Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాలి

నూర్ బాషా రహంతుల్లా  

ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13 లక్షలమంది చనిపోతుంటే, అయిదు కోట్లమంది క్షతగాత్రులవుతున్నారు. ప్రతి మూడు నిమిషాలకో మరణం జరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం మనదే. ప్రగతి భాగ్యరేఖలైన రహదారులు ప్రతిరోజూ నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రాదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లు. 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్‌ హైవేల మీదనే నమోదవుతున్నాయి. రోజుకు పాతికమంది పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న దేశం మనది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. లాక్ డౌన్ ఎత్తేశాక ప్రమాదాలు మళ్లీ పెరిగాయి. రహదార్ల నిర్మాణంలో లోపాలు ఎన్నో ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తన్నాయంటూ ఒక పౌరుడు రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు పరిగణించి, విచారణకు స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాకీదులు జారీ చేసింది.

ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు ఎందరో?

ఎర్రంనాయుడు,లాల్ జాన్ భాషా ,హరికృష్ణ,శోభా నాగిరెడ్డి, గీతం యూనివర్శిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరికృష్ణ , మంత్రి నారాయణ, కోటా శ్రీనివాసరావు, బాబూమోహన్,అజారుద్దీన్ ల కుమారులు నడిరోడ్డుపై ప్రాణాలు పోగొట్టుకున్నారు. అష్టకష్టాలలో దూరప్రయాణం కూడా ఒకటి. దూరప్రయాణం చేయాల్సిన  అవసరం రాని ప్రజలు అదృష్టవంతులు. కొండగట్టు అంజన్న సన్నిధికి చేరువలో బస్సు ప్రమాదం, 58 ప్రాణాల్ని తోడేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే ఢిల్లీలో దుర్మరణం చెందారు. వాహనాల్లో వెళ్లేవారు సీటు బెల్టులు ధరించాలి. గోపీనాథ్ ముండే ,యర్రం నాయుడు.శోభా రెడ్డి కూడా సీటు బెల్టు ధరించలేదు. ప్రయాణాలలో ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సామాన్య ప్రజలు ఎందరో? తమ బిడ్డను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన చిగురుపాటి విమలలాంటి దాతలు బాధితులకు కృత్రిమ కాళ్ళు చేతులు లాంటివి దానం చేసి ఓదార్పు పొందుతున్నారు.

నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యం

 ఆక్రమణలను తొలగించలేకపోవటం,నడిరోడ్డుపైన మత కట్టడాలు ఇతర భవనాలు అడ్డంగా ఉండటం, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటం,హెల్మెట్‌ ధరించకపోవటం ,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్‌లు మోగించుకుంటూ ఆకతాయిల్లాగా వాహనాలు నడపటం ,ట్రాఫిక్‌ పోలీసులతో తగాదాకు దిగడం అలవాటైపోయింది.రహదార్లు బాగుండవు. సిగ్నలింగ్‌ వ్యవస్థ సరిగా పనిచేయదు. పాదచారులకు కేటాయించిన ఫుట్ పాత్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. రోడ్డుమీద స్థలం కనిపిస్తే చాలు అక్కడ ఒక కొట్టో,మతకట్టడమో,ఘోరీనో  విగ్రహమో  వెలుస్తుంది. పూజభావంతో అక్రమ కట్టడాలను, చెట్లనుకూడా తొలగించకుండా వాటి ప్రక్కగా జాతీయ రహదారుల్ని కూడా మళ్లిస్తున్నారు. జనాభా విపరీతంగా పెరిగి వాహనాల రాకపోకల తాకిడి ఎక్కువవుతోంది. అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రుల ఆంబులెన్స్ వాహనాలే ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకొంటున్నాయి.

ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం

అందుకే సుప్రీం కోర్టు రహదారులు, కాలిబాటలపైన చట్టవిరుద్ధంగా ప్రార్థన మందిరాలు పుట్టుకొస్తుండటాన్ని ‘ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించింది. మతపరమైన దురాక్రమణల నిర్మూలనకు ఎటువంటి చర్యలు చేపట్టారో వెల్లడించే ప్రమాణపత్రాలు దాఖలుచేయాలని ఆదేశించింది. ప్రభుత్వాలలో  కదలిక రాకపోతే , ఏం చేయాలన్నది ఇక మేమే చూసుకుంటాం’ అని తేల్చిచెప్పింది. ప్రజల మతవిశ్వాసాలనే పెట్టుబడిగా చేసుకొని కొన్ని రాజకీయపక్షాలు చెలరేగిపోతున్నాయి. అక్రమాల పనిపట్టాల్సిన అధికారులు,ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.న్యాయస్థానం ఆదేశాల్నీ ఖాతరుచేయటంలేదు.

అనధికార ప్రార్థనామందిరాలు

దేశవ్యాప్తంగా అనధికారికంగా ఏర్పాటైన ప్రార్థనామందిరాలు దాదాపు 21లక్షలు. తమిళనాడు రోడ్లమీద 78 వేల అనుమతి లేని మతకట్టడాలున్నాయి. ఒక్క దిల్లీలోనే అవి 60వేలు. హైదరాబాద్‌ రోడ్లపై ఉన్న మతకట్టడాల సంఖ్య దాదాపు 600. రాజస్థాన్‌లో పాదచారుల హక్కుల పరిరక్షణ సంఘాలు అనధికార మత నిర్మాణాల జోలికి రావద్దంటూ మామూళ్లు హెచ్చరికలు, బెదిరింపులకు దిగుతాయని సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చాయి. 2006లో సుప్రీంకోర్టు  వెలువరించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం- రోడ్డుమధ్యన, పాదచారులకు నిర్దేశించిన ఫుట్ పాత్ లమీద మతకట్టడాలను ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలోనూ అనుమతించకూడదు. మితిమీరిన వేగం, ట్రాఫిక్‌ ఇబ్బందులు, కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి.రహదారి అందరిదీ అనుకోవాలి.అనధికార కట్టడాల్ని గుర్తించి పడగొట్టాలి.

అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలి

ఎవరికి తోచినట్లు వారు రోడ్లమీద ప్రార్థన మందిరాలు కట్టడం వల్ల, ట్రాఫిక్‌వ్యవస్థ ఛిన్నాభిన్నమై రోడ్డుప్రమాదాలు ఎక్కువయ్యాయి.ప్రజల్ని పీడించి వసూలుచేసిన సొమ్ముతో కట్టేవి, విస్తరించేవి కేవలం రాజకీయ, వర్గ ప్రయోజనాల కోసమే తప్ప మరొకందుకు కాదు. నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్న ఓ మతకట్టడం గోడ కూల్చివేతకు లోని ఐఏఎస్‌ యువ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ ఆదేశాలిస్తే అది మతసంబంధ ఉద్రిక్తతకు అవకాశమిచ్చిందంటూ యూపీ రాష్ట్రప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది! రోడ్లపై మతపరమైన కట్టడాల ఆక్రమణకు గురికావడాన్ని ప్రజాపద్దుల సంఘం ఎన్నోసార్లు ఆక్షేపించింది.వాటిలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్నవాటిని వెంటనే తొలగించాలని రోడ్లమధ్యలోని మతపరమైన కట్టడాల్ని కొన్ని వ్యాపారవర్గాలు సొమ్ముచేసుకుంటున్నాయని ఉన్నతాధికారులు వాటిని అక్కడినుంచి స్వచ్ఛందంగా తొలగించాలని కోరింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇలాంటి అక్రమ కట్టడాలను తొలగిస్తామని ప్రకటించింది. నాగపూర్‌లో రోడ్లమధ్య మతకట్టడాలు కూల్చేసి  రోడ్లను విస్తరించడంతో పాటు, ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని తొలగించగలిగారు.

క్షతగాత్రుల పరిరక్షణ

నెత్తురోడుతున్న బాధితులకు వైద్యులు తక్షణం ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం చేయాలని తీసుకొచ్చినవారిపై పోలీసు కేసులు ఉండవని తీర్పులొచ్చాయి. ప్రమాదబాధితుల గుండె రక్తనాళాలకు నాడీ మండలానికి తీవ్రగాయాలై తొలి 15నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారట.  తొలిగంట(గోల్డెన్‌ అవర్‌)లో వైద్యసహాయం అందించాలి. రోడ్డుప్రమాదం జరిగిన నిమిషాల్లోపే అంబులెన్స్‌ లు రావాలి. మనిషి ప్రాణాల్ని కాపాడటం అన్నింటికంటే ముఖ్యమన్న ‘సుప్రీం మార్గనిర్దేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి- బాధితుల్ని తీసుకొచ్చే వారిని డబ్బులు కట్టాలని బలవంత పెట్టకూడదు. ప్రధాన గేటు దగ్గర అందరికీ కనబడేలా బోర్డు పెట్టాలి. క్షతగాత్రులు వైద్యఖర్చుల్ని భరించలేని పెదలైతే ఆసుపత్రులు ఏం చెయ్యాలి? వైద్య వ్యయాల్ని ప్రమాద బాధితులు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. క్షతగాత్రులు ఏమాత్రం చెల్లించగల పరిస్థితి లేనప్పుడు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆసుపత్రులకు ఖర్చులు తిరిగి చెల్లించాలి. ప్రమాద బాధితులకు పాతిక వేల రూపాయల దాకా వైద్య వ్యయం చెల్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆపద్బంధు సేవల ద్వారా బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి. రహదారి భద్రతా నిధిని మరింత పరిపుష్టం చేయాలి.

రోడ్ల నిర్మాణంలో లొసుగులు సరిదిద్దాలి

బ్లాక్‌స్పాట్స్‌ దిల్లీలోనే 20, ఏపీలో 140, తెలంగాణలో 55 ఉన్నాయి. శాస్త్రీయ పంథాలో వాటిని యుద్ధప్రాతిపదికన సరిచేయాలి. అవసరమైన చోట్ల క్రాస్‌ దగ్గర ప్రమాదాల నివారణకు పైవంతెన, అండర్‌ పాస్‌ నిర్మించాలి. రోడ్డు మలుపుల దగ్గర డిజైన్‌ లోపాలు సవరించాలి. జాతీయ రహదారుల పైనే 34 శాతం ప్రమాదాలు,మరణాలు సంభవిస్తున్నాయి. రోడ్ల నిర్మాణంలో లొసుగులు, లోపాల్ని సరిచెయ్యాలి. చిన్న కల్వర్టులను వెడల్పు చెయ్యాలి. ప్రమాదకర ప్రాంతాల్లో అండర్‌ పాసులు నిర్మించాలి. అడ్డగోలుగా నిర్మిస్తున్న డివైడర్లే అనేక సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. మన దేశంలో 97 శాతం రహదారులకు అసలు ఫుట్‌పాత్‌లే ఉండవు.

పన్నులలో కొంత శాతం రోడ్డు మరమ్మతులపై వెచ్చించాలి

రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తున్నా, భారీ వర్షాలకు రోడ్లు అధ్వాన్న స్థితికి చేరినా పట్టించుకునేవారుండరు. ప్రపంచం లోని మొత్తం వాహనాల్లో మన దేశంలో ఉన్నవి ఒక్క శాతమే. కానీ ప్రపంచ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మన వాటా 11 శాతం. రహదారులు సక్రమంగా లేనికారణంగా వాహనాలు దెబ్బతిని ఏటా కొన్ని వేల కోట్ల రూపా యల నష్టం సంభవిస్తున్నది. పెట్రోల్, డీజిల్ పై వసూలు చేసే సుంకాల్లో కొంత రహ దారులను మెరుగుపరచడానికి ఖర్చుచేయాలి. శాస్త్ర విజ్నానం పెర్గుతున్నకొద్దీ ప్రమాదాలు తగ్గాలి. బ్యాటరీ వాహనాల తయారీ నేటికీ పెరగలేదు. డ్రైవర్ లేని కార్లు వచ్చాయి.బ్యాటరీ సైకిళ్ళు కార్లు ఉత్పత్తి పెరగాలి. వాహనాలు ఢీకొనకుండా కొంచెం దూరంలోనే వాటంతట అవే ఆగిపోయే రిమోట్ పరిజ్నానం పెరగాలి. రోడ్డు ప్రమాదాలు  చావులు తగ్గటానికి కొత్త ఆవిష్కరణలను ఆహ్వానించాలి.

(రచయిత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles