Friday, March 29, 2024

బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర తెలంగాణ ద్రోహయాత్ర:కేటీఆర్ లేఖాస్త్రం

  • ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర
  • పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు.
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..?
  • పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..?
  • పాలమూరు ఎత్తి పోతల పథకానికి
  • జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు?
  • కర్ణాటక మీద కనికరం చూపిన మీరు
  • పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో … సమాధానం చెప్పాలి?
  • అడుగడుగునా అన్యాయం…తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ.
  • విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిదులిచ్చే నీతి లేదు
  • ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు
  • ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. 
  • పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు
  • సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం గక్కుతారు 
  • తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ 
  • కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం?
  • వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? 

‘‘రైతులతో  రాబందుల్లా వికృత రాజకీయం చేసి  వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా? రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు,’’ అంటూ కేటీఆర్ తన బహిరంగ లేఖలో రాశారు.

‘‘తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదు,  అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర.. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర. బండి సంజయ్ తన పాదయాత్రను పాలమూరు జిల్లా నుంచి ప్రారంభించడమంత దగాకోరుతనం ఇంకొకటి లేదు. పచ్చ బడుతున్న పాలమూరుపై పగ బట్టిన పార్టీకి అధ్యక్షుడైన బండి సంజయ్ కు అక్కడ అడుగుబెట్టే నైతిక అర్హత లేదు. పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానికానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తు, ఎగతాళి చేస్తున్న నియంతృత్వ పోకడలపై ముందుగా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పి పాదయాత్రను ప్రారంభిస్తే కాస్తైనా గౌరవం దక్కుతుంది,’’ అని హితవు చెప్పారు.

కళకళలాడుతున్న పాలమూరు

‘‘ఒకప్పుడు పల్లేర్లు మొలిసిన పాలమూరు గడ్డ, ఈ రోజు పచ్చని పంటలతో  కళకళలాడుతున్నదన్న నిజాన్ని కలలో కూడా ఓర్వలేకపోతున్న నాయకత్వం బీజేపీది. పాలమూరు కు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? పాలమూరు జిల్లా వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన కృష్ణా జలాలలో వాటా తేల్చకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో ఒక శిఖండి సంస్థను ఏర్పాటుచేసి పాలమూరుకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సందిగ్దంలోకి నెట్టిన కుట్రపూరిత పార్టీ భారతీయ జనతా పార్టీ. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ, పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న భాజాపా బానిస నాయకులు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..? పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్పందన ఏంటో బండి సంజయ్ చెప్పాలి. పక్కనే ఉన్న కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పిన తరువాతనే  పాలమూరు గడ్డ మీద బండి సంజయ్ అడుగుపెట్టాలి. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో సమాధానం చెప్పాలి? పాలమూరు రైతు చేసిన పాపం ఏంది..? పాలమూరు ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల, మాచార్ల రైల్వే లైన్ ను ఎలా పూర్తి చేస్తారో బండి సంజయ్ స్పష్టం చేయాలి,’’ అని కేటీఆర్ కోరారు.

దేవాలయాలను ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి

‘‘ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభిస్తున్న బండి సంజయ్, రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులను తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ, ఆ కోదండ రాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలపాలి. దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే బండి సంజయ్, భారతీయ జనతా పార్టీలది. కాని మేం మాత్రం అంచంచలమైన భక్తి, అంకుఠిత దీక్షతో ఆ సేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించాము. ఈ దైవకార్యంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా? దేవుళ్లు, దైవాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రైతాంగాన్ని కూడా తన చిల్లర రాజకీయాలకు బలి చేస్తోంది. వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చినంక తప్పించుకు తిరుగుతున్న బండి సంజయ్ తన పాదయాత్రకు రైతు దగా యాత్ర లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితిపై బండి సంజయ్ తన వైఖరిని స్పష్టం చేసినంకనే పాదయాత్ర ప్రారంభిస్తే మంచిది. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? రైతులతో  రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు…ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా? వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారం బీజేపీది. రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు,’’

దశా-దిశా లేని బీజేపీ పాలన

‘‘దశా దిశా లేని బీజేపీ దరిద్ర విధానాలతో దేశంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కాలు రాని నాయకత్వం ప్రజలపై చేస్తున్న సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చేలా మీరు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్టున్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కేంద్ర ప్రభుత్వ చేతగానితనం పై  ప్రజలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయమే చేసింది. పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై కత్తిగట్టింది. అధికారం ఉందన్న అహంకారంతో తెలంగాణ 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపిన బీజేపీ దౌర్జన్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు. నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు.నదీ జలాల్లో వాటాలు తెల్చకుండా జలదోపిడికి సహకరిస్తారు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు.సందు దొరికితే దాలు తెలంగాణ మీద విషం గక్కుతారు. తెలంగాణ అంటేనే గిట్టని బీజేపీ నాయకులు కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? పాదయాత్రే కాదు మోకాళ్లపై దేక్కుంటూ యాత్ర చేసినా బండి సంజయ్, భాజాపాను తెలంగాణ ప్రజలు నమ్మరు. బీజేపీ పార్టీ డిఎన్ఏ లో ఉన్న వివక్ష, విభజన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గుర్తించి తిరస్కరిస్తారు’’ అని కేటీఆర్ తన బహిరంగలేఖలో స్పష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles