Friday, December 1, 2023

ఏపీలో రూ.3500 కోట్ల స్కామ్ : సోమ్ వీర్రాజు

వోలెటి దివాకర్

ఆంధ్రప్రదేశ్ లో మిల్లర్లు, సివిల్‌ సప్లయి అధికారులు కలిసి ఏడాదికి రూ.3,500 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంచులను కూడా ఇస్తుందనీ, అయితే ఆ సంచుల స్థానంలో పాత సంచులను ఇచ్చి రైతులను మోసం చేస్తూ ప్రభుత్వమే పెద్ద స్కామ్‌కు పాల్పడుతుందనీ, ఈ మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. మిల్లర్లు, సివిల్‌ సప్లై అధికారులు కుమ్మకై రైతు నుంచి రూ.వెయ్యి నుంచి 1100 చొప్పున కొనుగోలు చేసి, తరువాత ఆర్‌బీకేల్లో మరలా అమ్ముతున్నారని ఆరోపించారు. సివిల్‌ సప్లయి కమిషన్‌కు మిల్లర్ల అసోసియేషన్‌కు చెందిన వ్యక్తిని నియమించడం సరికాదని తాను చెబుతూనే ఉన్నానని, వారే ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇస్తున్న బియ్యంను నాణ్యమైనవిగా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు అమ్ముకుంటున్నారని, ఆ బియ్యాన్ని వారే విదేశాలకు తరలిస్తున్నారని అన్నారు.

రైతులు, ప్రజలు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విపత్తు వస్తుందని తెలిసినా రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మొక్కజొన్న, మిర్చి, వరి ధాన్యం సాగు చేసే రైతులు నేడు నట్టేట మునిగిపోయారని పేర్కొన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో రైతులకు జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం  రైతులను నేడు నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు. సంచులు లేవు, రవాణా ఖర్చులు లేవు..తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్పినా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. మొక్కజొన్న ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి అయితే నేటికీ కొనుగోలు చేసిన పరిస్థితి కన్పించడం లేదని ఆరోపించారు. మొక్కజొన్న, పప్పులు, ధాన్యంను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అలాగే రవాణాకు ఉపయోగించే సంచులకు కూడా కేంద్ర ప్రభుత్వమే నగదును ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల కార్డులకు రూ 44 మేలిమి బియ్యంను సరఫరా చేసేందుకు కూడా కేంద్రమే డబ్బును విడుదల చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నా రైతులకు మాత్రం ఆచరణలో ఫలితం దక్కడం లేదన్నారు.

మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ, వైసీపీ ఎమ్మెల్యే లు, ఎంపి ల అవినీతిపై చార్జిషీట్‌ రూపొందిస్తామని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తామన్నారు. ఉదాహరణకు ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారం అని, ఆ భూముల కొనుగోలులో రూ.వంద కోట్లు అవినీతి జరిగిందని, అలాగే గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఎకరం భూమిని ఆరు లక్షలకు కొనుగోలు చేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18 లక్షలకు అమ్మకం పెట్టారని తెలిపారు. అలాగే లిక్కర్‌, ఇసుక, ఇతర వ్యవహారాల్లో జరుగుతున్న అవినీతిపై చార్జ్ షీట్‌లను రూపొందించి జిల్లా స్థాయిలో ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ పై ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ఎవ్వరినైనా కలుసుకోవచ్చునని  చెప్పారు.

Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles