Friday, March 29, 2024

ఏళ్లయినా మిస్టరీగా మిగిలిన రాజీవ్ గాంధీ హత్య

హత్యకు ముందు రాజీవ్, దోషిగా 30 ఏళ్ళు జైల్లో గడిపి విడుదలైన పెరైవాలన్

చలసాని నరేంద్ర 

  • ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు
  • అసలు హంతకులు ఇంతవరకూ దొరకనే లేదు
  • ఓ బాటరీ సరఫరా చేసిన వ్యక్తికి 30 ఏళ్ళు జైలు
  • హత్యోదంతం విచారణ సవ్యంగా సాగిందా?
Rajiv Gandhi 31st death anniversary: Congress leaders Sonia, Priyanka,  Rahul Gandhi pay homage to former PM | India News | Zee News
రాజీవ్ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తున్న సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీవద్రా

ఓ యువ ప్రధానిగా భారత్ ను 21వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లడం కోసం సాంకేతిక విప్లవానికి బీజం వేసిన రాజీవ్ గాంధీ దారుణమైన పరిస్థితులలో హత్యకు గురయి  31 ఏళ్ళు గడించింది. హత్యా సంఘటనపై పలు విచారణలు జరిపి, కొందరిని దోషులుగా నిర్ధారించి, వారికి న్యాయస్థానాలు శిక్షలు కూడా వేసినా ఇంకా హత్య జరిగిన తీరు ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 

వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. న్యాయస్థానాలు దోషులుగా తేల్చిన వారు కీలక నిందితులు కాదని అందరికి తెలుసు. మొన్ననే సుప్రీంకోర్టు విడుదల చేసిన వ్యక్తి కేవలం పేలుడుకు ఉపయోగించడం కోసం ఓ బాటరీ సరఫరా చేశారని 30 ఏళ్లపాటు జైలులో ఉండవలసి వచ్చింది. అసలు ఈ సంఘటనపై జరిగిన విచారణ తీరుతెన్నులు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. 

అక్కడ రాజీవ్ గాంధీపై హత్యా ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖులకు ముందే తెలుసా? అంత పెద్ద ప్రేలుడు సంఘటన జరిగి మృతి చెందిన వారిలో ఒక్క కాంగ్రెస్ నేత కూడా లేరు. అంతేకాదు, ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న శివరాజన్ ను తదుపరి బెంగళూరులోని ఓ ఇంట్లో సిట్ అధికారులు హతమార్చిన సమయంలో భారీగా భారత కరెన్సీ దొరికింది. 

నిజంగా శ్రీలంక తమిళ తీవ్రవాదులే హంతకులను పంపి ఉంటే అంత భారీ మొత్తంలో భారత కరెన్సీ వారి వద్ద ఉండే అవకాశం ఉండదు. అంటే మనదేశంలోని వారే ఆ నగదును సరఫరా చేసి ఉండవలసింది. ఆ నగదు ఎక్కడి నుండి వచ్చిందో విచారణ జరిపాలని స్వయంగా సుప్రీంకోర్టు కోరినా, రెండేళ్ల తర్వాత తాము కనుక్కోలేక పోయామని సిట్ నిస్సహాయతను వ్యక్తం చేసింది. 

రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపిన సిట్ కు నేతృత్వం వహించిన డి ఆర్ కార్తికేయన్ మరో దశాబ్దం తర్వాత గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నియమించిన సిట్ కు కూడా నేతృత్వం వహించారు. ఆ అల్లర్లలో నరేంద్ర మోదీకి సంబంధం లేదంటూ `క్లీన్ చిట్’ ఇచ్చారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో సహితం కీలక అంశాలను దారి తప్పించే ప్రయత్నం ఆయన చేశారా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేశారు. 

మరో ప్రధానమైన అంశం, రాజీవ్ గాంధీకి అంత దగ్గరగా వెళ్లి హంతకులు తమ పథకం అమలు జరపడానికి కారణం ఆయనకు భద్రతను తగ్గించడమే అన్నది స్పష్టం. ఆయనకు ఆ సమయంలో భద్రత తగ్గించడానికి ప్రధాన కారణం అప్పటి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి ఎం కె నారాయణన్. అయితే, ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే అటువంటి అధికారిని 2004లో యుపిఎ ప్రభుత్వం ఏర్పడగానే జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించారు. 

చిదంబరం కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న సమయంలో నారాయణన్ వ్యవహారం పట్ల అసహనం వ్యక్తం చేయగా, ఆయనను అక్కడి నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించారు. రాజీవ్ గాంధీ హత్యలో పరోక్షంగా బాధ్యత వహించవలసిన అధికారికి యుపిఎ హయాంలో అంత కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి కారణం ఏమిటి?

నేడు దేశంలో ఉదారవాద ఆర్ధిక విధానాలు అమలుకు కారకులుగా భావిస్తున్న పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి వారెవ్వరూ అంతకు ముందెన్నడూ ఆర్ధిక సంస్కరణల గురించి మాట్లాడినవారు కాదు. క్షీణిస్తున్న దేశ ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడానికి గత్యంతరం లేక ఆర్ధిక సంస్కరణలకు పాల్పడ్డారు. అయితే అందుకు అవసరమైన ఓ అజెండాను తయారు చేసింది రాజీవ్ గాంధీ కావడం గమనార్హం. 

ఆయన ప్రధానిగా ఉండగానే ఆర్ధిక సంస్కరణల పట్ల ఆసక్తి కనబరిచారు. అయితే, ఆయన మంత్రివర్గంలో పలువురు సీనియర్లు అందుకు విముఖంగా ఉన్నారని గ్రహించి, ఎన్నికల ముందు అటువంటి ప్రయోగం రాజకీయంగా ప్రమాదకారి కావచ్చని వెనుకడుగు వేశారు. 1989లో ఓటమి చెందడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. కానీ 1991 కాంగ్రెస్  ఎన్నికల ప్రణాళికలో ఆర్ధిక సంస్కరణల గురించి రాజీవ్ గాంధీ స్వయంగా ఓ పేజీ చేర్చారు. 

తిరిగి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఆర్ధిక సంస్కరణలను అమలు జరపాలని ఆయన అనుకున్నారు. ఆయన సిద్ధం చేసిన అజెండాను అనుసరించే పివి నరసింహారావు ఆర్ధిక సంస్కరణలకు బీజం వేశారు. వీటి అమలుకోసం ఐజె పటేల్ ను ఆర్ధిక మంత్రిగా చేరమని ఆహ్వానించారు. అయితే, అమెరికాలో స్థిరపడిన ఆయన ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ను ఆయన ఎంచుకున్నారు.

కేవలం ఎల్ టి టి ఇ ఉగ్రవాదుల కక్షసాధింపు పన్నాగాలు మాత్రమే కాకుండా ఆయన తిరిగి ప్రధానిగా ఎన్నికైతే భారత్ బలమైన ఆర్ధిక శక్తిగా మారుతుందని భయపడిన కొన్ని `అదృశ్య శక్తులు’ భారత దేశంలోని తమకు అనుకూలమైన వారి ద్వారా ఈ హత్య కుతంత్రంకు సహకరించినట్లు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారత దేశంలోని కొందరి సహాయసహకారాలు లేకుండా అంత బహిరంగంగా ఆయనను హతమార్చడం తేలికైన వ్యవహారం కాబోదు. 

(రాజీవ్ గాంధీ వర్థంతి మే 21)

(రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు)

Narendra Chalasani
Narendra Chalasani
రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles