Saturday, September 7, 2024

కాంగ్రెస్ పునరుజ్జీవనం జాతికి అవసరం

ఎంతో చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. గతంలో ఎందరెందరో మహానుభావులు, మహనీయులు ఆ పార్టీలో ఉండేవారు. పార్టీని నడిపించారు. అప్పటి సందర్భం, విలువలు వేరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పయనం మారింది. తరాల అంతరాల మధ్య మారుతూ, కాలంతో పాటు ప్రయాణం సాగిస్తూ ఉంది. జాతీయ స్థాయిలో ఎక్కువ కాలమే అధికారంలో ఉంది. ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్న నేపథ్యంలో, మిశ్రమ ఫలితాలతో, మిశ్రమ ప్రభతో సాగుతోంది. ముఖ్యంగా 2014లో అధికారం కోల్పోయినప్పటి నుండి పార్టీ గతి మారింది. 2019లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుండి ఇంకా గతి తప్పింది. రాహుల్ గాంధీ నాయకత్వ పగ్గాలు వదిలేస్తున్నాను అని చెప్పినప్పటి నుండీ పెద్ద ఎత్తున విమర్శల పాలవుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల అధికారం తెచ్చుకుంది. కొన్ని చోట్ల కోల్పోయింది. కొన్ని చోట్ల మిగిలిన పార్టీల సంకీర్ణంతో అధికార గణంలో ఉండి, కొంత ఊరట పొందుతోంది. తాజాగా బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందింది. ఇదొక పెద్ద దెబ్బ.

సంచలనం సృష్టించిన లేఖాస్త్రం

గత ఆగస్టులో 23మంది సీనియర్ నేతలు సంధించిన లేఖాస్త్రం పెనుసంచలనం సృష్టించింది. తాజాగా కపిల్ సిబల్, చిదంబరం చేసిన వ్యాఖ్యలు పార్టీలో, దేశంలో మళ్ళీ కలకలం సృష్టిస్తున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే, రాహుల్ గాంధీని బలపరిచే వర్గం, పెద్దగా అభిమానించని వర్గాల మధ్య కొంత పోరు నడుస్తున్నట్లు అనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఈ పార్టీని నేను నడుపుతాను, అని బలంగా చెప్పలేక పోవడం, అనాసక్తిగా ఉన్నట్లు కనిపించడం, తాజా ఎన్నికల్లో వైఫల్యం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయనే చెప్పాలి. పైకి ఎలా మాట్లాడినా,  లోలోపల సోనియాగాంధీకి రాహుల్ గాంధీ చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండాలి, ప్రధానమంత్రి అవ్వాలి అనే బలమైన కోరికలు  ఉన్నాయి. ఈ ఆలోచనలు రాహుల్ గాంధీకి కూడా తప్పనిసరిగా లేకపోలేదు.  రాహుల్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తించడమే పార్టీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.

రాహుల్ పెరుతోన్న పరిపక్వత

గతంలో ఎలా ఉన్నప్పటికీ, కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుండీ రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అతనిలో పరిపక్వత  పెరుగుతున్నట్లుగా కొందరు విశ్లేషకులు గుర్తించారు. కపిల్ సిబల్, చిదంబరం చేసిన వ్యాఖ్యలను పార్టీ వర్గాల్లో కొందరు కొట్టి పారేస్తున్నారు. వారిని పార్ట్ టైమ్ రాజకీయ నాయకులుగానూ, ప్రజాబలం లేని నేతలగానే చూస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, గెలిచి, ప్రజాబలం చూపించిన వ్యక్తులుగా కాక, కేవలం రాజ్యసభ ద్వారా నామినేషన్ పొందినవారిగానే పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, గౌరవాలు, సౌకర్యాలు, సుఖాలు అనుభవించి, ఇప్పుడు పార్టీపై విమర్శలు చేసే కృతఘ్నులుగా ఆ వర్గం వీరిని చూస్తోంది.

తరాల మధ్య అంతరాలు

ప్రధానంగా యువతరం, మధ్య తరం, పాత తరం మధ్య అంతరాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. డిసెంబర్, జనవరిలో పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరిపి, రాజమార్గంలో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే వాతావరణం ఉంటుందని సమాచారం. రాహుల్ గాంధీ కూడా అదే కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీలో పరిపక్వత, పోరాటపటిమ, సమర్ధతలు పెరగాలి.పార్టీ భవిష్యత్తు పట్ల విశ్వాసం పెంచే బాధ్యత చేపట్టాలి.  సమీప కాలంలో తమిళనాడు,పశ్చిమ బెంగాల్,  అస్సాం మొదలైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగా, ఈ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు వస్తే, పార్టీకి మళ్ళీ ఒక ఊపు, ఊతం, నైతిక బలం వస్తాయి.

బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన

పార్టీ బాగుపడాలంటే బూత్ స్థాయి నుండి జవజీవాలు తేవాల్సిందే. ప్రతి రాష్ట్రంలోనూ సమర్థులను ఎంపిక చేసుకొని, కొత్త రక్తం ఎక్కించుకుంటే తప్ప, ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదు. మధ్య, పాత తరాల నాయకులతో జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ, యువతరానికి పార్టీ బాధ్యత అప్పచెపితే తప్ప, పార్టీకి మనుగడ ఉండదు. మనుగడ అంటే, సాంకేతికంగా పార్టీ ఉంటుంది, కానీ, ఊసులేకుండా అయిపోతుందనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. తప్పనిసరిగా పార్టీని ప్రక్షాళన చేయాల్సిందే. ఆత్మ పరీక్ష జరుపుకోవాల్సిందే. కలహాలు సృష్టించేవారు, నిరాశ నిస్పృహల మధ్య శల్య సారథ్యం చేసే నేతలను పక్కన పెట్టకపోతే, పార్టీ ముందుకు సాగదు. దేశ వ్యాప్తంగా అడుగడుగునా, ఆణువణువునా   పార్టీపై ప్రచారం చెయ్యాలి. కొత్త నియామకాలు జరగాలి.

పార్టీ చరిత్ర, విజయాలు ప్రచారం చేసుకోవాలి

కొత్త ఓటర్లకు కాంగ్రెస్ చరిత్ర, వారు సాధించిన విజయాలు, గొప్పలు, ప్రగతి,అందించిన ఫలాలు  గట్టిగా  ప్రచారం చేసుకోవాలి. వీటికి తోడు, వీటన్నింటి కంటే ముందుగా జాతీయ స్థాయి నాయకత్వం ఎవరి చేతిలో నడుస్తుందో తేల్చాలి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తన బలాలు, బలహీనతలు తెలుసుకొని ముందుకు సాగితే, పార్టీ ప్రతిష్ఠ కొంత పెరుగుతుంది. నరేంద్రమోదీ వంటి నాయకుడిని ఎదిరించి నిలబడడం అంత తేలిక కాదు. ఇప్పటికీ బిజెపి పట్ల, మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం, ఆకర్షణ ఏమీ తగ్గలేదు. అదే సమయంలో,  అసలు వ్యతిరేకతే లేదని చెప్పలేం, వైఫల్యాలు లేవనీ అనలేము. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ ఇప్పటి నుండే సమాయత్తం అవ్వాలి.

జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే

ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ఇదే పార్టీకి కలిసివచ్చే పెద్ద  బలమైన అంశం. ఓటర్లు, క్యాడర్ ఒక మోస్తరుగా ఉన్నారు. పూర్తిగా నిర్వీర్యం కాలేదు. సచిన్ పైలెట్ వంటి యువ నేతలతో పాటు, శశిథరూర్ వంటి మేధావులు పార్టీలో ఉన్నారు. అందరినీ, అన్ని వనరులను, అన్ని అవకాశాలను, అధికార పార్టీ వైఫల్యాలను సద్వినియోగం చేసుకుంటే, కాంగ్రెస్ కు మళ్ళీ జవజీవాలు వస్తాయి. పార్టీలో సమగ్రంగా, సంపూర్ణంగా మార్పులు రాకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే అవుతుంది. కొత్త ఆట సరికొత్తగా మొదలు పెడితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా, బలమైన ప్రత్యామ్నాయంగా, ప్రతిపక్ష పార్టీగా  కాంగ్రెస్ నిలుస్తుందని భావించవచ్చు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles