Saturday, April 20, 2024

చిన్నమ్మ పయనం ఎటు ?

  • అన్నాడీఎంకే హస్తగతమే లక్ష్యం?
  • నేతలపై పట్టుకోసం శశికళ వ్యూహం
  • శశికళ ఎంట్రీతో మారనున్న తమిళ రాజకీయాలు
  • సీఎం పదవి ఆశించి భంగపడ్డ శశికళ
  • డీఎంకే, బీజేపీలకు గడ్డుకాలం
  • శశికళ రాజకీయ భవితవ్యంపై పెరుగుతున్న అంచనాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక కేంద్రాన్ని పళని స్వామి, పన్నీర్ సెల్వం ఆవిష్కరించిన రోజునే జయలలిత  స్నేహితురాలు వివేకానందన్ కృష్ణవేణి అలియాస్ చిన్నమ్మ జైలు నుంచి (జనవరి 27) విడుదలకావడం కాకతాళీయంగా జరిగాయి. కాని చిన్నమ్మ విడుదలతో స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన ఆనందం కాస్తా ఆవిరైపోయింది. కరోనా సోకడంతో బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (జనవరి 31) ఇంటికి చేరుకున్నారు.  చిన్నమ్మ డిశ్చార్జి కావడంతో ఆమె అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఆసుపత్రి ముందు  అభిమానులు హడావిడి అంతా ఇంతా కాదు. వేడుకలు చేసి స్వీట్లు పంచారు. అయితే శశికళ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ కొవిడ్ నిబంధనల్లో భాగంగా మరో పదిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.

శశికళ విడుదలతో ముఖ్యమంత్రి పళని స్వామి, డిప్యుటీ సీఎం పన్నీర్ సెల్వంలు పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షపడ్డాక తమ రాజకీయ భవిష్యత్తుకు అడ్డు తగులుతారనే ఉద్దేశంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నిజమైన జయలలిత వారసులం తామేనని నిరూపించుకునే ప్రయత్నాలు చేశారు.

ఎన్నికల్లో సత్తా చూపించేందుకు దినకరన్ కుతూహలం:

శశికళ విడుదలవుతున్నరోజునే చెన్నై మెరీనా బీచ్ లో జయలలిత స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. రాబోయే రెండు మూడు నెలల్లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సమయం ఆసన్నమైందని దినకరన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  తన సోదరి ఇళవరసితో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్లుగా శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత జీవించి ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన శశికళ అన్నా డీఎంకేలో బలీయమైన శక్తిగా వ్యవహరించారు. జయలలిత అనూహ్య అస్తమయం తరువాత సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు. అంతలోనే జైలు శిక్ష పడటంతో ఆమె ప్రభావాన్ని కోల్పోవాల్సివచ్చింది. ఇపుడు శశికళ తన రాజకీయ జీవితంపై ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారోనని రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అన్నా డీఎంకేలో మళ్లీ చేరే అవకాశాలను పళని స్వామి తోసి పుచ్చారు. ఆమె అవసరం పార్టీకి లేదని తేల్చి చెప్పారు.

ఇది చదవండి: క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం

దినకరన్ కు మద్దతు ఇవ్వలేని పరిస్థితి:

పార్టీ పగ్గాలు శశికళకు అప్పగిస్తే సరేసరి లేదంటే రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే కు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. శశికళ మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీకి చిన్నమ్మ ప్రత్యక్షంగా మద్దతిచ్చే అవకాశాలు లేవు. అన్నా డీఎంకే పార్టీ గుర్తు కోసం చిన్నమ్మ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగులో ఉంది. దీంతో ఏఎంఎంకేకు బహిరంగంగా మద్దతు పలకలేరని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

అన్నాడీఎంకేను చేజిక్కుంచుకుంటారా?

శశికళ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ప్రస్తుతం ఆమె  అన్నా డీఎంకేలో చేరి పార్టీపై పట్టు సాధించాలి.. పళని స్వామి, పన్నీర్ సెల్వంలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అన్నా డీఎంకేలో చేరవచ్చు. ఎన్నికల్లో విజయం సాధిస్తే శశికళకు పార్టీ పగ్గాలు అప్పజెప్పి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు తీసుకోవచ్చు. ఎలాగూ ప్రభుత్వ వ్యతిరేకత ఉండనే ఉంది. మరోవైపు డీఎంకే బలంగా ఉండటమే కాకుండా విజయావకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ ఓడిపోతే వీరిద్దరూ శశికళ కింద పనిచేయవలసి వస్తుంది. పోయి పోయి పార్టీని శశికళ చేతుల్లో పెట్టి తాము ఖాళీగా కుర్చునేందుకు ఒప్పుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీనికి వారు దాదాపు ఒప్పుకునే పరిస్థితి లేదని శశికళకు సన్నిహితంగా ఉండే అన్నాడీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఏఎంఎంకే, అన్నాడీఎంకే పొత్తు?

అన్నాడీఎంకే నుంచి బహిష్కరింపబడి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన ఏఎంఎంకేలో శశికళ చేరాలి. ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. ఇది ఇరు పార్టీలకు శ్రేయోదాయకంగా ఉంటుంది. పొత్తుతో అన్నాడీఎంకే విజయావకాశాలు పెరుగుతాయి. అటు ఏఐఎంకే మనుగడ సాగించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ ప్రతిపాదనలకు అన్నాడీఎంకే లోని చాలామంది సీనియర్ నేతలు మద్దతునిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇరుపార్టీల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగితే మిత్ర పక్షాలతో బలంగా కనిపిస్తున్న డీఎంకే విజయావకాశాలు దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఇది చదవండి: ద్రావిడ పార్టీలకే మళ్ళీ అధికారమా?

 థర్డ్ ఫ్రంట్ దిశగా శశికళ అడుగులు:

శశికళ అనుకున్నట్లుగా జరగకపోతే థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అన్నాడీఎంకేను దెబ్బ తీసేందుకు కూడా వెనకాడరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే అన్నా డీఎంకే దారుణంగా దెబ్బతింటుంది. అన్నా డీఎంకేలోని పలువురు నేతలు శశికళ, దినకరన్ లతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకే కూటమిలో సీట్ల పంపకంలో విభేదాలు తలెత్తితే మరికొన్ని పార్టీలు థర్డ్ ఫ్రంట్ లో చేరే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైతే పార్టీ శశికళ నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి పార్టీపై పట్టులేదని కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే వారి వెంటఉన్నారని శశికళ సన్నిహిత వర్గాలు అంచనావేస్తున్నారు.

రజనీ తరహాలో రాజకీయాలకు గుడ్ బై?

ఇక చివరగా ఆమె ముందు ఉన్న మరో అవకాశం రజనీకాంత్ వలే ఆరోగ్య కారణాలు చూపిస్తూ రాజకీయాలనుంచి పూర్తిగా నిష్క్రమించడం. కానీ శశికళ వ్యక్తిత్వం, వ్యవహార శైలి గురించి తెలిసినవారు మాత్రం ఆమె రాజకీయాలనుంచి తప్పుకునే ప్రసక్తేలేదని బలంగా నమ్ముతున్నారు.  రాజకీయాల్లో కొనసాగుతూ ఆమెను పార్టీ నుంచి  బహిష్కరణకు గురవ్వడానికి, జైలు పాలవ్వడానికి కారకులైన వారిపై కక్ష తీర్చుకునే అవకాశాలున్నాయని సన్నిహితులు భావిస్తున్నారు.

చిన్నమ్మను ఎన్నికలకు దూరం పెట్టాలని బీజేపీ వ్యూహం:

చిన్నమ్మ రాజకీయాలలో కొనసాగితే  తమిళనాడులో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలయ్యే వరకు చిన్నమ్మను తమిళనాడు రాజకీయాలకు ఎలా దూరంగా ఉంచాలా అని బీజేపీ అగ్రనేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

శశికళ ఎంట్రీతో ఆందోళనలో డీఎంకే శిబిరం:

మరోవైపు ఎన్నికల్లో విజయం సాధిస్తామని డీఎంకే ధీమాతో ఉంది. విశ్లేషకుల అంచనాలు కూడా డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో శశికళ విడుదల కావడం ఖచ్చితంగా తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది చదవండి: రజనీ నిర్ణయంతో ఆనందంలో తమిళ పార్టీలు

కింకర్తవ్యం ?

 జైలు శిక్ష అనుభవించిన తరువాత  ప్రజల్లో ఆమె పట్ల పెల్లుబికుతున్న సానుభూతిని ఓట్ల రూపంలో మలచుకోవాలని శశికళ వ్యూహరచన చేస్తున్నారు. తనపై వేటు వేసిన అన్నాడీఎంకేను చేజిక్కుంచుని ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ తీసుకునే ఏ నిర్ణయమైన తమిళ రాజకీయాలలో పెనుమార్పులకు దోహదం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles