Tuesday, November 12, 2024

` స్త్రీ జాతి శిరోమణి` సరోజినీదేవి

`గాంధీజీ భారత నైతిక శక్తి. సరోజినీదేవి  భారత కళామూర్తి. గాంధీజీ  నీతిమంతమైన రాజకీయ ఉద్యమం చేస్తే, సరోజినీ దేవి తమ కళా వైదగ్ద్యంతో  మెరుగులు దిద్ది  మరింత శోభను చేకూర్చారు’ అని ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రశంసలు అందుకున్న తెలుగింటి కోడలు.

` స్త్రీ జాతి శిరోమణి వమ్మ

 మా జాతి గులాబి రెమ్మ

 మధురాల వరాల స్వరాల పల్కు

 మంజుల కోయిలవమ్మ

నీ జీవిత కావ్యాలాపం

విశ్వానికి  ప్రేమ కలాపం

అనురాగ తరంగ మృదంగ భంగిమల

అమృతము చిందితివమ్మ` అన్న కవి తేలేటి కమనీయ గీతం ఘంటసాల వారి కమ్మని కంఠం నుంచి జాలువారింది. `పరిపూర్ణ సువర్ణ కళామయి జీవి` సరోజినీదేవి `గానకోకిల` మాత్రమే కాదు.రాజకీయ ఉపన్యాసాలలో,జాతిని ఉత్తేజపరచడంలో దిట్ట. గంభీరవాణితో ఆమె చేసిన ఉపన్యాసాలు జాతిని ఉర్రూతలూంగిచేవట.

Also Read: ‘వట్టికోట’ మానవతకు పెట్టినకోట

గోఖలే గురుత్వంలో:

గోపాలకృష్ణ గోఖలే ఆమెకు రాజకీయ గురువు.1905లో ఆమెను జాతీయ ఉద్యమంలో ప్రవేశపెట్టగా  గాంధీజీ మార్గదర్శకులయ్యారు.  స్వరాజ్యసమరంలో అగ్రభాగాన నిలిచిన తొలి మహిళ.  మన దేశంపై అమెరికాలో ప్రబలిన అపోహల నివృత్తికి గాంధీజీ ప్రత్యేకంగా సరోజనిదేవిని పంపగా ఆమె  తన బాధ్యతను విజయవంతగా  పూర్తి చేసుకుని వచ్చారు.భారత పూర్వవైభవం, హిందూముస్లింల ఐక్యత  ఆమె ప్రధానాశాయాలుగా నిరంతరం   పాటుపడ్డారు.

ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం..

గాంధీజీ ఆయన  పిలుపు మేరకు సత్యాగ్రహ ప్రతిజ్నపై సబర్మతి ఆశ్రమంలో సంతకం చేశారు.  అబ్బాస్ త్యాబ్జీ అరెస్టు తర్వాత  ఉప్పు సత్యాగ్రహం జట్టుకు నాయకత్వం వహించారు. క్విట్ ఇండియాలో ఆమెను అరెస్టు చేసి గాంధీజీతో పాటు ఆగాఖాన్ భవన్ లో నిర్బంధించారు.

అద్భుత ఉపన్యాసకురాలు:

ఆమె ఉఫన్యాసాలను జనం అమితంగా ఇష్టపడేవారు. `అఖిల ఆసియా వాసులారా? ముందుకు సాగండి. ఆకాశమే హద్దుగా ఉద్యమించండి. చంద్రమండలాన్ని అందుకోండి.పారతంత్య్ర  శృంఖలాలను తెంచుకోండి. బానిస భావాలతో తరతరాలు మగ్గిపోతూ బతకడం కంటే త్యాగంతో ఒక తరం  అంతరించినా భావితరాలకు  స్వేచ్ఛావాయును ప్రసాదించగలగాలి` అంటూ 1947 మార్చి 23వ తేదీన  ఢిల్లీలో జరిగిన  ఆసియా సంబంధాల మహాసభలో చేసిన  అధ్యక్షోపన్యాసం అక్కడి  ప్రతినిధులనే కాకుండా యావద్భారత ప్రజానీకాన్ని ఉర్రూతలూగించింది.ఆ మహాసభ ఆసియా దేశాల  స్వాతంత్య్రానికి పునాది వేసింది.దక్షిణాఫ్రికాలోని భారతీయుల దుర్భర బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ వారి హక్కులకోసం పోరాడారు.

`జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ బావించకు.  దేశం బానిసత్వం అనుభవించే బానిసత్వం నీకూ వర్తిస్తుంది. నీకు అన్యాయం జరిగితే దేవానికీ జరినట్టే` అంటూ దేశమంతా తిరిగి చైతన్యపరిచారు. భారతదేశాన్ని ఆంగ్లేయలు సొంత దేవంగా భఆవించడమే అపరాధమని, భారతీయుల హక్కులను హరించివా వారి ప్రాణాలను బలితీసుకోవడం క్షమించరాని మహా నేరమని ఒక బహిరంగ సభలో హూంకరించారు.

 పరాయిపాలనలో భారతీయుల భానిసత్వం గురించి కెనడా, అమెరికా లాంటి దేశాలలో ప్రచారం చేసి వాటి మద్దతుకు ప్రయత్నించారు.గాంధీజీ అరెస్టు తర్వాత అవిశ్రాంతంగా పర్యటిస్తూ చేస్తున్న ఉపన్యాసాలకు, ప్రజల్లో రగిలిస్తున్న చైతన్యానికి బెంబేలెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమె చేతికి సంకెళ్లు వేసింది. నిస్వార్థ దేశభక్తురాలిని అరెష్టు చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డాడు 1930 వ 23 వతేదీన అరెస్టయిన  శ్రీమతి సరోజినీ నాయుడు ఎనిమిది నెలలు  జైలు జీవితం గడిపారు.

Also Read: పౌరహక్కుల గురించీ, మహిళా విమోచన గురించీ

 కాంగ్రెస్ అధ్యక్షురాలుగా…

 1924లో  కాంగ్రెస్ మహాసభలకు గాంధీజీ అధ్యక్షత వహించగా,మరుసటి  ఏడాదిలో  కాన్పూర్ లో జరిగిన  మహాసభలకు సరోజినీ అధ్యక్షత వహించారు.జాతీయ కాంగ్రెస్   అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన  తొలి మహిళ కూడా ఆమే.  ఆ పదవిని చాకచక్యంగా, సమర్థంగా నిర్వహించి  గాంధీజీతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు బొంబాయిలో జరిగిన (1915) కాంగ్రెస్ మహాసభ లకూ,లక్నో (1916) కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నారు.మహిళలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలోనూ,పార్టీని వారికి చేరువ చేయడంలోనూ, మహిళలోని భావదాస్యాన్ని పారదోలడంలో అద్వితీయ పాత్ర పోషించారు. ముఖ్యంగా అఖిల భారత మహిళాసభ స్థాపనలో, దాని నిర్వహణలో విశేషంగా కృషి  చేశారు. లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి  (1931) మన దేశ ప్రతినిధిగా హాజరయ్యారు. స్వరాజ్యం సిద్ధించిన తరువాత  దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా నియమితులయ్యారు.  `సరోజినీ వంటి బిడ్డ  ఈ  గడ్డపై మరోసారి జన్మిస్తుందా` అని  ఆమె కన్నుమూత వేళ్ ప్రధాని నెహ్రూ నివాళులు అర్పించారు.

బాల్యం, వివాహం:

బెంగాల్ లకు చెందిన సరోజినీ నాయుడు  తల్లిదండ్రులు వరదసుందరి, అఘోరనాథ్ చటర్జీ కోలకత్తా నుంచి  హైదరాబాద్ తరలి వచ్చి స్థిరపడిపోయారు. అఘోరనాథ్ చటోపాధ్యాయగొప్ప విద్యావేత్త.డాక్టర్ ఆఫ్ సైన్స్  పట్టా పొందిన తొలి భారతీయుడు. తల్లి వరద సుందరి  కవయిత్రి. సరోజినీ 1879 ఫిబ్రవరి 12 జన్మించారు.  బాల్యంలోనే వైధవ్యం ప్రాప్తించిన  ఆమె తరువాత  హైదరాబాద్ లోని ప్రముఖ వైద్యుడు మేజర్ ముత్యాల గోవిందరాజులనాయుడు గారిని పెళ్లాడారు. ఇది భాషాంతర, వర్ణాంతర వివాహం. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు రి వివాహానికి అధ్వర్యం వహించారు.ప్రఖ్యాత కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, లెనిన్ గ్రాండ్ విశ్వ విద్యాలయం లో  అధ్యాపకుడిగా పనిచేసిన  వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఆమె సోదరులు.  ఆమె నలుగురి సంతానంలో  హైదరాబాద్ లో ప్రముఖ వైద్యుడిగా  సేవలు అందించిన  జయసూర్య ఆమె తనయుడు. సొంత రాష్ట్రం  పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించిన పద్మజానాయుడు ఆమె కుమార్తె(తల్లీ కూతుళ్లు గవర్నర్లుగా  వ్యవహరించిన అరుదైన సందర్భం).

గానకోకిల:

బాల్యం నుంచి కవిత్వం పట్ల మక్కువ గల  సరోజినీ నాయుడు  పదేళ్ల  వయసులో  మృధుమధురమైన కవిత్వ రాసి `కవయిత్రి`గా విశ్వవిఖ్యాతి చెందారు. లేత వయసులో  తరగతి  గదిలో కవిత్వం రాసి అధ్యాపకులనే  అబ్బురపరిచారట. పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షలో  ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై. మద్రాసు ప్రెసిడెన్సీలోనే సర్వ ప్రథములుగా నిలిచారు. ఆమె ప్రతిభని గుర్తించిన హైదరాబాద్ నిజాం ప్రభువు విదేశాల్లో చదువుకునేందుకు  ఉపకార వేతనం ఇచ్చారు. కానీ అనారోగ్య కారణంగా రెండేళ్లు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.  ఆ సమయంలో  పుస్తక పఠనంతో  అపారమైన  విజ్ఞానాన్ని సముపార్జించారు. లండన్ లోని కింగ్స్ కాలేజీలో,  కేంబ్రిడ్జిలోని  గిర్బన్ బాలికలో కళాశాలలో చదివారు. ఆమె కవితా సౌరభం  అంతర్జాతీయ ఖ్యాతిని అర్జిస్తున్న తరుణంలో  జాతీయ ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొనడంతో  కవితా రచనకు స్వస్తి చెప్పారు.

Also Read: మరచిపోతున్న ‘మహాత్ముని’ మరణం… కొన్ని వాస్తవాలు

సేవాకార్యక్రమాలు:

మూసీనదికి వరదలు (1908) సంభవించినప్పుడు సరోజినీ దేవి చేపట్టిన సేవా కార్యక్రమాలకు బ్రిటిష్  ప్రభుత్వం  `కైజార్ ఎ హిందూ` స్వర్ణపతకాన్ని బహుకరించింది. మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసిన ఆమె   మహిళలకు విద్య ఆవశ్యకతపై  ఎన్నో సమావేశాలు నిర్వహించారు. స్వరాజ్యం కోసం, వివిధ వర్గాలు ముఖ్యంగా  మహిళాభివృద్ధి  కోసం  పాటు పడిన  ఆ  గానకోకిల గాత్రం, గంభీరవాణి  ఆమె 70వ ఏట మూగపోయింది.

( ఈ  నెల 13న `గానకోకిల` సరోజినీ దేవి జయంతి)

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles