Thursday, April 18, 2024

మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

రామాయణమ్27

లక్ష్మణుడి వీరాలాపములు విని ధైర్యము తెచ్చుకొన్న కౌసల్యాదేవి రామునితో….

 ‘‘నాయనా! లక్ష్మణుని మాటలు విన్నావుగా. నీకిష్టమయినచో ఈ విషయమున చేయదగిన పనులు చేయి’’ అని పలికింది.

‘‘నా సవతి మాటలు ధర్మవిరుద్ధము, న్యాయవిరుద్ధము! ఆ మాటలు పట్టుకొని నీవు నన్ను వదలి అడవుల పాలవుతావా నాయనా! వద్దు, వద్దు. నీవిచ్చటనే నాకు శుశ్రూష చేస్తూ ఉండు! నీవు అరణ్యమునకు వెళ్ళుటకు నా అనుమతి నీకు లేదు. నీవు వెళ్ళినచో నాకు ప్రాణత్యాగమే శరణ్యము.’’ దీనంగా పలుకుతున్న తల్లిని చూసి రాముడు  ‘‘అమ్మా! తండ్రి ఆజ్ఞను ధిక్కరించే సాహసము నేను చేయలేను. అంత సామర్ధ్యమూ నాకు లేదు! అమ్మా నా తండ్రి  ఆజ్ఞ నాకు శిరోధార్యము. అదే నా వ్రతము.  తండ్రి ఆజ్ఞ పాటించిన వారెవరికీ ఎటువంటి దోషము కలుగదు’’ అని తల్లికి తెలిపి లక్ష్మణుని వైపు తిరిగి ‘‘లక్ష్మణా నీ బలము, తేజస్సు నేను ఎరుగుదును. అమ్మకు ధర్మము యొక్క రహస్యము తెలియక అంత బేల అయినది. లోకములో అన్నిటికన్నా శ్రేష్టమైనది ధర్మమే. ఆ ధర్మములోనే సత్యమున్నది. మన తండ్రి చెప్పిన వచనములన్నీ ధర్మాశ్రయములే. అందులో నిస్సంశయముగా ఏ దోషమూలేదు. నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమించజాలను. క్షత్రియధర్మములోని ఈ చెడు ఆలోచన నీవు విడువుము. క్రౌర్యము వలదు. ధర్మమును శరణువేడుము. నా ఆలోచనను అనుసరించుము’’ అని మృదువుగా పలికినాడు.

Also read:రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

రాముని వదనములో ఏ విధమయిన వ్యాకులత గానీ, తొట్రుపాటు గానీ లేవు. కేవలము ధర్మాచరణమే లక్ష్యముగా మాటలు చెపుతున్నాడు. రవ్వంత వికారము కూడా లేదు!

రాముడి వన గమనమునకు కౌసల్యాదేవి  అనుమతించటంలేదు. తల్లిని సమాధానపరచటం ఇప్పుడు ఆయన కర్తవ్యము. ‘‘అమ్మా! నీవు, నేను, లక్ష్మణుడు, సుమిత్రామాత అందరమూ తండ్రిగారి ఆజ్ఞకు బద్ధులము కావలసినదే. అది సనాతన ధర్మము.

(తండ్రి కుటుంబపు పెద్ద. He is Superior to all in the family,  కుటుంబ వ్యవస్థ క్షీణదశకు చేరుకున్న నేటి రోజులలో దాని ప్రాముఖ్యత ప్రస్తుతము అర్ధము కాదు అని నా భావన).

‘‘నాయనా! నీ తండ్రి వలే నేను కూడా నీకు గురు స్థానములో ఉన్నాను. కావున నీకు అనుజ్ఞ ఇవ్వను’’ అని పలుకుతున్న తల్లిని, ఆవిడకు అండగా నిలచిన లక్ష్మణుని చూసి రాముడు కొరివిమంటలు పట్టుకొన్న మనుష్యులచే అడవిలో చుట్టుముట్టబడ్డ గొప్ప ఏనుగు లాగ అయిపోయాడు. ఇంతగా వారిస్తున్నా ఆయన బుద్ది మాత్రము ఒకదానియందే స్థిరముగా ఉన్నది అదియే “ధర్మము”.

(ధర్మమార్గమునుండి రవ్వంతయినా ప్రక్కకు జరుగడు .నిశ్చయాత్మకమైన, నిర్ణయాత్మకమైన బుద్ధి ధర్మమునందేగలవాడు ఒక్కడే. అతడే “రాముడు.”)

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

తన బుద్ధి మారకుండా దృఢముగా నిలుచుని, స్థిరగంభీర కంఠముతో, లక్ష్మణా ఎందుకు నీవు అమ్మతో చేరి నన్ను బాధిస్తావు? కష్టపెడతావు? అర్ధము, కామము నాకు ముఖ్యము కావు. వాటికొరకు నాలో వెంపర్లాట లేదు.  ధర్మము పాటించడమే నాకు చాలా ఇష్టము. ధర్మపథము నాకిష్టమైన మార్గము. తండ్రి మనకు పూజ్యుడు, ఆయన వృద్ధుడు కావచ్చుగాక. కామప్రేరితుడు గావచ్చుగాక., ఆయన కోపముగానైనా, సంతోషముగానైనా ఆజ్ఞాపించినప్పుడు ధర్మదృష్టి కలవాడెవడైనా చేయకుండా ఉంటాడా? కేవలము రాజ్యము, భోగములకొరకు గొప్పగొప్ప ఫలితాలిచ్చే ధర్మమార్గము నేను వదలను గాక వదలను…

యశోహ్యహం కేవలరాజ్య కారణాత్

న పృష్ఠతః కర్తుమలం మహోదయమ

‘‘ఈ జీవితము అల్పకాలికమైనది దీనికోసం తుచ్ఛమైన రాజ్యము ధర్మవిరుద్ధముగా సంపాదించను గాక సంపాదించను ’’ అని అంటూ  శ్రీ రామసింహం ధర్మగర్జన చేసింది!

Also read: కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

..

NB.

ఇంకాసేపట్లో పట్టాభిషేకము. అంతలోనే ఇంత మార్పు! ఈ మార్ప ఎవరికి? మనకు! చూసేవారికి! ధర్మమార్గాన్ని అనుసరించే వారికి కాదు. ఏది ధర్మమో అదే వారి జీవన విధానము అందులో మార్పులేదు.

కానీ మనబోంట్లకు ఒక ఊహల అంతస్తునుండి జారిపోయిన భావన. ఏదో చేజారిందన్న బాధ. అంత త్వరగా మనకు మనము సర్దిచెప్పుకోగలమా? Can We shift our ego states?

ఆయన ego state ధర్మమే. ధర్మపథంలో నడవడమే ఆయనకు తెలిసినది!

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

గీతలో భగవానుడు చెప్పినట్లు విషయాలను ఊహించుకొని వాటిమీద మమకారం పెంచుకొని కామ ప్రేరితులమయి అదిదక్కక పోతే క్రోధం లోకి జారి మోహము కప్పివేసి స్మృతి నశించి బుద్ధి అణగారి సర్వనాశనానికి కారణమవుతాము.

ఇందుకు, కైకకానీ, లక్ష్మణుడు కానీ కౌసల్యకానీ, దశరధుడుకానీ అతీతము (exception) కాదు .

రాముడొక్కడే. అవును రాముడు ఒక్కడే. మర్యాదా పురుషోత్తముడు ఆయన ఒక్కడే!

Also read: కోపగృహంలో కైక, ప్రాధేయపడుతున్న దశరథుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles