మిల ఉప్పెన’ లు మన ఇంటి లోపల మాత్రం లేవా? అందుకే, దీన్నొక కౌటుంబిక స్పృహ దృష్టితో చూసినప్పుడు, వొక ‘కంఫర్ట్ జోన్’ ను బద్దలుకొట్టుకొని బయటకు వచ్చిన షర్మిల తొలి విజయం, ఇప్పటికే ‘రికార్డు’ అయిపొయింది!

Also Read: అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?

ఇటువంటివి వొక వ్యక్తితో తొలుత మొదలు అయినప్పటికీ, ఇది ముందుకెళ్ళే క్రమంలో ‘ఆమె’ ప్రాతినిధ్యం వహించే పలు వేర్వేరు పాయలు వచ్చి ఇందులో చేరి అది విశాలప్రవాహంగా ఉధృతంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల ఇకముందు జరిగేది మేలా కీడా? అనేది కాదు ఇప్పటి ముచ్చట. వొకసారి అది మొదలయితే, ‘ఆమె’ ప్రవేశానికి అడ్డుగా ఉండే తెరలు చాలా పక్కకు తొలుగుతాయి అనేది ఇక్కడ పాయింట్. నిజానికి ఇది కొంచెం ‘టైం టేకింగ్ ప్రాసెస్’. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ వాడకంలో ఉన్న‘తూనికలు-కొలతల’ టూల్స్ అన్నీ పురుషాధిక్య సమాజం ‘డిజైన్’ చేసినవి. కనుక, 65 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రానికి మళ్ళీ ఇప్పుడు మరో కొత్త ‘నమూనా’ రూపొందించుకోవలసిన అవసరం పడింది. అయితే, వొకటిగా ఉన్న మనం రెండుగా విడిపోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యం అయింది!

వొకానొక కాలంలో లేదా ‘టైం ఫ్రేం’ లో ఇప్పుడు జరిగినట్టుగా వ్యక్తులు ‘ఇన్ స్టాల్’ కావడం గురించి ముందుగా ఒకసారి చూద్దాం. ఉదా: దక్షణాదిలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 1969 లో దేశానికీ స్వాత్యంత్రం వచ్చిన 22 ఏళ్లకే వొక (ప్రాంతం-ప్రజలు) ‘సెంటిమెంట్’ గా ఉబికి ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వం 2001 తర్వాత సెంట్రల్ ఇండియాలో కొన్ని కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడంతో, పాత డిమాండ్ కొత్త నాయకుని సరికొత్త ‘టూల్స్’ తో ఉద్యమమై మళ్ళీ వెలుగులోకి వచ్చింది, అది ఫలితం సాధించింది. ‘కాలము’ – ‘వ్యక్తి’ ఈ రెండింటిలో; కాలానికి తగిన వ్యక్తి కే.సి.ఆర్. నాయకత్వం రూపంలో ‘ఎమర్జ్’ కావడం ఇక్కడ కీలకం. ఇక ఇప్పటి సందర్భంలోని ‘వ్యక్తి’ షర్మిల. ఆమె గురించి ఇప్పటికే కొంత తెలుసు. అయితే, ఆమెను ఇలా ఉపరితలం మీదికి తెచ్చిన ‘కాలం’ గురించి సాకల్యంగా మాట్లాడుకున్నప్పుడు, వర్తమానంలో ఆమెను ‘ఇన్ స్టాల్’ చేయడానికి ‘స్పేస్’ ఎక్కడ ఉంది? అనే వెతుకులాటకు తాళం దొరికితే దొరకవచ్చు.

సరళీకరణ మౌలిక లక్షణం అంతేనేమో తెలియదు గానీ, మన దేశంలో ఆర్ధిక సంస్కరణలతో పాటుగా అస్థిత్వ ఉద్యమచింతన, విడివిడిగా పోల్చి చూడలేనంత ద్రవాధునికతగా కలిసి ప్రవహించింది. మనం కూడా ఆ విషయం ఇక్కడ వేగంగా అమలైన సంస్కరణలకు పాతికేళ్ళు ముగిసాకగాని గుర్తించలేదు. వొకసారి అవి రెండు అలా ‘బ్లెండ్’ అయ్యాక, ఇక మిగిలింది మన దోసిట్లో పడ్డది తాగడం తప్ప, మనకు మరో మార్గం లేకపోయింది. తాగాక నోరు చేదెక్కి జరిగింది తెలిసి… అస్సలు ఇది మనది కాదు కదా, దీనితో మనకు పని ఏమిటి? అని పాతతరం అంటే, ‘వుయ్ ఆర్ విత్ అవర్ టైమ్స్’ కదా, మాతో మీకొచ్చిన సమస్య ఏమిటి? అని యువతరం కూడా దాన్ని అంతే ‘లైట్’ తీసికొంది. ఆ రంగం అలా ముగిసింది.

ఇక్కడి సామాజిక పర్యావరణం ఇలా మారాక, ఇటువంటి పరిస్థితుల్లో ‘షర్మిల ఫ్యాక్టర్’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపరితలం మీదికి దూసుకొచ్చింది. ఇది ఇక్కడ ఇలా ‘సర్ఫేస్’ కావడానికి ముందు పరిస్థితి ఎటువంటిదో మనం గుర్తుచేసుకోకపోతే, ఉన్నట్టుండి ఇదేదో పై నుంచి ఊడిపడినట్టుగా అనిపించే ప్రమాదం కూడా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం 2001 మే నాటికి దేశవ్యాప్తంగా మహిళా సాధికారకత లక్ష్యంగా పనిచేస్తున్న మహిళా మేధోకేంద్రాలకు అప్పటి మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్ర స్థానం అయింది. దాంతో – అప్పట్లోనే, ‘ఏమి మాట్లాడుతున్నాము?’ అనే దానితోపాటు, ‘ఎక్కడ మాట్లాడుతున్నాము?’ అనేది కూడా కీలకం అయింది. 80’ దశకం నాటి వయోజన విద్య, 1992 నాటికి నెల్లూరులో సారాను ప్రశ్నించిన దూబగుంట రోశమ్మను ఇస్తే, 1995 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 83, 84, రాజ్యాంగ సంస్కరణలతో 33 శాతం మంది మహిళా రిజర్వేషన్లుతో ‘రాజ్యం’ లోకి ప్రవేశించారు. ఇదే కాలంలో విస్తరించిన మహిళా పొదుపు సంఘాలు, జిల్లా కలక్టర్లుగా వచ్చిన మహిళ ఐ.ఏ.ఎస్. అధికారులు, వారికి చేరువైన ప్రజలు, వారి గ్రామీణ సమస్యలు, కలక్టరేట్లలో సోమవారం ‘గ్రీవెన్స్ సెల్స్’ ను తెరిపించాయి. బిడ్డలకు ‘అమ్మ’ స్పర్శ అవసరమైన ‘పల్స్ పోలియో’, ‘ఎయిడ్స్’, ‘ట్రాఫికింగ్’ వంటివి మొదట్లో వ్యక్తిగతమైనప్పటికీ కాలక్రమంలో మహిళా శక్తికి అది ‘గ్రూప్’ రూపం ఇచ్చాయి.

Also Read: బాణం లక్ష్యాన్ని చేరుతుందా ? గురితప్పుతుందా ?

ఇదే కాలంలో హైదరాబాద్ లో ‘అస్మిత’ వంటి సంస్థలు ‘జెండర్’ అంశంపై నిర్వహిచిన జాతీయ సదస్సులు, వర్క్ షాపులు, రీతూ మీనన్, వసంతా కన్నాభిరాం, అమ్ము జోసఫ్, ఓల్గా, గౌరి సెల్వి, వంటి వారు నాయకత్వంలో సాగిన మేధోమధానాలు, తెలుగు పత్రికల్లో మొదలయిన మహిళా ప్రత్యేక పేజీలు, ఇవన్నీ ఆర్ధిక సంస్కరణల కాలంలో ‘ప్రొఫెషనల్’ కోర్స్ చదువులు పూర్తిచేసుకొని, ‘వర్క్ ప్లేస్’ లో తమని తాము నిరూపించుకోవాలని కలలు కంటున్న యువతులకు వొక ‘వర్చువల్ సేఫ్టీ నెట్ ఎన్విరాన్మెంట్’ అనిపించాయి. ‘సైబర్ సిటీ’ వస్తే, దాంతోపాటు ‘సైబర్ సిటీ పోలీస్ కమీషనరేట్’ కూడా అవసరం అయింది. ముందు తరంలో వామపక్ష విద్యార్ధి ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి బయటకు వచ్చిన మహిళా ‘యాక్టివిస్ట్’ లు పార్లమెంటరీ పాలిటిక్స్ పట్ల ఉండే విముఖత కారణంగా కాలక్రమంలో ‘ఎన్.జి.వో.’ లేదా ‘జర్నలిస్ట్స్’ పాత్రకు పరిమితం అయ్యారు. ఇదే కాలంలో ఐ.ఏ.ఎస్. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన జయప్రకాశ్ నారాయణ్ ‘లోక్ సత్తా’ ను తొలుత ‘ఎన్.జి.వో.’ గా మొదలుపెట్టి తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు, అదికూడా ఇప్పుడు చురుగ్గా లేదు.

ఇలా తెలుగునాట మహిళా సాధికారికత అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు గడచిన మూడు దశాబ్దాలలో వొక ‘బర్నింగ్ ఫర్నేస్’ మాదిరిగా అగ్నికీలల్ని విస్తరిస్తున్నప్పటికీ, దీన్ని ఇంధనంగా మార్చి వొక అంగీకృతమైన వేదికపైన నిర్మాణాత్మక కార్యాచరణకు దీన్ని ‘ఇన్ స్టాల్’ చేసే నాయకత్వం మనకు లేకపోయింది. నిజానికి దీన్ని వొక సామాజిక అంశంగా ‘ర్యాండం’ గా కనుక చూస్తే, వొక ‘ఫ్యాక్టర్’ గా మన దగ్గర ప్రతి కుటుంబంలోనూ ఈ రోజున మనకొక ‘షర్మిల’ ఉన్నారు! వారు తమవైన  వనరులకు తగిన ‘వెంటిలేషన్’ కోరుకుంటున్నారు. అందుకే వ్యాసం ఆరంభంలోనే షర్మిల ప్రవేశాన్ని ‘సంభవం’ అన్నది.

Also Read: ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’

అయితే, ప్రతిదీ తమ కనుసన్నల్లో జరగాలి అనే ఆధిపత్య శక్తులు, ఆడవారికి విడిగా రాజకీయాలు ఎందుకు? అనే రీతిలోనే దీన్ని చూస్తారు. వాళ్ళు ‘డిజైన్’ చేసిన  ‘లైన్’ మేరకు వై.ఎస్. షర్మిల ప్రజాజీవిత ప్రవేశాన్ని చూడడం, నియంత్రించడం కూడా ఇకముందు జరిగితే జరగవచ్చు. అయితే, వొక ‘పెడస్టల్’ పైకి చేరడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ వొక ‘పెడస్టల్’ పై నుంచి మరొక ‘పెడస్టల్’ పైకి చేరడానికి శ్రమ పెద్దగా అక్కరలేదు. ఇప్పటికే ఇక్కడ పదునుమీద ఉన్న వనితా సమాజం, అటువంటి ‘కేటలిస్ట్’ గా ‘షర్మిల ఫ్యాక్టర్’ ను కాలం కనుక మలుచు కోగలిగితే, దక్షణాదికి అది ‘పోస్ట్-రిఫార్మ్స్’ కాలం ఇచ్చిన శాశ్విత ప్రయోజనం అవుతుంది.

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

3 COMMENTS

  1. మగాధిక్య / రాజకీయ కోణాల చట్రాలు దాటలేని వ్యాఖ్యానాలు విశ్లేషణలు “కాలానుగుణమైన పరిణామాన్ని” ఎలా విస్మరిస్తున్నాయో
    #చోరగుడిజాన్సన్. ఈ వ్యాసంలో చెప్పారు 👍👌👏🙏

  2. మా తరం చేసిన ఒక చారిత్రక తప్పిదం.

    వామపక్ష విప్లవోద్యమ నాయకత్వం మీద మునుపటి ప్రేరణ, నమ్మకం ఉత్సాహం క్రమంగా తగ్గిపోవడంతో మా తరం బయటికి వచ్చింది. కొందరు నిర్బంధ కారణాలతోనూ బయటికి వచ్చారు. మాలో వామపక్ష భావాలు కొనసాగాయిగానీ రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. కాంప్రమైజ్ ఫార్మూలాగా సామాజిక కార్యకర్తలుగానో, జర్నలిస్టులుగానో, ఎన్.జి.వోలు గానో స్థిరపడ్డాం. పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ లోనో, టిడిపిలోనో క్రియాశీల పాత్ర పోషించడానికి అప్పుడు పుష్కలంగా అవకాశాలున్నాయి. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోనికి నాకు ఫ్రీ ఎంట్రీ ఆఫర్లు రెండుసార్లు వచ్చాయి. నేను అన్యమనస్కంగా వుండిపోయాను. ఇప్పుడయితే ఆ అవకాశాలు కూడ లేవు. ఇప్పుడున్నవి ఫైనాన్స్ రాజకీయాలు. అంతటి శక్తి నాకు లేదు.

    సాయుధపోరాట రాజకీయాల ‘హ్యాంగ్ ఓవర్’ కారణంగా ‘పార్లమెంటరీ పాలిటిక్స్ పట్ల విముఖత’ మాలో బలంగా కొనసాగింది. సాయుధపోరాట రాజకీయాల్ని వదిలినపుడు పార్లమెంటరీ రాజకీయాల్ని చేపట్టి వుండాల్సింది. అలా కాకుండ మొత్తం రాజకీయాల్నే వదిలివేశాము. అది మా తరం చేసిన ఒక చారిత్రక తప్పిదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles