Tuesday, April 16, 2024

భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

రాజకీయ ప్రపంచంలో పార్టీ సంస్థలు శూన్యంగా మారినప్పుడు నాయకులకు దగ్గర ఉండడమే ప్రధానమైనప్పుడు సెల్ఫీ ప్రజలకూ, అధికారానికీ మధ్య వారధి అవుతోంది.

పూర్వీకుల నుంచీ అందివచ్చిన మా నివాసంలో మా నాన్నగారు ఎక్కువ ఫోటోలను పెట్టనిచ్చేవారు కాదు. కొద్ద ఫొటోలలో ఒకటి 1930 నాటి అలహాబాద్ ను చూపించేది. దానికి శీర్షిక లేదు. అథోపీఠికా లేదు. అది అలహాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ, కమలానెహ్రూ మొదటి వరుసలో కూర్చుంటే వెనక తెల్ల దుస్తులతో, టోపీలతో కాంగ్రెస్ వాదు లు నిలబడి తీయించుకున్న గ్రూప్ ఫొటో. వెనక నిలబడిన కార్యకర్తలలో మా మాతామహుడు (నానాజీ) బల్బీర్ సింగ్ ఒకరు. క్షయరోగం వల్ల ఆయన వయసు మీరకుండానే వెళ్ళిపోయారు. ఆయన ఫొటో అది ఒక్కటే మా దగ్గర ఉంది. స్వాతంత్ర్య సమరానికి ఇది చాలా విలువైన అనుబంధం.

Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

మా మాతామహుడి ఫొటో

ఆ ఫోటో నాలో మిశ్రమమైన అనుభూతిని రేకెత్తిస్తుంది. ఆ పొటో తీసుకున్నప్పుడు నెహ్రూ ఏమని భావించారు? తన కార్యకర్తలతో ఫొటో దిగడం ఆయనకు సంతోషం కలిగించిందా? లేక, వెంటనే మరో సమావేశానికి హాజరు కావాలనే తొందరలో ఉన్నారా? లేదా, ఏ అనుభూతీ లేకుండా నిరాసక్తంగా ఉన్నారా? ఒకానొక సమయంలో ఎవరికైనా ఏ ఫొటోగ్రాఫ్ ఎటువంటి అనుభూతి కలిగిస్తుందో మనకు తెలియదు. ఒక ఫొటోగ్రాఫ్ ను ఎన్నిసార్లు అయినా ముద్రించవచ్చు. అదే విధంగా దాని అర్థం కూడా ఎన్నిరకాలుగానైనా చెప్పుకోవచ్చు.
భారత్ జోడో పాదయాత్రలో సెల్ఫీల దాడి ఎక్కువైనప్పుడు ఆ ఫొటోగ్రాఫ్ నా మదిలో మెదులుతూ ఉంది. ‘‘ఆహా, యోగేంద్రజీ. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచీ మిమ్ములను టీవీలో చూస్తూనే ఉన్నాను’’ అని ఒకతను అన్నప్పుడు అతని బట్టతల చూసి నాకు తొంభై ఏళ్ళు వచ్చాయేమోననే అనుభూతికి లోనవుతాను. నా భుజాల చుట్టూ ఒక చేయి వేసి కెమెరా చూపుతూ ‘స్మైల్ ప్లీజ్’ అంటున్నారు ఎవరో. చాలా సందర్భాలలో ఒక బృందం దాడి చేస్తుంది. వాళ్ళంతా నన్ను చుట్టుముడతారు. వారిలో ఎవరు ఫొటో తీస్తున్నారో తెలియదు. ఫొటో తీయడానికి ఒక వలంటీర్ దొరుకుతాడు. అతడు ఫొటో తీస్తుండగానే మధ్యలో నుంచి ఒకరు సెల్ఫీ తీసుకుంటూ చెయ్యి ముందుకు పెడతారు. అది ఇతరుల సెల్ఫీ ఫ్రేమ్ కు అడ్డం వస్తుంది. గ్రూప్ ఫొటో అయిన తర్వాత చిన్న గ్రూప్ లు దిగుతాయి. తర్వాత ఒక్కొక్కరు దిగుతారు. కాదు,కూడదు అనే స్వేచ్ఛ నాకు లేదు. ఎవరి అభ్యర్థననూ కాదనే సమస్యే లేదు. ఈ సెల్ఫీ ఫొటోలలో ఏదైనా నన్నుతరుముకుంటూ వస్తుందేమోనని భయంగా ఉంది (వైవై – యోగేంద్రయాదవ్-కి ఫలానావారు చాలా సన్నిహితమైన వ్యక్తి అని రైటప్ ఉంటుంది)

కనీస మర్యాద పాటిస్తూ ‘హలో’ అని సైతం చెప్పకుండానే సెల్ఫీ వేటగాళ్ళు సెల్ఫీ తీసుకొని గబగబా వెళ్ళిపోతారు. కొంతమందికి నేనెవరో కూడా తెలియదు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ‘‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మీ పేరేమిటి? (ఆప్ కో కహీ దేఖా హై. ఆప్కా నామ్?)’’ చాలా సందర్భాలలో ఆగంతుకు నాకు చాలా సన్నిహితుడైనట్టు నటిస్తాడు. ‘‘యోగేంద్రజీ, ఒక సెల్పీ దిగకతప్పదు (యోగేంద్ర జీ , ఏక్ సెల్ఫీ తో బన్తీ హై)’’ అంటాడు. సెల్ఫీ దాడి ఎక్కడైనా జరగవచ్చు. డైనింగ్ టేబుల్ దగ్గర, స్లీపర్ బెర్త్ దగ్గర, బాత్రూం దగ్గర. భారత సెల్ఫీ వేటగాళ్ళు పాశ్చాత్య దేశాల తరహాలో మీరు ఒంటరిగా ఉండాలనుకున్నా, మీ మానాన మీరు ఉండాలనుకున్నా ఒప్పుకోరు. మీరు బహిరంగంగా రాజకీయాలలో ఉంటే మీరు పబ్లిక్ ప్రాపర్టీ కిందే లెక్క.

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు

ఎన్నటికీ మరచిపోలేని సెల్ఫీ దాడి

కొన్నేళ్ళ కిందట జరిగిన సెల్ఫీ దాడిని నేను ఎన్నటికీ మరచిపోలేను. నేను మా ఇద్దరు పిల్లలనూ తీసుకొని దిల్లీలో ప్రపంచ పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను. అకస్మాత్తుగా నాకు చిన్నవాడు కనిపించలేదు. అప్పుడు వాడికి ఏడెనిమిదేళ్ళు ఉన్నాయేమో. నేను కంగారు పడ్డాను. నడుస్తున్న జనంలో నేను నా కుమారుడికోసం వెతకసాగాను. అప్పుడు నా భుజంపైన ఎవరిదో చెయ్యి పండింది. ‘యోగేంద్రజీ, ఒక సెల్ఫీ కావాలి (యోగేంద్రజీ, ఎక్ సెల్ఫీ హోజాయే) అని అనడం వినిపించింది. కానీ దాన్ని పట్టించుకోలేదు. చుట్టూ చూస్తూ ఉన్నాను. సెల్ఫీ వేటగాడు నన్ను బలవంతంగా పక్కకు లాగాడు. నా పరిస్థితిని వివరించి, నన్ను వదిలేయవలసిందిగా కోరాను. ‘‘అవుననుకోండి. కానీ ఒక సెల్పీ తప్పదు మరి (అఫ్ కోర్స్, పర్ ఎక్ సెల్ఫీ తో బన్తీ హై)’’ అన్నాడు. నేను అడ్డం తిరిగి నేనున్న పరిస్థితిలో మీరుంటే మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీ అడిగితే మీరు ఎట్లా స్పందిస్తారు? అని అడిగాను. సానుభూతితో తన ఊపాడు. కానీ సెల్ఫీ మాత్రం క్లిక్ చేశాడు.

నేను-నా సెల్ఫీ అనే ప్రథమ పురుష, వ్యక్తిగత దృష్టి మాత్రమే వారికి ముఖ్యం. సెల్ఫీ వేటగాళ్ళను ప్రేరేపించేది అది ఒక్కటే కాదు. కొన్ని సందర్భాలలో సెల్ఫీలు సరిగా రావు. అసహ్యంగా ఉంటాయి. వాటి వెనుక నిజమైన ప్రేమ ఉంటుంది. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో చార్మినార్ వైపు నడుస్తున్నప్పుడు నాకు ఇది అనుభవంలోకి వచ్చింది. ఒక కిలీమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న ఆ చారిత్రక కట్టడంవైపు ఒక ఇరుకైన రోడ్డు మీద నడిచే సమయంలో నాతో కనీసం వంద మంది సెల్ఫీ  దిగారు. ఎందుకో కానీ ఆ సెల్ఫీలు తీస్తున్నప్పుడు నాపైన పూలవాన కురిపించినట్టు అనిపించింది కానీ ఏదో ట్రోఫీకోసం పరుగెడుతున్నట్టు అనిపించలేదు. కొన్నేళ్ళ కింద నాకు పరిచయంలేనివారు నాతో సెల్ఫీ దిగి దాన్ని నాకు చూపించడం నాకు బాగా గుర్తు. నేను కాకపోయినా నా ఇమేజ్ (ఛాయ) వారి జీవితాలలో భాగమైపోయింది.

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు
నా సెల్ఫీ అంతా మీరే…

నా కంగారంతా రాజకీయ సెల్ఫీల కారణంగానే. అదంతా ఒక ప్రత్యేక తరహా. భారత రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక సెల్ఫీ ఆ సెల్ఫీ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఫొటో మాత్రమే కాదు. అలా అయితే అతను ఉన్న ఏ ఫొటో అయినా వ్యక్తిగతమే అవుతుంది. తరచుగా ఒక రాజకీయ నాయకుడినీ, తననూ కలిపి సెల్ఫీ తీయాలని తన మొబైల్ ను ఒక యువకుడికో, సేవకుడికో ఇస్తాడు ఒక వృద్ధిలోకి వస్తున్న రాజకీయవాది. అందులో నా సెల్ఫీలో నేను ఎట్లా కనబడాలనేదానికంటే నా సెల్ఫీలో మీరు ఎట్లా కనబడాలన్నదే ప్రధానం. కరచాలనం కావచ్చు. ఆశీస్సులు అందజేయడం కావచ్చు. ‘‘నా భుజంపైన చేయి వేయండి సార్ (జరా ఖందేపర్ హాథ్ రఖియే నా)’’- సెల్ఫీలో ఇతరులు ఎట్లా ఉండాలన్నది ముఖ్యం. పాశ్చాత్య దేశాలలో లాగా కాకుండా భారత దేశంలో రాజకీయ సెల్ఫీ అన్నది సామూహిక సముదాయంలో ఒంటరిగా కనిపించడం కాదు. ఇది వీలైనంత బహిరంగంగా ఉంటుంది. మన సెల్ఫీ ప్రజలది, ప్రజలకోసం తీసినది. వ్యక్తిత్వాన్ని నమోదు చేయడమో లేదా ఫలానా మూడ్ (కవళిక)ను పట్టుకోవడమో కాదు.  ముఖ్యమైన సందర్భాలలో రాజకీయ నాయకులకు ఎంత సన్నిహితంగా ఉన్నారో చాటుకొని సదరు సాన్నిహిత్యాన్ని భవిష్యత్తు రాజకీయాలలో ఉపయోగించుకోవడానికి ఉద్దేశించింది. ఆ ఘటనలలో పాల్గొన్నట్టూ, ముఖ్యులతో ఫొటో దిగినట్టూ, వారితో చనువుగా ఉన్నట్టూ చాటుకోవడానికి వర్తమాన రాజకీయాలలో సెల్ఫీలు ఉపయోగపడతాయి.

ఫొటో అంటే ప్రాతినిధ్యానికి సంకేతం. సెల్ఫీ కూడా అంతే. రాజకీయ సెల్ఫీ రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించింది.  వీక్షకుడికి నేను నన్ను నివేదించుకోవాలి.  ఆ దృశ్యం ద్వారా ఒక రాజకీయ సందేశం పంపించాలి. అధికారంలో నా వాటా నేను కోరుకుంటున్నాననే విషయం తెలియజేయాలి.  నేను దేనికో ఒక దానికి, ఎవరినో ఒకరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే వాదనను వీక్షకుడు గుర్తించి సమర్థించాలి.

Also read:బీహార్ మోదీ కొంప ముంచుతుందా?

ఇదో ప్రజాస్వామ్య ప్రక్రియ
అందుకని రాజకీయ సెల్ఫీ రాజకీయ ప్రాతినిధ్యం అనే గందరగోళాన్ని తప్పించుకోజాలదు. స్మార్ట్ ఫోన్లూ, ఇంటర్ నెట్ విపరీతంగా విస్తరించిన కారణంగా రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకునేవారి సంఖ్య అంతే అధికంగా పెరిగింది. సెల్ఫీ దాడి ద్వారా ఒక రాజకీయ నాయకుడిని సామాన్యుడు ఒక చౌక మొబైల్ ద్వారా పట్టుకోవడం అనే వ్యవహారంలో అంతులేని ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇమిడి ఉంది. పార్టీ సంస్థలు శూన్యంగా ఉన్న దశలో రాజకీయ ప్రపంచంలో నాయకుడికి సామీప్యం, సాన్నిహిత్యమే రాజకీయాలలో ప్రాసంగికతకూ,  అధికారంలో భాగస్వామ్యానికీ సోపానం. ప్రతి పరిణామాన్నీ ఒక ఘటనగా పరిగణిస్తున్న యుగంలో ఆ ఘటన ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఒక ఫొటోకి మారి చరిత్రలో మిమ్మల్ని మీరు సెల్ఫీ ద్వారానే దూర్చుకొని నమోదు చేసుకుంటారు. ప్రజా సంభాషణ బోలెడు బొమ్మలున్న పోస్టర్ల ద్వారా (నా మిత్రుడ ఫాహీం దీన్నిపోస్టర్ పైన చిత్రహారం అంటాడు), సాధారణ వ్యక్తి తన మైబెల్ స్క్రీన్ అనే పోస్టర్ పైన తన సెల్ఫీని పెట్టుకొని సంతృప్తి చెందుతాడు. ప్రాతినిధ్యానికి కొత్త అర్హతలు అధికార ప్రాంగణంలో గుర్తింపు పొంది ఇప్పుడున్న దొంతరల వ్యవస్థను ధ్రువీకరిస్తాయి. గొప్పవారి మర్యాదలు, ఉన్నతమైన నైతికత, ఉదాత్తమైన వైఖరి ద్వారా ఈ అడ్డగోలు చర్యల మంచి చెడును బేరీజు వేయడానికి మనం ఎవరం?

సెల్ఫీలో స్వార్థం ఉన్నట్లయితే, మన కాలంలో ఏ రకమైన వ్యక్తిత్వాలను ప్రోత్సహిస్తున్నామనే దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. సెల్ఫీ ఒక వ్యాధి అయితే, నయం చేయవలసింది సెల్ఫీ వేటగాడికి మాత్రమే కాదు మన సంస్కృతిని కూడా. రాజకీయ సెల్ఫీలు రోగభూయిష్టమైతే ఆధునిక ప్రాతినిథ్య ప్రజాస్వామ్య వ్యవస్థలోని సంక్షోభాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి.

Also read: ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles