Thursday, April 18, 2024

బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

లోకసంచారం చేయి నరుడా జీవితం ఇంకెక్కడుందీ?

జీవితమింకా ఉంటే గింటే నవయవ్వన మింకెక్కడుందీ?

అంటూ ఒక ఫకీరు హిందీలో పాడుతూ పోవడం చూసిన ఒక పదకొండేళ్ళ పిల్లవాడికి ఆ పాట సారాంశం తలకెక్కింది. జీవితంలో యవ్వన దశలోనే తిరగకలిగినంత తిరగాలి. చేయగలిగినంత చేయాలి – అని బోధపడింది. ఆ బాలుడి పేరే కేదార్ నాథ్ పాండే. ఆ పేరు ఇప్పుడు ఎవ్వరికీ గుర్తులేదు. రాహుల్ సాంకృత్యాయన్ అంటే మాత్రం ప్రపంచమంతా గుర్తుపడుతుంది. బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, యాత్రాసాహిత్య పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్ (9 ఏప్రిల్ 1893-14 ఏప్రిల్ 1963) జీవితంలో45 సంవత్సరాలు యాత్రలలో గడిపిన లోకసంచారి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బౌద్ధభిక్షువుగా మారి, మార్క్సిస్టు సోషలిస్టుగా పరివర్తన చెందిన ఆయన భారత జాతీయోద్యమంలో కూడా కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ రచనలూ, ప్రసంగాలూ చేసినందుకు మూడు సంవత్సరాలు జైలు శిక్షననుభవించారు.

ఆజంగఢ్ లో పుట్టుక

బ్రిటిష్ పాలనలో యు.పి (యునైటెడ్ ప్రావిన్స్)లో ఆజంగఢ్ లో జన్మించిన కేదార్ నాథ్ పాండే క్రమంగా బౌద్ధాన్ని జీర్ణించుకొని తన పేరును రాహుల్ సాంకృత్యాయన్ గా మార్చుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో తాత,అమ్మమ్మల వద్ద పెరిగాడు. ఉరుదూ మాధ్యమంలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత ఆ బాలుడు బహుభాషావేత్తగా, మహాపండితుడుగా స్వయంకృషితో ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఫకీరు పాటకు ప్రభావితుడై ప్రపంచం ఏమిటో చూడాలనిపించి ఇంట్లోనుంచి పారిపోయాడు. అందువల్ల పాఠశాల చదువు ఎనిమిదో తరగతితోనే ఆగిపోయింది. కాలినడకన వేల మైళ్ళు ప్రయాణిస్తూ మూడు బౌద్ధ పిటకాలను జీర్ణించుకొని త్రిపిటకాచార్య అయ్యారు.

బహుభాషావేత్త

హిందీ, కన్నడం, మైథిలీ, నేపాళీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉరుదూ వంటి ముప్పయికి పైగా భాషలు నేర్చుకున్నారు.  అంతేకాదు వాటి యాసల్ని కూడా పట్టుకోగలిగారు. కాశీ విద్యాపీఠ్ లో సంస్కృతం నేర్చుకున్నారు. రాహుల్ జీ ఆర్యసమాజంలో హిందూమతవ్యాప్తికి కొంతకాలం కృషి చేశారు. ఆ సమయంలోనే గ్రంధాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు. భిన్నమైన అభిరుచులూ, లోతైన తాత్విక చింతన, నిరంతర సంచార జీవితం కలగలిపి అపురూప సాహిత్య రచనకు పూనుకున్నారు. దానితోపాటు తనదైన ఉపన్యాస శైలికి రూపకల్పన చేసుకున్నారు.

బౌద్ధగ్రంథాల అనువాదం

పురాతన బౌద్ధగ్రంధాలు వెలికి తీసి, వాటిని అనువదించి ప్రపంచానికి తెలియపరచడంలో రాహుల్ జీ చేసిన అపారమైన కృషిని బౌద్ధులు ఎంతో విలువైందిగా గుర్తించారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రతిభాశాలి అనీ, ఆయనను మించినవారు ఎవ్వరూ లేరనీ ప్రముఖులెందరో వ్యాఖ్యానించారు. ఆయన రచనాశైలి సరళంగా, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండేది. ఇరవై ఏళ్ళ వయస్సులో రచనలు చేయడం ప్రారంభించి మతం, తత్వం, భాష, సైన్సు, సోషియాలజీ వంటి అనేక  విషయాల మీద పుస్తకాలు రాశారు.

ఓల్గా నుంచి గంగ వరకు

ముఖ్యంగా బౌద్ధంమీద విస్తృతంగా పరిశోధన చేశారు. ‘ఓల్గా నుంచి గంగ వరకూ,’ ‘రుగ్వేద ఆర్యులు,’ ‘లోకసంచారి,’ ‘దివోదాసు,’ ‘విస్మృత యాత్రికుడు,’ ‘సింహసేనాని,’ ‘మధుర స్వప్నం’ – ఆయన రచనలలో కొన్ని. ‘ఓల్గా సే గంగా’ అనే ప్రసిద్ధ గ్రంథంలో ఆయన క్రీస్తుపూర్వం ఆరువేల నుంచి క్రీస్తు శకం 1942 వరకూ ఇండోయూరోపియన్ మానవ సమాజ వికాసాన్ని కథలుగా రాశారు. ఇది, మరికొన్ని రచనలు తెలుగులోకి అనువాదమైనాయి. మానవ జీవన యానం యాంత్రపాలజీపై అభిరుచి ఉన్నవారు రాహుల్ జీ రచనలు తప్పక చదవాలి.

నిత్యసంచారి

నిత్యసంచారిగా రాహుల్ సాంకృత్యాయన్ జీవితంలో సగం కన్నా ఎక్కువ కాలం సుదూర ప్రాంతాలు సందర్శించడానికే గడిపారు. వీలైనంతవరకూ రోడ్లపైనా, కాలిబాటపైనా ఆధారపడ్డారు. కొత్త సంగతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ప్రయాణించారు. 13వ శతాబ్దంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు బౌద్ధభిక్షువులు తమ గ్రంథాలతో పారిపాయారనీ, వాటిని టిబెట్ ఆరామాలలో భద్రపరిచారనీ రాహుల్ జీకి తెలిసింది. ఆరు వందల ఏళ్ళుగా వాటిని పట్టించుకున్నవారు లేరని ఆయన కార్యరంగంలోకి దూకారు. దారి సరిగా లేని కొండల్లో నడుస్తూ కశ్మీర్, లధాఖ్, కార్గిల్ ల మీదుగా టిబెట్ వెళ్ళారు. అక్కడ

కొన్ని పుస్తకాలు లభించాయి గానీ అవి సంస్కృతంలో లేవు. అవన్నీ భోటీ భాషలో ఉన్నాయి.

కంచరగాడిదలపై పుస్తకాల ప్రయాణం

పుస్తకాలను కంచరగాడిదలపై ఎక్కించి, సుమారు నలభై రోజుల ప్రయాణించి రాహుల్ జీ చివరికి డార్జిలింగ్ సమీపంలో ఉన్న కాళీపాంగ్ చేరారు. ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు పట్నా మ్యూజియంలో ఉన్నాయి. టిబెట్ పర్యటనలో భాగంగా ఆయన టిబెట్ భాష నేర్చుకున్నారు. దానికి వ్యాకరణం రాశారు. హిందీ-టిబెటన్ నిఘంటువు కూర్చారు. నాటి సోవియెట్ యూనియన్ అంతా విస్తృతంగా పర్యటించి సంస్కృతం, పాళీ భాషల్లో ఉన్న శాసనాలూ, రాతిఫలకాలూ సేకరించారు. నేపాల్, టిబెట్ మాత్రమే కాకుండా మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ లు కూడా పర్యటించారు. అరుదైన కాన్జూర్, టాన్జూర్ గ్రంథాలు కొన్నారు. 130 వర్ణచిత్రాలూ, 1600 పైచిలుకు రాతప్రతులూ సేకరించారు. విదేశీయాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తర్వాత, మళ్ళీ అంత భారీగా పుస్తకాలూ, చిత్రాలూ సేకరించినవారు రాహుల్ జీ తప్ప మరొకరు లేరని చరిత్రకారుల అంచనా.  ఆయన సేకరించిన పుస్తకాలను అమ్మాలని చాలామంది వెనకబడి ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన అంత నిక్కచ్చైన మనిషి. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆసక్తినీ, నిబద్ధతనూ గమనించిన కలకత్తాలోని మహాబోధి సొసైటీ, లండన్ బుద్ధిస్ట్ సొసైటీలు సంయుక్తంగా ఖర్చులు భరించి ఆయనను యూరప్, అమెరికా దేశాలలో బౌద్ధమత వ్యాప్తికోసం పంపించాయి.

పద్మభూషణ్, సాహిత్య అకాడెమీ పురస్కారాలు

రాహుల్ సాంకృత్యాయన్ కి జీవిత కాలంలో అనేక గౌరవాలూ, బిరుదులూ లభించాయి. 1958లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, 1963లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ అందాయి. ఆయనకు బాల్యంలోనే వివాహం జరిగింది. కానీ ఇతను నిత్యసంచారి కావడం మూలాన వారెప్పుడూ కలిసి ఉండలేదు. అయతే, లెనిన్ గ్రాడ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నప్పుడు మాత్రం ఒక మంగోలియన్ స్త్రీని వివాహమాడారు. భారత్ కు తిరిగి వచ్చేప్పుడు సోవియెట్ నిబంధనలు ఒప్పుకోకపోవడం వల్ల ఆమె భారత దేశానికి రాలేకపోయింది. ఆ తర్వాత ఆయన కమల అనే భారతీయ యువతిని వివాహమాడి డార్జిలింగ్ లో స్థిరపడ్డారు. అందుకే ఆయన స్మృతిచిహ్నం డార్జిలింగ్ లో బౌద్ధమతానుసారం నిర్మించారు. రాహుల్ జీ ఎన్నో ఏళ్ళపాటు బీహార్ లోని శరణ్ జిల్లా పర్శగడ్ గ్రామంలో నివాసమున్నారు. అందుకే అక్కడవారు గ్రామ ముఖద్వారానికి ‘రాహుల్ గేట్’ అని పేరుపెట్టుకున్నారు.

చరమాంకంలో మతిమరుపు

చరమాంకంలో రాహుల్ సాంకృత్యాయన్ శ్రీలంకలో ఆచార్యుడిగా పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే, చివరిలో గుండెల్ని పిండేసే విషాదం ఒకటి జరిగింది. రిఫరెన్స్ గ్రంథాలను కూడా కంఠోపాఠంగా ఉంచుకునే ఆ మహాజ్ఞాని చివరి రోజుల్లో తన పేరేమిటో కూడా గుర్తుతెచ్చుకోలేని మతిమరుపులోకి జారిపోయారు. 1940 దశకం ప్రారంభంలో, అంటే సుమారు 47వ ఏట ఆయన పూర్తిగా భౌతికవాద భావాలను స్వీకరించి, కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరి, జీవితాంతం కమ్యూనిస్టుగానే జీవించారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. బీహార్ లో ఒక రైతు ఉద్యమంలో జరిగిన లాఠీచార్జిలో ఆయన తలపైన బలమైన దెబ్బ తగిలింది. జీవితంలోఎప్పుడో జరిగిన ఆ బలమైన దెబ్బకారణంగానో లేక సహజవార్థక్య లక్షణంగానో వచ్చిన మతిమరుపు వల్ల ఆయనెవరో ఆయనకే తెలియకుండా కొంతకాలం బతికారు. అదికారికంగా ఎక్కడా చదువుకోకపోయినా, స్వయంకృషితో విశ్వవిద్యాలయాలలో బోధించే స్థాయికి ఎదగడం, మహాపండితుడిగా గుర్తించబడడం సామాన్య విషయం కాదు. ఇలాంటి మహామేధావి ప్రంపంచంలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

(ఏప్రిల్ 9 రాహుల్ సాంకృత్యాయన్ జయంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles