Tuesday, September 10, 2024

పాదయాత్రను మించిన సకారాత్మక రాజకీయం లేదు

  • రాహుల్ యాత్ర ప్రారంభం
  • 118 మంది యాత్రికుల రాహుల్ తో నడక

రాహుల్ గాంధీ పాదయాత్ర ఒక చారిత్రక ఘటన. ప్రజల సంపర్కంతో సాగే యాత్ర విశేషమైనదే. ప్రజల నాడి తెలుసుకోవాలంటే వారిని కలుసుకొని వారు చెప్పేది వినడానికి మించిన మరో ఉత్తమమైన మార్గం లేదు. గాంధీజీ రైళ్ళలో యాత్ర చేశారు. వినోబాభావే పాదయాత్ర చేశారు. చంద్రశేఖర్ గ్రామాలలో, నగరాలలో పాదయాత్ర చేశారు. నగరాల పొలిమేరల వరకూ వాహనాలు వినియోగించారు. తెలుగు రాజకీయ నాయకులు మాత్రం అచ్చంగా పాదయాత్రలే చేశారు. వైఎస్ ఆర్ కావచ్చు, చంద్రబాబునాయుడు కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ మోహన్ రెడ్డి కావచ్చు. బండి సంజయ్,  రేవంత్ రెడ్డి కావచ్చు. ప్రజలలో యాత్ర మంచిదే. పాదయాత్రకు మించిన యాత్ర మరొకటి లేనేలేదు. అది అత్యుత్తమమైనది. ప్రజలతో మమేకం కావాలంటే అంతకు మించిన మార్గం లేదు.   

భారత్ లో ఇటువంటి సందర్భాలు లోడగ రెండు ఎదురైనాయి. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత గోపాల కృష్ణ గోఖలేని కలుసుకున్నాడు. అప్పుడు  దేశం 565 సంస్థనాలతో, బ్రిటిష్ పరిపాలనలోని అనేక ప్రాంతాలతో అస్తవ్యస్థగా ఉంది. ఇప్పటి లాగా సమైక్య భారతదేశం అప్పుడు లేదు. ‘ముందుగా దేశం అంతటా పర్యటించు. చెవులూ, కళ్ళూ తెరుచుకొని ఉండు. నోరు మాత్రం మూసుకో (“With eyes and ears open, but mouth shut”)  అంటూ గోఖలే సలహా ఇచ్చాడు. గోఖలే ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు తమ సమస్యలనూ, అనుభవాలనూ చెప్పుకొనే అవకాశం ఇవ్వాలనీ, వాళ్లకు ఉపన్యాసాలు అవసరం లేదనీ.  ముందు భారత దేశాన్నిఅర్థం చేసుకోమన్నారు.  గాంధీ గోఖలే సలహాను తు.చ. తప్పకుండా పాటించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వాహకులలో ఒకరైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ‘పాదయాత్రలో రాహుల్ ఎక్కువగా వింటారు, తక్కువగా మాట్లాడతారు’ అన్నారు. మంచి నిర్ణయం. విన్న విషయాలు అక్కడికక్కడే విస్మరించకుండా ప్రతిరోజూ పాదయాత్ర ముగిసిన తర్వాత నాటి అనుభవాలు డైరీగా రాసుకుంటే మంచిది.  

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో గాంధీ తర్వాత అంతటి ఎత్తు ఎదిగిన నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ. నవభారత తొలి ప్రధాని. ఆయన దేశవ్యాప్తంగా గాంధీజీ లాగా భౌతికంగా యాత్ర చేయలేదు. మానసిక యాత్ర చేశాడు. గతాన్నీ, వర్తమానాన్నీ వడబోశారు. అహ్మద్ నగర్ జైలులో 1942 నుంచి 46 వరకూ ఉన్నకాలంలో అయిదు నెలలపాటు కదలకుండా కూర్చొని భారతదేశ చరిత్రను అవలోకనం చేస్తూ ఏడు వందల పేజీల ఉద్గ్రంథం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రచించాడు. చరిత్ర మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతినీ, తాత్త్విక చింతనా స్రవంతినీ ఆయన తన గ్రంథంలో సవివరంగా చర్చించారు.

గాంధీ భారత యాత్ర సందర్భంలో భారత్ ఎట్లా ఉన్నదో తలచుకుంటే ఈ తరం యువతీయువకులకు ఆశ్చర్యం కలుగుతుంది. 1885లో నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ దేశానికి మంచి చేయాలని కోరుకునే పెద్దమనుషుల క్లబ్ గా మాత్రమే ఉండేది. అప్పుడప్పుడే దేశీయ భావాలూ, ఉద్యమ రూపాలూ వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని గానీ, స్వాతంత్ర్యం కోసం పోరాడాలని కానీ అప్పటికి ఎవ్వరూ అనుకోలేదు. గాంధీ తెరపైకి వచ్చే వరకూ అహింసాయుతమైన స్వాతంత్ర్య ఉద్యమం రూపురేఖలు స్పష్టంగా ఎవ్వరికీ తెలియవు. దేశంలో అక్షరాస్యత 12 శాతం కంటే తక్కువ. దాస్యమానస్తత్వం జీర్ణించుకుపోయినవారే ఎక్కువ. అటువంటి దేశాన్ని తన ఉద్యమం ద్వారా, పోరాటాల ద్వారా గాంధీజీ మేల్కొల్పి ఏకం చేశారు. ఆసేతుహిమాచాల పర్యంతం రైలులో పర్యటించారు. దేశ వ్యాప్తంగా అనేక సార్లు పర్యటించారు. మద్రాసు ప్రావిన్స్ లో జరిగిన సభలోనే ఆయన ప్యాంటూ, షర్టూ విడిచి కొల్లాయి కట్టాలని నిర్ణయించుకొని, నిర్ణయాన్ని అప్పటికప్పుడే అక్కడికక్కడే అమలు చేశారు.

ఇందిరమ్మ ఎమర్జెన్సీ

ఆ తర్వాత దేశానికి విపత్తు వచ్చింది ఇందిరాగాంధీ 25 జూన్ 1975న ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించినప్పుడు. అంతకంటే ముందే పరిస్థితుల క్షీణించడం, ఇందిరాగాంధీ నిరంకుశ ధోరణులను ప్రదర్శించిన కారణంగా రాజకీయాలు విరమించి విశ్రాంతి తీసుకుంటున్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ రంగంలో దిగవలసి వచ్చింది. గుజరాత్ లో విద్యార్థి ఉద్యమం ఛాత్ర సంఘర్ష్ పరిషత్తు నాయకత్వంలో సాగి ఉత్తరాదిలో అనేక ఉద్యమాలకు దారితీసింది. పట్నా మైదానంలో గొప్ప బహిరంగసభలో జయప్రకాశ్ నారాయణ్ ధిక్కార స్వరం వినిపించారు. పోలీసులు ఆత్మప్రబోధం ప్రకారం పని చేయాలని, అధికారులు జారీ చేసిన ఆదేశాలను గుడ్డిగా అనుసరించనక్కరలేదని ఉద్బోధించారు. కాంగ్రెసేతర రాజకీయ పార్టీలనూ, ఉద్యమ సంస్థలనూ ఏకం చేశారు. బ్రహ్మండమైన ఉద్యమం నడిపారు. ఆత్యయిక వ్యవస్థనూ, సంజయ్ గాంధీ, విద్యా చరణ్ శుక్లా వంటి ఇందిర విధేయులనూ, ప్రజాస్వామ్య వ్యతిరేకులనూ, నిరంకుశ ధోరణి ప్రదర్శించేవారినీ ప్రతిఘటించారు. జార్జి ఫెర్నాండెజ్ వంటి నాయకులు ధీరోదాత్తులుగా పేరు తెచ్చుకున్న సందర్భం అది. అన్ని ప్రాంతాల ప్రజలూ, అన్ని మతాలవారూ, అన్ని భాషలవారూ జేపీ ఉద్యమంలో కదం కలిపి ముందుకు సాగారు. రెండు సంవత్సరాలు తిరగకుండానే ఆత్యయిక పరిస్థితిని ఇందిరాగాంధీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఆ విధంగా ఎక్కువకాలం ఆత్యయిక పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ స్వయంగా రాయబరేలీలో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు.  ఉత్తరాదిలో జనతాపార్టీ ఘనవిజయం సాధించింది. దక్షిణాదిలో ఆత్యయిక పరిస్థితిలో అక్రమాలు, అత్యాచారాలు ఎక్కువగా జరగలేదు కనుక ఇక్కడ కాంగ్రెస్ కు అంత దెబ్బతగలలేదు. మొత్తం మీద ఆత్యయిక పరిస్థితిని అనే గండం నుంచి భారత్ గట్టెక్కింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువ ప్రజలకు మరింతగా తెలిసి వచ్చిన సందర్భం అది. ఏదైతో లేదో అప్పుడే దాని విలువ తెలుస్తుంది.

అప్రకటిత  ఎమర్జెన్సీ

ఇప్పుడు దేశంలో ఆత్యయిక పరిస్థితి అప్రకటితంగా ఉందని వాదించేవారు ఉన్నారు. ప్రభుత్వాన్ని కానీ, ప్రధాని నరేంద్రమోదీని కానీ విమర్శిస్తే కేసులు పెట్టుతారనీ, జైల్లో కుక్కుతారనీ ప్రతిపక్షాలు ఆరోపించడమే కాదు స్వయంగా ప్రజలకు కనిపిస్తున్న పరిణామాలు. ఒక ప్రొఫెసర్ సాయిబాబా, ఒక వరవరరావు ఎందుకు జైలులో ఉండవలసి వచ్చిందో తెలియదు. ఒక ఫాదర్ స్టాన్ స్వామి ఎందుకు ఖైదీగా మరణించవలసి వచ్చిందో అర్థం కాదు.  ఇటీవల జస్టిస్ శ్రీకృష్ణ ఈ దేశంలో స్వేచ్ఛ లేదనీ, ప్రధానిని విమర్శిస్తే జైలు పాలు కాకతప్పదనీ అని వ్యాఖ్యానించినందుకు ఆ మాజీ న్యాయమూర్తిని కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు తీవ్రంగా మందలించారు. మతపరమైన విద్వేషాలు పెరుగుతున్నాయి. పౌరహక్కుల నాయకుల హత్యలు జరుగుతున్నాయి. ముస్లింల పట్ల పనిగట్టుకొని వ్యతిరేకత పెంపొందిస్తున్నారు. సమాజాన్ని మతప్రాతికపైన చీల్చుతున్నారు. 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ లో పరిస్థితులు అదుపుతప్పుతాయని ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీదికి ప్రజాస్వామ్య సంస్థలైన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం అంత స్వేచ్ఛగా పని చేస్తున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ క్షీణించింది. ప్రాంతీయపార్టీలు తలా ఒక దారిలో ప్రయాణం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులపైనా, ప్రాంతీయ పార్టీ నాయకులపైన కేంద్ర నిఘా సంస్థలైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ఇడి), ఆదాయపన్న శాఖ దాడులు నిర్వహిస్తున్నాయి. కేసులు పెడుతున్నాయి. విచారణ పేరు మీద రోజులకొద్దీ ప్రశ్నలు అడిగి వేధిస్తున్నాయి.  కొంత కాలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తర్వాత బీజేపీలో చేరిన అక్రమార్కులు మాత్రం సంతోషంగా ఉన్నారు. వారిపైన సీబీఐ, ఈడీ దర్యాప్తులు నిలిచిపోయాయి. అస్సాం ముఖ్యమంత్రిగా, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నాయకుడుగా, రాజ్యసభ సభ్యులుగా అనేకమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, నిఘా సంస్థల దాడులను చవిచూసి ఒత్తిడికి తట్టుకోలేక బీజేపీలో చేరిపోయి కులాసాగా ఉన్నారు. ఈ  నాయకులు అధికారం చెలాయిస్తున్నారు. సూత్రబద్ధులైన ప్రతిపక్ష నాయకులను ఎద్దేవా చేస్తున్నారు. ప్రజాస్వామ్య పాఠాలు వల్లిస్తున్నారు. ఆత్యయిక పరిస్థితి కంటే దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు దారుణంగా, దుస్సహంగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

పాదయాత్రల పరంపర

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. ఇటువంటి పాదయాత్ర చేసిన మొదటి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కాదు.1983లో నాటి జనతాపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి దిల్లీలో గాంధీ సమాధి రాజఘాట్ వరకూ యాత్ర చేశారు. ఆ సందర్భంలో విజయవాడ వచ్చినప్పుడు చంద్రశేఖర్ ని కలుసుకున్నవారిలో నేనూ ఒకడిని. 4.260 కిలో మీటర్లు సాగిన భారత్ యాత్ర ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న 3,500 కిలో మీటర్ల పాదయాత్ర కంటే ఎక్కువ. కాకపోతే రాహుల్ గాంధీ ప్రతి అడుగూ నడుస్తారు.  తన యాత్రను రాజకీయ నాటకంగా ప్రజలు అపార్థం చేసుకుంటారేమోనని చంద్రశేఖర్ అనుమానించారు. అన్ని అనుమానాలు ప్రజల మధ్యకు పోయిన తర్వాత పటాపంచలు అయినాయి. ఈ యాత్ర వల్ల చంద్రశేఖర్ స్థాయి పెరిగింది. నైతికంగా ఎదిగారు. 1990-91లో ప్రధానమంత్రి అయినారు.

చంద్రశేఖర్ కంటే ఒక సంవత్సరం ముందు ఎన్ టి రామారావు అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో చైతన్యరథంలో నిర్విరామంగా ఆరేడు మాసాలు యాత్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన తర్వాత తొమ్మిది మాసాలలోనే ఝంఝామారుతంలాగా అధికారంలోకి దూసుకు వచ్చారు.  బీజేపీ అధినాయకులు లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. దాని ఫలితంగానే 1998లో వాజపేయి ప్రధానిగా ఎన్ డీఏ అధికారంలోకి వచ్చింది. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి రావడానికి కూడా మూలకారణం అయోధ్య రామజన్మభూమి ఉద్యమమే. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకూ 1,500 కిలో మీటర్ల పొడవునా ప్రజాప్రస్థానం సాగింది.  ఎండాకాలం గోదావరి స్నానం చేసి వడదెబ్బ కొట్టి రాజమండ్రి సమీపంలోని తోటలో వారంరోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. అనంతరం చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి 02 అక్టోబర్ 2012న ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర 2,340 కిలో మీటర్లు సాగింది. 2014లో అధికారంలోకి వచ్చారు. 2012 అక్టోబర్ 18న జైలులో ఉన్న అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా చెల్లెలు వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించి మూడు వేల కిలోమీటర్ల దూరాన్ని ‘మరో ప్రజాప్రస్థానం’ పేరు మీద నడిచి చరిత్ర సృష్టించారు. మోకాలికి గాయం కావడం వల్ల మధ్యలోమూడు మాసాలు విరామం ఇవ్వవలసి వచ్చింది. పాదయాత్రలో పూర్తి విశ్వాసం ఉన్న నాయకురాలు షర్మిల. ఇప్పుడు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ 08 జులై 2021న వైఎస్ జయంతినాడు నెలకొల్పిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికీ ఆమె పాదయాత్ర తెలంగాణ జిల్లాలలో ‘ప్రజాప్రస్థానం’ పేరుతో సాగుతూనే ఉంది. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కూడా మూడు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని లఘుపాదయాత్రలు చేశారు. మొత్తంమీద పాదయాత్ర అనేది రాజకీయంగా ప్రయోజనాత్మకమైన కార్యక్రమం అని తెలుగు నాయకులు గుర్తించారు. 2017-19లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో 14 మాసాలపాటు 3,648 కిలోమీటర్లు నడిచారు. ఇది మరో చరిత్ర. పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికలలో 51 శాతం ఓట్లూ, 175కు గాను 151 సీట్లూ సాధించి ఎన్నికల చరిత్రను తిరగరాశారు. వైఎస్ కుటుంబంలో ముగ్గురు – వైఎస్, ఆయన కుమార్తె షర్మిల, కుమారుడు జగన్ పాదయాత్రలు చేశారు. ఇది ప్రపంచ రికార్డు.

రాహుల్ యాత్రలో మజిలీలు

ఈ లెక్కన చూసుకుంటే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా జయప్రదంగా ముగుస్తుందనీ, ఆశించిన ఫలితం ఇస్తుందనీ అనుకోవచ్చు.  రాహుల్ తో పాటు 118 కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటారు. రాత్రిపూట కంటైనర్లలో పడుకుంటారు. 150  రోజులు సగటున రోజుకు 22 కిలోమీటర్ల వంతున నడుస్తారు. మొత్తం 3,570 కొలో మీటర్లు. 12 రాష్ట్రాలూ, రెండు కేంద్రపాలిత రాష్ట్రాలూ దాటుతారు. చరిత్రలో కొండగుర్తుగా ఈ పాదయాత్ర మిగిలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడు ఒక సందేశంలో అన్నారు. ఈ యాత్ర కేరళకు ఈ నెల 11వ తేదీన చేరుకుంటుంది. కర్ణాటకకు సెప్టెంబర్ 30 న చేరుకుంటుంది. ఆ రాష్ట్రంలో మూడు వారాల పాటు పర్యటన ఉంటుంది. ఈ యాత్ర మజిలీలు చేసే స్థానాలు:  కేరళలో తిరువనంతపురం, కొచ్చి, నిలంబూరు, కర్ణాటకలో  మైసూరు, బళ్లారీ, రాయచూరు, తెలంగాణలో వికారాబాద్, మహారాష్ట్రంలో నాందేడ్, జలగాం, మధ్యప్రదేశ్ లో ఇండోర్, రాజస్థాన్ లో కోట, దౌసా, అల్వార్, ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్,  దిల్లీ, పంజాబ్ లో అంబాలా, పఠాన్ కోట్, జమ్మూ, తర్వాత చివరిగా శ్రీనగర్.

కంటెయినర్ లో మరుగుదొడ్లు ఉంటాయి. పడకలు ఉంటాయి. ఎయిర్ కండీషనింగ్ కూడా కొన్నింటిలో ఉంటుంది. 148 రోజుల యాత్రలో పాదయాత్రలూ, ర్యాలీలూ, బహిరంగసభలూ  వివిధ ప్రాంతాలలో ఉంటాయి. ప్రియాంకగాంధీతో పాటు కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ సభలకు హాజరవుతారు. ఈ యాత్ర ఫలితంగా కాంగ్రెస్ పటిష్ఠమైన పార్టీగా బలపడాలనీ, 2024 నాటి ఎన్నికలలో విజయాలు సాధించాలనీ, దేశం ఐకమత్యంగా ఉండాలనీ, ప్రేమ ద్వేషాన్ని జయించాలనీ యాత్రికులు కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles