Wednesday, September 18, 2024

ఒంటిమిట్ట రామాలయ ప్రాశస్త్యం

  • ఆంధ్రవాల్మీకి పుణ్యవిశేషం
  • పోతన ఇక్కడే నివసించాడనే వివాదం సశేషం
  • భద్రాచలం తెలంగాణలో ఉన్నందున ఒంటిమిట్టకు పెరిగిన వైభవం

ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం ‘శ్రీరామనవమి’ వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వ లాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది మంచి పరిణామం.’భద్రాచలం’ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ప్రారంభమైంది. ఈ తీర్థం గురించి తెలియనివారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Also read: అపూర్వ రాజకీయ విన్యాసం

ఆంధ్రవాల్మీకి అనుగ్రహం

andhra-valmiki-vavikolanu-subbarao – తెలుగునాడు
ఆంధ్రవాల్మీకి బిరుదాంకితుడు వావికొలను సుబ్బారావు

ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు,దోపిళ్ళు, దొంగతనాలు, దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒకే ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి,అనన్య సామాన్యమైన సేవలు మూలస్థంభాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా,ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో… ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! ‘వాసుదాసు -ఒంటిమిట్ట’ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు ‘ఏకశిలా నగరం’ అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడివాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు,కొందరు ఆ వాదంతో అంగీకరించ లేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు.”పోతన్నది ఒంటిమిట్ట” అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం.ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలవడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం ‘ఏకశిలా నగరం’గా ఖ్యాతికెక్కింది.

Also read: చిన్న జిల్లాలతో పాలనాసౌలభ్యం

సీతారాముల పక్కన ఆంజనేయస్వామి లేని విగ్రహం ఇక్కడే

Vontimitta temple Brahmotsavams from April 10- The New Indian Express
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించిన వేళ

రామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవక ముందుకాలంలో  ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు, శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో  స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్  ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే ‘అష్ట దిగ్గజ కవులు’లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో, దేవాలయ పునరుద్దీపనలో ప్రధానభూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను  పోషించాడు. వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని పద్యాలలో ‘మందరం’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. ఒంటిమిట్ట కోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవిపండితులు ‘ఆంధ్రవాల్మీకి’ బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది.

Also read: చిన్న జిల్లాలతో పాలనాసౌలభ్యం

అనంతకాలం అలరారుతుందని ఆశిద్దాం

Vontimitta temple set for Rama Navami | Vijayawada News - Times of India
శ్రీరామనవమికి సన్నాహాలు చేస్తున్న ఒంటిమిట్ట రామాలయ నిర్వాహకులు

ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు, జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు, సంపదలు దోపిడీకి, దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని, దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. “నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా ” అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా… వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు.  తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ‘ఒంటిమిట్ట’ కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామ నవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు, సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం , ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం.

Also read: కష్టాల కడలిలో శ్రీలంక

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles