Tuesday, April 23, 2024

జిల్లెళ్ళమూడి అమ్మకు వందనం

ఇప్పుడిప్పుడే శతజయంతి సంవత్సరం ప్రారంభమైంది (జననం: 28 మార్చి1923 – మరణం:12 జులై 1985). పెద్దఎత్తున ఉత్సవాలు ప్రణాళిక చేస్తున్నారు. మీడియా కమిటీలో నన్ను సభ్యుడిగా వేసుకున్నారు. అమ్మగారి పుట్టింటివారు ‘మన్నవ’వారు మాకు దగ్గర బంధువులు. మా అన్నయ్య (cousin) నరసరావుపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీగిరిరాజు అయ్యపరాజు మన్నవవారి అమ్మాయినే పెళ్లిచేసుకున్నారు. మా వదినపేరు శారద. పేరుకు తగ్గట్టుగా ఆమె నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. నేను నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో 7 వ తరగతి చదువుతున్నప్పుడు (1979-80) మా వదిన మాకు ఇంటి దగ్గర సైన్స్ పాఠాలు చెప్పేది. జిల్లెళ్ళమూడి అమ్మకు పినతాతగారు చంద్రమౌళి చిదంబరరావుగారు. వారు ఒకప్పుడు బాపట్లలో పేరుగాంచిన న్యాయవాది. కేవలం న్యాయవాది కాదు,

కవి, పండితుడు, అవధాని కూడా. కొప్పరపు సోదర కవుల అనేక సభల్లో ఆయన పాల్గొన్నారు. కొప్పరపు కవుల బాపట్ల శతావధానం అచ్చయినప్పుడు పీఠిక చిదంబరరావుగారే రాశారు. కొప్పరపు కవుల అవధాన, ఆశుకవితా ప్రతిభావైభవాలకు ప్రత్యక్ష సాక్షిగా ఆ విశేషాలను అద్భుతంగా ఆవిష్కరించారు.

అమ్మ అమ్మవారి అవతారమని గుర్తించిన వ్యక్తి చిదంబరరావు

జిల్లెళ్ళమూడి అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు చంద్రమౌళి చిదంబరరావుగారి ఇంట్లోనే ఎక్కువగా ఉండేది. ఈ అమ్మాయి మామూలు పిల్ల కాదు, అమ్మవారి అవతారమని మొట్టమొదటగా గుర్తించినవారు ఆయనే. మాకు దగ్గర బంధువులైన మిన్నికంటి గురునాథశర్మ, డాక్టర్ ప్రసాదరాయకులపతి (నేటి కుర్తాళపీఠాధిపతి), మాకు ఆత్మబంధువులైన పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణగార్లు అమ్మకు పరమభక్తులు. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య, సద్గురు కందుకూరి శివానందమూర్తి, ఎల్ వి సుబ్రహ్మణ్యం తండ్రిగారు ప్రొఫెసర్ ఎల్ ఎస్ ఆర్ కృష్ణశాస్త్రిగారు… ఇలా ఎంతోమంది అమ్మకు భక్తులు. ముఖ్యంగా గుండవరపువారి ద్వారా అమ్మ గురించిన విశేషాలు  కొన్ని తెలుసుకోగలిగాను. గుండవరపువారితో ఒకసారి, పొత్తూరివారితో కలిసి ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అమ్మ ఆలయాన్ని దర్శించుకుని,అక్కడ భోజనం (అమ్మ ప్రసాదం) చేశాను. అమ్మ అత్తగారువారు బ్రహ్మాండంవారు. బ్రహ్మాండం బాపనయ్యగారు, తదితరులు మా తాతగార్లైన కొప్పరపు కవులకు అత్యంత ఆత్మీయులు. కాకపోతే,అమ్మ జీవించి వున్న సమయంలో దర్శించుకోలేకపోయాననే వెలితి మాత్రం వుంది. అమ్మ 1985లో వెళ్లిపోయారు. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, చదువుకుంటున్నాను. ఈ విశేషాలు ఏవీ అప్పుడు తెలియదు. అమ్మ ఎప్పటికీ అమ్మ అమ్మ చిరంజీవి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles