Wednesday, September 18, 2024

ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర

  • నాటో విస్తరణ ప్రధాన కారణం
  • ప్రేక్షకపాత్ర పోషిస్తున్న నాటో
  • అమెరికాను నమ్మి రష్యాను రెచ్చగొట్టిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం కొనసాగుతోంది. ఈ వ్యాసం రాసే సమయానికి (గురువారం రాత్రి పది గంటలు) ఉక్రేన్ లో 74 సైనిక స్థావరాలనూ, 11 వైమానిక స్థావరాలనూ ధ్వంసం చేసినట్టు రష్యన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎనభై మందికి పైగా ఉక్రేన్ సైనికులూ, పౌరులూ మరణించినట్టు రష్యన్ ప్రభుత్వం వెల్లడించింది. యాభై మంది రష్యన్ సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రేన్ అధినేత జెలెన్ స్కీ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తోనూ, ఇతర కేబినెట్ మంత్రులతోనూ సమావేశం జరిపి ఉక్రేన్ యుద్ధ పర్యవసానాల గురించి చర్చించారు. రష్యాతో, ఉక్రేన్ తో ఇండియాకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. గురువారం రాత్రి పుతిన్ తో మోదీ మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.

యుద్ధానికి కారకులు ఎవరు?

Latest Ukraine updates: US warns Russia preparing for invasion | Russia- Ukraine crisis News | Al Jazeera
ఉక్రెయిన్ లో ప్రవేశించిన రష్యన్ ట్యాంక్

ఈ యుద్ధానికి కారకులు ఎవరు? అందరి పాత్రా ఎంతో కొంత ఉంది.  2013-14లో ఉక్రెయిన్ లో జరిగిన తిరుగుబాటులో రష్యాకు అనుకూలమైన అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ గద్దె దిగిపోయి రష్యాకు వ్యతిరేకమైన నాయకుడు అందలమెక్కాడు. ప్రస్తుతం జెలెన్ స్కీ ఉక్రెయిన్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. 2014లో రష్యన్ సైనికులు ఉక్రేన్ తో యుద్ధానికి దిగారు. అప్పుడే క్రిమియాను రష్యన్ సైనికులు ఆక్రమించుకున్నారు. ఉక్రెయిన్ లో రష్యన్ భాష మాట్లాడేవారూ, రష్యన్ సంతతివారూ చాలా మంది ఉన్నారు. వారంతా ఉక్రెయిన్ ప్రభుత్వంపైన తిరుగుబాటు చేశారు. ఉక్రేన్ తూర్పు రాష్ట్రాలైన డానెస్క్, లూవాస్క్ లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాలనూ స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. రష్యాతో దౌత్య సంబంధాలను ఉక్రేన్ తెగతెంపులు చేసుకున్నది. దేశంలో మార్షల్ లా ప్రకటించారు ఉక్రేన్ అధినేత జెలెన్ స్కీ.

Russian President Putin declares 'war' on Ukraine: 10 points
యుద్ధం ప్రకటించిన పుతిన్

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం. 8.30లకు యుద్ధం ప్రారంభిస్తున్నట్టు పుతిన్ రష్యాదేశవాసులను ఉద్దేశించి టీవీలో మాట్లాడుతూ ప్రకటించారు. రష్యా మొత్తం 203 చోట్ల దాడులు చేసిందని ఉక్రేన్ పోలీసులు వెల్లడించారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కూడా పోరాటం జరుగుతోంది. అక్కడే ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి 1986లో రేడియేషన్ లీకై ప్రమాదం సంభవించింది. ఇండియా ఉక్రెయిన్ విషయంలో ఇంతవరకూ తటస్థంగా ఉన్నది. చైనా కూడా రష్యాకు ఉన్న భద్రతా భయాలను అర్థం చేసుకోగలను అంటూ ప్రకటించింది. మాస్కోలోనే ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా యుద్ధం ప్రారంభించడాన్ని సమర్థించారు.

అసలు సమస్య నాటో విస్తరణ

అసలు సమస్య నాటో విస్తరణ.  ఉక్రెయిన్ నాటో సభ్యత్వం తీసుకోవడానికి ప్రయత్నించడం. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరితే, ఉక్రెయిన్ లో నాటో దళాలు తిష్ఠవేస్తే, ఉక్రెయిన్ నుంచి ప్రయోగించే రాకెట్ మాస్కోకు ఐదు నిమిషాలలో చేరుతుంది. ఉక్రెయిన్ రష్యాకు చాలా కీలకమైన ప్రాంతం. ఇది రష్యాకు యూరప్ రహదారి. రష్యా నుంచి యూరప్ వెళ్ళాలంటే ఉక్రెయిన్ మీదుగానే వెళ్ళాలి. యూరప్ నుంచి ఎవరైనా రష్యాకు రావాలంటే ఉక్రెయిన్ మీదుగానే రావాలి. నెపోలియన్ బోనపార్టే, అడాల్ఫ్ హిట్లర్ సైన్యాలు మునుపు రష్యాపైకీ, సోవియెట్ యూనియన్ పైకీ ఉక్రెయిన్ గుండానే వచ్చాయి. అటువంటి కీలకమైన ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించడాన్ని రష్యా అధినేత పుతిన్ ప్రతిఘటించడం సహజమే.

గోర్బచేవ్ కు అమెరికా ఇచ్చిన వాగ్దానం భంగం

సోవియెట్ యూనియన్ పతనానికి ముందు నాటి సోవియెట్ నాయకుడు గోర్బచేవ్ అమెరికా విదేశాంగ మంత్రితో సమాలోచనలు జరిపారు. నాటో కూటమిని విస్తరించబోమనీ, తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అమెరికా సోవియెట్ యూనియన్ కు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీని ఉల్లంఘించి పద్నాలుగు దేశాలను నాటో కూటమిలో చేర్చుకున్నారు. సోవియెట్ యూనియన్ పతనమైన సమయంలో ఆర్థికంగా చితికిపోయిన రష్యా బలహీనంగా ఉన్నంత కాలం అణగిమణిగి ఉంది. నాటోను విస్తరించుకుంటూ పోతున్నా ఎదురు చెప్పే సాహసం చేయలేదు. పైగా, రష్యా కూడా ఒక దశలో నాటోలో చేరిపోదామని ఆలోచించింది. ఎల్ స్టిన్ హయాంలోనూ, పుతిన్ మొదటి టరమ్ లోనూ రష్యా దుర్బలంగానే ఉంది. ఈ లోగా పుతిన్ బలం పుంజుకోవడం, రక్షణ రంగంలో రష్యా నిలదొక్కుకోవడం, ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడం, చైనాతో దోస్తానా కుదరడంతో పుతిన్ నాటోని నిలువరించే సాహసం చేశారు. అమెరికాది సామ్రాజ్యవాదమైతే రష్యాది నయాసామ్రాజ్యవాదమంటూ విమర్శించేవారు లేకపోలేదు. కానీ ఉక్రెయిన్ పై దాడి చేయడానికి రష్యాకి బలమైన కారణం ఉంది.

బైడెన్ వ్యూహం

The War in Ukraine Heats Up | Vocal Europe
ఉక్రేన్ లో యుద్ధ దృశ్యాలు

రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చాలా రోజులుగా చెబుతున్నారు. నాటోకు నాయకత్వం వహించి ఆ కూటమిని బలోపేతం చేయాలన్నది బైడెన్ ఆకాంక్ష. కానీ అఫ్ఘానిస్తాన్ అనుభవాలను ఇంకా మరచిపోలేని బైడెన్ యూరప్ లో ఇరుక్కుపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కనుక నాటో దళాలు  రంగంలో దిగితే రష్యా వెనుకంజ వేయవలసి వస్తుంది. కానీ నాటో దేశాలు ఉక్రేన్ కోసం ప్రాణత్యాగం చేసే పరిస్థితి లేదు. కేవలం రష్యాపైన ఆర్థిక ఆంక్షలు ప్రకటించడంతో రష్యాని కట్టడి చేయడం సాధ్యం కాదు. ఆంక్షలు విధిస్తారని రష్యాకు తెలుసు. వాటివల్ల కలిగే నష్టం కూడా తెలుసు. అందుకు సిద్ధపడే రష్యా రంగంలో దిగింది. ఆంక్షల కారణంగా ఫ్రాన్స్, జర్మనీలు అమెరికా జట్టులో తిరిగి చేరాయి.

ఫ్రాన్స్ కీ, జర్మనీకీ అమెరికాతో సమస్యలు

అసలు ఫ్రాన్స్ కీ, జర్మనీకీ  అమెరికాతో సమస్యలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఆస్ట్రేలియాకు న్యూక్లియర్ సబ్ మెరైన్ లు అమ్మబోతే అమెరికా అడ్డుకున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యువల్ మాక్రాన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కలసి ఒక సైనిక కూటమిగా ఏర్పడినాయి. అందువల్ల ఆస్ట్రేలియాకు ప్రత్యేకంగా సబ్ మెరీన్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా పోయింది. దీనితో కినిసిన మాక్రాన్ అటు అమెరికాతోనూ, ఇటు ఆస్ట్రేలియాతోనూ వైరం పెంచుకున్నారు. దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జర్మనీ రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తే చాలా చవకగా లభిస్తుంది. అందుకని ఉక్రేన్ ద్వారా పైప్ లైన్ నిర్మించి గ్యాస్ రవాణాకి సర్వంసిద్ధం చేశారు. అమెరికాలోని గ్యాస్ ఖరీదు ఎక్కువ. కానీ తమ గ్యాస్ అమ్మాలని అమెరికా పట్టుదల.  ఇప్పుడు యుద్ధం వల్ల రష్యా-జర్మనీ గ్యాస్ పైప్ లైన్ కి ఆటంకం కలిగింది. అందుకే పుతిన్ తో జర్మనీ అధ్యక్షుడూ, ఫ్రాన్స్ అధ్యక్షుడూ విడివిడిగా సమాలోచనలు జరిపారు. యుద్ధం రావడానికి అమెరికా మొండిపట్టు కారణమని ఇతర యూరోపియన్ దేశాలలో కూడా అభిప్రాయం ఉంది. నాటోను విస్తరించడం రష్యాను రెచ్చగొట్టటమేనన్న వాస్తవాన్ని కొన్ని యూరోపియన్ దేశాల నాయకులు పరోక్షంగా చెబుతున్నారు. మొత్తంమీదికి అమెరికా అధ్యక్షుడి కోరిక తీరింది. ఫ్రాన్స్, జర్మనీలు మళ్ళీ నాటో కూటమిలో కుదురుకున్నాయి. అయితే, నాటో సేనలను మోహరించింది కానీ రంగంలో దిగమని వాటిని ఆదేశించలేదు. అదే జరిగితే అది అంతర్జాతీయ యుద్ధం అవుతుంది. నాటో సేనలు అంటే అమెరికా సేనలు కూడా అందులో ఉంటాయి. యుద్ధం కొనసాగితే, నాటో సేనలు రష్యన్ సైనికులతో తలబపడితే, అది సుదీర్ఘంగా సాగితే రష్యా ఎట్లాగూ నష్టపోతుంది కానీ అమెరికా కూడా ఇరుక్కుపోతుంది.

ఉక్రేన్ లో భారతీయులు

Indian students in tight spot amid Ukraine-Russia tensions - DTNext.in
ఇబ్బందికరమైన పరిస్థితులలో భారత విద్యార్థులు

ఇక ఉక్రెయిన్ లో భారతీయులు చాలామంది ఉన్నారు. వారిని ఇంతకు ముందే ఇండియాకి సురక్షితంగా తీసుకురావలసింది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం జాప్యం చేసిందనే చెప్పాలి. రష్యా ఇంత వేగంగా రంగంలోకి దిగుతుందని మోదీ ఊహించి ఉండరు. తాత్కాలికంగా ఇండియా రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారే కానీ వెంటనే కదలండని చెప్పలేదు. ఇండియా అంచనాలు తప్పి ఉంటాయి. కొంతమంది తెలుగు విద్యార్థులు ‘ప్రైమ్9’ టీవీ చానల్ తో మాట్లాడారు. కొందరు ఉక్రెయిన్ రాజదాని కీవ్ లో బంకర్లలో ఉన్నారు. మరికొందరు పోలండ్ వైపు కారులో ప్రయాణం చేస్తున్నారు. ఆరేడువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలెండ్ కు అనేక జాతులకు చెందినవారు కార్లలో బారులు తీరి వెడుతున్నారు. ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన తెలుగువారు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రతించి ఎక్కడ ఉన్నారో తెలియజేస్తే ఆహారం ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. బంకర్లలో ఉన్నవారు యుద్ధం ముగిసే వరకూ అక్కడే ఉండటం క్షేమదాయకం. బంకర్లను వీడి బయటకు వస్తే ప్రమాదం. బంకర్లలో సరిపడా ఆహారపదార్థాలూ, మంచినీళ్ళూ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం భారత రాయబార కార్యాలయానికి తాము ఎక్కడ ఉన్నదీ తెలియజేయాలి. ఇప్పటికే నాలుగు వేల మంది భారతీయులు క్షేమంగా స్వదేశానిికి చేరుకున్నారు. మరికొన్ని వేలమంది అక్కడే చిక్కుకుని ఉన్నారు.

ఈ లోగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ-7దేశాధినేతలతో ఆన్ లైన్ సమావేశం (జూమ్) నిర్వహించారు. నాటో దేశాలు యుద్ధసన్నాహాలు చేయవలసి ఉంటుందని అనుకున్నారు. ఏమి చేయగలరో తెలియదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ లో ఒక దేశంపైకి మరో దేశం దండయాత్ర చేయడం, లక్షన్నర మంది సైనికులను రంగంలో దింపడం ఇదే ప్రథమం. ఒమిక్రాన్, డెల్టా వంటి వైరస్ లతోనూ, వాతావరణ కాలుష్యంతోనూ, పెరుగుతున్న ధరలతోనూ సతమతం అవుతున్న ప్రపంచ దేశాల నెత్తిపైన పిడుగులా పుతిన్ యుద్ధం పడింది. స్టాక్ మార్కెట్ పతనం అయింది. డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. కోవిద్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది మరణించారు. ఇప్పుడు యుద్ధం కావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు.    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles