Saturday, April 20, 2024

తెలుగు సాహిత్యంలో సాంకృత్యాయన్!

రాహుల్జీ తెలుగు నేలపై అడుగిడి 110 సంవత్సరాలు. ఈ విషయంలో చిన్న గందరగోళం ఉంది. రాహుల్జీ ఆత్మకథ “మేరీ జీవన్ యాత్రా” ప్రకారం ఆయన 1913 లో దక్షిణదేశానికి మొదటిసారి వచ్చినట్లు రాసుకున్నారు. సైదాపేట నుండి తిరుపతి కి కాలినడకన సాగిన ఆ ప్రయాణం, మొట్టమొదటి సారిగా ఆ మహామానవుడి పాదం తెలుగు నేలను తాకి తాదాత్య్మం చెందిన క్షణం. తిరుపతి నుండి ఆయన తిరుమశి వెళ్ళి అక్కడ సంస్కృత కళాశాలలో కొద్ది రోజుల పాటు ఉన్నారు. ఐతే, బండ్లపల్లె ఓబులరెడ్డి 1963లో జయంతి పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించగా, 2011 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ముద్రించిన “మహోన్నత మానవుడు రాహుల్ సాంకృత్యాయన్” గ్రంథం లో రచయిత పొరపాటా, ముద్రాపకుల పొరపాటో తెలియదు కానీ రాహుల్జీ దక్షిణ దేశ యాత్ర కీ.శ. 1923 లో చేసినట్లు ఉంది. అదే నిజమైతే రాహుల్జీ తెలుగు నేలమీద అడుగిడి సరిగ్గా శతాబ్దం కావొస్తోంది. కానీ, స్వయంగా రాహుల్జీ రాతలే మనకి ప్రమాణం కాన ఏది ఏమైనప్పటికీ నిత్య సత్యాన్వేష కుడయిన ఆ అద్వితీయ మహామానవుడు దక్షిణ దేశానికి విచ్చేసిన సందర్భం , తెలుగు లో యాత్రా సాహిత్య కారులు శతవార్షి కోత్సవం చేయాల్సిన శుభ సమయం . దురదృష్ట వశాత్తు మహాకవులు, మహా రచయితల జీవితం – కృషికి సంబం ధించీ అర్థవంతమైన సంవాదాలు, సమా లోచన ల కంటే కూడా నిరర్దకమయిన ఉత్సవాలు, ఊరేగింపులకే సమయం వెచ్చించే  మూక తీర్థాలే ఈ రోజు నడుస్తున్నాయి!

Also read: మానవత్వమే మహాత్ముడి స్పూర్తి !

హిందీ. బెంగాలీ తర్వాత తెలుగులోనే…

రాహుల్జీ సాహిత్యం హిందీలో ఎంత ఉన్నదో అంత కాకపోయినా చాలా మట్టుకు తెలుగులో ఉన్నది. ఇతరేతర భాషలతో పోల్చుకుంటే బెంగాలీ లోనూ, తెలుగులోనూ రాహుల్జీ అనేక రచనలు తర్జుమా అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉన్నట్లే తెలుగులో కూడా రాహుల్జీ కి అనేకమంది మిత్రులు ఉన్నారు. 1944లో బెజవాడ లో జరిగిన అఖిల భారత రైతు మహాసభలకి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం మరువరాదు. ఆసక్తిక రమైన విషయం ఏమిటంటే ఆ మహాసభల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు వివిధ సాంస్కృతిక కార్య క్రమాలు ప్రదర్శించారు. సహజంగానే బెంగాలీ కళా బృందం మొదట నిలుస్తుందనీ అంతా భావించారు. అయితే, అందరి ఊహల్నీ తలకిందులు చేస్తూ ఆంధ్రా కళాకారులు వారి సాంస్కృతిక చైతన్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారనీ, బెంగాల్ నాయకులు ముజఫర్ అహమద్, గోపాల్ హాల్దర్ మాట్లాడుతూ, “ఆంధ్రా కళాకారులు ప్రజల వద్దకు వెళ్ళి వారి కళల్ని ప్రదర్శించే బదులు, ప్రజల నుండే కళకి అవసరమైన సారాన్ని గ్రహిస్తారు, మనం బెంగాల్ లో ముందుగానే ఏర్పర్చుకున్నమధ్యతరగతి అభిప్రాయాలను బుర్రల్లో ఉంచుకుని ప్రజల వద్దకు వెళతాం…” అని బహిరంగంగా అంగీకరించారంటూ రాహుల్జీ తన ఆత్మకథ లో రికార్డు చేసారనీ , ఫిబ్రవరి 20, 2019 న మహాపండిత రాహుల్ సాంకృత్యా యన్ జీవితం- కృషి కి సం బంధించి ‘ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం, ప్రొఫెసర్ కొత్తా సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో ఆసియన్ ఫిలాసఫీస్ (గుంటూరు) లో జరిగిన వర్క్ షాప్ అధ్యక్ష ఉపన్యాసం లో పావ్లోవ్ ఇనిస్టిట్యూట్ (కోల్ కతా) ఆచార్యుడు రామకృష్ణ భట్టాచార్య పేర్కొన్నారు. తెలుగులో సాంస్కృతిక వికాసోద్యమ చరిత్రకు సంబంధించీ రాహుల్జీ వంటి అనితరసాధ్యమైన వ్యక్తి నమోదు చేసిన ఈ విషయం స్తబ్దత రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఎంత విలువైనదో గుర్తించాల్సిన శ్రేణులు గుర్తిస్తే బాగుంటుంది !

ఆలూరి భుజంగరావు విశేషమైన కృషి

ఆలూరి భుజంగరావు, ఆయన అనువదించిన రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం

తెలుగులో రాహుల్జీ ని అధ్యయనం చేసిన వారికీ, ఆయన ప్రభావంతో రచనలు చేసిన వారికీ కొదవలేదు. అనేకమంది వారి పిల్లలకు రాహుల్జీ పేరు పెట్టుకునేంతగా ఆయన్ని ప్రేమించారు, అభిమానించారు. అనేక సంస్థలు రాహుల్జీ పై రకరకాల కార్యక్రమాలు చేసాయి.  ఆలూరి భుజంగరావు గారు గుడివాడలోనే కాక షాహాబాద్, కర్నాటక లో కూడా భార్య లలితా పరమేశ్వరి వ్యవస్థాపకురాలిగా  రాహుల్ సాహిత్య సదనం స్థాపించి ఎన్నో ప్రచురణలు తీసుకువచ్చారు. “నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం ప్రాణాలను ధారపోస్తున్న ప్రతి ఒక్క విప్లవకారుడూ – నా జీవితానికి ఆదర్శ మార్గ దర్శకుడే !” అని తన ఆత్మకథ ‘గమనా గమనం’ మొదటి పేజీలోనే ప్రకటించిన ఆయన, కడుపు కోసం కష్టపడుతూనే రాహుల్జీ రాసినఅనేక విలువయిన గ్రంథాల్ని తెలుగులోకి తర్జుమా చేశారు. 150 రూపా యలు బాకీ కట్టడం కోసం వేరే దారి లేక రాహుల్జీ ‘జయ ఔథేయ’ తెలుగు చేసిన ఆయన, “మార్చి నెల చివరి రోజులు. విద్యార్థులకు పరీక్షలు. పేపర్లు దిద్దాలి. స్కూలు పని రోజల్లా సరిపోయేది. ఇటు నూతనంగా వివాహమాడి తెచ్చుకున్న భార్య; క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం లేని ఈ జీవితాన్ని చూసి లలిత ఏమనుకుంటుం దోనని బాధ! రాత్రంతా కిరసనాయిలు బుడ్డి ముందు పెట్టుకుని అనువాదం చేస్తుండే వాడ్ని. ఇంకొంచెం కాంతిని ఇవ్వగల లాంతరైనా లేదు. తెలియని శబ్దాలకు అర్దాలు చూసుకోవడానికి శబ్దకోసమైనా లేదు. రాత్రంతా రాయడం వల్ల తెల్లవారేసరికిచేత నరాలు పోట్లు పెట్టడం మొదలయ్యేది. లలిత మనసులో ఏమనుకునేదో – చేతికి కొబ్బరి నూనె రాసి ఉపశమనాన్ని మాత్రం కలిగించేది. అలా ఓ నెల రోజుల్లో ‘జయఔథేయ’ అనువాదాన్ని పూర్తి చేసాను. పేగులు తెంచుకున్నంత పనయింది దాన్ని పూర్తి చేసేసరికి!…” అంటూ వాపోతారు.

అంబేడ్కర్ ధమ్మదీక్షకు సమర్థన

నాగపూర్ లో 1956లొ ధమ్మదీక్ష స్వీకరించిన తర్వాత ప్రసంగిస్తున్న అంబేడ్కర్

అందుకే, బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ద ధర్మదీక్షను సమర్ధిస్తూ రాహుల్జీ రాసిన  అరుదైన వ్యాసం ‘నవదీక్షిత బౌద్ధులు ‘ ని ప్రజాసాహితి సంపాదకులు కె. రవిబాబు గారి సహకారంతో సంపాదించి,  డా.మలయశ్రీ తెలుగు అనువాదంలో మిళింద ప్రచురణల తరపున సరిగ్గా 20 ఏళ్ళ క్రితం 2002 లోసంపాదకత్వం వహించి తీసుకువచ్చిన టి. రవిచంద్ గారు ఆ పుస్తకానికి రాసిన విశ్లేషణాత్మక మున్నుడికి ఇచ్చిన రిఫరెన్స్ నోట్సులో ఆలూరి భుజంగరావు గారి కృషిని గురించి పేర్కొంటూ, ” ఆయన (ఆలూరి) తెలుగు బాగాలేదని ఆత్రేయ లాంటి పండిత కవులు విమర్శించినా, హిందీ భాష తెలియని రాహుల్ సాంకృత్యాయన్ సాహిత్య అభిమానులకు ఆయన అనువాదాలు వరప్రసాదాలే!” అంటారు. ఈ సందర్భంగా గాంధీ జీ  మరణానంతరం ఆయన పై రాహుల్జీ రాసిన అరుదైన వ్యాసం, “ఇద్దరు మహావ్యక్తులు – బుద్దుడు – గాంధీ” . డా. జె. ఎల్. రెడ్డి అనువాదంలో 2005 లో మిసిమి పత్రికలో వచ్చిన ఈ వ్యాసాన్ని కూడా ఆంగ్ల మూలంతో కలిపి 2017 లో మిళింద ప్రచురణగా చిన్న బుక్ లెట్ రూపంలో రవిచంద్ తీసుకొచ్చారు. రాహుల్జీ మేధో పరిణామాన్ని (Intellectual Evolution) తెలియజేసే ఈ వ్యాసాన్ని, రాహుల్జీ రచనల్లో ఒక చారిత్రక పత్రం (Historical Document) గా పరిగణించాలంటారు రవిచంద్. రాహుల్జీ రాసిన రెండు అరుదైన వ్యాసాలని ఆ విధంగా తెలుగు సాహిత్యానికి, అంతకు మించి సాహితీ సాంస్కృతికోద్యమ చరిత్ర కి కూడా మిళింద ప్రచురణల ద్వారా అందిన తీరు ప్రసంశనీయం !

యాత్రా రచనలు

రావుల్ సాంకృత్యాయన్ పాదయాత్ర

ఇకపోతే, యాత్రా సాహిత్యం గురించి కృషి చేస్తున్న వాళ్ళలో కూడా రాహుల్జీ స్పూర్తితో ఆయన యాత్రల గురించి రచనలు చేసిన ఆదినారాయణ వంటి వారు ఉన్నారు. హిందీ, ఆంగ్లాలలో అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. ఒక్క యాత్రా సాహిత్యం మాత్రమే కాదు, మొత్తం రాహుల్జీ జీవితం గురించి కూడా అడపాదడపా అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రభాకర్ మాచ్వే నుండి అలకా ఆత్రేయ చుడాల్ వరకూ ఎందరో రాహుల్జీ జీవితం, కృషికి సంబంధించి విలువైన గ్రంథాలు వెలువరించారు. తెలుగులో కూడా వామపక్ష ప్రగతిశీల సంస్థలు, దాదాపుగా అన్నీ ఆయన గురించి ప్రచురించాయి. ముఖ్యంగా, ప్రాచీన భారతీయ సంస్కృతికి సంబంధించి రాహుల్జీ కృషిని అర్దం చేసుకోవడం ఈనాటికి కూడా చాలా అవసరం అనే నా అభిప్రాయం. 1994 , సెప్టెంబరు కమ్యూనిజం పత్రికలో “సాహిత్య – స్వాతంత్ర్య సమరాంగణంలో సవ్యసాచి – మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్” అంటో డా. మాడభూషి భావనాచార్యులు వ్యాసం రాశారు. 2011 లో సంఘమిత్ర ప్రచురణల తరపున వచ్చిన ఆయన వ్యాసావళి, “ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తాత్విక చింతన” లో ఆ వ్యాసం ఉంది. రాహుల్జీ రాసిన చిన్న పొత్తాన్ని 1986లోనే యతిరాజులు అను వాదంగా “ఈ సమాజ దుష్టత్వం పతనం కాక తప్పదు’ పేరిట ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురిం చింది. ఇందులోనే చివర్లో వి. ఆర్. బొమ్మా రెడ్డి రాసిన రాహుల్జీ జీవిత విశేషాలు అను బంధంగా ఉన్నాయి. అసలు తెలుగులో మొదటి సారిగా ఎప్పుడు రాహుల్జీ గురించిన రచన వచ్చిందనేది ఆసక్తి కలిగించే విషయం. తెలుగు పరిశోధన ఆ దిశగా జరిగితే బాగుంటుంది !

తెలుగు ప్రముఖులతో అనుబంధం

తిరుమల రామచంద్ర

ఇక స్వీయచరిత్ర, ఆత్మకథల విషయానికి వస్తే ఎందరో ప్రముఖులు రాహుల్జీ తో వారి అనుబంధం ప్రస్తావించి ఉన్నారు. ఎన్నో సరదా సంగతులు కూడా చెప్పిన వారు ఉన్నారు. కళా తపస్వి సంజీవ్ దేవ్ అలాంటి ఎన్నో విషయాలు రాసారు. ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ఇంటి దగ్గర రాహుల్జీ తో కలిసి భోజనం చేస్తుండగా, ” అన్ని ప్రాంతాల భోజనాలలోకి ఏ ప్రాంతపు భోజనం బాగుంటుందని అడిగితే, ‘మాంసం కనుక ఉంటే ఏ ప్రాంతపు భోజనమైనా బాగానే ఉంటుంద’ని అన్నారట” ఇలాంటి విషయాల్ని సంజీవ్ దేవ్ ఆత్మకథ ‘తుమ్మపూడి’ లో చూడొచ్చు. తిరుమల రామచంద్ర గారి స్వీయచరిత్ర ‘‘హంపీ నుంచి హరప్పా దాక’’ లో కూడా రాహుల్జీ ప్రస్తావన వస్తుంది.

పుట్టపర్తి నారాయణాచార్యులు

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డెయిలీ టెలీగ్రాఫ్ పత్రిక ఇంటర్వ్యూలో “నా ముఖ్యమైన అర్హత ఆకలి” అంటూ వెళ్ళి చేరిన రామచంద్ర గారికి మొదటి అసైన్మెంట్, ఆ రోజు జరిగిన సమావేశంలో రాహుల్జీ ప్రసంగాన్ని రికార్డు చేయడం. పొట్ట చేత పట్టుకుని పాత్రికేయుడి అవతారం ఎత్తిన ఆయన మాటల్లోనే, “ఆ దినం సాయంకాలం రాహుల్ సాంకృత్యా యన్ ప్రసంగించే సభ ఒకటి ఉంది. ‘రామచంద్రా మీకు హిందీ బాగా వచ్చు గనుక రాహుల్జీ ప్రసంగం కవర్ చేయండి’ అన్నారు. అది ఆంగ్లంలో నా మొదటి కవరేజ్. చాలా జాగ్రత్తగా రాసాను. రాహుల్జీ భావాలు స్పష్టంగా, వివరంగా ఇచ్చాను. ఆయన సోవియట్ యుద్ధం మీద, తక్కిన వాటి మీద ప్రకటించిన భావాలు ఎంతో అమూల్య మైనవి. వెంకట్ రామన్ నన్ను ప్రోత్సహించ డానికి కాబోలు చాలా మెచ్చుకున్నారు. తక్కిన పత్రికలతో పోల్చి బెస్ట్ కవరేజ్ అన్నారు. నేన ఉబ్బిపోలేదు కానీ సంతోషం ప్రకటించి కృతజ్ఞత తెలిపాను…” అంటారు. అసాధారణ మేధో సంపత్తి ఉండి కూడా భాషా సేవకుడు అని వినమ్రంగా రాసుకునే ఒక మహా తెలుగు రచయిత మహా పండితుడు రాహుల్జీ సభకి విలేఖరిగా వ్యవహరించి తన మొదటి ఇంగ్లీష్ కవరేజిని కూర్చిన క్రమం అది!

నిత్యనూతన సత్యాన్వేషి

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. రాహుల్జీ గురించి విస్తారమైన అధ్యయనాలు మరిన్ని జరగాల్సి ఉంది. స్వచ్చందంగా ఉత్తరాదిని  తన కార్యక్షేత్రంగా చేసుకున్న ఆయన్ని ఈ రోజు దేశం మొత్తం విస్మరించడం విచారకర విషయం. విశ్వమానవుడిగా మసిలిన ఆయన స్పూర్తిని వర్తమాన సమాజం అసలు గుర్తించే పరిస్థితిలో లేకపోవడం బాధాకరం. ఇది వ్యక్తిగత ఆసక్తితో రాసిందే కానీ  సమగ్రమైన శోధనా వ్యాసం కాదు. ఆ మాటకొస్తే అసలు పరిశోధనేమీ నేను చేయలేదు. భవిష్యత్తులో రాహుల్జీ కోసం మరిన్ని ప్రయత్నాలు ఉన్నతమైనవి జరగాలని ఆశిస్తున్నాను. అవిశ్రాంతంగా ప్రజ్వరిల్లిన ఆయన పయనంలో సంచారిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా, వైష్ణవ సన్యాసిగా, ఆర్య సామాజికునిగా, దేశ దిమ్మరిగా, తిరుగు బాటు దారుగా, రైతు నేతగా, రాజకీయ నేతగా, జైలు ఖైదీగా, తార్కికుడి గా, ఆచార్యుడిగా,  తాత్వికుడిగా,బహు భాషా వేత్తగా, రచయిత గా, సంపాదకునిగా, పాత్రికేయుడిగా , వైజ్ఞానిక వేత్తగా, చరిత్ర కారునిగా ,గాంధేయవాదిగా,సామ్యవాదిగా, సోషలిస్టుగా, కమ్యూనిస్టుగా, బౌద్దునిగా , మానవతావాదిగా ..ఇలా అంతులేని అనేకానేక పాత్రల్లో ఒదిగిపోయిన విశ్వ మానవునిగా రాహుల్జీ ని స్మరించు కోవడం ప్రతీ తరానికి ఒక చారిత్రక అవసరం. కొందర్ని ఆయన సన్యాసి జీవితం మరికొందర్ని సామ్యవాద జీవితం, కొంతమందిని ఆయన యాత్రలు, ఇంకొంత మందిని ఆయన అక్షరాలు, కొద్దిమందిని ఆయన బౌద్ధం, మరి కొద్ది మందిని జీవితాంతం ఆయన చేసిన యుద్ధం… ఇలా ప్రభా వితం చేస్తూనే ఉన్నాయి. వీటన్నిం టిలోకి అంతిమంగా, అంతర్లీనంగా ఆయన్ని నిత్యం నడిపించినది మాత్రం ఎప్పటికీ ఎడతెగని ఒక నిరంతరమైన నిత్యనూతన నిర్మాణా త్మకమైన సత్యాన్వేషణ మాత్రమే!

Also read: మహామానవవాద తత్త్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్!

(రాహేల్జీ తెలుగుగడ్డపైన అడుగుపెట్టి నూటపదేళ్ళు అయిన సందర్భంగా)

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles