Tuesday, August 9, 2022

సాఫ్ట్ వేర్ శిఖరంపై సత్యనాదెళ్ళ

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా పదవోన్నతి

సీఈవోగా, చైర్మన్ గా జమిలి బాధ్యతల నిర్వహణ

మైక్రొసాఫ్ట్ కు బిల్ గేట్, థాంసన్ తర్వాత మూడో చైర్మన్

ఐఏఎస్ అధికారుల కుటుంబానికి చెందిన దీపస్తంభం

న్యూయార్క్: తెలుగు యువకుడు, సమాచార సాంకేతికరంగంలో మేరునగ సమానుడు, తెలుగు యువజనులకు దీపస్తంభం వంటి  సత్యనాదెళ్ళ ప్రపంచంలోనే పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన మైక్రొసాఫ్ట్ కు చైర్మన్ గా ఎన్నిక కావడం తెలుగువారూ, భారతీయులూ అంతా గర్వించదగిన పరిణామం. ఇంతవరకూ ఇంతటి ఉన్నతస్థానాన్ని ఏ భారతీయుడూ అధిరోహించలేదు. ముఖ్యకార్యనిర్వాహణాధికారి (సీఈవో)గా ఏడేళ్ళ నుంచి (2014 ఫిబ్రవరి) పని చేస్తున్న సత్య ఇటు సీఈవోగానూ, అటు చైర్మన్ గానూ జోడు పదవులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఇది ప్రపంచంలో చాలాఅరుదైన గౌరవం. సీఈవోగా కంపెనీని వ్యాపారంలో కొత్తపుంతలు తొక్కించిన ఫలితంగా సత్యనాదెళ్ళకు ఈ అపూర్వమైన అవకాశం దక్కింది. ఆ కంపెనీ విలులను రెండు లక్షల కోట్ల డాలర్లకు చేర్చడంలో నాదెళ్ళ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఈ సమున్నత స్థానాన్ని అప్పగించారు.  ప్రస్తుత చైర్మన్ జాన్ థాంసన్ స్థానంలో చైర్మన్ గా సత్య త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. సత్యనాదెళ్ళ తెలివితేటలపైనా, నిజాయతీపైనా, విశ్వసనీయతపైనా, శక్తియుక్తులపైనా మైక్రొసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం సంపూర్ణ విశ్వాసం ప్రకటించినట్టుగా ఆ పరిణామం స్పష్టం చేసింది. 2014లో స్టీవ్ బామర్ నుంచి సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ళను కంపెనీ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లు అందరూ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నుకున్నారు.

వ్యాపారంలో ఎదురైన కీలక సమస్యలను సకాలంలో గుర్తించి వాటికి పరిష్కారాలు కనుగొన్నందుకూ, కొత్త కంపెనీల కొనుగోలు ప్రక్రియలో కంపెనీ ప్రయోజనాలను విస్తరించినందుకూ నాదెండ్లకు డైరెక్టర్లు పట్టంకట్టారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 1976లో నెలకొల్పిన సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రొసాఫ్ట్ కు నాదెళ్ళ మూడో చైర్మన్ అవుతారు. తొలి చైర్మన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అయితే మలి చైర్మన్ ప్రస్తుతం ఆ కుర్చీలో కూర్చున్న జాన్ థాంసన్. థాంసన్ ను స్వతంత్ర డైరెక్టర్లలో ప్రథముడుగా బోర్డు నియమించింది. బోర్డు నియమనిబంధనలను పాటిస్తూ, సమావేశాలు నిర్వహిస్తూ, సీఈవో పనిని మదింపు చేస్తూ బోర్డుకు మార్గదర్శనం చేసే బాధ్యతలను థాంసన్ ఇకమీదట నిర్వహిస్తారు. ఇదే పనిని ఆయన 201214లో చేసేవారు. త్వరలోనే చైర్మన్ బాధ్యతలను సత్యకు అప్పగిస్తారు.

సత్యనాదెళ్ళ హైదరాబాద్ లో 19 ఆగస్టు 1967లో జన్మించారు. హైదరాబాద్ బేగంపేటలో పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్శిటీలో ఎంఎస్ (కంప్యూటర్స్) చేశారు. చికాగో యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. సత్య తండ్రి యుగంధర్ ఐఏఎస్ అదికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రకరకాల హోదాలలో పని చేసి, దిల్లీలో ప్రధాని కార్యాలయంలో పని చేశారు. రెండేళ్ళ కిందట ఈ లోకం విచిడి వెళ్ళారు. సత్య మరో ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్ కుమార్తె అనుపమను వివాహం చేసుకున్నారు. వేణుగోపాల్ మంచి పేరున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా, ఎన్ టీ రామారావు హయాంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం బాద్యులుగా పని చేశారు. అనంతరం దిల్లీలో ముగ్గురు ప్రధానుల దగ్గర పని చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర వ్యవహరాలను చక్కదిద్దే పనిలో సహకరించేవారు. సత్యనాదెళ్ళ, అనుపమలకు ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు.  వారి కుటుంబం మైక్రోసాఫ్ట్ కంపెనీ కేంద్ర కార్యాలయం ఉన్న  సియాటిల్ (వాషింగ్టన్)లో నివాసం ఉంటుంది. సత్య వయస్సు 53 సంవత్సరాలు.  

వార్షిక వేతనం రూ. 350 కోట్లు

సత్య నాదెళ్ళ 1992లో మైక్రొసాఫ్ట్ లో చేరారు. క్లౌడ్ కంపూటింగ్ వ్యవస్థను పెంపొందించారు. ఆయన విలువ రూ. 5 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఆయన వార్షిక వేతనం రూ. 350 కోట్లు. భారతీయులు చాలా మంది అమెరికాలోని పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. సుందర్ పిచ్చాయ్ గూగుల్ కంపెనీకి సీఈవోగా పని చేస్తున్నారు. అట్లాగే చాలా మంది పెద్ద హోదాలలో ఉన్నారు. వారందికంటే ఉన్నతమైన హోదా సత్యనాదెళ్ళను వరించింది. ఇందుకు ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగాలి. తెలుగు జాతి మనస్ఫూర్తిగా గర్వించాలి. సత్యనాదెళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles