Tuesday, November 5, 2024

లాయర్ దంపతుల హత్యలో పుట్టమధు మేనల్లుడి ప్రమేయం

హతులైన లాయర్ దంపతులు ఇద్దరికీ ఒకే చితిపై గురువారంనాడు అంత్యక్రియలు జరిగాయి. కత్తులూ, ఇతర మారణాయుధాలు అందజేసింది పెద్దపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షుడు పుట్ట మధుకర్  మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ అనీ, కారుకూడా అతడిదేననీ, దాడి చేసింది కుంట శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ నాయకుడనీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ నాగిరెడ్డి వెల్లడించారు. పుట్ట మధుకర్ తన తల్లిపేరు మీద పెట్టిన ట్రస్టు బాధ్యతలు మేనల్లుడు శ్రీనివాస్ చూస్తూ ఉంటాడని తెలుస్తోంది. కత్తులను మంథనిలో ఒక పండ్ల దుకాణం నుంచి తెచ్చారనీ, ఆ దుకాణం ఒక ప్రజాప్రతినిధితి కావడంతో అతడిని విచారిస్తే మరికొన్ని విషయాలు బట్టబయలు అవుతాయనీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు:

ఏ1 గా కుంట శ్రీనునూ, ఏ 2గా చిరంజీవినీ, ఏ 3గా కుమార్ నూ శుక్రవారంనాడు కోర్టుకు హాజరు పరచనున్నట్టు ఐజి నాగిరెడ్డి తెలియజేశారు. వామనరావు స్వగ్రామం గుంజపడుగు గ్రామంలో నెలకొన్న విభేదాలే జంటహత్యలకు కారణమని పోలీసులు అంటున్నారు. ఈ హత్యకు పాల్బడిన ముగ్గురు నిందితులనూ అరెస్టు చేసినట్టు వరంగల్లు రేంజి ఐజి నాగిరెడ్డి తెలియజేశారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో విలేఖరులతో నాగిరెడ్డి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ కూర్చొని ఉన్నారు.

Also Read: సూమోటోగా లాయర్ల హత్య కేసు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఇలా జరిగింది హత్య:

‘‘17న గట్టువామనరావు తన భార్య నాగమణితో కలిసి ఒక కేసు విషయమై మంథని కోర్టుకు వచ్చారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత హైదరాబాద్ కు బయలుదేరారు. వారు రామగిరి మండలం కల్వచర్ల దాటిన తర్వాత అప్పటికే ఒక కారులో మాటువేసి ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్ (44), శివందుల చిరంజీవి (35) వామనరావు కారును స్వల్పంగా ఢీకొట్టి వేటకొడవళ్ళతో కారు అద్దాలు పగలకొట్టారు. కుంట శ్రీనివాస్ వామనరావుపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత కారులో నుంచి బయటకు లాగి మళ్ళీ దాడి చేశాడు. కారులో ఉన్న  నాగమణిపై చిరంజీవి కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం వారిద్దరూ సుందిళ్ళ బ్యారేజి వైపు వెళ్ళి అక్కడ దుస్తులు మార్చుకొని కత్తులను బ్యారేజీలో పడవేసి మహారాష్ట్రవైపు పారిపోయారు,’’ అని నాగిరెడ్డి వివరించారు. వామనరావు కదలికల గురించి గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్ ఎప్పటికప్పుడు నిందితులకు తెలియజేస్తూ సహకరించాడు.

కారు, కత్తులు బిట్టు శ్రీనివాస్ వి:

మంథనికి చెందిన బిట్టు శ్రీను కొబ్బరి బోండాలను కొట్టే రెండు కత్తులతో పాటు తన కారు కూడా ఇచ్చాడని కుంట శ్రీనివాస్ తెలియజేశాడు. ఆ కారును చిరంజీవి డ్రైవ్ చేశాడనీ, వామనరావు కోర్టు నుంచి బయలుదేరిన సమాచారాన్ని తెలుసుకున్న తానూ, చిరంజీవి ముందుగానే దారిలో కాపు కాశామనీ శ్రీనివాస్ చెప్పాడు. హత్య సమాచారాన్ని వామనరావు కారు డ్రైవర్ సతీష్ వామనరావు తండ్రి కిషన్ రావుకు తెలిపాడని పోలీసులు చెప్పారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు రామగిరి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని ఐజి చెప్పారు. పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే వామనరావు దంపతులు చనిపోయారు. గట్టు కిషన్ రావు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302, 341, 120 బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Also Read: ఆందోళన కలిగిస్తున్న నేరం నేపథ్యం

చంద్రాపూర్ ప్రాంతంలో శ్రీను అరెస్టు:

ఏ1 గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్ (44)నూ, ఏ2 గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి (35)నీ, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్ (44) నూ కేసులో చేర్చామని పోలీసులు తెలిపారు. కుంట శ్రీనివాస్, చిరంజీవి బ్రెజా కారులో వెడుతుండగా గురువారం ఉదయం 11 గంటలకు మహరాష్ట్ర సరిహద్దు చంద్రాపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కపాక కుమార్ ను మంథని ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ మంథని కోర్టు శుక్రవారంనాడు హాజరు పరుస్తారనీ ఐజి నాగిరెడ్డి అన్నారు.

స్వగ్రామానికి చెందిన వివాదాలే కారణం:

వామనరావు, శ్రినివాస్ మధ్య చాలా వివాదాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవన్నీ సొంత గ్రామానికి సంబంధించినవే. గుంజనపడుగులోని రామాలయ కమిటీకి సంబంధించిన వివాదం, పెద్దమ్మ ఆలయం, కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివాదాల వల్లనే కుంట శ్రీనివాస్ వామనరావుపైన కక్ష పెంచుకున్నాడని, అది హత్యకు దారితీసిందనీ నాగిరెడ్డి తెలియజేశారు. రామాలయ కమిటీలో శ్రీనివాస్, అక్కపాక కుమార్ తో పాటు రిటైర్డ్ ఇంజనీరు వెల్ది వసంతకుమార్ కూడా ఉన్నారు. అప్పటి వరకూ ఆలయ కార్యదర్శిగా ఉన్న వామనరావు సోదరుడు గట్టు ఇంద్రశేఖరరావును పిలిపించి సంప్రదించి కమిటీ నియమించారని చెప్పారు. గ్రామంలో శ్రీనివాస్ అక్రమంగా నిర్మిస్తున్న ఆలయాన్నీ, ఇంటినీ అడ్డుకోవడానికి వామనరావు ప్రయత్నించడంతో అతడిపైన కక్ష పెంచుకున్నాడని తెలిపారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాలని పోలీసు అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

Also Read: పెద్దపల్లి జంటహత్యలపై హైకోర్టులో పిటిషన్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles