Tuesday, June 25, 2024

ప్రొ. సాయిబాబాను వేధిస్తున్న జైలు అధికారులు

  • నాగపూర్ జైల్లో ఆరేళ్లుగా మగ్గుతున్న సాయిబాబా
  • నిరశనదీక్ష గురించి భోగట్టాలేని కుటుంబం
  • మందులూ, పుస్తకాలూ, ఉత్తరాలూ అందకుండా అడ్డుకుంటున్న అధికారులు
  • కరోనా సోకే ప్రమాదం ఉంది, వెంటనే విడుదల చేయండి:  ప్రొ. హరగోపాల్ విజ్ఞప్తి
  • దళితుల, ఆదివాసుల, మైనారిటీల హక్కులకోసం పోరాడిన కారణంగానే జైలు
  • ఐక్యరాజ్య సమితి చెప్పినా విడుదల చేయని ప్రభుత్వం

నాగపూర్ సెంట్రల్ జైలులో మగ్గుతున్న ప్రొఫెసర్ జి.ఎస్. సాయిబాబాకు అవసరమైన మందులూ, పుస్తకాలూ, ఉత్తరాలూ తక్షణం అందజేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. బీమా – కోరెగావ్ ఘటనతో ప్రమేయం ఉందన్నతాజా ఆరోపణపైన ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసి, జైలులో పెట్టారు. మందులూ, ఉత్తరాలూ, అధ్యయనానికి అవసరమైన పుస్తకాలూ ప్రతి ఖైదీకి విధిగా ఇవ్వవలసి ఉండగా ప్రొఫెసర్ సాయిబాబాకు వాటిని ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

‘కమిటీ  ఫర్ డిఫెన్స్, రిలీజ్ ఆఫ్ సాయిబాబా’ కన్వీనర్, పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఇది వరకు అనేక పర్యాయాలు సాయిబాబా విడుదలకోసం కేంద్ర ప్రభుత్వానికీ, మహారాష్ట్ర ప్రభుత్వానికీ విజ్ఞప్తులు చేశారు. తన హక్కులకోసం నిరశనదీక్ష చేపడతానని సాయిబాబా ప్రకటించారనీ, ఇది ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందనీ హరగోపాల్ ఆందోళన వెలిబుచ్చారు.  సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నదనీ, 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాకు జైలులో కరోనా సోకే ప్రమాదం కూడా ఉన్నందున ఆయనను  వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.  సాయిబాబాకు అవసరమైన మందులూ, పుస్తకాలూ అందజేయాలనీ, ప్రతిరోజూ వార్తాపత్రికలు అందించాలనీ, వారి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడించాలనీ ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా సాయిబాబా  పని చేస్తూ ఉండేవారు.

ప్రొఫెసర్ సాయిబాబా భార్య ఏ. ఎస్. వసంత కుమారి మాట్లాడుతూ, ఇతర ఖైదీలకు ఇచ్చే కనీస వెసులుబాట్లు సైతం తన భర్తకు ఇవ్వడం లేదనీ, ఇతర ఖైదీలను వారి న్యాయవాదులూ, బంధువులూ కలుసుకుంటున్నారనీ, తమను మాత్రం అనుమతించడం లేదనీ ఆమె ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఇచ్చిన మందులూ, పుస్తకాలు కూడా సాయిబాబా దాకా వెళ్ళనివ్వడం లేదని విమర్శించారు. సాయిబాబా తల్లి మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలకు కూడా రానివ్వలేదనీ, ఆయన తమ్ముడు రావద్దని చెప్పారంటూ పోలీసులు తప్పుడు ప్రచారం చేశారనీ, తల్లి చనిపోయినప్పుడు అన్నని తమ్ముడు రావద్దని ఎందుకు చెబుతాడనీ వసంత ప్రశ్నించారు. ఈ సందర్భగా హక్కులు కోరుకునేవారూ, ప్రజాస్వామ్యవాదులూ స్పందించి నాగపూర్ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపాలని హరగోపాల్, వసంత కోరారు. అక్టోబర్ 15 వసంత ఒక వినతి పత్రం సమర్పించారు. సాయిబాబా నిరాహారదీక్షకు దిగకుండా ఆయన అడిగిన సదుపాయాలు కల్పించాలని ప్రొఫెసర్ హరగోపాల్ జైలు అధికారులకు 20 అక్టోబర్ 2020న రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రొఫెసర్ సాయిబాబాకు ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతించవలసిందిగా వసంతకుమారి తాను ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఆయనకు కనీస హక్కులు అమలు జరగాలని ఆమె కోరారు. సాయిబాబా 21వ తేదీ ఉదయం అనుకున్న ప్రకారం నిరాహారదీక్ష ప్రారంభించారో లేదో కూడా ఆయన కుటుంబ సభ్యులకు తెలియదు. తాను ఉదయం నుంచీ జైలు అధికారులకు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదనీ, ప్రొఫెసర్ సాయిబాబా తమ్ముడు రాందేవ్ కూడా చాలా సార్లు ఫోన్ చేశారనీ, సమాధానం రావడం లేదనీ, నాగపూర్ జైలులో ఏమి జరుగుతున్నదో తెలియడం లేదనీ వసంత కుమారి ఈ ప్రతినిధితో బుధవారం మధ్యాహ్నం నాలుగున్నరకు చెప్పారు.

ఆరేళ్ళుగా చెర

మావోయిస్తులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపైన ప్రొఫెసర్ సాయిబాబాను 9 మే 2014న అరెస్టు చేశారు. ఆరోపణలు రుజువైనాయని ఆయనను దోషిగా 7 మార్చి 2017న నిర్ణయించారు. సాయిబాబాకు తలలో సిస్టు ఉండటం కారణంగా ఆయనకు అప్పుడప్పుడు స్పృహ తప్పుతుంది. చిన్నతనంలోనే పోలియో రావడంతో అయిదేళ్ళ ప్రాయం నుంచీ వీల్ చైర్ కే పరిమితమైన వ్యక్తి. ఆయనకు 19 రకాల జబ్బులు ఉన్నాయి. కిడ్నీ, పాంట్రియాస్, గాల్ బ్లాడర్ వగైరా అవయవాలలో అనారోగ్యం ఉంది.

సాయిబాబా అరోగ్యం వేగంగా క్షీణిస్తున్నదనీ, ఆయన సజీవంగా ఉండాలంటే అత్యున్నతమైన వైద్యం అవసరమనీ, వెంటనే విడుదల చేయాలనీ కోరుతూ ఐక్య రాజ్యసమతిలోని మానవహక్కుల హైకమిషన్ (ఓహెచ్ సీహెచ్ ఆర్) భారత ప్రభుత్వానికి 13 ఏప్రిల్ 2020న విజ్ఞప్తి చేసింది. ఫలితం లేకపోయింది. ప్రభుత్వం కనికరించలేదు. 25 మే 2020న ఆరోగ్య కారణాలపై బెయిల్ ఇవ్వాలంటూ పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్  కొట్టివేసింది.

అండాసెల్ వల్ల క్షీణిస్తున్న ఆరోగ్యం

అండా సెల్ లో ఉంచడం వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా (అధిక శీతోష్ణస్థితి) ఉండి ఆరోగ్యం మరింత దెబ్బతింటున్నదనీ, బెయిల్ ఇవ్వడం సాధ్యం కాకపోతే కనీసం మరేదైనా జైలుకు తరలించవలసిందిగా అభ్యర్థించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ వసంతకుమారి అన్నారు. కారాగారాలు  మనుషులను సంస్కరించడానికని అంటారనీ, వాస్తవానికి మనుషులను చిత్రహింసకు గురిచేయడానికే కారాగారాలను వినియోగిస్తున్నారనీ ఆమె వ్యాఖ్యానించారు. దళితులకూ, ఆదివాసీలకూ, మైనారిటీలకూ మద్దతుగా సాయిబాబా ఉంటారనీ, అందుకే ఆయనను వేధిస్తున్నారనీ, భావజాలం కారణంగా జైలులో మగ్గుతున్న మేధావి సాయిబాబా అనీ వసంతకుమారి ఆవేదన వెలిబుచ్చారు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ)ని తన తండ్రిపైన దుర్వినియోగం చేస్తున్నారనీ, ఈ చట్టం దుర్వినియోగానికి సరైన ఉదాహరణ తన తండ్రి అనీ సాయిబాబా కుమార్తె మంజీర వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles