Thursday, September 19, 2024

అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం

Breathes there the man

Breathes there the man, with soul so dead,

Who never to himself hath said,

This is my own, my native land?

Whose heart hath ne’er within him burn’d,

As home his footsteps he hath turn’d,

From wandering on a foreign strand?

If such there breathe, go, mark him well;

For him no Minstrel raptures swell.

High though his titles, proud his name,

Boundless his wealth as wish can claim;

Despite those titles, power, and pelf,

The wretch, concentred all in self,

Living, shall forfeit fair renown,

And, doubly dying, shall go down

To the vile dust, from whence he sprung,

Unwept, unhonor’d, and unsung.

Sir Walter Scott

నా తరం విద్యార్థులకు పాఠ్యాంశంగా గల దేశభక్తి గీతమిది. దీనికి దగ్గరి చుట్టమొకటి తెలుగులో వున్నది.  నైజామ్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రప్రజలు పోరాడిన నాటి  కాళోజీ వారి గేయమిది:

మాతృదేశము మాట ముచ్చట

ముదము గూర్పదు మదికి అనియెడు

పరమ నీచుడు ధరణినంతట

కలయవెదకిన కాననగునా?”

నీరు లేని ఎడారి యైనను

వానవరదల వసతి యైనను

అగ్గి కొండల కవని యైనను

మాతృదేశము మాతృదేశమె!”

తల్లి కోపము, తండ్రి శాపము

భార్య బిడ్డల ప్రణయ పాశము

ఇంచుకయు గణియింప నీయదు

మాతృదేశము మాతృదేశమె!”

స్వర్గమే అపవర్గమే యగు

మాతృదేశము, పరుల పాలన

క్రింద నరకము కన్న హేయము

కఠినతరము!”

 స్వరాజ్య పోరాటం సమయంలో ఆంధ్రప్రాంతాన్ని ఉఱ్ఱూత లూగించిన గరిమెళ్ళ వారి  “మాకొద్దీ తెల్లదొరతనం” పాట గూర్చి వేరే చెప్పవలసిన పనిలేదు.

Also read: ఏల ప్రేమింతును

పదహారేళ్ళ క్రిందట, నేనూ, నా స్నేహితుడు సోమయాజులు గారూ గుంటూరు నుండి హైదరాబాదుకు తిరిగి వస్తున్నాము.  భారతీయ సంపదను రెండు వందలా యాభై ఏండ్లపాటు ఆంగ్లేయ సామ్రాజ్యం ఎంతగా దోచుకున్నదో అనే అంశంపైనే మా సంభాషణ సాగింది. ఉన్నట్లుండి ఆయన నన్నడిగినాడు: “ఒకవేళ బ్రిటీష్ వారు భారతదేశాన్ని ఆక్రమించకపోతే ఏం జరిగేది?”

“భారతదేశం ఫ్రెంచ్ పాలన క్రిందనో, డచ్, పోర్చుగీస్ పాలన క్రిందనో మ్రగ్గేది” అన్నాను నేను. “అప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యేది!”

“అనగా, బలహీనత మనలోనే వున్నది. నిర్వీర్యమైన మన సాంఘిక వ్యవస్థ ఎవరో ఒకరు పరాయి పాలకుల క్రింద మ్రగ్గడానికి ఆనాడు సిద్ధంగా వుంది.”

ఆయన అన్నాడు: “ఆ నాటి సాంఘిక బలహీనత నేటికీ వున్నది. సామాజిక చైతన్యం సాధించడం ఈ దేశంలో చాలా అవసరం”

Also read: భ గ్న మా లి క

అంబేడ్కర్ అన్నమాట

1949లో రాజ్యాంగసభలో ప్రసంగిస్తూ డా అంబేడ్కర్ ఇట్లా అన్నారు: “వేదయుగంలో, బౌద్ధయుగంలో, స్థానిక ప్రజాస్వామ్యం మనదేశంలో పలుమార్లు పరిఢవిల్లి, అదే సమయంలో పలుమార్లు పతనావస్థను కూడా చవిచూసింది. నా సంశయమిదే. కష్టపడి సాధించుకొన్న జాతి స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకొనే సత్తా ఈ దేశప్రజలకున్నదా?”

ఆధునిక ప్రజాస్వామ్యానికి మాతృభూమి అనబడే ఇంగ్లండులో రాజ్యాంగం అతి చిన్నది. తరతరాలుగా నెలకొల్పబడిన ప్రజాస్వామ్య సంప్రదాయాలే శిరోధార్యంగా పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తుందక్కడ. స్వేచ్ఛాభారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. కానీ మన రాజకీయ వేత్తల్లో రాజ్యాంగస్ఫూర్తి ఉన్నదని చెప్పడానికి వీలులేదు.

ప్రతి ప్రజాస్వామ్య దేశంలో,  separation of powers అనే మౌలిక సూత్రానికి పెద్దపీట వేస్తారు. అనగా, న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ, శాసనవ్యవస్థ పరస్పర స్వతంత్రంగా మనుగడ సాగిస్తాయి. రానురాను, న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, మన దేశంలో స్వతంత్రంగా పనిచెయ్యలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Also read: నా గు ల చ వి తి

మహాత్మాగాంధీ ఏమన్నాడు?

ఆసియాఖండంలో ప్రజాస్వామ్యం పచ్చగా వున్న అతికొద్ది దేశాల్లో భారతదేశమొకటి. ఇక్కడ మానవస్వేచ్ఛకు, ప్రజాస్వామ్య పాలనకు ముప్పు వాటిల్లడానికి వీల్లేదు.

“ఈ సమాజానికి మానవుడే కేంద్రబిందువు. సమాజం వృత్తం యొక్క పరిధి. సమాజమనే వృత్తానికి కేంద్రబిందువు మటుకు మానవుడే. వృత్తం యొక్క పరిధి విస్తరించవచ్చు. లేదా సంకోచించవచ్చు. కానీ స్థిరంగా వుండేది మానవుడే!” అని పేర్కొన్నాడు మహాత్మాగాంధీ. “నీవేదైనా పని తలపెట్టినప్పుడు, దానివల్ల సమాజంలో అత్యంత దీనావస్థలో వున్న మనిషికి నీ పనివల్ల మేలు కలుగుతున్నదా లేదా అని ఆలోచించు. అట్లా ఆలోచించినప్పుడే నీవు చేస్తున్న పనికి సార్ధకత” అంటాడు మహాత్ముడు. నేటి ప్రజాస్వామ్యం సామాన్యమానవుణ్ణి క్రమక్రమంగా విస్మరిస్తున్నది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

పీవీ కవిత

1972 సంవత్సరం భారతదేశ రజతోత్సవ సందర్బంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభా సంయుక్తసమావేశంలో నాటి ముఖ్యమంత్రి పీవీగారు ర చించి, ఆలపించిన కవిత ఈ ప్రశ్ననే అడుగుతున్నది:

భూమి దానవగ్రహమై

పోవగ రోదసిని మధించి

మానవతావాహనకై

పూనుకొన్న రాజ్యేందిర

జయదుందుభి విని

ఉత్తేజము పొందునా

పౌరుడు?”

మోదమలరని చెరలో

మూల్గెడు భావకిశోరికి

విహరణ స్వేచ్ఛాంతరిక్ష

వీధిని లభ్యంబగునా?”

ఔనని, ఔనౌనని,

నౌనౌనని జనవాక్యము!

తనువులు పులకెత్త ప్రతి

ధ్వనితమయ్యె మనకంఠము”

అంతులేని ప్రశ్నల పరంపర యిది

పృచ్ఛకుడెవడో? ఇవ్వగ జాలెడు

నెవడో సమాధానము?”

అమెరికన్ కవి ఆర్చిబాల్ఠ్ మాక్లిష్ సైతం ఇదే భావాన్ని ప్రతిబింబిస్తున్నాడు:

“When state is the master

Drums beat disaster;

When master is man

Music can!”

తరతరాల బానిసత్వానికి అలవాటు పడిన భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం “top dressing” వంటిదని నొక్కి వక్కాణిస్తాడు డా అంబేడ్కర్.

సుదీర్ఘకాలం సాగిన తన స్వాతంత్ర్య పోరాటకాలంలో సామాన్యజీవుల  సత్యాగ్రహోద్యమాలకు ఊపిరి నిచ్చిన వాడు మహాత్మాగాంధీ. నేడా స్పూర్తి దేశదేశాలకు ప్రాకింది. ప్రజాస్వామ్యం బలహీనపడినప్పుడీ ఉద్యమాలే  మానవస్వేచ్ఛను పునురుజ్జీవంప చేయగలవు.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

“నిరంతర జాగరూకత స్వేచ్ఛకై మనం వెచ్చించే మూల్యం”.

“Eternal vigilance is the price of liberty.

మూడేండ్ల క్రిందట “శంకరాభరణం” సమస్యాపూరణ సమూహంలో ఇచ్చిన సమస్య యిది. “స” నిషిద్ధాక్షరంగా, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని వర్ణించండి!”.

దానికీ వ్యాసరచయిత సమర్పించిన పూరణ యిది:

ఈ మనోహర రాగరంజిత రవాల

కేది శ్రీకార మదియె వర్జితము నేడు

త్రెంచిరి దయావిహీనులు తీగనొకటి

మూగ వడివోయె మధుర వీణా గళమ్ము”

చూతవనిలో దిగులు కుహూగీతి లేక!

లతకు క్లేశమ్ము తరళ ఝాంకృతులు లేక!

పేదవడెను పురాతన వేదభూమి

అధరముల నిషిద్ధమగు మంత్రాక్షరాన!”

ఏది బీజాక్షరమ్ము జీవేచ్ఛయందు?

ఆజ్యమెద్ది ఉద్యమ మహితానలాన?

ఏది కాంక్షించి దేవి లక్ష్మీలలామ

కదనరంగాన వీరరక్తమ్ము చిందె?”

అభయమే లేక మహిళల కర్ధరాత్రి

అవని వినువారు లేక క్షుధార్తగీతి

తెల్లదొరలను త్రోలిన నల్లదొరలు

వేయు పాచిక యగుచు పవిత్రధాత్రి!”

ఉద్యమించె తలపులు మహోదధి వలె

నేడు మువ్వన్నె జండాల నీడ నిలచి

గళము పెగలక కన్నీరు కార్చికార్చి

భరతమాత పాదాల తర్పణమొనర్చి!”

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

మహాత్ముని శతజయంతోత్సవం 1969 లో దేశం వైభవోపేతంగా జరుపుకున్నది. ఆ సందర్భంలో “యోజన” పత్రిక ప్రత్యేక సంచికను ప్రచురించింది. అందులో మహామహుల వ్యాసాలున్నవి. వాటిల్లో ఎస్ యే డాంగే  రచించిన వ్యాసమొకటి నన్ను అమితంగా ఆకట్టుకొన్నది. ఆ వ్యాసం కొసలో డాంగే ఇట్లా పేర్కొన్నారు:

“Freedom of the masses does not mean transfer of power from the white sahib to the brown sahib; it means transfer of power from the brown sahib, to the people and the people and none but the people!”

స్వరాజ్య వజ్రోత్సవ శుభాకాంక్షలతో

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles