Tuesday, April 23, 2024

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనను స్వాగతిద్దాం

  • ఇల్లు అలకగానే పండుగ కాదు

కె. రామచంద్రమూర్తి

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ప్రవేశపెట్టదలచిన సంస్కరణల ఆశాజనకంగానే ఉన్నాయి. భూమి హక్కుల రికార్డులను సమర్థంగా నిర్వహించేందుకూ, భూబదలాయింపు జరిగిన వెంటనే రికార్డులలో మార్పులు చేసేందుకూ (మ్యుటేషన్) అవసరమైన బిల్లును (తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్లు) తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పాస్ పుస్తకాల జారీలో జాప్యం నివారించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే సదుపాయం ఉంటుంది.  రెవెన్యూశాఖకు చెందిన ఉన్నతాధికారులకు విచక్షణాధికారాలు (డిస్క్రిషనరీ పవర్స్) రద్దు చేయడం, గ్రామాధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు (తెలంగాణ ఎబాలిషన్ ఆఫ్ ది పోస్ట్స్ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్) చేయడం  స్వాగతించవలసిన పరిణామాలు. ఈ ముఖ్యమైన బిల్లుల గురించి శాసనసభ వేదికగా ప్రజలకు వివరించడం తన పూర్వజన్మ సుకృతమంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆవేశంగా మాట్లాడడాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజానికి రెవెన్యూ వ్యవస్థ అవినీతికీ, అలసత్వానికీ, అన్యాయానికీ ఆలవాలమైనదని అనడంలో అతిశయోక్తి లేదు. తక్కిన వ్యవస్థలు పరిశుభ్రంగా ఉన్నాయని అర్థం కాదు. అవి కూడా రెవెన్యూ దారిలోనే ఉన్నాయి. కానీ సామాన్య ప్రజల జీవితాలతో పెనవేసుకున్నదీ, చెలగాటం ఆడుతున్నదీ రెవెన్యూ వ్యవస్థ. భూమి సర్వే చేయిస్తామనీ, యజమానులకు పట్టాలు ఇచ్చి పాసుబుక్కులు కూడా ఇస్తామనీ, రిజిస్ట్రేషన్ తో పాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందనీ ముఖ్యమంత్రి నమ్మబలికారు. రెవెన్యూ వ్యవహారాలు ఇకమీదట పారదర్శకంగా, అవినీతిరహితంగా జరుగుతాయంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేరడం అంత తేలికైన విషయం కాదు. పైనుంచి కిందిదాకా పాలనాయంత్రాంగం అవినీతిమయం అయినప్పుడు రెవెన్యూశాఖ నీతిమంతంగా, పారదర్శకంగా పని చేస్తుందని చెప్పడం కష్టం. చట్టాలతో ఆశించవన్నీ జరిగితే  ఈ సమాజం ఎంతో పురోగతి చెందేది.

ప్రజావ్యతిరేకులుగా అపకీర్తి మూటకట్టుకున్న అధికారులను తొలగించడం సంతోషించదగిన పరిణామమే. కానీ ఇకమీదట రెవెన్యూ శాఖను నడిపించే అధికారులు అవినీతిరహితంగా పని చేస్తారనీ, పారదర్శకంగా ఉంటారనీ పూచీ ఏమిటి? చట్టాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉపేక్షించడమే అరిష్టాలకు అసలు కారణం. మొన్న భారీ లంచం తీసుకుంటూ పట్టుబడిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వీఆర్వోకంటే చాలా పెద్ద ఉద్యోగి. ఐదు కోట్ల లంచం అడిగినట్టు ఆరోపణ ఎదుర్కొంటున్న జీఎస్ టీ ఉన్నతాధికారి కూడా మొన్నటివరకూ పెద్దమనిషే. దొరికినవాడే దొంగ. దొరకనివాడు దొర. ప్రభుత్వ నిఘా ఎంత గట్టిగా ఉంటే ప్రభుత్వాధికారులు అంత జాగ్రత్తగా పని చేస్తారు. నిఘాపెట్టవలసిన సంస్థలలోనూ లంచగొండులు దాపురిస్తున్నారు. కనుక అవినీతిరహిత, పారదర్శక పరిపాలనా వ్యవస్థ రావాలంటే పరిపూర్ణమైన, విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరం. చట్టాలలో మాత్రమే కాదు హృదయాలలో పరివర్తన రావాలి. కేవలం చట్టాల వల్ల లక్ష్యం సాధ్యం కాదు.

ముఖ్యమంత్రి తలపెట్టిన రెవెన్యూ సంస్కరణల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) నాయకులు కొందరు ముఖ్యమంత్రిని అవతారపురుషుడంటూ పొగుడుతున్నారు. రెవెన్యూ శాఖలో కీలక భూమిక పోషించిన బీఆర్ మీనా వంటి అధికారులు కూడా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు బాగున్నాయంటూ కితాబులు ఇస్తున్నారు. ప్రస్తుత వ్యవస్థ అయితే ఏ మాత్రం బాగాలేదు. ఎటువంటి మార్పులనైనా స్వాగతించవలసిందే. వివిధ స్థాయిలలోని అధికారులతో, అనధికారులతో సంప్రతించి,  కూలంకషంగా పరిశీలించి తయారు చేసిన బిల్లులు అంటున్నారు కనుక పరిస్థితి ఇప్పటికంటే మెరుగువుతుందని చెప్పవచ్చు.

ఏకగవాక్ష (సింగిల్ విండో) విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాల జారీ ఒకే రోజు ఒకే చోట పూర్తి కావాలన్నది సంస్కరణల లక్ష్యం. బ్రోకర్ల ప్రమేయం లేకుండా, లంచం ఇవ్వవలసిన అగత్యం లేకుండా పారదర్శకంగా ఈ పనులు ఏకకాలంలో జరిగితే రెవెన్యూ శాఖకూ, ప్రజలకూ మంచిరోజులు వచ్చినట్టే.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైన ఒకటి,రెండు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానమైన అంశం కౌలురైతుకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం. ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదంతో రైతులూ, రైతు కూలీలు మహోద్యమం చేసింది తెలంగాణలోనే. రైతాంగ సాయుధపోరాటానికి ప్రధాన కారణం దున్నేవాడికి భూమి దక్కాలనేదే. పోరాటకాలంలో వేల ఎకరాల భూములను కామందుల నుంచి స్వాధీనం చేసుకొని కమ్యూనిస్టులు  పేదలకు పంచిపెట్టారు. అంతవరకూ నిజాంపక్షాన ఉండిన జమీదార్లూ, జాగీర్దార్లూ స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  పోలీసు యాక్షన్ తర్వాత పోలీసులను వెంటబెట్టుకొని జాగీర్దార్లు తమ భూములను తిరిగి ఆక్రమించుకున్నారనేది వేరే విషయం. ‘రైతుబంధు’ పథకం అమలు చేసే సమయంలోనూ ప్రభుత్వం రైతు కూలీలను పట్టించుకోలేదు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతుకూలీలనూ ఆదుకోవలసిన అవసరం ఉన్నదనే అవగాహనతోనే సహాయ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణలో మాత్రం భూమి యజమానులకే ఆర్థిక సహాయం అందుతోంది. రైతు కూలీలకు ఎటువంటి సాయం లేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి మరోసారి ఆలోచించాలి. యజమానుల హక్కులకు భంగం కలగకుండా రైతు కూలీలను ఆదుకునే అవకాశాన్ని కల్పించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవినీతిని అరికట్టాలనీ, పారదర్శకత పెంచాలనీ సంకల్పించడం మంచిదే. ‘ధరణి’ పోర్టల్ ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెబుతున్నారు.  కానీ పహణీకీ, కంప్యూటర్ లోని సమాచారానికీ వ్యత్యాసం ఉన్నకారణంగా యజమానులు అష్టకష్టాలు పడిన దాఖలాలు అనేకం. కంప్యూటర్ లో లంచం ఇచ్చిన ఆగంతుకుని పేర్లు ఎక్కించి అసలు యజమానుల పేర్లు తొలగించిన అధికారులు ఉన్నారు. ఈ వేధింపులతో విసిగివేసారిని యజమానులు సదరు పొలాలను అమ్మివేస్తే వాటిని కొనుగోలు చేసిన మోతుబరి రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి హక్కు పత్రాలను పొందిన ఉదంతాలు కొల్లలు. కంప్యూటర్ లో సమాచారం నిక్షిప్తం చేసినంత మాత్రాన యాజమాన్యం హక్కు చెక్కుచెదరకుండా ఉంటుందనే విశ్వాసం ప్రజలకు లేదు. ముఖ్యంగా గ్రామీణులలో కంప్యూటర్ పైన విశ్వాసం లేదు. కంప్యూటర్ లో వివరాలు నమోదు చేస్తూనే పహణీలో కూడా అదే వివరాలను ఎక్కించాలి. కంప్యూటర్ తో పాటు పహణీని కూడా అధికారులు ప్రమాణంగా పరిగణించాలి. భూమికోసం అన్నదమ్ములూ, ఇరుగుపొరుగులూ కలహించుకొని, తలలు పగలకొట్టుకొని, హత్యలకు పాల్బడిన ఉదంతాలు అనేకం. ఒకే భూమిని ఒకరి కంటే ఎక్కువమందికి విక్రయించిన దగాకోరులూ, ఆ విక్రయాలను క్రమబద్ధం చేస్తూ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించినవారి పేరుపైన రిజిస్టర్ చేసిన సబ్-రిజిస్ట్రార్లూ ఉన్న దేశం మనది.

సర్వేలో యజమానుల పేర్లు ఖరారు చేసి కంప్యూటర్ లోనూ, పహణీలోనూ నమోదు చేసిన తర్వాత ఎవరైనా ఆ భూమి తనదంటూ పేచీ పెట్టినా, కోర్టుకు ఎక్కినా ప్రభుత్వం ఏ వ్యక్తిపేరుపైన రిజిస్టర్ చేసిందో ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా ఉండాలి. తాను చేసిన రిజిస్ట్రేషన్ ను సమర్థించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే ముందే పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫీజు వసూలు చేసి రిజిస్టర్ చేసిన ప్రభుత్వం పేచీలు వచ్చినప్పుడు తనకేమీ పట్టనట్టు ఉండటం క్షంతవ్యం కాదు.  ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు మంచివే. కానీ అవి మాత్రమే చాలదు. ఇంకా చాలా లొసుగులు ఉన్నాయి. వాటిని తొలగించడానికీ నిత్యం అప్రమత్తతో ఉంటూ సంస్కరణలను కొనసాగించాలి. భూదందాలనూ, భూమాఫియాలనూ అరికట్టడానికి ప్రభుత్వం చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చట్టాల అమలు జరిగే క్రమంలో అధికారులూ, ఉద్యోగులూ ప్రజలను పీడించకుండా ప్రభుత్వం నిఘా పెంచాలి. వీఆర్వో వ్యవస్థ లాగానే ఎంఆర్ వో వ్యవస్థ కూడా ప్రజాకంటకంగా తయారు కాదని పూచీ లేదు. పాలకులకు చిత్తశుద్ధి చాలా అవసరం.

పూర్వం భూమి శిస్తు పాలకులకు ప్రధాన వనరు. భూమి శిస్తు వసూలు చేసే అధికారంతో జాగీర్దార్లూ, సంస్థానాధీశులూ వనరులు సమీకరించుకొని నిజాం నవాబుకు కొంత భాగం చెల్లించేవారు. నిజాం నవాబు బ్రిటిష్ వలస ప్రభుత్వానికి తన వాటాలో కొంత భాగం చెల్లించేవాడు. బ్రిటిష్ పాలనలో ఉండిన కోస్తాంధ్ర, రాయలసీమలో సైతం సంస్థానాధీశులకు శిస్తు వసూలు చేసే అధికారమే ప్రధానంగా ఉండేది. కోస్తాంధ్రలో సంస్థానాధీశులు ఈ శిస్తులోనుంచి వలస ప్రభుత్వానికి వాటా చెల్లించేవారు. వారి భోగభాగ్యాలన్నీ ఈ శిస్తు ద్వారా వచ్చే ఆదాయాలతో సాగేవి. అక్బర్ చక్రవర్తి కాలంతో రాజాతోడర్ మల్ ఈ భూమి రికార్టుల, శిస్తు వసూళ్ళ వ్యవస్థను రూపొందించాడు. నిజాం సంస్థానంలో  రెవెన్యూశాఖలో ఫార్శీ పదాలు ప్రయోగించేవారు. కాలక్రమేణా ఈ వ్యవస్థలో సంస్కరణలు అమలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1971లో గుణాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టింది. భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం చేశారు. అప్పుడు చేసిన భూహక్కుల రిజకార్డు (ఆర్ ఓ ఆర్) చట్టాన్ని చాలా సార్లు సవరించారు. భూయజమానికి టైటిల్ పక్కాగా ప్రదానం చేసే విధంగా భూచట్టాలను రూపొందించాలనే కృషి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ వచ్చింది. 2011లో, 2019లో ముసాయిదా చట్టాలను రూపొందించి రాష్ట్రాలకు పంపించింది.

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రెవెన్యూ శాఖలో 1983-89లో మౌలికమైన మార్పులు చేశారు. అంతవరకూ ఉండిన పటేల్, పట్వారీ లేదా మునసబు, కరణం వ్యవస్థను రద్దు చేశారు. ప్రత్యామ్నాయం లేకుండా ఉన్న వ్యవస్థను రద్దు చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నది. అనంతరం విలేజీ రెవెన్యూ అధికారులను నియమించినప్పటికీ రెవెన్యూ వ్యవహారాలమీద లోడగ పట్వారీలకూ, మునసబులకూ ఉన్న పట్టు వీఆర్వోలకు దొరకలేదు. వారికున్న నిబద్ధత కూడా వీరికి లేకుండా పోయింది. దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం రెవెన్యూ వ్యవస్థను చక్కబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మార్పులను పరిగణించాలి. భూమి కొనుగోలు, దానం, మార్పిడి, తనఖాలకు సంబంధించిన పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వెడితే దస్తావేజుల రిజిస్ట్రేషన్, రికార్డులలో మార్పులు, కొత్త పాస్ పుస్తకాల జారీ ఒకే రోజులో పూర్తి కావాలన్నది చట్టాల లక్ష్యం.

రెవెన్యూ కోర్టులనూ, రెవెన్యూ ఉన్నతాధికారుల విచక్షణాధికారాన్నీ రద్దు చేయడాన్ని స్వాగతించాలి. రెవెన్యూ కోర్టులలో పెండింగ్ లో  ఉన్న కేసుల పరిష్కారానికి 16 ట్రిబ్యూనళ్ళను నెలకొల్పాలనీ, నిర్ణీత గడువులోగా కేసులను పరిష్కరించవలసి ఉంటుందనీ ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపైన భూవివాదాలు ఏమైనా తలెత్తితే సివిల్ కోర్టులకు వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు. సివిల్ కోర్టులలో కేసులు అంత సులభంగా పరిష్కరం అవుతాయా? ఇప్పటికే వేలకేసులు సివిల్ కోర్టులలో అపరిష్కృతంగా కునారిల్లుతున్నాయి. రెవెన్యూ కోర్టులలో కేసు పరిష్కారం కావడానికి ఒక జన్మ పడితే సివిల్ కోర్టులలో పరిష్కారం కావాలంటే రెండు జన్మలు అవసరం. పెనం మీది నుంచి పొయ్యిలో పడిన చందంగా రైతుల పరిస్థితి తయారు కాకూడదు.  కొత్తగా నియమించబోయే ట్రిబ్యూనళ్ళనే పెండింగ్ కేసులు పరిష్కారమయ్యేవరకు మాత్రమే కాకుండా శాశ్వత ప్రాతిపదికపైన నియమిస్తే భూవివాదాలు త్వరితగతిన పరిష్కారం కాగల అవకాశం ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యూనల్ వంతున మొత్తం 33 ట్రిబ్యూనళ్ళను నియమించి, రాష్ట్ర స్థాయిలో అపిలేట్ ట్రిబ్యూనల్ ను నెలకొల్పితే ఇంకా బాగుంటుంది. చిన్న జిల్లాలకు ట్రిబ్యూనళ్ళు అవసరం లేదని భావిస్తే పాత జిల్లాకు ఒకటి చొప్పున పది ట్రిబ్యూనళ్ళు శాశ్వత ప్రాతిపదికపైన ఏర్పాటు చేయడం అవసరం.  ఈ ట్రిబ్యూనళ్ళలో అవినీతి జరగకుండా నిరంతర నిఘా పాటించడం ముఖ్యం. ధరణిలో ఉన్న పొరబాట్లనూ, గందరగోళాన్నీ సవరించాలంటే సరికొత్త సర్వే అత్యవసరం. ఇదివరకే సర్వే చాలావరకూ పూర్తయినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ కొత్తగా సర్వే నిర్వహిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. నిజానికి భూముల సర్వే ప్రతి 30 సంవత్సరాలకు ఒక సారి జరగాలి. తెలుగుదేశం పార్టీ హాయంలో నిజామాబాద్ జిల్లాలలో ప్రయోగాత్మకంగా సర్వే జరిపి, భూరికార్డులను సవరించాలని ప్రయత్నించారు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏళ్ళ తరబడి పురోగతి లేకుండా ఉన్నది.  ‘ధరణి’ కి రాతప్రతిగా పహణీ ఉండటం అవసరం. రెండూ ప్రజల ముందుంచి వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ ఉద్యమసదృశంగా ఒక ప్రయత్నం జరగాలి. ఒకసారి లోపాలన్నింటినీ గుర్తించి తొలగించుకున్న తర్వాత భూకమతాల వివరాలన్నిటినీ ఖరారు చేసి వాటిని ప్రమాణంగా పరిగణించవచ్చు. భూమి శిస్తు వసూలు చేసినా, చేయకపోయినా భూముల యజమానులకు పాస్ పుస్తకాలు ఇవ్వడం, హక్కుల వివరాలు సందిగ్థం లేకుండా ప్రకటించడం అవసరం. ప్రభుత్వం మంజూరు చేసే పత్రాలను భవిష్యత్తులో ఎవరైనా వివాదంలోకి లాగితే వాటిని సమర్థించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటే యజమానుల సమస్యలు చాలావరకూ తీరిపోతాయి. రైతుబంధు వంటి కార్యక్రమాలు అమలు చేయాలన్నా, రైతులు తమ భూములపైన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఈ హక్కు పత్రాలే ఆధారం కావాలి. అప్పుడు రెవెన్యూ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తున్నదని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రెవెన్యూ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని విధివిధానాలను స్పష్టంగా రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. దశాబ్దాలుగా గందరగోళంలో పడి కొట్టుకుంటున్న రెవెన్యూ వ్యవస్థకు స్పష్టత తీసుకురావడం, ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి రికార్డులు తయారు చేయడం, వాటి వివరాలు ‘ధరణి’లో పొందుపరచడం చాలా అవసరమైన కార్యక్రమం. ‘ధరణి’ డిజిటల్ రికార్డు అయితే, రాత ప్రతిగా పహణీని కొనసాగించడం చాలా అవసరం. చట్టాలు చేసి చేతులు దులుపుకోకుండా వాటికి సత్వరమే నియమనిబంధనలు రూపొందించి, వాటిని పటిష్ఠంగా అమలు జరిపే యంత్రాంగాన్ని సమకూర్చడం, ఆ యంత్రాంగం అవినీతికీ, పక్షపాతానికీ అతీతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఇల్లు అలకగానే పండుగ కాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles