Sunday, December 3, 2023

మాయాసీత మరణవార్త విని కుప్పకూలిన రాముడు

రామాయణమ్ 202

‘‘రామా,  మేము చూచుచుండగనే ఇంద్రజిత్తు సీతమ్మను చంపివేసినాడు. ఇక ఎందులకీ యుద్ధము అని కొనసాగించలేక మేము నీవద్దకు వచ్చినాము’’ అని హనుమ పలికిన పలుకులు విని మొదలు నరికిన చెట్టు వలే రాఘవుడు నేల కూలినాడు.

వెంటనే వానరులు రామునకు సకల ఉపచారములు చేసిరి. రాముని ధైర్యమంతయూ సీత మరణించినది అను వార్త వినినంతనే నశించిపోయినది. ఉన్నవాడు ఉన్నట్లుగా అన్నీవదిలివేసి చతికిలపడి పోయినాడు. రాముని ఈ స్థితి చూసి లక్ష్మణునకు ధర్మమనిన ఏవగింపుకలిగినది.

Also read: మాయాసీతతో రణరంగానికి వచ్చిన ఇంద్రజిత్తు

లక్ష్మణునకు మనసు చెడి ‘‘ధర్మమేమిటి అధర్మమేమిటి? ధర్మాచరణము కావించిన వానికి ఇన్ని కష్టములేటికి? ఏ ధర్మము కాపాడుచున్నది రామా నిన్ను? నీవు చక్కగా ఆచరించని ధర్మమే లేదు కదా? అభ్యుదయము కలిగించని ధర్మమెందులకు? ఏ మాత్రము అతిక్రమించకుండా ధర్మాచరణగావించు నీకే ఫలితము దక్కనినాడు ఇంక ఈ ధర్మాచరణమెందులకు? అధర్మి అయిన రావణుడు సుఖించుటయా? ధర్మాచరణమున రవ్వంత కూడా విశ్రమించని నీకు దుఃఖములా?

‘‘కనుక రామా, ధర్మములేదు అధర్మము లేదు. అసలు సకల ధర్మములకు సంపదలే మూలము. కొండలు లేక నదులు ఏల ఉండవో అదేవిధముగా సంపదలు లేక కర్మాచరణమే లేదు! ధనము మిత్రులను తెచ్చును. ధనము బంధువులను తెచ్చును. ధనమున్నవాడినే పౌరుషమున్నవాడందురు. ధనమున్నవాడినే శక్తిమంతుడందురు. ధనమున్న వాడే మహాపండితుడు. ధనమున్న వాడినే గుణమున్నవాడందురు. ధనమున్న వాడినే గుణవంతుడందురు…..రామా! జగదేకవీరుడవు. రాజ్యమును వదలి, సకల సంపదలు త్యజించి కట్టుబట్టలతో అడవికి వచ్చి ధర్మాచరణమనుచూ ఏల కష్టాలు పడెదవు. ధర్మము ఆచరించువాడు సుఖపడడు అని నిన్ను చూసిన వారెవరికయినా తేటతెల్లమగును ….

Also read: మరోసారి లంకాదహనం

‘‘రామా, తండ్రిమాట మీద అడవులకు వచ్చి ప్రియసతిని పోగొట్టుకొని చివరకు ఆమె హతురాలయినదన్న వార్త విన్న తరువాత కూడా  ఆ రాక్షసాధముల పీచమణచవలెనని రుద్రుని వలే లేవవేమి? ఒక్కొక్కరినీ ఏరిఏరి హతమార్చవలే. ఇంకా అలాగే ఎందుకు కూర్చుంటావు? నరశార్దూలా,  లే! లే! లంకను నీ బాణాగ్నిలో భస్మీపటలము చేసివేయి…..’’అని లక్ష్మణుడు ఏమేమో మాటలాడుచుండగా అక్కడికి అప్పుడే విభీషణుడేతెంచెను.

….

నల్లని కాటుక పోగుల వంటి ఆకారములు గల నలుగురు భటులను వెంట పెట్టుకొని విభీషణుడు రామలక్ష్మణులు ఉన్నచోటికి వచ్చెను. ఆయనకు శోకాక్రాంతుడై లక్ష్మణుని ఒడిలో పడుకొన్న రాముడు, కంటినిండా నీరు నింపుకొని దైన్యముతో ఉన్న వానరులు కనుపించిరి.

‘‘ఏమి జరిగినది? ఇది ఏమి?’’ అని రాముని ప్రశ్నించిన విభీషణుని చూసి లక్ష్మణుడు కన్నీరు కార్చుచూ, ‘‘సీతాదేవి ని ఇంద్రజిత్తు చంపివేసినాడు’’ అని హనుమ తెలిపిన విషయాన్ని గురించి చెప్పినాడు.

Also read: ఇంద్రజిత్తు మయాయుద్ధతంత్రం

ఆ మాటలు మధ్యలోనే ఆపివేసి, ‘‘ఓ రామా, సముద్రము ఎండిపోయినది అని హనుమ చెప్పినచో నమ్ముదువా.  ఇదియునూ అంతే. సీతాదేవి విషయములో రావణుని ప్రవర్తన ఎటులుండునో నాకు పూర్తిగా తెలియును. అతడు ఆమెకు ఎట్టి హాని తలపెట్టడు!

‘‘ఇంద్రజిత్తు మాయావి. మిమ్ములనందరినీ మోహింపచేసి నాడు. వాడు చంపినది మాయాసీతను. మిమ్ములను ప్రక్కదోవపట్టించి అతడు నికుంభిల ఆలయములో హోమము చేసి సకల శక్తులు కూడగట్టుకొనుటకు పన్నిన పన్నాగమిది. అతడి హోమము అయిపోయెనా ! వాడిని ఎదిరించు శక్తి ముల్లోకములలో ఎవడి వద్దా యుండదు. రామా దైన్యము వీడుము. నేనూ లక్ష్మణుడూ కలిసి వెళ్ళి  ఇంద్రజిత్తు హోమము భగ్నము చేసి వేసెదము.  అప్పుడు గానీ అతడు హతుడుగాడు. ఇక ఆలస్యము వలదు రామా. ఇది అతిశీఘ్రమే చేయవలసిన కార్యము.’’

శోకముతో నిండిన హృదయముతో ఉన్న రామునకు మొదట అర్ధము కాలేదు. అందువలన మరల విభీషణుడు చెప్పవలసి వచ్చెను.

‘‘రామా, ఇంద్రజిత్తు గొప్ప శస్త్రాస్త్రవేత్త.  బ్రహ్మను మెప్పించి బ్రహ్మశిరస్సు అను అస్త్రమును కూడా సంపాదించినాడు. అతడు హోమము నికుంభిలలో పూర్తి చేసి లేచెనా మనమందరమూ మరణించి నట్లే. కావున పెద్ద సైన్యముతో లక్ష్మణుని నా వెంట పంపుము ….పైగా అతనితో బ్రహ్మదేవుడొకసారి ఇలా అన్నాడు ,”ఓ ఇంద్రజిత్తూ నీవు నికుంభిల చేరకముందు, చేరిన తరువాత అగ్నిలో హోమము చేయుటకు ముందు ఏ శత్రువు నిన్ను ఆయుధముతో  ఎదిరించునో అతడే నీకు మారకుడు.” కావున మహాబాహో లక్ష్మణుని నాతో పంపుము …..’’

Also read: అతికాయుని యమపురకి పంపిన రామానుజుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles