Friday, March 29, 2024

ధర్మపురిలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం

  • సంక్షోభాలను ఎదిరించిన హిందూ, ముస్లింల స్నేహ బంధాలు
  • పేదలసేవలో తరిస్తున్న ముస్లిం సోదరులు

జె. సురేందర్ కుమార్ , ధర్మపురి

ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయాలకు మతం రంగు పులిమి కొందరు నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో, ప్రశాంత వాతావరణాన్నికలుషితం చేస్తున్నారు. అంతే కాకుండా మతసామరస్యం కోసం ఆయా పార్టీల కు చెందిన కొందరు నేతలు మాత్రమే పాటుపడుతున్నట్లు ప్రజా వేదికలపై సమావేశాలు పెట్టి  మరీ ప్రసంగాలు దంచేస్తుంటారు. ఎన్నికల సమయంలోనూ, ఇతర సందర్బాలలోను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా హిందువులూ, ముస్లింలూ కలిసిమెలిసి ఆదర్శప్రాయమైన, ఆనందమయమైన జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా వారి  మధ్య సంబంధాలు బలంగానే కొనసాగుతున్నాయి.  దేశంలో ఏ ప్రాంతంలో,  ఏ రాష్ట్రంలోనూ  కనిపించని హిందూ ముస్లిం భాయ్ భాయ్ కి ప్రతీకలైన పురాతన చారిత్రిక  ఆనవాళ్లు, వాటితో మమేకమై సనాతన సాంప్రదాయ, ఆచార, వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రంలో వందలాది సంవత్సరాల నుంచీ ఆచరణలో ఉన్నాయి.  ఆ సాంప్రదాయాలను ఆచరిస్తూనే జీవనం కొనసాగిస్తున్నారు.

ఆలయాల్లో ముస్లింల పూజలు

హిందువులకు ముస్లింలూ, ముస్లింలకు హిందువులూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. ముస్లిం  దర్గాలను హిందువులు  తమ కుల దైవంగా భావిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొందరు ముస్లింలు తమ కోర్కెలు తీర్చుకునేందుకు హిందూ ఆలయాలలో పూజలు నిర్వహిస్తూ  మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తోంది. ఈ సనాతన సంప్రదాయం ఉత్తర తెలంగాణ జిల్లాలలో అనాదిగా కొనసాగుతూ వస్తోంది. కాలక్రమంలో ఎదురైన ఎన్నో అవాంతరాలను తట్టుకుని హిందూ ముస్లింల బంధాలు నిలబడ్డాయి. అయితే అనాదిగా పాటిస్తున్న సంప్రదాయాల గురించి ప్రభుత్వం గానీ,  పర్యటక శాఖ గానీ,  ప్రచారం గానీ లేకపోవడం విచారించాల్సిన విషయం. బయటి ప్రపంచానికి హిందూ-ముస్లింల సంబంధాలు బలంగా ఉన్నాయనే విషయం తెలియడం లేదని మేధావి వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

ధృఢంగా హిందూ, ముస్లింల సోదర బంధాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా హిందూ ముస్లింల మధ్య ఉన్న సోదర సంబంధాలు మరింత బలీయంగా మారాయి.  కరోనా బారిన పడిన  వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్ళడానికీ, వారితో మాట్లాడడానికీ, పరామర్శించడానికీ, కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకులే వెనుకాడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆ వ్యాధిన పడిన వారు మరణిస్తే వారి మృతదేహాలు అంతిమ సంస్కారానికి నో చుకోవడానికి ఆ కుటుంబీకులు అష్ట కష్టాలు పడడంతో వారి బాధలు వర్ణనాతీతం.  కరోనా వ్యాధి తో మృతిచెందిన  వారి మృతదేహం  వారి స్వస్థలాలకు తీసుకుని రావడం ఒక ఎత్తయితే, అంత్యక్రియలు జరిపించుందుకు రక్త సంబంధీకులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు  బంధువర్గం గానీ ప్రజలు గానీ, గ్రామస్తులు గానీ స్మశాన వాటిక వద్దకు రాకపోవడంతో మృతి చెందిన వారి రక్తసంబంధీకుల  కష్టాలు చెప్పనలవి కావు .

ఇలాంటి తరుణంలో కోరుట్ల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు నజీర్ అలీ, ఇసాక్, అబ్దుల్లా సోఫియా, ఆసీన్, ముజాహిద్, అబ్దుల్ రజాక్ లు అఖిలభారత మానవత్వ సందేశ సమితి (ఆల్ ఇండియా పాయం-ఇ-ఇన్సానియత్ ఫోరం) వేదికగా వారు రామలచ్చక్కపేట, రాఘవపట్నం, మెట్పల్లి, కోరుట్ల, మాదాపూర్ తదితర గ్రామాలలో కరోనాతో మృతి చెందిన వారికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యం నింపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

సంప్రదాయాలను కాపాడుతూనే సేవలు

సనాతన ఆచార సంప్రదాయాలు ఆచరణలో ఉన్న ధర్మపురి క్షేత్రంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు జహంగీర్ నేతృత్వంలో వెల్ఫేర్ సొసైటీ  వేదికగా వినాయక నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాల్లో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించడం భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోదావరి హారతి తిలకించడానికి వచ్చిన వేలాది మంది భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారికి బలవర్ధక ఆహార పదార్థాలు  ఉచితంగా అందజేయడం జరిగింది. చలికాలంలో పేద ప్రజలకు బ్లాంకెట్స్  పంపిణీ. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి సంక్షేమ ధార్మిక , సేవా కార్యక్రమాల్లో ముస్లిం సోదరులు పాల్గొంటూ మత సామరస్యాన్ని చాటుతున్నారు.

మత సామరస్యానికి అద్దంపడుతున్న ధర్మపురి

అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా గోదావరి తీరంలో గల ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, ముస్లింల ప్రార్థన మందిరం పక్కపక్కనే అనాదిగా కొనసాగుతున్నాయి. మసీదులో ప్రార్థనా సమయంలో ఆలయంలో గంటలు మోగించడం గాని, మైకుల్లో పూజలు భజనల ప్రసారం తాత్కాలికంగా నిలిపివేసిస్తారు. ఊరేగింపుల నిర్వహణ సమయంలో ప్రార్థనా స్థలం వద్దకు రాగానే మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నిలిపివేస్తారు.

హిందువుల ఇలవేల్పు బిజిగిరి షరీఫ్ దర్గా

కరీంనగర్ జిల్లా. జమ్మికుంట మండలంలోని ప్రసిద్ధ బిజిగిరి. షరీఫ్ దర్గా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని  ఓ  హిందూ వంశీయులకు ఇలవేల్పు. అనాదిగా వారింట ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఆ దర్గాను సందర్శించి వారి మొక్కులు చెల్లించుకుంటారు. వారి పిల్లల పుట్టు వెంట్రుకలను  సైతం ఆ దర్గా వద్ద పూజలు నిర్వహించి సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

 దస్తగిరి  దేవుడు

గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో చిన్న గుట్టపై దర్గా ఉంది. శతాబ్దాల నుంచి ఆ గ్రామం తో పాటు పరిసర గ్రామ ప్రజలు ఆ దర్గాను “” దస్తగిరి” దేవుడిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.   ప్రతియేటా అక్కడ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు.  జాతరలో హిందువులే అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ గుట్టపైకి మెట్ల నిర్మాణం కోసం గ్రామస్తులు, భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో మెట్ల మార్గాన్ని నిర్మించుకున్నారు. ఈ దర్గాకు అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు, బడుగు బలహీన  వర్గాల ప్రజలూ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారూ వస్తుంటారు. వారంలో రెండు రోజులపాటు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.  కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా వారు కొలుస్తుంటారు. సంతానం కోసం ఇక్కడ ముడుపులు కట్టి కొన్ని రోజుల పాటు గుట్టపై భక్తులు నిద్ర చేస్తుంటారు. సంతానం కలిగితే ” దస్తగిరి ” అని పేరు  పెట్టుకుంటామని మొక్కుకుంటారు. గొల్లపెల్లి  మండల పరిసర గ్రామాలతో పాటు  చందోలి గ్రామం లోని అత్యధిక శాతం మంది హిందువులకు “దస్తగిరి ” అనే పేర్లు ఉన్నాయి.

రాజన్న ఆలయంలో దర్గా

దక్షిణ కాశి క్షేత్రం గా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముస్లింల ‘‘దర్గా”  వందలాది సంవత్సరాల నుంచి ఉంది.  స్వామివారికి మొక్కులు, కోడె మొక్కులు చెల్లించుకుని వారు ఇక్కడి దర్గాను దర్శించుకుని పూజలు నిర్వహించి దర్గాలోని ముస్లిం పూజారి ఆశీస్సులు పొందుతారు.  రాజన్న ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి భక్తుడూ దర్గాను దర్శించుకుని ఆ పూజారి ఆశీస్సులు పొందడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

 ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా హిందూ ముస్లింలు సఖ్యతతో మెలుగుతున్నమని స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు. మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు కొందరు అతివాదులు చేస్తున్న ప్రయత్నాలపట్ల ఇక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హిందూ,ముస్లిం భాయి-భాయి’ అంటూ ఇరు మతాలవారూ ప్రశాంత జీవనం కొనసాగించేందుకు సహకరించాలని కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles