Friday, December 2, 2022

నాస్తికత్వం ఒక విచారధార – జీవన విధానం

ఫొటో: సత్యేద్రనాథ్ బోస్, జవహర్ లాల్ నెహ్రూ, అమర్త్య సేన్, త్రిపురనేని రామస్వామి చౌదరి – అందరూ నాస్తికులే

తొమ్మిదో శతాబ్దంలో జైన తత్త్వవేత్త జినసేన ‘మహాపురాణం’ రాశాడు. అందులో ఇలా ఉంది. ‘‘భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని కొందరు పిచ్చివాళ్ళు ప్రకటించారు. ఒక వేళ భగవంతుడే ఈ సృష్టికి కారణభూతుడవుతే, మరి సృష్టికి పూర్వం ఆయన ఎక్కడ ఉన్నాడూ? ఆయనకు ఏ ఆధారమూ అక్కరలేదు. డోలాయమాన స్థితిలోనైనా ఉండగలడు..అని అనుకుంటే, సృష్టి జరిగిపోయింది కదా?మరి ఇప్పుడెక్కడ ఉన్నాడూ?’’ అని! ఇదే విషయం కార్ల్ సాగన్ పుస్తకం ‘కోస్ మోస్ (cosmos) లో కూడా ఉంది.

Also read: మనువాదం మట్టికరవక తప్పదు!

హిందూ తత్త్వశాస్త్రం ప్రకారం ఆస్థిక, నాస్తిక భావజాలాలు రెండున్నాయి. ఇందులో మొదటిది – వేదాల నుండి దేవుడి నుండి బల్లిశాస్త్రం దాకా అన్నింటినీ నమ్మే ఈ ఆస్థికత్వం విపరీతంగా విజృంభించి ప్రపంచమంతా వ్యాపించింది. సాంఖ్య, యోగ, న్యాయ, వైశాఖ, మీమాంస, వేదాంత శాఖలుగా పరిఢవిల్లింది. ఇక రెండోరకం నాస్తికత్వం – ముక్తిని, స్వర్గాన్ని, ఆత్మల్ని నమ్మలేదు. ఈ కోవలోనివారు కూడా శాఖోపశాఖలుగా విస్తరిల్లారు. జైన, బౌద్ధ, చార్వాక, ఆజ్విక శాఖలుగా ఆయాకాలాలలో వర్థిల్లుతూ వచ్చారు. వీరు ఆస్థికుల భావాలకు వ్యతిరేకమైన అంశాల్ని ప్రవేశపెట్టారు. ఎవరి భావజాలం వారిదైనా, చార్వాకులు మాత్రం వీరిలో ప్రత్యేకంగా నిలిచారు. పైగా క్రీస్తు పూర్వమే ఉద్భవించారు. దేవుణ్ణి, ఆత్మల్ని నిరసించారు. ప్రత్యక్ష ప్రమాణాలు కావాలని నిలదీశారు. భూమి, నీరు, గాలి, అగ్ని అనే నాలుగు మూలకాలతోనే అన్నీ రూపొందాయని చెప్పారు. దైవభావనను పక్కకు నెట్టి, తొలిసారిగా ఒక వైజ్ఞానిక విశేషాన్ని అప్పుడే – చెప్పగలిగారు! ప్రవచనాలు చెప్పేవారు చెపుతున్నట్టు, దేవుణ్ణి నిరసించేవారు ఇటీవల ఆధునిక కాలంలో పుట్టుకురాలేదు. ఆస్థికత్వంతో పాటే నాస్తికత్వమూ పుట్టింది. అదేమీ విశృంఖలత్వం కాదు. సంఘవిద్రోహ శక్తి కాదు. పాపమూ కాదు. ఇదంతా ఆస్థికులు ప్రచారంచేసిన అబద్ధం! నాస్తికత్వం ఒక విచారధార. ఆలోచనా సరళి. జీవన విధానం. ఓపికగా నిజానిజాలు విశ్లేషించుకునేవారికి సత్యం బోధపడుతుంది. జట్కా గుర్రానికి పక్కలకు చూడకుండా గంతలు కడతారు. దైవంపై విశ్వాసమున్నవారు అట్లాంటి గంతలే కట్టుకుని విశ్వాన్ని మా కోణంలోంచే చూస్తామంటే కుదరదు. వారికి సమగ్రమైన అవగాహన కలగదు. గంతలు విప్పుకొని రావాలి!

Also read: దశహరాకు వక్రభాష్యాలు ఆపండి!

చార్వాకుల మూలపురుషులు వెలువరించిన ‘బృహస్పతి సూత్ర,’ ఇతర చార్వాక గ్రంథాలు కాలగర్భంలోకలిసిపోయ్యాయి. ఆ తర్వాత రెండు వందల ఏళ్ళకు, అంటే ఎనిమిదో శతాబ్దంలో, జయరాసి భట్ట ‘తత్వో పప్లవ సింహ’- అనే రంథం ప్రకటించాడు. పద్నాలుగో శతాబ్దపు మధ్వాచార్య-‘సర్వదర్శన సంగ్రహ’ రాశాడు. ఇది భారతదేశ తత్త్వశాస్త్రాల సారాంశం. ఇందులో ఆయన చార్వాకుల గురించి రాశాడు. అది కూడా మొదటి అధ్యాయంలో ప్రముఖంగా రాశాడు. 8,14 శతాబ్దాలలో వెలువడ్డ ఈ రెండు గ్రంథాలు రెండవ తరం చార్వాకులు ప్రకటించినవి. వాటిలోని కొన్ని కొన్ని విషయాలు తరువాత తరాలకు అందుతూ వచ్చాయి.  ఇవి ప్రశ్నించడాన్ని నేర్పాయి. ప్రత్యక్ష సాక్షులను, రుజువులను కోరాయి. పందొమ్మిదో శతాబ్దంలోనే తమిళనాడులో ఒక ప్రయత్నం జరిగింది.  1881-1888 మధ్య కాలంలో మద్రాస్ సెక్యులర్ సోసయిటీ ‘ద థింకర్’ (తత్త్వవివేశిని) పేరుతో ఒక పత్రిక ప్రచురించింది. ఇందులో రచయితల పేర్లు లేకుండా వ్యాసాలు రాయబడ్డాయి. లండన్ సెక్యులర్ సోసయిటీ జర్నల్ నుంచి ఎన్నిక చేసిన వ్యాసాలు కూడా పునర్ముంద్రించబడ్డాయి. ఆ రోజుల్లో లండన్ సెక్యులర్ సొసయిటీకి మద్రాస్  సెక్యులర్ సొసయిటీ అనుబంధంగా పని చేసింది.

Also read: చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు

ఇరవయ్యవ శతాబ్దంలో సత్యేంద్రనాథ్ బోస్ (1894-1974) గణిత-భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు. నిరీశ్వరవాది కూడా! క్వాంటమ్ మెకానిక్స్ ని వెలుగులోకి తెచ్చాడు. అదే తర్వాతి కాలంలో బోస్-ఐన్ స్టీన్ స్టాటిస్ టిక్స్ కి ఆధారమైంది. ఆస్ట్రోఫిజిస్ట్ గా ప్రసిద్ధుడైన మేఘానంద్ సాహా (1893-1956) నక్షత్రాల్లోని రసాయనిక, భౌతిక స్థితిగతుల గూర్చి చెప్పినవాడు మాత్రమే కాదు. ఒక నాస్తికుడు కూడా! అలాగే మరో ఆస్ట్రోఫిజిస్ట్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1910-1995) కూడా నక్షత్ర పరిణామంపై కృషి చేసి, 1983లో నోబెల్ బహుమతి సాధించాడు. ఆయన కూడా నిరీశ్వరవాదే! నాస్తికుడే!! తొలి భారత ప్రధాని ‘టు వర్డ్స్ ఫ్రీడమ్’ (1936) పేరుతో తన ఆత్మకథ రాసుకున్నపండిట్ జవహర్ లాల్ నెహ్రూ (1889-1964) ఏ దేవుణ్ణీ విశ్వసించలేదు. మూఢనమ్మకాల్ని తీవ్రంగా నిరసించాడు. మతం కారణంగా జరిగే అనర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన గోరా: గోపరాజు రామచంద్రరావు (1902-1975) కులమతాల్ని దుయ్యబట్టిన సామాజిక కార్యకర్త! ఆయనతో పాటు ఆయన భార్య సరస్వతీగోరా (1912-2007) కూడా హేతువాద ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1940లో హేతువాద కేంద్రం స్థాపించి సమాజంలో మార్పుకోసం అహరహం కృషి చేశారు.

గోరా రచనలు తెలుగు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. 1972లో ప్రపంచ హేతువాదసభలు తొలిసారిగా ఏర్పాటు చేసి, ఆయన ఘనంగా నిర్వహించారు. ఫలితంగా 1997లో ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ ప్రారంభమైంది. 21వ శతాబ్దపు భారతీయ ఆర్థిక  శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ నిరీశ్వరవాది. హిందూ మతంలో నిరీశ్వరవాదాన్ని ‘లోకాయత’ పేరుతో ఒక విభాగంగా గుర్తించాలన్నాడు. 2008లో ‘నిర్ముక్త’ వెబ్ సైట్ (www.huganatheist.org)  ఏర్పాటయ్యింది. అది స్వేచ్ఛాలోచన కోసం, ప్రజాస్వామ్య మానవతావాదం కోసం కృషి చేస్తోంది. 2009లో మీరానందా ‘ది గాడ్ మార్కెట్’ (దేవతల సంత) అనే పుస్తకం ప్రచురించారు.  అది భారతీయ మధ్యతరగతి జనుల్లో గ్లోబలైజేషన్ ప్రభావం  ఎలా పడుతూ ఉందో చర్చించింది. వీరందరినీ గుర్తు చేసుకోవడమెందుకంటే, దైవభీతి, దైవభావన లేకుండానే సమాజ శ్రేయస్సుకు జీవితాలు ధారపోసినవారు కాబట్టి! విశ్వశాంతికోసం, మానవీయ విలువల కోసం నిరంతరం శ్రమించారు కాబట్టి!! ఇప్పుడిక మనం, మన రాబోయే తరాలు ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాల్సి ఉంది. కనబడని దైవాన్ని నమ్ముదామా? దైవం పేరుతో దైవత్వం పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసే ఘరానా మోసగాళ్ళను నమ్ముదామా? లేక వారి భరతం పట్టి, నోరు మూయిద్దామా? ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రచయిత గోపీచంద్ తండ్రిగారు నాటి ప్రముఖ రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి, నటులు అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్ వంటి లక్షల మంది నిర్ణయం తీసుకున్నారు. వారు దైవాల్నీ, దైవాంశసంభూతుల్ని నమ్మలేదు. మరి వారు, వారి వారి రంగాలలో అత్యున్నత శిఖరాలు చేరుకోలేదా?

Also read: రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

2009లో ‘హేతువాదాన్ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలకు ఓటు వేయవద్దని’- కాథలిక్ బిషప్ కౌన్సిల్ లో ఒక ఉత్తర్వు జారీ అయ్యింది. అలాంటిదే 2010లో కూడా వెలువడింది. 10 మార్చి 2012న సనల్ ఎడ్మరు విల్లిపార్లే – మోసాన్ని బట్టబయలు చేశాడు. క్రీస్తు విగ్రహం ఏడవడం ఒక బూటకమని, అది – డ్రైనేజ్ సమస్యవల్ల విగ్రహం నుండి నీరు కారిందని రుజువు చేశాడు. టీ.వీ. చర్చలో అదే చెప్పాడు. వాస్తవాల్ని అంగీకరించకుండా కొందరు ఆయనపై పోలీసు కేసు నమోదు చేయించి, ఇబ్బందులకు గురి చేశారు. మతమౌఢ్యం వదిలించుకోలేనివారు అంతకన్నా ఏం చేయగలరు? ఏ కేసూ నిలువ లేదు. ఇటీవలి కాలంలో కూడా హేతువాదులపై అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం బలిసిపోయవడానికి కారణమేమిటీ – అని ఆలోచిస్తే – వచ్చే సమాధానం మతమౌఢ్యం కదా? ఒక మతసామ్రాజ్యాన్ని స్థాపించడానికి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. ఇతర మతాలపై ద్వేషం కక్కుతున్నారు. ద్వేషం కక్కడంలో ఏ మతంవారికీ మినహాయింపు లేదు. మతాన్నీ, కులాన్నీ, ప్రాంతాన్నీ పణంగా పెట్టి, రాజకీయాలు చేస్తూ బతికేవాళ్ళు మన కళ్ళముందే ఉన్నారు. మనం గుర్తించడమే తరువాయి. ఇలాంటి విషయాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అయితే, తక్షణం చేయాల్సిన కర్తవ్యమేమిటంటే, మతం లేని   మాన్యుల్ని గుర్తించుకోవడం, గౌరవించుకోవడం, వారిని ఆదర్శంగా తీసుకుని, వారి  వారి పరిధుల్లో ముందుకు పోవడం – అయితే దైవత్వం గురించి మాట్లాడేవారు మాత్రం, దయచేసి మానవుడి విజయాల ఫలితాలను అనుభవించకుండా బయటికి వచ్చి, వారేమిటో వారు నిరూపించుకోవాల్సి ఉంది.  

Also read: మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles