Friday, March 29, 2024

రామచంద్రుని వ్యధాభరితమైన క్రోధావేశం

రామాయణమ్ 87

‘‘సీత ఎక్కడ ఉన్నది?’’ సకల భూతములనూ, నదులనూ, పర్వతాలనూ ప్రశ్నిస్తూ పిచ్చివాడివలే తిరుగుతున్నాడు రాఘవుడు.

‘సీత ఎక్కడ ఉన్నది’ అన్నప్రశ్న వినగానే మృగములన్నీ ముట్టెలెత్తి దక్షిణ దిక్కును సూచిస్తూ, ఆకాశము వైపు తలెత్తి చూపించి అటుగా పరుగులెత్తినవి.

ఆ మృగహృదయాలను అర్ధము చేసుకొన్న లక్ష్మణుడు ‘‘అన్నా, మృగములన్నీ కూడా దక్షిణదిక్కును సూచిస్తున్నాయి. కావున అటువైపు వెళ్ళి వెదుకుదాము పద’’ అని అటువైపుగా నడక సాగించారు.

Also read: సీతమ్మకోసం రామలక్ష్మణుల వెదుకులాట

ఇరువురూ నేలను పరిశీలనగా చూస్తూ నడుస్తున్నారు. దారిలో రాలినపూవులు కనపడ్డాయి. అవి ఆ రోజు సీతాదేవి కొప్పున ముడిచిన పూలే అని రాముడు గుర్తుపట్టాడు.

‘‘ఓ పర్వతమా, నా సీత జాడ చెప్పుము, లేనిచో ఇదిగో ఈ శరాలు నిన్ను చూర్ణం గావిస్తాయి!

‘‘ఓ నదీనదాలలారా, నా సీత ఎక్కడ? జవాబీయరేమి? ఇవిగో ఈ నిశిత శరాలు మీ నీరు ఆవిరి చేసి మిమ్ములను శాశ్వతముగా ఎండిపోయేటట్లు చేస్తాయి.’’

అని బిగ్గరగా అరుస్తూ ఉన్మాదియై నడుస్తున్న రామునకు హఠాత్తగా భూమి మీద ఒక పెద్ద కాలి అడుగు దాని వెంట సీత కాలి అడుగు, ఆవిడ అడుగులు, వాటి వెంట అతిపెద్ద కాలి అడుగులు వెంబడించి పరుగెత్తినప్పుడు ఏ విధముగా అడుగుల ముద్రలుంటాయో ఆ విధముగా కనపడ్డాయి.

Also read: సీత క్షేమమేనా? రాముడిని మనసు అడుగుతున్న ప్రశ్న

ఇంకొకవైపు విరిగిన ధనుస్సు ముక్కలు, ధ్వంసమైన రధపు విడిభాగాలు సీతాదేవి అలంకారాలనుండి చిన్నచిన్న బంగారు ముక్కలు చెల్లాచెదురుగా కనపడ్డాయి. ఒక్కసారిగా రాముడి హృదయం గతితప్పింది.

ఆయనకు అక్కడక్కడా రక్తపు చుక్కలు కనపడ్డాయి, అవి చూసి, ‘‘లక్ష్మణా ఇవి నిశ్చయముగా మీ వొదినను రాక్షసులు భక్షించినారు అనుటకు చిహ్నాలు సుమా’’ అని మరల బిగ్గరగా రోదించసాగాడు.

మరల చూపు సారించాడు. ఒకచోట భయంకరమైన పిశాచరూపముగల గాడిదలు చంపబడి ఉన్నాయి. అవి ఎవరివి?  అని మరల పరిశీలనగా చూడసాగాడు రాముడు. అక్కడ పడి ఉన్న రధమును మరికాస్త వివరముగా చూడసాగాడు. అక్కడ ఏదో భయంకరమైన యుద్ధము జరిగిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి.

Also read: సీతమ్మకు గడువిచ్చి అశోకవనమునకు తరలించిన రావణుడు

‘‘లక్ష్మణా, ఇదుగో ఇటుచూడు. వీరెవరో మహారాజుకు చామరగ్రాహుల వలే ఉన్నారు. వీరిచ్చట చచ్చి పడియున్నారు.

ఇదుగో ఇక్కడ ఇతని చేతిలో కొరడా, కళ్ళాలను ధరించి ఉన్నాడు. బహుశా ఇతను సారధి అయి ఉండవచ్చును. ఇది ఎవ్వడో పురుషుడైన రాక్షసుడు ఈ మార్గములో సంచరించినాడని తెలియచేయుచున్నది.

ఇది నా జీవితానికే ముప్పు తెచ్చినది చూడు.

‘‘లక్ష్మణా అసలు నాకే ఇలా ఎందుకు జరగాలి? నేను అనుసరించే ధర్మము నా సీతను కాపాడలేకపోయిందా? ఏ దేవతలు ప్రియము చేయగలరు? ఇది తీరని నష్టము కదా.

‘‘లక్ష్మణా, దయ, కరుణ అనే లక్షణాలున్న వానిని చూసి అతనెంత వీరుడైనా, శూరుడైనా, ఈ లోకాలను సృష్టించగల సమర్దుడైనా  గానీ అందరూ తమతమ అజ్ఞానము వలన అతనిని అవమానిస్తారు. నేను ఎవరికీ ఏ హానీ తలపెట్టక మెత్తగా యుండుట వలన దేవతలు నన్ను పరాక్రమ శూన్యమైనవాడని తలస్తున్నట్లుగా ఉన్నది.

‘‘లక్ష్మణా, నాలోని గుణములుకూడా ఎలా దోషములుగా మారినవోకదా.

ఇదుగో ఈ క్షణమునుండీ యక్ష, గంధర్వ, పన్నగ, పిశాచ, రాక్షస, కింనర, మానవులలో ఎవరినీ ఈ పుడమి మీద ప్రశాంతముగా ఉండనివ్వను.

Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత

‘‘గ్రహగతులు నిలిచిపోవునట్లు, చంద్రుడుఉదయించకుండునట్లు, అగ్ని, వాయువు, సూర్యుడు తమతమ తేజస్సులను ఉపసంహరించుకునే విధముగా చేసెదను. సరస్సులు, సముద్రాలు, లతలు, పొదలు ఎండిపోవునట్లు చేసెదను. ముల్లోకాలలో ప్రళయము సృష్టించెదను. దేవతలు సీతను నాకు క్షేమముగా అప్పగించనిచో ఇక ప్రళయమే.  నా ధనుర్విముక్త శరాలు ఆకాశాన్ని కప్పివేస్తాయి. జలనిధులను ఇంకింపచేస్తాయి. పర్వతాలను చూర్ణము గావిస్తాయి. నా సీత నాకు దక్కని ఎడల ముల్లోకాలలో ప్రశాంతముగా ఏ ప్రాణీ తన మనుగడ సాగించలేదు. ఇది  తధ్యము, తధ్యము, తధ్యము.’’

అని తన కోపాన్ని తీవ్రంగా వెలిగక్కుతూ, అరుణిమ దాల్చిన నేత్రాలు  విస్ఫులింగాలు వెదజల్లతుండగా  క్రోధమూర్తి అయినాడు సీతావియోగ పీడితుడు రఘుకుల తిలకుడు జానకిరాముడు.

Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles