Thursday, April 25, 2024

పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు

వివేకం మరణించడమే మూఢవిశ్వాసం !

రాబర్డ్ ఆంటన్ విల్సన్, అమెరికన్ రచయిత.

Quote by Robert Anton Wilson: “I don't believe anything, but I have many  suspi...”
రాబర్డ్ అంటర్ విల్సన్

పారాసైకాలజీ – అంటే అతీంద్రియ శక్తులు కలిగి ఉండడం. అదొక మూఢనమ్మకం. ఉదాహరణకు దూరంలో ఉన్న ఒక మనిషి మనసులోని విషయాన్ని గ్రహించి చెప్పడం, అలాగే జరగబోయే సంఘటనలు మందే కనుక్కుని చెప్పడం తమ అతీంద్రియ శక్తుల ద్వారా సాధ్యమవుతుందని లోగడ కొందరు ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అలాంటివారు కొందరున్నారు. అలా చెప్పగడలగడాన్ని  ‘పారాసైకాలజీ’ అనే శాస్త్రంగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి పారాసైకాలజీ అనేది ఒక సూడో సైన్స్. దానికి వైజ్ఞానికంగా ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఎదుటివారి మరసులోని విషయం టెలిపతి ద్వారా చెప్పగలమని చెప్పుకుంటారు. అలాగే దూరంలో ఉన్న వస్తువుల్ని కంటి చూపుతో లేదా మనోశక్తితో కదిలించడాన్ని ‘సైకో కైనసిస్’ అని చెపుతారు. మామూలుగా అందరికీ ఉండే ఇంద్రియ శక్తులకన్నా అతిగా శక్తులున్న వ్యక్తిని మహాత్ముడు, బాబా, గురువు, సాధువు అని జనం నమ్ముతున్నారు కదా? అసలు ఎవరికైనా అలాంటి అతి – ఇంద్రియ శక్తులు ఉంటాయా? అని శతాబ్ది కాలంగా చర్చ జరుగుతూ ఉంది. కొందరు వాటికి నిరూపణలు చూపడానికి ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు వాటి వెనక ఉన్న రహస్యాలను ఛేదిస్తున్నారు. ఆ గోలంతా ఎందుకూ?- అని అనుకునే అధిక సంఖ్యాకులు కళ్ళు మూసుకుని గుడ్డిగా అతీంద్రియ శక్తుల్ని నమ్ముతున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు నమ్ముతున్నారని అబద్ధమెప్పుడూ నిజంగా మారదు. ఏ అతీంద్రియ శక్తి అయినా పరిశీలకుల, పరిశోధకుల పరిక్షలకు ఎదురునిలిచి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా నిరూపించుకోగలిగితే అది సైకాలజీలో భాగమయ్యేది. లేదా సైన్స్ లో భాగమయ్యేది. అలా కాకుండా పారాసైకాలజీగా విడిగా ఉందంటే అది విజ్ఞానశాస్త్రం లోని ప్రధాన స్రవంతిలో భాగం కాలేదన్నమాట! దాన్ని నమ్మి మోసపోవడం అంటే, అది అమాయకత్వమో – లేక అజ్ఞానమో  అవుతుందన్నమాట!!

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

వ్యక్తిగత స్థాయిలోనే పరిశోధనలు

Parapsychology – McFarland

అతీంద్రియశక్తులకు సంబంధించిన  ఈ పారాసైకాలజీ (PARAPSYCHOLOGY)ని ఇంగ్లీషులో ప్రికాగ్నిషన్ (PRECOGNITION), సైకోకైనసిస్ (PSYCHOKINESIS), టెలికైనసిస్ (TELEKINESIS), సైకోమెట్రీ (PSYCHOMETRY) వంటి అనేక పేర్లతో వ్వవహరిస్తారు. జర్మన్ తత్త్వవేత్త మాక్స్ డిస్సోయిర్ 1889లో పారాసైకాలజీ అనే పదాన్ని తొలుత రూపొందించాడు. ఈ విషయం మీద పరిశోదనలన్నీ ప్రయివేటు వ్యక్తులిచ్చిన విరాళాలతో కొతమంది తమ వ్యక్తిగత స్థాయిలో సాగించినవే తప్ప, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వ సంస్థలు గానీ, ప్రజాసంఘాలు గాని చేపట్టలేదు. వీటి పరిశోధనా ఫలితాలు చిన్నాచితక పత్రికలు తప్ప, స్థాయిగల సైన్స్ జర్నల్స్ ప్రచురించలేదు. 1942లో రాబర్ట్ థోలిస్ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ఒక వ్యాసం ప్రచురించడంతో ఈ విషయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సైకి (SYCHE) అంటే మైండ్-సోల్ (ఆత్మ-బుద్ధి) అని అర్థం. అవి మానసిక సంసిద్ధతపై, శక్తిపై ఆధారపడి ఉంటాయి. 1882లో సొసయిటీ ఫర్ సైకికల్ రీసర్చ్ – లండన్ లో ఏర్పడినప్పుడు తత్త్వవేత్తలు, వైజ్ఞానికులు, మేధావులు, విద్యావేత్తలు, రాజకీయనాయకులు ఎంతోమంది ఆకర్షితులయ్యారు. వైద్యశాస్త్ర నోబెల్ గ్రహీత చార్లెస్ రిచట్ కూడా ఆకర్షితుడై అందులో చేరాడు. అతీంద్రియ శక్తుల పేరుతో మేజిక్ ట్రిక్ లు చేసి జనాన్ని ఆకర్షించిన సైకికల్ రీసెర్చ్ వారు వాస్తవ నిరూపణలు లేక – క్రమంగా బలహీనపడ్డారు. తమ ట్రిక్ ఫోటోగ్రఫీతో దయ్యాల్ని, ఆత్మల్ని పోటోలు తీసి జనాన్ని బొల్తాకొట్టించిన వారు కూడా లేకపోలేదు. పారాసైకాలజీ ప్రభావం అంతటితో ఆగిపోలేదు. విద్యా సంస్థల్లో చేరి బోధనాంశంగా కూడా మారిపోయింది. 1911లో మొదటిసారి అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్ (ESP) సైకో కైనసిస్ (PK)కి సంబంధించి ప్రయోగశాలలు తయారయ్యాయి. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత అన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే తప్ప, విజ్ఞానశాస్త్ర మూల సూత్రాలకు అనుగుణంగా జరిగినవి ఏవీ లేవని నిర్థారణ జరిగింది.

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

డ్యూక్ యూనివర్శిటీలో ప్రయత్నం

1930లో డ్యూక్ యూనివర్శిటీలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. జె.బి. రైన్ ఆధ్వర్యంలో అక్కడ కొన్ని పరిశోధనలు జరిగాయి. అయితే నికరంగా కొత్త విషయాలేవీ బయటపడలేదు. దొంగలెక్కలు చూపి రుజువైనట్లు ప్రకటించారే గాని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఫలితంగా డ్యూక్ యూనివర్శిటీలో పారాసైకాలజీ శాఖ మూతపడింది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా అతీంద్రియ శక్తుల వ్యాపారాలు విస్తరించాయి. హేతువాద తత్వాన్ని, వైజ్ఞానిక పిపాసని ధ్వంసం చేశాయి. ఆత్మలు, దయ్యాల గురించి 19 వ శతాబ్దం దాకా జనం విపరీతంగా భయపడేవారు. చర్చించుకునేవారు. వాటి ప్రభావం ఇటీవల కాలం వరకు సాహిత్యంలో, సినిమాలలో కూడా కనపడుతూ ఉండేది. దాన్ని ఉపయోగించుకుని కొందరు జనాన్ని భక్తిభావనలోకి, ఆధ్యాత్మికతలోకి, దేవుడి పేరుతో ఒక ఉత్పాతంలోకి తీసుకుపోయేవారు. ఒక్కోసారి విస్మయచకితుల్ని చేసి ఆకట్టుకునేవారు. ఎప్పటికప్పుడు ఏదోరకంగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఉదాహరణకు గోడ అవతల మనిషిని నిలబెట్టి – అతని ఆలోచనలు చెప్పడం, గణాంక పరిశీలనలు, పేకముక్కల ప్రయోగం వంటివి ఎన్నెన్నో చేస్తూ విఫలమవుతూ వచ్చారు. ఇప్పటికీ కొందరు ఆశ వదులుకోలేక పారాసైకాలజీని నిరూపించాలనుకుంటున్నారు.

డ్యూక్ యూనివర్శిటీలో సారాసైకాలజీ ప్రయోగాలు చేసినవారు

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

ఇంగిత జ్ఞానంతో ఆలోచిద్దాం

Abraham Kovoor (Author of Begone Godmen)
అబ్రహాం కోవూర్

సైన్స్ దాకా అక్కరలేదు. కేవలం ఇంగిత జ్ఞానంతో ఆలోచిద్దాం. దూరంలో ఉన్న మనిషి ఆలోచనలు తెలుసుకోవాలంటే అతని మెదడులోని న్యూరాన్ల, ఎగ్జాన్ల పని తీరు తెలుసుకోవాలి. న్యారాన్ లు పని చేయడం వల్లనే మనిషి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఆవేదన చెందుతాడు. ఆలోచనలు చేస్తాడు. ఆ న్యూరాన్ లు ఎగ్జాన్ లతో కలిసి సంకేతాలు పంపిస్తుంటాయి.  ఈ పంపడం అనేది ఒక విద్యుత్ రసాయనిక చర్య. ఎదుటి వ్యక్తి మనసులోని విషయాలు తెలుసుకోవాలంటే అతని మెదడులో జరిగే ఈ విద్యుత్ రసాయనిక చర్య తెలుసుకోవాలి. అంతే కాదు అతని మెదడులోని ఇంపల్స్ ని డి-కోడ్ చేసి విషయం గ్రహించగలగాలి. ఇదంతా ఎలా చేయగలుగుతున్నారో చెప్పకుండా ‘‘టెలిపతి ద్వారా తెలసుకుంటున్నాం’’- అంటే సరిపోదు కదా? పారాసైకాలజీలో పరిశోధనలు చేస్తున్నవారైనా కనీసం కొంత వివరణ ఇవ్వాలి కదా? ఇవ్వంది ఎలా నమ్మడం? ఇది కాకుండా ఒక అసంబద్ధమైన వివరణ ఇచ్చారు. అదేమంటే మెదడు సిట్రాన్ కణాలను విడుదల చేస్తుందనీ, వాటి వల్ల టెలిపతి పని చేస్తుందని అన్నారు. అన్నింటి లాగా ఇదీ అబద్దమే! ఎందుకంటే సిట్రాన్ కణాల ఉనికి ఇంతవరకు తేలలేదు.

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

India would have been a better place without Sathya Sai Baba | New Humanist
పుట్టుపర్తి సాయాబాబా

నిత్యజీవితంలో పనికొచ్చే విషయాలు చూద్దాం. టెలిపతి ద్వారా ఎదుటి మనిషి ఆలోచనలు పసిగట్టొచ్చు లేదా ఎక్కడో జరిగే సంఘటనలు తెలసుకోవచ్చు అనేది నిజమైతే మొదటి బహుమతి ఏ లాటరీ నెంబరుకు వస్తుంద చెప్పాలి. లేదా కారు రేస్ లో – హార్స్ రేస్ లో ఏ కారు/ ఏ హార్స్ గెలుస్తుందో చెప్పాలి.   వారి టెలిపతి ఇలాంటి వాటి గూర్చి మాట్లాడదు. వస్తువుల్ని దూరం నుంచే కదిలించే  ప్రయత్నాలు యూరి గెల్లర్ అనే ఆయన చేశాడు. అయితే అందులోని మోసాన్ని జేమ్స్ రాండి బట్టబయలు చేశాడు. పుట్టపర్తి సాయిబాబా మోసాల్ని అబ్రహం కోవూర్ బయటపెట్టిన విధంగానే – స్పూన్ లను కంటి చూపుతో వంచే ట్రిక్కుల బండారం కూడా జేమ్స్ రాండి బయటపెట్టాడు. దూరం నుంచి వస్తువుల్ని కదిలించాలంటే ఎంత శక్తి వినియోగించాలి – అనే విషయం మీద పరిశోధనలు జరిగాయి. ఒక స్పూన్ ను చూపుతో కదిలించాలంటే వంద మిల్లీ ఓల్ట్స్ ల శక్తి మెదడులో ఉత్పత్తి కావాలి. అది అసాధ్యం! కొందరు రేడియో తరంగాల పోలిక తెస్తారు – రేడియో సిగ్నల్స్ సమాచారాన్ని ఇవ్వగలవు. కానీ, వస్తువుల్ని కదిలించలేవు. స్పూన్ లను వంచలేవు. సైకోకైనసిస్ – విద్యుదయస్కాంతం ద్వారా పని చేస్తుందన్నది నిరూపణ కాలేదు. సైన్స్ కు తెలిసిన శక్తుల వల్ల టెలికైనసిస్, టెలిపతి వంటివి పనిచేయడానికి వేలేలేదు. అందువల్ల గత్యంతరం  లేక ఇదొక మూఢనమ్మక అని నిర్ధారించవలసి వస్తోంది. ఈ మూడనమ్మకం కూడా, ఇతర ఎన్నో మూఢనమ్మకాల వలె కొందరికి జీవనోపాధి అవుతూ ఉందన్నద వాస్తవం!

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

సూడో సైన్స్ అని ఎందుకు అంటున్నారు?

శాస్త్రవేత్తలంతా పారాసైకాలజీని ఎందుకు సూడోసైన్స్ (తప్పుడు శాస్త్రం)గా అభివర్ణిస్తున్నారూ? – అనే విషయం గురించి తత్త్వవేత్త రైమో టొమేలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. సైన్స్ – ప్రోటోసైన్స్- సూడోసైన్స్ ల మధ్య పోలికలను, తేడాలను గురించి వివరించాడు. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి:

  1. పారాసైకాలజీ ఆలోచనాధోరణి తప్పుదోవ పట్టిస్తుంది. ప్రతి విషయాన్ని తప్పుగా నిర్వచిస్తుంది.
  2. పారాసైకాలజీ సూత్రాలు, సిద్ధాంతాలు ఏవీ ఇప్పటివరకు నిరూపణ కాలేదు.
  3. విజ్ఞానశాస్త్రంతో పోలిస్తే – పారాసైకాలజీలో జరిగిన అభివృద్ది చాలా తక్కువ. పైగా ఇది విజ్ఞానం శాస్త్ర సూత్రాలకు పూర్తి విరుద్ధం.
  4. పారాసైకాలజీలో జరిగిన పరిశోధనలూ తక్కువే. అవి కూడా జనబాహుళ్యంలో విశ్వసనీయతను పొందలేదు.
  5. పారాసైకాలజీ – అబద్ధపు పునాదులపై లేచిన భవనం.
  6. విజ్ఞానశాస్త్రంలోని ఏ పరిశోధన అయినా, ఇతర శాఖల సమన్వయంతో కొనసాగుతుంది. కానీ, పారాసైకాలజీ వెలివేయబడ్డ ఒక ఒంటరి శాస్త్రం.
  7. పారాసైకాలజీ – మరణాన్ని చవిచూచి వచ్చినవారి అనుభూతుల గురించి చెబుతుంది.
  8. ఇది పునర్జన్మ వృత్తాంతాల గూర్చి చెపుతుంది.

మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త డేవిడ్ మార్క్స్ అంటాడు – ‘‘విశ్వాసాలు-భ్రమలు-అభూత కల్పనలు వెరసి కొన్ని తప్పులూ- కలగలిసి రూపొందిందే పారాసైకాలజీ’’- అని! సంశయవాది, ఇంద్రజాలికుడు జేమ్స్ రాండి బహిరంగంగా ప్రదర్శనలిచ్చేవాడు. అతీతశక్తులు ప్రదర్శించేవారివలె ఆయన కూడా అన్నిఅంశాలు ప్రదర్శించేవాడు. ఆ తర్వాత వాటి వెనక గల మేజిక్ లనూ, ట్రిక్కులనూ ప్రజలకు బోధించేవాడు.  అలాగే 19వ శతాబ్దిలో ‘క్రేజీ సిస్టర్స్’ ప్రదర్శించే అతీంద్రియ శక్తుల వెనక గల అసలు నిజాల్ని ‘సొసయిటీ ఫర్ సైకికల్ రీసెర్చ్’ వారు బయటపెట్టారు. మన దేశంలో, మన రాష్ట్రాలలో కూడా జ్యోతిషాన్ని, వాస్తును యూనివర్శిటీల్లో బోధనాంశాలు చేశారు. వాటితో జరిగిన మేలేమైనా ఉందా? సైన్సు పరిధిలోకి రానంతవరకు అది ఏదైనా నాన్-సైన్స్ – అవుతుంది. లేదా నాన్సెన్సు – అవుతుంది. మతవిశ్వాసకులు, తమ విశ్వాసాల్ని శాస్త్రీయం అని చెప్పి జనాన్ని బురిడీ కొట్టించేందుకు  పారాసైకాలజీ లాంటి వాటిని ఉపయోగించుకుంటారు. అయితే, అది నిరూపణలకు నిలబడనంతకాలం, సైన్సులో భాగం కానంతకాలం – అది వృధా ప్రయాసే అవుతుంది. ఒక మూఢనమ్మకంగానే మిగిలిపోతుంది!!

Also read: చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు! 

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, ప్రఖ్యాత శాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles