Tuesday, April 23, 2024

రాజారావు రెండోసారి బదిలీకి రాజకీయ రంగు!..డాక్టర్ సుధాకర్ తరహా ఉద్యమం!?

వోలేటి దివాకర్

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు రెండో సారి బదిలీ అయ్యారు.  తెలుగుదేశం పార్టీ నేతలు రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడల్లా జైలు  రాజారావుకు ఇబ్బందులు తప్పడం లేదు.  విరివిగా ములాఖత్లు ఇస్తున్నారన్న నెపంతో ఆయనపై బదిలీ వేటు పడుతోంది. గతంలో మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు రాజమహేంద్రవరం సెంట్రలైజైలులో రిమాండ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారికి ఉదారంగా ములాఖత్ ఇచ్చారన్న కారణంగా ఆయనపై బదిలీ వేటు పడింది. అయితే ఆ తరువాత జరిపిన విచారణలో నిబంధనలకు అనుగుణంగానే రాజారావు వ్యవహరించినట్లు తేలడంతో బదిలీ నిలిచిపోయింది.

తాజాగా మరోసారి రాజారావు ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురై, ఆకస్మికంగా బదిలీ అయ్యారు. విశాఖపట్నం సెంట్రలైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా నియమితులయ్యారు. రాజారావును ప్రాధాన్యత లేని నెల్లూరు కేంద్ర కారాగారాల సిబ్బంది శిక్షణా విభాగం ప్రిన్సిపాల్ గా నియమించింది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సెంట్రల్ జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను పరామర్శించేందుకు వస్తున్న ఒక రోజు ముందు రాజారావును ఆకస్మికంగా బదిలీ చేయడం అటు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఆయన బదిలీ నిలిచే అవకాశాలు కనిపించడం లేదు.

 టిడిపి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న జగజ్జననీ చిట్ ఫండ్ సంస్థ లో చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అభియోగంపై సిఐడి తండ్రీ కొడుకులను 3 రోజుల క్రితం అరెస్టు చేసి సెంట్రలైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు టిడిపి నేతలు ఆయనను పరామర్శించేందుకు సెంట్రలైలుకు తరలివచ్చారు. దీనిపై ఆదిరెడ్డిని రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్, రాజారావుపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసి బదిలీ చేయించారు. ఈవిషయాన్ని రాజారావే పత్రికాముఖంగా వెల్లడించారు. జైలు నిబంధనల మేరకే వ్యవహరించినా తాను గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిని కావడం వల్లే ఆకస్మింగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదిరెడ్డిని పరామర్శించేందుకు ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి ఉన్నతాధికారులు అమరావతికి పిలిపించి, వివరణ కోరారు. బదిలీ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో జైళ్లశాఖ డిజి హసన్ రెజా జైలు సిబ్బందితో సెంట్రలైలును క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. 3 బీడీ ప్యాకెట్లు మినహా ఏమీ టీడీపీ వారికి సహకరిస్తున్నట్లుగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. అంటే రాజారావుపై నమ్మకం లేకపోవడం వల్లే ఆయన పరోక్షంలో జైలును తనిఖీ చేయించినట్లు స్పష్టమవుతోంది.

దేవినేని ఉమామహేశ్వరరావు జైలుకు వచ్చినప్పుడు రాజారావును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన పై నమ్మకం లేకపోతే మళ్లీ ఎందుకు కొనసాగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేసే క్రమంలో రాజారావు బలిపశువుగా మారారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రాజారావు టిడిపి అనుకూల పత్రికలకు ఎక్కడం, తన బదిలీపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం భవిష్యత్లో మరింత ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

 మరోవైపు రాజారావు ఆకస్మిక బదిలీని దళిత, గిరిజన, వామపక్షాలు, టీడీపీ తప్పుపట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాజారావుకు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీంతో రాజారావు బదిలీ రాజకీయరంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గిరిజన వర్గానికి చెందిన రాజారావు బదిలీ వ్యవహారం విశాఖపట్నంకు చెందిన దివంగత డాక్టర్ సుధాకర్ తరహా ఉద్యమానికి దారితీసే అవకాశాలూ ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ ఉత్తర్వులను చంద్రబాబునాయుడు సహా అధికార వ్యతిరేక పార్టీలు స్పందిస్తున్నందున గతంలో మాదిరిగా ఈసారి రాజారావు బదిలీ నిలిచే అవకాశాలు లేవన్నది సుస్పష్టం.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles