Thursday, September 28, 2023

పోలీసులకు సవాలు విసురుతున్న అగ్రనేతల భద్రత

  • నగరానికి క్యూ కడుతున్న బీజేపీ అగ్ర నేతలు
  • అప్రమత్తంగా ఉండాలన్న ఇంటెలిజెన్స్ వర్గాలు
  • భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైన పోలీసులు
  • భారత్ బయోటెక్ సందర్శనకు రానున్న ప్రధాని

గ్రేటర్ ఎన్నికలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు జాతీయ స్థాయి నేతలు వరుసగా క్యూ కట్టనుండటంతో వారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం పోలీసులకు సవాలుగా మారింది. వీటికి తోడు జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నేతలు కావడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారానికి వచ్చి వెళ్లారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, నగరంలో పర్యటించనున్నారు.  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  గురువారంనాడు ఇక్కడ పర్యటించి బీజేపీ మెనిఫెస్టోని విడుదల చేశారు.

కీలక నేతల ప్రచారం – నిఘా సంస్థల హెచ్చరికలు

అరాచక శక్తులు మత విద్వేషాలను  రెచ్చగొట్టనున్నాయని ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో వీరి భధ్రతను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర నిఘావర్గాలను సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నగరంలోని ఓ హోటల్ లో మేనిఫెస్టో విడుదల చేశారు. హోటల్ లోపలా, బయటా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారంనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. యోగి ఆదిత్యనాథ్ శనివారం నగరంలోని రెండు చోట్ల జరిగే ర్యాలీల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఆయా ప్రాంతాలో  స్థానిక పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి.

ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమయా భావాన్ని బట్టి రెండు లేదా మూడు చోట్ల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సాయుధ బలగాలతో తాత్కాలికంగా పికెట్లు ఏర్పాటు చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావడంతో భద్రతా సిబ్బందిలో 10 మంది జాతీయ భద్రతాదళంతో పాటు 55 మంది పోలీసు అధికారులు వలయంగా ఏర్పడి భద్రతను పర్యవేక్షిస్తుంటారు. వీరికి అదనంగా స్థానిక ఠాణా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. ఇటీవల తమిళనాడు పర్యటనలో అమిత్ షా కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అగంతకుడు ప్లకార్డు విసరడంతో అది అమిత్ షా సమీపంలో పడింది. ఈ అనుభవం నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో కఠిన ఆంక్షలు

కరోనా వాక్సిన్ పురోగతిని తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ను సందర్శించనున్నారు. ప్రధాని  పర్యటన ఖరారైన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కమిషనర్ సజ్జనార్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హకీంపేట విమానాశ్రయం నుంచి జినోమ్ వ్యాలీ లోని భారత్ బయోటెక్ వరకు దాదాపు 18 కిలో మీటర్ల మేర మాక్ డ్రిల్ నిర్వహించారు.  ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే బృందం ఇవాళ నగరానికి చేరుకుంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ బహిరంగ సభ

బల్దియా ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని స్వయంగా సీఎం ప్రకటించిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఈ సభకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles