Monday, February 26, 2024

మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ

పేదరికపు కష్టాల మధ్య, అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో.. ఆయనకే తెలుసు. ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు. ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేరుకున్నారు. మహోన్నతమైన ‘భారతరత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. అత్యుత్తమ ‘భారతరత్న’ సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించిన సాధకుడు సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన మన తెలుగువాడు, మన భారతీయుడు. ఆయన జన్మదినం  ‘జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం’. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్టగౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం,  క్రమశిక్షణే తన మార్గం, పట్టుదలే తన సోపానం. రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సుజ్ఞాన ప్రబోధ. ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. తనకు చదువు, అనుభవం రెండూ తోడునీడలు. జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని, సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక, తను గడించిన అనుభవాన్ని, పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు. అందుకే,  ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. చైనా, పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో, ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గ నిర్దేశం చేశారు. ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు. భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు. బోధనలో, పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.

Also read: నానాటికీ బరువెక్కుతున్న గ్యాస్ బండ

ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు

ఎంత గొప్పగా మాట్లాడుతారో, అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు. అందుకే ఆయనకు పాఠకుడి హృదయం, ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు, ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో,  24 నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే, సరదా కబుర్లు, ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు. 24 నిముషాలకు మించి, ఏ విషయాన్నీ మెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోదని ఆయన సిద్ధాంతం. మానవ జీవ రసాయన చర్యలు, విద్యా మనస్తత్వశాస్త్రం ( ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే  సర్వోన్నత ఉపాధ్యాయుడయ్యారు. సర్వజన రంజిక ఉపన్యాసకుడయ్యారు. ఆయన రాసిన ‘భారతీయ తత్త్వశాస్త్రం’ ప్రపంచ పండితులకు నిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజప్రతిభావంతుడికి  సాధన మరింత వెలుగునిచ్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ద్వితీయ వైస్ ఛాన్సలర్ గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి. హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. మేధావుల విలువ తెలిసిన మేధావి. దేశ, విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు.

Also read: గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు

విద్యావిధానంలో సంస్కరణలకు సారథ్యం

భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి. జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక, నేలను శుభ్రం చేసుకొని భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే హృదయం ద్రవించినా  జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందబాష్పాలు కురిపిస్తుంది.  మెదడును కదిలిస్తుంది.  గుండెను మరింత దృఢంగా మారుస్తుంది. కర్తవ్యం వైపు నడిపిస్తుంది. పేదవాడికి కొండంత స్ఫూర్తిని అందిస్తుంది. డబ్బు విలువ, దేశం విలువ తెలిసినవాడు కనుక రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని, మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు.”చదువది ఎంత కలిగిన.. రసజ్ఞత ఇంచుక చాలకున్న.. ఆ చదువు నిరర్ధకంబు…” అన్నట్లు, జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం. జీవితాన్ని అర్ధంచేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన. వివేకం, తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతన ప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత  అధ్యాపకుడు సర్వేపల్లి రాధాకృష్ణ.

Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles