Tuesday, September 10, 2024

చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు

ఔరంగజీబు

భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజీబు తన గురువుకి రాసిన ఉత్తరంలో విషయం ఇలా ఉంది-

‘‘నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దానివల్ల అటు మీకూ, ఇటు నాకూ చాలా సంవత్సరాలు వృధా అయ్యాయి. ఎదుగుతున్న లేతవయసులో విద్యార్థి బుద్ధిని తేజోమయం చేయాలి గానీ, మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకూ ఉపయోగపడని భాష నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువలైన పది, పన్నెండేళ్ళు వృధా చేశారు. ఆ ఒక్క భాష, అందులోని సంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ మాత్రమే నన్ను లోకజ్ఞానిగా, మేధోసంపన్నుడిగా చేస్తాయని మీరు ఎట్లా అనుకున్నారూ? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. వారి అభిరుచికి తగిన విదంగా  జ్ఞానాన్ని అందిచాల్సి ఉంటుంది. కాగా, మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా?

Also read: రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

‘‘భూగోళ శాస్త్రం తెలియదు. గణితం తెలియదు. చరిత్రా తెలియదు. ఇంగ్లాండ్. హాలెండు, పోలెండు, పోర్చ్ గీస్ వంటి దేశాలు ఉన్నాయని మీరు నాకు చెప్పలేదు. దేశమంటే ఏమిటో, ద్వీపమంటే ఏమిటో, ద్వీపకల్పమంటే ఏమిటో మీరు నాకు చెప్పనేలేదు. సముద్ర మట్టమంటే ఏమిటో, సముద్రమట్టానికి ఏ దేశం ఎంత ఎత్తున ఉందో తెలియదు. ఈ హిందుస్థాన్ బాదుషా పేరు వింటేనే ప్రపంచ దేశాల రాజులందరూ గడగడ వణికిపోతారని అబద్ధాలు చెప్పారు కదా? అబద్ధాలతో ఎవరైనా జ్ఞానసముపార్జన చేయగలరా? ప్రపంచంలోని వేరువేరు రాజ్యాలేవీ? వారి పాలకులు ఎవరు? అక్కడి ఆచారవ్యవహారాలు, ఆహారనియమాలు ఎలాంటివీ? సంపత్తిగల దేశాలేవీ? విపత్తులు ఎదుర్కొన్న రాజ్యాలేవీ మాటవరుసకైనా చెప్పలేదే? ఇక మాకు విషయాలు ఎలా తెలుస్తాయీ? ప్రపంచంలో మన దేశం ఎక్కడ ఉంది? దీని బలబాలాలేమిటీ? వనరులేమిటీ? శక్తిసామర్థ్యాలేమిటీ? వంటి విషయాలు అంచనా వేసుకోవాలంటే చుట్టూ ఉన్న దేశాల పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా? చక్రవర్తి కుమారులమైన మాకు విషయాలు తెలియాల్సిన వయసులో తెలియకపోతే ఎలా? దేశాన్ని సమర్థవంతంగా ఎలా పరిపాలించగలం?’’ అని మదన పడ్డాడు ఔరంగజీబు. ఈ ఉత్తరంలో చాలా వాస్తవాలున్నాయి. ఒక భాషను బోధించడం, తర్వాత మతబోధలు చేయడం తప్ప ప్రపంచ పరిజ్ఞానానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. అతను మొఘల్ చక్రవర్తి వారసుడు గనక, అరబ్బీ నేర్పించారు. దాని ద్వారా అల్లాను పరిచయడం చేశారు. దాంతో మతానికి పునాదులు వేశారు. ఆ సమయంలో హిందూ కుటుంబాలలో కూడా దాదాపు అదే జరిగేది. ఆ కుటుంబాలలో సంస్కృతం నేర్పేవారు. వేదాలు, పురాణాలు చదివించి, మతం లోకి దారి చూపించేవారు. ఇంకా ఇతర మతాల్లోనూ అలానే జరిగేది. దాన్నే పాండిత్యంగా ప్రకటించుకునేవారు.

Also read: మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

ఈ విషయాల్ని పక్కన పెట్టి అల్బర్ట్ ఐన్ స్టీన్ బాల్య అనుభవాల్ని చూద్దాం. జర్మనీ మ్యూనిచ్ నగరంలోని ఒక కేథలిక్ స్కూల్లో చదువుకున్న ఐన్ స్టీన్ అక్కడి మత బోధనలకు, వారి పద్ధతులకూ విసిగి తర్వాత కాలంలో ఇలా రాసుకున్నారు. ‘‘నాకు పన్నెండో యేటినుండి పాఠశాలమీద, ఉపాధ్యాయులమీద అపనమ్మకం ప్రారంభమైంది. స్కూలు నన్ను ఫెయిల్ చేసింది. నేను స్కూలును-ఉపాధ్యాయులెప్పుడూ మిలట్రీ సార్జంట్లలాగే ప్రవర్తించేవారు. నాకు కావల్సింది నన్ను నేర్చుకోనివచ్చేవారు కాదు. నా జ్ఞానతృష్ణను ఉపాధ్యాయులు మెలికవేసి తిప్పుతుండేవారు. ప్రభువు ప్రార్థనలు ఎంతసేపనీ?’’ అంటూ విసుక్కున్నాడు. ఇంగ్లీషు కవి డబ్ల్యూ.బి. ఈట్స్ అంటాడు-‘‘విద్య నేర్పడం అంటే, బకెట్ నింపడం కాదు – అగ్నిని రగిలించడం!’’- అని! ఈ గురువులు విద్య పేరుతో దైవభావనకీ, మతబోధనలకు ప్రాధాన్యమిచ్చారే గానీ. జ్ఞానబోధ చేసింది ఎక్కడ? బకెట్లు నింపడమే గానీ అగ్నిరగిలించిందెక్కడ? సమాజంలో  అభ్యుదయ భావనలు చోటుచేసుకున్న దశలో ఉపాధ్యాయుడి నిర్వచనం మారింది. ఉపాధ్యాయుడంటే స్నేహితుడు, మార్గదర్శకుడు, ప్రణాళికా నిపుణుడు, క్రమశిక్షణ నేర్పేవాడు, స్ఫూర్తి కలిగించేవాడు. తరగతి నిర్వహించేవాడు. వక్తీకరించే నేర్పుగలవాడు,  ఆ నేర్పు నేర్పించేవాడు, కౌన్సిలింగ్ చేసేవాడు, పరీక్ష నిర్వహణాధికారి, సృజనకారుడు,తత్త్వవేత్త, తండ్రిలాంటివాడు, వసతులు కల్పించేవాడు. బోధకుడు వగైరా. గతంలో బోధించేవారిని ‘గురువు’ అని అనేవారు. గురువు-మతబోధలు చేసేవాడు. ముక్తిమార్గం చూపేవాడు. రానురాను గురువుల అవసరం తగ్గిపోయింది. ప్రపంచజ్ఞానాన్ని, విశ్వరహస్యాల్ని విప్పి చెప్పే ఉపాధ్యాయుల అవసరం ఎక్కువైంది. అందుకే అన్నారు ‘‘వేయిమందిపూజారు (గురువు) ల కన్నా, బాధ్యత గల ఒక ఉపాధ్యాయుడు మిన్న’’- అని!

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

పిల్లలకు ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలు నేర్పించే దేశాల్లో ఆయా భాషల ద్వారా మతబోధలు కొనసాగించారు. వందల ఏళ్ళు అదే ధోరణి నడిచింది. అదే జీవిత పరమార్థం అనుకున్నారు. తర్వాత కాలంలో తప్పని సరై గణితం, చరిత్ర, భూగోళం పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తున్న కొద్దీ సైన్సు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. గతాన్నంతా దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు  ఈ అత్యాధునిక యుగంలో నిలబడి ఆలోచిద్దాం. ఇప్పుడుకూడా ఓ భాష నేర్చుకుని, దాంట్లోంచి మత బోధలు వంటిబట్టించుకుని, మందబుద్ధులై ఉందామా? లేక నేటి జీవితంలో ఏ ఉపయోగమూ లేని మత బోధలు పక్కనపెట్టి, ఆధునిక విజ్ఞానాన్ని ఆహ్వానిద్దామా? ఆ నాటి ఔరంగజీబు చక్రవర్తే తనకు సరైన విద్య అందించలేదని తన గురువును దోషిగా నిలబెట్టాడు కదా? మరి ఇప్పుడూ? విద్యా సంస్థల్లోనే కాదు, అనేకానేక మాధ్యమాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకునే వెసులుబాటు ఉంది. ఎవరి ఊర్లో వారు కుంచించుకుని ఉండిపోవాల్సిన పరిస్థితిలోంచి విశ్వమంతా నా గ్రామమే అని అనుకునే స్థాయికి ఎదిగాం.  కులమతాల్ని వదిలేసి, మతేతరులుగా జీవించగలిగే స్వేచ్ఛను సంపాదించుకున్నాం. దేవుడు శిక్ష విధిస్తాడన్న భయంతో కాక, స్వచ్ఛందంగా మానవీయ విలువల్ని కాపాడుకునేంతటి వివేకవంతులమయ్యాం.  మరి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. మూఢత్వమా, వివేకమా? బానిస మనస్తత్వమా? స్వేచ్ఛాలోచనా? పురాణాల పాండిత్యమా? వైజ్ఞానిక అవగాహనా? ఏది? ఏది మనం కావాలనుకుంటున్నాం?

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

‘‘ఒక పిల్లాడు ఆపదలో ఉంటే కాపాడేవాడు -మనిషి. కాపాడమని ఎవరినో ప్రార్థించేవాడు – భక్తుడు. తనకేమీ సంబంధం లేనట్టు ఉండేవాడు – దేవుడు’’

మత విషయాలు బోధించి జనాన్ని ‘జ్ఞానుల్ని’ చేయాలని కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. చాలావరకు సఫలమయ్యాయి కూడా! మతం చెప్పింది, దేవుడుచెప్పాడు – వంటి బూటకపు మాటలతో తరతరాలుగా కోట్ల మందిని బానిసల్ని చేశారు. హీనజనులుగా చూసి, ఈసడించారు. ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన క్రిస్టియన్లు ఈ పని ఎక్కువగా చేస్తే, ఆ తర్వాత వరుసలో ఉన్న ముస్లింలు, హిందువులూ కూడా ఆ పని విజయవంతంగా కొనసాగించారు. అదే ఇప్పటికి ఇంకా ఇంకా కొనసాగాలని భావిస్తున్నారుకూడా! జ్ఞాని అయినవాడికి అన్ని విషయాల మీద అవగాహన ఉండదు. అజ్ఞానికి మాత్రం ఉంటుంది. ఎంతటి జ్ఞాని అయినా కొన్నికొన్ని విషయాల మీదే అవగాహన పెంచుకుంటాడు. తెలియని విషయాలు తెలియవని ఒప్పుకుంటాడు. అదే అజ్ఞాని మాత్రం తెలియని విషయాలు తెలియవని ఒప్పుకోడు. ఇలాంటివారు తమకు తాము బాగుపడరు. తమని బాగుపరిచే అవకాశాన్ని కూడా ఇంకొకరికి ఇవ్వరు. ఇది మతం పిచ్చిలో మునిగిన అవివేకుల లక్షణం!  ‘‘అభూత కల్పినలే పరమ సత్యాలని నీ చేత నమ్మించేవాళ్ళు, నీ చేత పరమ క్రూర చర్యల్ని సైతం పవిత్ర కార్యాల్లాగా చేయించగలరు’’- అని అంటాడు వోల్టేర్ అనే ఫ్రెంచ్ రచయిత. ‘‘మనుషులు పరస్పరం ద్వేషించుకోవడానికి తగినంత మతం అనేది ఉంది. కాని ప్రేమించుకోవడానికి చాలినంతగా లేదు’’ అని అంటాడు ఆంగ్లో ఐరిష్ కవి, రచయిత జోనాథన్ స్విప్ట్.

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

హిందూ కుటుంబాలలో సంస్కృతం, హిందీ, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో కొంచెం ప్రవేశం సంపాదించి, దైవభావనని అంగీకరిస్తే చాలు. మంచి సంప్రదాయ కుటుంబం అని గుర్తింపు దొరుకుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నాలుగు శ్లోకాలు ఎక్కువ చదివి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే సమాజం అతణ్ణి ‘గురువు’గా గుర్తిస్తుంది. ముస్లింల పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఖురాన్ లో ఉన్న క్రీ.శ. 570-632 నాటి విషయాలు పాటిస్తారు. మహ్మదు ప్రవక్త చెప్పినవి అని అంటారు. అలాగే క్రిస్టియానిటీలో పాస్టర్ మాటలకు  వశులైపోయి పూనకాలు పూనుతారు. కన్వరి నూనెతో రోగాలు నయమవుతాయనుకుంటారు.  దేవునితో ఒక రాత్రి – శృంగార దేవాలయాలు – స్వస్థత ప్రార్థనలన్నీనిజమనుకుంటారు. స్త్రీలు మోసపోతున్నారని తెలిసినా తెలివి తెచ్చుకోరు. ఈ మతాలన్నింటిలో దగ్గరి పోలికలు ఉన్నాయి ఎందుకంటే – ఒకప్పుడు అందరూ ఒకటే కాబట్టి! భారత దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లూ చాలావరకు ఒకప్పుడు హిందువులే. ముస్లిం చక్రవర్తుల పాలనవల్ల, బ్రిటిష్ వారి పాలనవల్ల…ఏవో లాభాలుకు, రాయితీలకు ఆశపడి మతం మారినవారే ఎక్కువ. బౌద్ధం ప్రభావంలోంచి బయటపడలేక, హిందువులు తమ దశావతారాలలో బుద్ధుణ్ణి కలిపేసుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం, నిమ్న జాతుల జీవితాలను దుర్భరం చేయడం జరిగింది. ఫలితంగానే వారంతా ఇతర మతాల్ని స్వీకరించారు. తర్వాత కాలంలో హిందూ దేవాలయాల్ని కూలగొట్టి ముస్లిం రాజులు వాటిని మసీదులుగా మార్చుకున్నారు. చరిత్ర పుటల్లో మత ఘర్షణలన్నీ నమోదయ్యే ఉన్నాయి. అజ్ఞాన నేత్రంతో చూస్తే విషయాలు వంకరటింకరగా కనిపిస్తాయి. జ్ఞాననేత్రంతో సమ్యక్ దృష్టితో చూస్తే వాస్తవాలేమిటో అర్థమవుతాయి. అయితే అధ్యయనాలన్నిటి సారాంశం ఒక్కటే – ‘‘మతం మనిషిని మనిషిగా ఉండనీయదు’’- అని.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles