Saturday, April 20, 2024

అమ్మకు వందనం

అమ్మతనాన్ని తూకం వేసే రాళ్ళు లేవు

కన్న తల్లి భారమై, పనికి రాని వస్తువైందా?

భూమి కంటే గొప్పది మాతృమూర్తి

అమ్మ ప్రేమను పొందడం అందరికీ తెలిసిన అనుభవం. కానీ, అమ్మ ప్రేమను వర్ణించమంటే? అది సాధ్యమయ్యే పనికాదు. వ్యాసానికి,ఉపన్యాసానికి  అందని సృష్టి అమ్మ. ఏ మహాకవియైనా ప్రేయసి అందాన్ని వర్ణించగలడు, పరిపాలించే రాజులోని వీరత్వాన్ని, దానగుణాన్ని వచించగలడు, కనిపించని దైవాన్నికూడా  కవితామయం చేసి స్తుతించగలడు, నవరసాలకూ అక్షరాకృతిని అందించగలడు. కానీ! అమ్మను అభివర్ణించడానికి ఏ మహాకవి దగ్గర ఉన్న కవితా సంపద సరిపోదు, ఏ చిత్రకారుడి,ఏ శిల్పకారుడి కళాప్రతిభలు సరిజాలవు. అమ్మతనాన్ని తూకం వేసే రాళ్లు సృష్టిలో లేనేలేవు. ఆమెపట్ల కృతజ్ఞత, ఆమె పెంచిన, పంచిన జ్ఞాపకాల మధురత, ఆమె అందించిన సేవల, చిలికించిన ప్రేమల, పంచిచ్చిన సంస్కార సంపదల, త్యాగనిరతుల స్మృతిగతిలో తరించడం, హృదయం పరచి కన్నీళ్లు,ఆనందభాష్పాలు కలగలిపి నిలువెత్తు కృతజ్ఞతతో నమస్సులు సమర్పించడమే మనం చేయగలిగింది.చేయవలసింది కూడా అదే.

Also read: ఖలిస్థాన్ వాదం ఖతం కాలేదా?

తల్లిని మించిన దైవం లేదు

కొండంత దేవునికి కొండంత పత్రిని సమర్పించలేం కదా ! అలాగని పూజించడం మానం కదా. దొరికిన ఒక పువ్వుతోనైనా, ఒక పత్రంతోనైనా పూజలు చేస్తాం. అలాగే, అక్షరాలు దొరకలేదని  అమ్మను అర్చించకుండా ఉంటామా?  “న మాతుః పరం దైవతమ్” అన్నది ఆర్యోక్తి. తల్లిని మించిన దైవం లేదన్నది దాని సారాంశం. ఆదిశంకరాచార్యుడి నుంచి ఆధునిక సినిమాకవి వరకూ అమ్మను అక్షరాల్లో బొమ్మకట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ‘చందమామ’ పుస్తకంలో అమ్మగురించి చెప్పిన ఒక కథ ఈ సందర్భంలో గుర్తుచేసుకుందాం. “మీ తల్లి గుండె నాకు కావాలి. అది తీసుకొచ్చి ఇవ్వమని  భర్తను భార్య కోరింది. భార్య వ్యామోహంలో పడివున్న అతను తల్లి గుండెను కోసి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో,అతనికి ఒక రాయి తగులుతుంది. అమ్మా! అని అరుస్తాడు. ఏం నాయనా దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? జాగ్రత్తగా వెళ్ళు అంటుంది అమ్మ”. అదీ అమ్మతనం!! తన గుండెను కోసి తీసికెళ్తున్నా.. కొడుకు క్షేమం గురించే ఆలోచించేది అమ్మ. అందుకే, ఆదిశంకరాచార్యులు “కు పుత్రో జాయేత క్వచిదపికు మాతా న భవతి ” అంటాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డ కుమారుడు ఉంటాడేమో! కానీ, చెడ్డతల్లి ఎక్కడా ఉండదు అని దాని తాత్పర్యం. ఈ వాక్యం మనమందరం పటం కట్టించుకొని గుండెల్లో పెట్టుకోవాలి.తల్లి పట్ల మనం ఎంత మంచిగా ఉంటున్నాం, ఎంత చెడ్డగా ఉంటున్నాం, అని నిరంతరం మనల్ని మనం ఆత్మపరీక్ష చేసుకుంటూ ఉండాలి. అసలు మనలో చాలామంది తల్లి దండ్రులను  ఇంట్లోనే ఉంచుకోవడం లేదు. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, డొక్కలు ఎండగట్టుకొని పిల్లలను పెంచుతారు. పిల్లలకు రెక్కలు రాగానే ఒదిలిపెట్టి వెళ్లేవారు  కొందరు,వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ మరికొందరు, సేవకులను అప్పజెప్పి వేరే ఇళ్లల్లో ఉంచేవారు ఇంకొందరు ప్రబుద్ధులు  తయారవుతున్న నవీన నాగరిక సమాజంలో నేడు మనం ఉన్నాం.

Also read: కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందా?

అమ్మకు కన్నీళ్ళే మిగుల్చుతున్నామా?

‘తల్లి’ పనికిరాని వస్తువైంది. పిల్లలకు బరువైంది. ఆ తల్లిని వదిలించుకొనే, దించుకొనే ప్రయత్నంలోనే ఎందరో నేటికాలపు పిల్లలు సాగుతున్నారు. అందుకే, “ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు – పెట్టబోక ఏడిపించు నేడు” అన్నారు గరికిపాటి నరసింహారావు ఒక పద్యంలో. చిన్నప్పుడు అన్నం తినకుండా మారాం చేస్తున్న పిల్లవాడిని, వెంటపడి అన్నం పెడుతుంది, అయ్యో! వీడు అన్నం తినడం లేదే? అని బాధపడుతుంది అమ్మ. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత,ఆ అమ్మకే అన్నం పెట్టకుండా ఏడిపిస్తాడు అదే…  కొడుకు. చిన్నప్పుడూ, ఇలా, పెరిగి పెద్దయినప్పుడు కూడా అమ్మకు కన్నీళ్లే మిగిలిస్తున్నాం. అత్తా ఒకప్పుడు కోడలే అన్న చందంగా,కూతురు లేదా కోడలు జీవితంలో ఏదో ఒకనాడు తల్లిపాత్రను పోషించాల్సిందే.తన పిల్లలకు తల్లితనాన్ని పంచాల్సిందే. పంచుతుంది కూడా. కానీ ఈ క్రమంలో  అత్తగారిలోని తల్లి ఈమెకు గుర్తురాదు. అదే మాయ. భార్య మాయలోనో, భయంతోనో,అవసరంతోనో కొడుకు తల్లిని మరచిపోతున్నాడు, అదీ నేటి విషాదం.

Also read: ఐరోపాలో మోదీ పర్యటన

మాతృదేవతా దినోత్సవం

ప్రతి సంవత్సరం మే నెలలో  రెండవ ఆదివారంనాడు ప్రపంచవ్యాప్తంగా ‘మాతృదేవతా దినోత్సవం’ జరుపుకోవడం కొన్నాళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అది ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, ఎప్పుడు మొదలు పెట్టారు అనే చరిత్ర,తారీఖులు,  దస్తావేజులు గురించి పెద్దగా చర్చ చేయాల్సిన  అవసరం లేదు.వారు మొదలు పెట్టిన సంప్రదాయాన్ని మనం కూడా గౌరవిద్దాం.అమ్మను తలచుకుందాం,అమ్మను కొలుచుకుందాం.  “అమృతానికి,అర్పణకు అసలుపేరు అమ్మ – ఈ లోకమనే గుడి చేరగ, తొలి వాకిలి అమ్మ ” అన్నారు మాడుగుల నాగఫణిశర్మ. అమృతం ఎలా ఉంటుందో, మనకెవ్వరికీ తెలియదు. అది అనిర్వచనీయం. త్యాగం, ప్రేమ, సేవల అర్పణకు అసలు పేరు అమ్మ. ఆ తల్లి ఋణం మనం తీర్చుకోలేం. అంత ప్రేమ మనం తిరిగి ఆమెకు పంచలేం. మరణించినప్పుడు తద్దినాలు (పితృకార్యాలు) పెట్టడం , పెద్ద పెద్ద ఉత్సవాలు చెయ్యడం,చొక్కా జేబుల్లో ఫోటోలు పెట్టుకొని తిరగడం మాత్రమే కాదు. తల్లి బతికివున్నప్పుడు ఆమెను ఎంత గౌరవించాం, ఎంత ప్రేమించాం, ఎంత సేవించాం అన్నది, అన్నింటికన్నా ముఖ్యం. కొన్ని రాష్ట్రాల్లో సంతానానికి తల్లిపేరును కూడా  కలిపి పెడతారు.ఈ మధ్య కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తి నుంచి సమాచారం సేకరించే క్రమంలో తండ్రిపేరుతో పాటు తల్లిపేరును కూడా చేర్చారు. వీలైనంతవరకూ తల్లిదండ్రులను మనతోనే ఉంచుకుందాం.పిల్లల పట్ల ఎంత ప్రేమ,శ్రద్ద చూపిస్తామో? తల్లిదండ్రుల పట్లా అంతే ప్రేమను చూపిద్దాం. “సంవత్సరానికి ఒకసారి మాత్రమే తలచుకొనే పండగ కాదు అమ్మ.., ప్రతినిత్యం గుండెల్లో కొలవాల్సిన బొమ్మ”. మహాభారతంలోని  యక్షప్రశ్నల్లో యమధర్మరాజు  వేసిన  ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలను ఒకసారి తలపుల్లోకి తెచ్చుకుందాం. ఆకాశం కంటే ఎత్తైనవాడు తండ్రి, భూమి కంటే గొప్పది తల్లి. ‘క్షమయా ధరిత్రి’ అన్నది ఆర్యోక్తి.సహనానికి మారుపేరు భూమి, అని దాని తాత్పర్యం. ఆ  భూమి కంటే కూడా మించిన సహనం  అమ్మసొత్తు.అందుకే, భూమికంటే కూడా గొప్పది అమ్మ. అదీ! ధర్మరాజు చెప్పిన సమాధానం. ఇంతటి గొప్పతనం,అంతటి కమ్మదనం అమ్మసొమ్ము. ప్రతి అమ్మకు నమస్కరిద్దాం… అమ్మతనానికి జేజేలు పలుకుదాం.

Also read: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles