Saturday, October 16, 2021

విలువల కొమ్మకు విరబూసిన పూలు

రచన: డాక్టర్ గోవిందరాజు చక్రధర్

కె. రామచంద్రమూర్తికి గోరాశాస్త్రి పురస్కారం

గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు సుప్రసిద్ధ సంపాదకులు కె. రామచంద్రమూర్తి. నవసాహితీ ఇంటర్నేషనల్ గోరాశాస్త్రి కుంటుంబ సభ్యులు 2021 అక్టోబర్ 10వ తేదీన నిర్వహించిన సభలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గోరాశాస్త్రి, కె. రామచంద్రమూర్తి సాగించిన జర్నలిజం ప్రస్థానాలలోని సారూప్యతలపై గోవిందరాజు చక్రధర్ ప్రసంగ పాఠం.)

కాలాల్లో కొంచెం వెనకా ముందూ కావచ్చు. కానీ వారిద్దరి లక్ష్యాలు మాత్రం ఒకటే. విశాల ప్రజాహితానికి జర్నలిజం సోపానంగా నిలవాలన్నదే వారి అభిమతం, ఆకాంక్ష. అందుకు తగ్గట్లుగానే అడుగులు ముందుకు వేశారు.

గోవిందు రామశాస్త్రి, కొండుభట్ల రామచంద్రమూర్తి వృత్తి జీవితాలను తరచి చూసినప్పుడు కన్పించే సారూప్యతలు ఎన్నో. అవి అబ్బురపరుస్తాయి.

వారిద్దరూ అనుకోని పరిస్థితుల్లో జర్నలిజంలోకి ప్రవేశించారు. గోరాశాస్త్రి ఖుర్దారోడ్ రైల్వేస్టేషన్ లో ఎ.ఎస్.ఎమ్ గా పని చేస్తుండేవారు. ఆ వృత్తి ఆయనకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. ఈ అసంతృప్తే భద్రమైన రైల్వే ఉద్యోగం నుంచి తప్పుకునేలా చేసి సుదీర్ఘ అక్షరయాత్ర వైపు గోరాశాస్త్రిని మళ్ళేలా చేసింది.

గోరాశాస్త్రి మాదిరే కె.ఆర్.మూర్తికి కూడా ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా భద్రమైన ఉద్యోగం. అయితే, ముక్కుసూటి మనస్తత్వం, రాజీపడలేనితత్వం కుదురుగా ఉండనివ్వలేదు. ఆర్టీసీ ఉద్యోగంలో ఇమడలేక మనసుకు నచ్చిన జర్నలిజం వైపు దృష్టి మళ్ళించారు. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజం కోర్సులో చేరి సుశిక్షితులై పత్రికారంగాన సుదీర్ఘప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

అలా ఆంధ్రప్రభ ద్వారా తొలి అడుగు పడింది. గోరాశాస్త్రికి కూడా ఆంధ్రప్రభ అనుబంధం ఉంది. కొంతకాలం ఆంధ్రప్రభ స్పెషల్ కరెస్పాండెంట్ గా ఆయన పని చేశారు. మూర్తి కూడా గోరాశాస్త్రి మాదిరే కొంతకాలం ఆంధ్రజ్యోతి దిల్లీ బ్యూరో చీఫ్ గా పని చేయడం విశేషం.

వినాయకుడి వీణ, గోరాశాస్త్రి

వీరిద్దరికీ తెలుగు, ఇంగ్లీషు భాషలు రెంటిలో సమానమైనప ప్రవేశమూ, పట్టు, రచనా నైపుణ్యాలు ఉండటం చెప్పుకోదగిన మరో ప్రత్యేకత. గోరాశాస్త్రి ఇటు ఆంధ్రభూమికి,  అటు దక్కన్ క్రానికల్ కు రెండు భాషల్లో వేర్వేరు అంశాలపై సంపాదకీయాలు రాస్తుండేవారు. మూర్తికి ఇలా ఏక కాలంలో రెండు భాషల్లో రాసే అవకాశం రాలేదు కానీ తెలుగు పత్రికలను ఎడిట్ చేసిన ఆయనే ‘ద హన్స్ ఇండియా’ ఎడిటర్ గానూ రాణించారు. ఆంధ్రాంగ్లాల్లో ఎడిటోరియల్స్ రాశారు. ‘రూరల్ రిపోర్టింగ్ నెట్ వర్క్’ పై పరిశోధన చేసి ఇంగ్లీషులో సాధికారికమైన పీహెచ్ డి గ్రంథం రాశారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు జీవితంపై ఇంగ్లీషులో మరో పుస్తకం వెలువడనుంది.

పత్రికారచయితలు, సృజనాత్మక రచయితలు కూడా అయితే ఎన్నో అద్భుతాలు చేయడ్చుననడానికి వీరిద్దరి రచనా వ్యాసంగాలే నిదర్శనం. గోరాశాస్త్రి సంపాదకుడుగా ఎంత ప్రతిభ చూపారో కాలమిస్టుగా, కథకుడిగా, దృశ్య, శ్రవ్య నాటకకర్తగా కూడా అంతే ప్రతిభ చూపారు. ‘వినాయకుడి వీణ’ ఆయన ప్రసిద్ధ కాలమ్. తొలుత ‘ఆనందవాణి’లో మొదలుపెట్టి ఆ తర్వాత తెలుగుస్వతంత్రలో ఈ కాలమ్ కొనసాగించారు.

రామచంద్రమూర్తి కూడా కొన్ని దశాబ్దాలపాటు వారంవారం కాలమ్ లు రాశారు. క్రీడారంగంతో మంచి పరిచయం ఉన్న ఆయన ‘క్రీడాభారతం’ పేరుతో జాతీయ క్రీడాదృశ్యాన్ని ఆవిష్కరించారు. ‘సరదాలపరదా’ పేరుతో వ్యంగ్య, హాస్య రచనలు చేశారు. జర్నలిజం వృత్తికి సంబంధించి ‘అమీబా’ నవలను, ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడి నేపథ్యంలో మరో నవలనూ (కాలమేఘం) రాశారు. కొన్ని కథలు చెక్కారు.

వార్త, వ్యాసం, వార్తావ్యాఖ్య, కాలమ్, కథ, నవల – ఇలా ఏది రాసినా ఇద్దరూ పాఠకుడి నాడి పట్టుకోగలిగారు.  వారిని ఆకట్టుకునేలా, వాక్యాలదారుల వెంట పరుగులు తీయించేలా రాసి మెప్పించారు. జటిలమైన విషయాలను సైతం అరటిపండు వలిచి పెట్టనట్టుగా, సులభంగా చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే. ఎవరూ మరెవరికీ తీసిపోరు.

ఇద్దరిలోనూ సమానంగా కనిపించే మరో వ్యక్తిగత లక్షణం సెన్సాఫ్ హ్యూమర్. మాటల నుంచి, సంభాషణల నుంచి చమత్కారబాణాలు సంధించగల నేర్పరులు వీరు.

తను నడిచివచ్చిన దారులను గోరాశాస్త్రి మరువలేదు. తనను సాహిత్యపరంగా మిత్రులు ప్రోత్సహించినట్లే తాను ఎంతో మంది కవులనూ, రచయితలనూ ప్రోత్సహించారు. సుప్రసిద్ధులైన మేటి రచయితలు చాలామంది తొలిసారి తెలుగు స్వతంత్ర పుటలలోనే ఉదయించారు. ఆరద్ర ‘త్వమేవాహం,’ ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు,’ చలం ‘మ్యూజింగ్స్,’ శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మొదటగా స్వతంత్రలోనే వెలుగు చూశాయి. శ్రీశ్రీ ప్రాసక్రీడలు, కొడవటిగంటి కుటుంబరావు సినిమా సమీక్షలు కూడా స్వతంత్రలోనే మొదటగా ప్రచురితమయ్యాయి. గోరాశాస్త్రి నివాసం నిత్యం సాహిత్య గోష్ఠులకు కేంద్రంగా అలరారింది.

అదే స్ఫూర్తిని రామచంద్రమూర్తి కూడా పుణికి పుచ్చుకున్నారు. రచయితలు, జర్నలిస్టులతో నిరంతరం స్నేహబంధాలను కొనసాగిస్తున్నారు. తాను ఏ పత్రికలో పని చేస్తే ఆ పత్రికలో వారి చేత పట్టుబట్టి రాయించారు. ప్రసిద్ధ జర్నలిస్టు జి. కృష్ణ ‘ఉదయం’లో కాలమ్ రాయడానికి రామచంద్రమూర్తి ప్రోద్బలమే కారణం. తుర్లపాటి కుటుంబరావు, శ్రీరమణ, గొల్లపూడి మారుతీరావు, అండవల్లి సత్యనారాయణ వంటివారు కూడా మూర్తితో ఉన్న స్నేహసంబంధాల వల్లనే ఆయన పనిచేసే పత్రికలలో కాలమ్స్ కొనసాగించారు. మూర్తి హెచ్ఎంటీవీకి సారథ్యం వహించినప్పుడు గొల్లపూడి మారుతీరావు ద్వారా వందేళ్ళ కథకు వందనం శీర్షికన ఆణిముత్యాల వంటి తెలుగు కథలను పరిచయం చేయించారు. ఈ కథా పరిచయాలు తర్వాత పుస్తకరూపం తొడిగాయి.

జర్నలిజంలో తనకంటే సీనియర్లు అయిన జి. కృష్ణ, ఉప్పులూరి కాళిదాసు, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటివారితో ఎంతో గౌరవాభిమానాలతో మెలిగేవారు. తనకంటే జూనియర్లయిన కె. శ్రీనివాస్, మాశర్మ, మల్లెపల్లి లక్ష్మయ్య వంటివారితోనూ అంతే అపేక్షగా స్నేహశీలంగా కొనసాగుతున్నారు. మూర్తితో కబుర్లు కలబోసుకోవడం కోసమే ప్రసిద్ధులనేకమంది ఆయన ఆఫీసుకు వస్తుండేవారు. అలాంటివారిలో ఉప్పులూరి కాళిదాసు ఒకరు. ఆరడుగుల పొడవుతో, చేతిలో సూట్ కేసుతో, దబ్బపండు ఛాయతో మూర్తి కార్యాలయంలో అప్పుడప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యేవారు. ఆయన తన పత్రిక ‘ఆనందవాణి’లోనే తొలుత గోరాశాస్త్రి వినాయకుడి వీణను ప్రచురించి ప్రోత్సహించారు. అలాంటి కాళిదాసుగారిని  మూర్తి ప్రోద్బలంతో ‘ఉదయం’ కోసం ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం నాకు లభించింది.

గోరాశాస్త్రి, రామచంద్రమూర్తి – వీరిద్దరూ ప్రయోగశీలురే. గోరాశాస్త్రి, భాణాలు అనే ప్రక్రియను ప్రవేశపెట్టి అందులోనూ రచనలు చేశారు. అలాగే హెచ్ ఎంటీవీలో మూర్తి ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు మీడియాలో ఆంబుడ్స్ మన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. తీర్పరి పేరిట జి.యస్. వరదాచారిగారి సేవలను పొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాల ప్రజల వాదనలనూ, మనోభావాలనూ వెలికితీస్తూ ‘‘ఆంధ్రప్రదేశ్ దశ-దిశ’’ పేరుతో ధైర్యంగా చర్చాకార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇంతటి సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంలో ఇద్దరూ ఏదో ఒక దశలో ఒడిదుడుకులు చవిచూడక తప్పలేదు. ఖాసా సుబ్బారావు మరణించాక స్వతంత్ర ప్రచురణ నిలిచిపోయింది. ఆ తర్వాత గోరాశాస్త్రి మద్రాసు నుంచి సికింద్రాబాద్ కు మకాం మార్చి డాక్టర్ పి. శ్రీదేవి సహకారంతో తెలుగు స్వతంత్రను వెలువరించారు. ఈ కాలంలో ఆయన ఇబ్బందులు చవిచూశారు.

ఉదయంలో ఉన్నప్పుడు మూర్తి కూడా ఒక దశలో ఉద్యోగపరంగా సంక్షోభాన్ని ఎదుర్కొని పత్రిక నుంచి బయటకు  రావలసి వచ్చింది. అయితే వారిద్దరూ అడ్డంకులెదురైనా ప్రయాణం మాత్రం ఆపలేదు. ఒక వ్యక్తి ఒక రంగానికి అంకితమై ఎంతకాలంపాటు సేవలందించారన్నదాన్ని బట్టే వారి కృషిని అంచనా వేయవీలుంది. ఆటుపోట్లు అధిగమిస్తూ నిర్విరామంగా జర్నలిజానికే అంకితమై కొనసాగడం వారి అంకితభావానికీ, దీక్షకూ సంకేతం.

గోరాశాస్త్రి మాదిరే విలువల విషయంలో రాజీపడని మూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవిలో ఇమడలేక, మధ్యలోనే రాజీనామా చేసి బయటకు వచ్చారు. గోరాశాస్త్రికి తన సమకాలికుల్లో ఎంతో గౌరవం ఉన్నట్లే, మూర్తికి కూడా తెలుగు మీడియాలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజి ఉంది. సమర్థుడిగా, మృదుభాషిగా, అందరినీ కలుపుకుని వెళ్ళే సారథిగా ఆయనకు మంచి పేరుంది.

గోరాశాస్త్రి పురస్కారాన్ని అందుకున్న మూర్తిగారిని మనసారా అభినందిస్తున్నాను.

ముక్తాయింపు: సాహిత్య అకాడెమీకోసం గోరాశాస్త్రిపై మోనోగ్రాఫ్ రాశాను. ఆ స్క్రిప్టును అకాడెమీవారు రామచంద్రమూర్తికి పంపి నిగ్గుతేల్చమన్నారు. ఆయన చదివి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ రకంగా ఆ మోనోగ్రాఫ్ మా ముగ్గురినీ కలిపిన బంధమైంది.

Related Articles

2 COMMENTS

  1. Elated much to note the contente ,I totally heard Sri.Govindrajula Speach and the comparativestatement of resemblance between Sri ,Ramasastry and you ,you’re deserving person to be honered I felt happy and my respect and love always with you Dear Ramachandramurthy.

  2. Dear Ramachandra Murthy garu…felt happy on your well deserving award 👏 👍. You richly deserve it. May the Veda Purusha shower his grace and blessing on you for many more inspiring achievements in life

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles