Friday, March 29, 2024

బలగం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ

బండారు రాం ప్రసాద్ రావు

ఎప్పుడూ ముభావం, ఏవో ఆలోచనలు, కానీ ఆయన అంతరంగమథనం అంతా దేశం కోసమే. ఏదైనా చేయాలనే తపన. బంగారం కుదువ పెట్టి దేశాన్ని నడపడం, తాళి బొట్టు అమ్ముకోవడం లాంటిది అని నమ్మిన పీవీ రాజకీయ నాయకులను కాకుండా ఒక బ్యూరో క్రాట్ ను ఆర్థిక శాఖ మంత్రిని చేసి ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు.

భూసంస్కరణలు, సమాజ సంస్కరణలు ఎన్నో చేసిన మన పీవీ బలగం లేని బహుముఖ ప్రజ్ఞా శాలి. ఆయన ఒక శిఖరం. అందుకే ఎవరికి అందనంత ఎత్తులో ఆయన కీర్తి అజరామరం అయింది. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 1967 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.

కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని అతని రాజకీయ నేపథ్యం అతనికి 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. అది భూస్వామ్య వర్గాలుగా ఉన్న అప్పటి పటేల్ పట్వారీ లకు కూడా తెలియకుండా తన భూమి వందల ఎకరాల్లో పోతుందని తెలిసినప్పటికీ భూసంస్కరణలు తెచ్చి చిక్కుల్లో పడి చివరకు అమలు చేసి పదవి నుండి దిగిపోయారు.  

ఇదీ చదవండి:తెలుగు నేల కీర్తి పాములపర్తి

తన అస్తిత్వాన్ని నిలుపుకొని తరువాత కేంద్ర రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి రాజీవ్ గాంధీ మరణం అనంతరం ప్రధానిగా ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఏలిన ఘనత పీవీది. నియంతృత్వ దొరగా కాకుండా పేదల దొరగా కీర్తి గడించిన పీవీ హయాంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా దేశం చిక్కుల్లో పడే ప్రమాదాన్ని తప్పించి లౌకికవాదిగా తన చాణక్య నీతి ద్వారా పెను ప్రమాదాలను రాకుండా చూసిన పరిపాలనాదక్షుడు. పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.

1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి అవినీతి మార్గాలను అనుసరించారనే విమర్శలు ఉన్నాయి. కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా పీవీలో ఒక చిరునవ్వు కనిపించింది. మౌన ముని అని ఎంత మంది అన్నా తాను సంసార జీవితాన్ని కూడా చక్కగా పోషించారు. తాను రాసిన ‘ఇన్ సైడర్’ లో ఆనంద్ పాత్ర లో పీవీ అంతరంగం కనబడుతుంది. వంగర దొర భారతదేశాన్ని ఏలినా కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నచందాన తెలంగాణలోనే అయన అంత్యక్రియలు జరగడం కాకతాళీయం. ఢిల్లీ పెద్దలు ఏఐసిసి కార్యాలయానికి పార్థివ దేహాన్ని రానివ్వకుండా చేసినా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎన్ని ఆటంకాలు తెచ్చినా జ్ఞాన భూమిలో సగం కాలిన తన దేహం ద్వారా కరణం పగ కాట్లో పడ్డా పోదు అన్న చందంగా మొత్తం కాంగ్రెస్ పరువును తీసి, తన పరువును ఆకాశం వరకు పెంచుకున్న పీవీ మన తెలుగువాడి ఠీవి.  కేసీఆర్ పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం తెలంగాణా ముద్దు బిడ్డకు ఇచ్చిన ఘన పురస్కారం అని చెప్పక తప్పదు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles