Thursday, December 8, 2022

ఎస్సారెస్పీ, ఇతర రిజర్వాయర్ల నీటిని కిందికి వదలండి: కేసీఆర్

  • ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది
  • మంత్రులతో, ఎంఎల్ఏలతో, అధికారులతో సీఎం సమీక్ష
  • మరి రెండు రోజులు వర్షాలు, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి

మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి  వదలాలని  ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని  క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో, అప్రమత్తతతో వుండాలని  సీఎం కేసిఆర్ ఆదేశించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం నాడు కూడా సీఎం కేసిఆర్ ప్రగతి భవన్ లో కొనసాగించారు.

ఈ సమీక్ష సమావేశం లోమంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్,  రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి,సుధీర్ రెడ్డి , అంజయ్య యాదవ్ , కృష్ణ మోహన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, పీసిసిఎఫ్ డోబ్రియాల్,   సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం వోఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,  ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి  జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దంగా వుండాలన్నారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ ఆరా తీసారు. వరద ముప్పు వున్న జిల్లాల అధికారులతో మాట్లాడి, పరిస్థితులను అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని.,గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు.  సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం తగు సూచనలు చేశారు.  వరద పెరగడం ద్వారా రిజర్వాయర్లకు చేరే బ్యాక్ వాటర్ తో ముంపుకు గురికాకుండా చూసుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావుకు సిఎం సూచించారు. మరో వారం పది రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెల్లవద్దన్నారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీములు సహా హెలికాప్టర్ లను సిద్దం చేసుకోవాలని సిఎం సిఎస్ ను ఆదేశించారు.

గత రెండురోజులుగా వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను అధికారులు సీఎం కేసిఆర్ కు వివరించారు.  నిజామాబాద్, ములుగు రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తున్నాయని, అయినా పరిస్థితి అదుపులోనే వుందని అధికారులు సిఎంకు వివరిచారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.

ప్రాణహిత, ఇంద్రావతి, వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన పరిస్థితిలో రేపు కూడా భద్రాచలం లోనే వుండి పరిస్థితులను ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను  సిఎం కెసిఆర్ ఫోన్లో ఆదేశించారు.భద్రాచాలం లో పరిస్థితిని ఆరా తీసారు.

వరంగల్, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్  ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని  స్థానిక మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్ధానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లకు సీఎం ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం సూచించారు.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles