Tuesday, June 25, 2024

ధర్మపురి తో పి.వి.అనుబంధం

పాములపర్తి వెంకట నరసింహారావు కు ధర్మపురి క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి వాసులతో బంధుత్వం లేకున్నా, ఇక్కడి శ్రీ నృసింహ గురు పీఠంతో, అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న నాయకులతో గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా తరుచుగా పి.వి. క్షేత్రానికి వస్తూ పోతూ ఉండేవారు. అష్టాదశ పురాణముల ను ఔపోసనం పట్టి, నిత్య పురాణ ప్రవచనాలతో భక్తులను ఆధ్యాత్మిక లోకాలలో విహరింప చేసిన, అపర వేదవ్యాసులుగా పేరుగాంచిన గుండి రాజర్షి వద్దకు వచ్చి, శ్రద్ధగా విని, సందేహ నివృత్తి చేసుకున్న నేపథ్యం, అపర ధన్వంతరి, నాటక సంస్థ స్థాపకులు, దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి కాసర్ల వేంకట రాజయ్య, కొరిడే కిష్టయ్య, వొజ్జల కోటయ్య, పాత కాంతయ్య, పెండ్యాల లక్ష్మీ నరహరి, సంగన భట్ల మాణిక్య శాస్త్రి తదితరులతో, కొరిడే కిష్టయ్య ఇంటి అరుగుపై రోజుల కొద్దీ రాజకీయ చర్చలు చేసిన విషయాలు క్షేత్ర పాతతరం వారికి నిత్య జ్ఞాపకాలుగా ఉన్నాయి.

ఇది చదవండి: వారసత్వ పాలనకు స్వస్తిపలికిన పివి

1967లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, నాటి రాష్ట్ర ఆర్థిక మంత్రి మర్రి చెన్నారెడ్డి తో కలిసి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, తమ చిరకాల సన్నిహితులైన దాదగారి కిషన్ రావు గృహంలో భోజనం చేసిన సమయంలో, దేవాలయాల అభివృద్ధిపై చర్చించి వెళ్లిన నేపధ్యంలో, పి.వి. తర్వాత నాటి సీఎం బ్రహ్మానంద రెడ్డి, ఆర్థిక మంత్రి మర్రి చెన్నారెడ్డిలతో చర్చించి, దేవస్థానం అభివృద్ది చేయాల్సిన అవసరాన్ని వివరించి, స్థానికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కే.వీ. కేశవులను ఏకసభ్య దేవస్థాన పునరుద్ధరణ కమిటీ బాధ్యులుగా నియమింప చేసి, దేవాలయాల అభివృద్ధికి, శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపన అది కార్యక్రమాలకు పి.వి.చేయూత అందించారు.

ధర్మపురి క్షేత్రం లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో నిర్వహించ బడిన శ్రీ రాజ రాజేశ్వర వెంకటేశ్వర సంస్కృత పాఠశాల కోసం శాశ్వత భవనం నిర్మించాలని, నాటి దేవస్థాన పాలక వర్గ కమిటీకి సూచించి, 1970 అక్టోబర్ 2న రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా, శంకు స్థాపన చేశారు. తర్వాత సదరు పాఠశాల భవనం 1976 ఆగస్టు 11న నాటి రాష్ట్ర వ్యవసాయ, రవాణా శాఖల మంత్రి జువ్వాడి చొక్కారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రాజా సాగి సూర్య నారాయణ రాజు చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది.

ఇది చదవండి: ధర్మపురిలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం

 1972 శాసనసభ సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం హోదాలో నాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.రాములుకు మద్దతుగా ధర్మపురి లో ప్రచార సభలో పలువురు మంత్రులతో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గోదావరి నుండి త్రాగు నీటి సరఫరా పథకం మంజూరీ ఇచ్చి, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావును నీటి సరఫరా పథకం పనులు చేయాలని కోరారు. జగపతిరావు సదరు ఆదేశాలను పాటించి ఫిల్టర్ బెడ్, వాటర్ ట్యాం క్, అంతర్గత పైపులైన్లు పూర్తి చేసిన ఫలితంగా 1975 ఏప్రిల్ 29వ తేదీన నాటి పురపాలక శాఖ మంత్రి చల్లా సుబ్బారాయుడు చేతుల మీదుగా రక్షిత నీటి పథకం ప్రారంభించడం జరిగింది.

తమ సన్నిహితులు రొట్టె విశ్వనాథ శాస్త్రి కోరికపై, స్థానిక లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర డిగ్రీ ప్రాచ్య కళాశాల శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని నాటి కరీంనగర్ కలెక్టర్ కే. ఎస్. శర్మను ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్ సంగి కిష్టయ్య, 10,% కాంట్రిబ్యూషన్ తో, నిర్మాణం గావించారు. నాటి ఎమ్మెల్యే జువ్వాడి రత్నాకర్ రావు అభ్యర్థనపై పలు నిధులు మంజూరు చేశారు.

1945 నుండి పి.వి.కి ధర్మపురి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఒక సందర్భంలో కోరుట్లకు చెందిన శతావధాని కృష్ణమాచార్య, ధర్మపురిలో అష్టావధానం చేసిన సమయంలో పి.వి. ఒక పృచ్ఛకునిగా పాల్గొన్నట్లు,పి.వి. సన్నిహితులు, ఆయన సమకాలిక నేత, పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులతో సాన్నిహిత్యం కలిగి ఉన్న దివంగత దాదగారి కిషన్ రావు చెప్పేవారు. స్థానికులైన మాజీ మంత్రి దివంగత కే. వీ. కేశవులు, ధర్మపురి క్షేత్రానికే  చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత మధ్వాచారి శ్యామ్ సుందర్ శాస్త్రి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రాంత బాధ్యులు, హిందీ సాహిత్య రత్న, రాష్ట్రపతి, ప్రధానులు పలువురితో సన్మానితులైన సంగన భట్ల నరహరి శర్మ, విద్యుత్ శాఖ అధికారుల సంఘం రాష్ట్ర బాధ్యులుగా పనిచేసిన స్థానికులు ఇందవరపు సాంబన్న, సంగన భట్ల సాంబన్న తదితరులు పి.వి.కి సుపరిచితులై, సత్సంబంధాలు కలిగి ఉండేవారు.

క్షేత్రంలో గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పథకం, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మశాల, సంస్కృత పాఠశాల భవనం, ఓరియంటల్ డిగ్రీ కళాశాల భవనం పి.వి. చొరవ వల్లనే సాధ్య మైనాయని పి.వి. సన్నిహితులు, ప్రభుత్వ సన్నానితులు, నరసింహ పీఠ నిర్వాహక బాధ్యులు దివంగతు లైన రొట్టె విశ్వనాథ శాస్త్రి చేపుతుండే వారు.సాంప్రదాయ పద్య నాటకంలో తన ప్రదర్శన తిలకించి నట కిరీటి బిరుదుతో గౌరవించి, సన్మానిం చిన సంఘటనను, తమ ఇంటిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యాలయంలో నెల రోజులు బిజీగా పార్టీ పటిష్టతకు అంకిత భావంతో పనిచేసిన, తనతో పాటే నిద్రించిన నేపథ్యాన్ని విశ్వనాథ శాస్త్రి గుర్తు చేసుకునేవారు.

ఇది చదవండి: ధర్మపురి క్షేత్రంలో కన్నులపండువగా ముక్కోటి ఏకాదశి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles