Saturday, April 20, 2024

రఘురామకృష్ణంరాజుకు షరతులతో బెయిలు

దిల్లీ: నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజుకు సుప్రీంకోర్టులో శుక్రవారంనాడు షరతులతో కూడిన బెయిల్ లభించింది. సికిందరాబాద్ సైనిక ఆస్పత్రి రాజును పరిశీలించిన తర్వాత పంపిన నివేదికను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులకు అందజేశారు. రఘురామకృష్ణం రాజు కాలికి కనిపించని ఫ్రాక్చర్ ఉన్నదని సైనిక ఆస్పత్రి వైద్యుల బృందం రహస్య నివేదికలో రాసింది. దీన్ని బట్టి గుంటూరులో సీఐడీ అధికారులు పార్లమెంటు సభ్యుడితో సముచితంగా వ్యవహరించలేదని భావించవలసి వస్తున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

Also read: రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

రఘురామకృష్ణంరాజు తరఫున ముకుల్ రొహట్గీ, ఆదినారాయణరావు వాదించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, వివి గిరి వాదించారు. రాజద్రోహం అంటే మాటలు కాదనీ, చేతలు ఉండాలనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది బూటకపు కేసు అనీ రొహట్గీ వాదించారు. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని విమర్శించారే కానీ అస్థిరపరచడానికి ప్రయత్నించలేదని వాదించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కారణంగా రఘురామకృష్ణంరాజుపైన కక్షకట్టి ఈ విధంగా నిరాధారమైన కేసు బనాయించి అందులో 124ఎ సెక్షన్ ను కూడా చేర్చారనీ, దానివల్ల బెయిలు రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశమనీ, రాజద్రోహానికి సాక్ష్యాధారాలు ఉంటేనే 124ఎ సెక్షన్ వర్తిస్తుందనీ, కేవలం బెయిల్ రాకుండా చేయడం కోసమే ఈ సెక్షన్ పెట్టారు కానీ ఆరోపణ నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఏమీ లేవనీ రొహిట్గీ అన్నారు. ప్రభుత్వం కక్ష కట్టింది కనుకనే రఘురామకృష్ణంరాజు దిల్లీ హైకోర్టులో తనకు రక్షణ కావాలంటూ పిటిషన్ వేశారనీ, అందుకు సమ్మతించి కోర్టు ఆదేశాలు జారీ చేసిందనీ, ఆయనకు ‘వై’ కేటగరీ రక్షణను కేంద్రం కల్పించిందనీ రొహట్గీ చెప్పారు.

Also read: మీడియా అందుబాటులోకి ఎస్ సి ప్రత్యేక యాప్

బెయిల్ కావాలని ఆంధ్ర్ర్రప్రదేశ్ హైకోర్టును కోరామనీ, వారు దిగువ కోర్టుకు వెళ్ళమని చెప్పారనీ, హైకోర్టుకు వెళ్లే అధికారం పార్లమెంటు సభ్యుడుగా రఘురామకృష్ణంరాజుకు ఉన్నదనీ, హైకోర్టు తమ కోరికను  మన్నించకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చామని రొహట్గీ వివరించారు. సికిందరాబాద్ సైనిక అస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక చూస్తే సీఐడీ పోలీసులు రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురిచేశారని స్పష్టంగా తెలుస్తోందని ఆయన చెప్పారు.

Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే

సైనిక ఆప్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక స్పష్టంగా లేదనీ, కనిపించని ఫ్రాక్చర్ ఉన్నట్టు రాశారనీ, గుంటూరులో పరీక్షించినప్పుడు లేని ప్రాక్చర్ హైదరాబాద్ కు వచ్చే వరకూ ఎట్లా ప్రత్యక్షమైనదో అర్థం కావడం లేదనీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. తన దగ్గర గుంటూరు లో తీసిన ఎక్స్ రే ఉన్నదనీ, అందులో దెబ్బలు తగిలిన గుర్తులే లేవనీ దవే చెప్పారు. తమ దగ్గర 45 టేపులు ఉన్నాయనీ, ఒక పార్లమెంటు సభ్యుడు సభ్యత, సంస్కారం మరచి నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు స్పస్టంగా తెలుస్తోందనీ, రెడ్లకూ, ఇతర కులాలవారికీ మధ్యనా, క్రైస్తవులకూ, ఇతర మతాలవారికీ మధ్యన ఘర్షణలు జరిగే విధంగా రెచ్చగొడుతూ అదే పనిగా మాట్లాడటం ఒక పార్లమెంటు సభ్యుడికి తగునా అంటూ దవే ప్రశ్నించారు. అంబులెన్స్ ఎక్కి అస్పత్రికి వెళ్ళమంటే నిరాకరించి, తన కారులోనే వెళ్ళారనీ, ప్రయాణం చేస్తూ కాలిని బయటికి కనిపించే విధంగా, కాలు గాయాలు ప్రజలు కనిపించేట్టు పెట్టుకొని మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారనీ, దాని కారణంగానే ఎడిమా వచ్చిందనీ, కాలు ఉబ్బిందనీ, ప్రాక్చర్ లేనే లేదనీ దవే వాదించారు.

Also read: రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

హైకోర్టు చెప్పిన దానిలో తప్పులేదనీ, దిగువ కోర్టుకు వెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సమంజసం కాదనీ, అర్ణబ్ గోస్వామికీ, రఘురామకృష్ణంరాజుకి మాత్రమే ఈ విధంగా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సాధ్యమవుతుందనీ, సామాన్యులకు కాదనీ దవే అన్నారు. తమ పిటిషనర్ అవసరమైతే విమానం కొనుక్కొని గుంటూరు నుంచి దిల్లీకి వచ్చి ఎయిమ్స్ లో వైద్యులకు చూపించుకుంటారని రొహట్గీ అన్నారనీ, అటువంటి సంపన్నులకే ప్రత్యేక సదుపాయాలు ఉంటాయనీ దవే ఆక్షేపించారు.

ఒక వేళ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానం నిర్ణయిస్తే దర్యాప్తునకు సహకరించాలనీ, మీడియాతో మాట్లాడరాదనీ, ఇంటర్వ్యూలు ఇవ్వరాదనీ షరతులు విధించాలనీ, ఇప్పటికే యూట్యూబ్ లో పోస్ట్ చేసిన అనేక పరువుతీసే వీడియోలను తొలగించాలని కూడా ఆదేశించాలని ప్రభుత్వం తరఫున వాదించిన మరో న్యాయవాది వివి గిరి అన్నారు.

అందరి వాదనలు ఆలకించిన తర్వాత రఘురామకృష్ణంరాజుకు షరతుల కూడిన బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, బిఆర్ గవాయ్ నిర్ణయించారు. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించమని రఘురామరాజుకు ఆదేశించారు. విచారణకు సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని చెప్పారు. ఈ షరతులను ఉల్లంఘించినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని న్యాయమూర్తులు హెచ్చరించారు.

Also read: భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles