Friday, July 19, 2024

మానవత్వాన్ని మంటగలుపుతున్న పుతిన్

యుద్ధం విరమించాలంటూ ప్రదర్శనలు

 

‘‘యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. మనుషులు చనిపోవడం చూశాను. పిచ్చెత్తిపోవడం, ఆసుపత్రిలో నరకం అనుభవించడం చూశాను. కానీ వీటన్నిటి కన్నా ఘోరాతిఘోరమైన విషయం మరొకటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక – మానసిక వైకల్యం. నిజాలు చెప్పేవారిని నిలువనా శిలువ వేయడం. కళాకారుల చేతులు నరికి వేయడం, సంస్కరణలనూ, విప్లవాలనూ, సామాజిక శక్తులను పక్కదోవ పట్టించడం’’- అని అన్నాడు కవి, విప్లవ రచయిత, జర్నలిస్టు జాన్ రీడ్  (1887-1920). ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా మనగలుగుతున్నాయి. సమస్యలేమైనా ఉంటే ఒకటికి రెండు సార్లు చర్చలు జరుపుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో పుతిన్ చేపట్టిన ఈ యుద్ధనేరానికి కారణమేమిటి? ఇది ఉక్రేయిన్ తో ఆగిపోతుందా? లేక ఇతర దేశాలతో కొనసాగబోతోందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ చెపుతున్నదేమిటీ? ‘‘ఉక్రేయిన్ వేరే దేశం కాదు. అది మా రష్యాలోని అంతర్భాగం. మేమంతా ఒక్కటే’’- అని చెపుతున్నప్పుడు – ఆ దేశంపై అక్రమంగా యుద్ధం ప్రకటించి – నగరాలను నాశనం చేసి, పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి – ఆ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలన్న రాజ్యకాంక్ష, దురహంకారం అతనిలో ఎందుకు పెరిగినట్టూ? అంతర్జాతీయ కోర్టు ‘యుద్ధం తక్షణం ఆపేయమ’ని ఆదేశాలు ఇచ్చినా…పుతిన్ ఎందుకు పట్టించుకోవడం లేదూ? ఇది కమ్యూనిజానికీ, మరో ఆలోచనా ధోరణికీ మధ్య జరిగే యుద్ధంకాదు. పుతిన్ తనకు తాను బలవంతుడినని ఊహించుకుని చేస్తున్న ఉగ్రవాద యుద్ధం. ఇది మానవత్వంపై యుద్ధం. మానవ వినాశనానికి దారి.

Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

మానవత్వం మరిపించిన దురహంకారం

ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ గొప్ప నేపథ్యం ఉన్నకుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. అతి సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాడు. తల్లి వీధులు ఊడ్చేది. తండ్రి ఫ్యాక్టరీ వర్కర్. తాత – లెనిన్,స్టాలిన్ ల దగ్గర వంటమనిషిగా పని చేసేవాడు. ఈ విషయాలు గుర్తు చేసుకోవడమెందుకంటే – సామాన్యుల జీవితాల్లొ సాధకబాధకాలు అతనికి తెలిసి ఉండాలి కదా? మంచితనం మన్ననా తెలిసి ఉండాలి కదా? రష్యా అధ్యక్షుణ్ణయ్యానన్న దురహంకారంతో మానవత్వం మరవడమంటే – అతనితో మనిషి ఏమైపోయినట్టూ? ఏ రకంగా చూసినా యుద్దం వాంఛనీయం కాదు గదా? యుద్ధం ప్రభావం ఉక్రేయిన్ ప్రజలపై నేరుగా పడితే, ఇతర ప్రపంచ పౌరులపై  ముఖ్యంగా సామాన్యులపై అతి తీవ్రంగా ఉంటుంది కదా? ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకప్పటి యు.ఎస్.ఎస్.ఆర్ వేరు. ఇప్పటి రష్యా- యు.ఎస్.ఎస్.ఆర్ లాగా బలమైన దేశం కాదు. ఒకప్పటి సిద్ధాంతాలూ, ఆలోచనా ధోరణులూ ఇప్పుడున్నాయా? అన్ని దేశాలూ పెట్టబడి దారీ వ్యవస్థలకు దాసోహమన్నాయి. ఇంకా ఆ విలువల, ఆ నిజాయితీ, ఆ నిబద్ధతా ఎక్కడా? ఏది ఏమైనా, వైజ్ఞానికి యుగంలో బతుకుతున్న మనుషులుగా మనం ఆలోచించాలి! నిర్దాక్షిణ్యంగా బాంబుదాడులు చేసి కాలుష్యాలు పెంచుకోవడం వల్ల – అణ్వస్త్రాలు ప్రయోగించి ప్రపంచాన్ని  ధ్వసం చేసుకోవడం వల్ల మనిషి ఏం సాధిస్తాడూ? లోగడ ఎన్నో జంతువృక్ష జాతులు కాలగర్భంలో కలిసి పోయినట్టు మనిషి కూడా సత్వరం అంతరించి పోతాడు. దాని కోసమేనా ఈ తహతహ? సహజంగా వచ్చే విపత్తుల వల్లే నశిస్తే, అది వేరే విషయం – మనిషే తెలిసి తెలిసి తనకు తాను నాశనం చేసుకోవడం ఏమైనా విజ్ఞత అనిపించుకుంటుందా?

Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?

నాశనం చేయడానికి ఒక మూర్ఖుడు చాలు

మోహరించిన రష్యన్ సైనికులు

ప్రపంచంలో శాంతి స్థాపించబడాలంటే ఎంతో మంది వివేకవంతులు, మేధావులూ అవసరమౌతారు. నాశనం చేయదల్చుకుంటే మానవత్వం, మానవజాతి పరిరక్షణ…లాంటి విషయాలపై అవగాహన లేని, విచక్షణ లేని పుతిన్ లాంటి అహంకారి ఒక్కడు చాలు! వివేకానికి హద్దులుంటాయేమో కానీ మూర్ఖత్వానికి ఉండవు. మామూలుగా ప్రపంచంలోని ఏ దేశమైనా రక్షణ శాఖ మీద అతితక్కువ శాతం ఖర్చు చేస్తుంది. ఇలా యుద్ధాలు వస్తే ఏం చేస్తాయి? విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి వంటి పనులకు ఉపయోగించే నిధులన్నీ మళ్ళించి రక్షణ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించుకుంటాయి. దానివల్ల ప్రపంచ పౌరుల వినాశనం జరుగుతుందే తప్ప, మానవాళికి జరిగే మేలు ఏమీ ఉండదు. మనకు తెలుసు. భయస్థుడే ఎక్కువ ఉలికి పడతాడు. ఇప్పుడు పుతిన్ ముందస్తుగా ఉలికిపడి బయటపడ్డాడు. తన అమానవీయ సంకల్పంతో ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడ్డాడు. ఉక్రేయిన్ నాటోలో చేరుతాందేమోననీ, చేరితే అమెరికా సైన్యాలు పక్కనే ఉన్న ఉక్రేయిన్ లో మోహరించి, రష్యాపై దాడి చేస్తాయేమోననీ… తన దేశ అంతర్గత భద్రత కోసం తను ఈ యుద్ధం  చేస్తున్నాననీ పుతిన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. రష్యా గనక ఉక్రేయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకంటే – బలమైన దేశం బలహీనమైన చిన్న దేశాల్ని అక్రమంగా దెబ్బతీసి, తనలో కలుపుకోవచ్చన్నది – రుజువవుతుంది. దీన్ని అనుసరిద్దామని మరికొన్ని దేశాలు పథకాలు వేసుకుంటున్నాయేమో! అనాగరిక యుగం నుంచి అత్యాధునిక నాగరిక యుగంలోకి వచ్చి – మళ్ళీ అనాగరికంలో ధబీలుమని పడిపోతామన్నమాట! ఆటవిక న్యాయమే చట్టమౌతుందన్న మాట! హక్కులు, చట్టాలు మూసిపెట్టుకొని, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లాంటి పదాల్ని నిఘంటువుల నుండి తొలగించుకోవాలన్నమాట!

Also read: దైవశక్తి లేదు, ఉన్నదంతా మానవశక్తే

3 Women Describe Life Fighting in the Russia-Ukraine War
రష్యాపైన యుద్ధం చేస్తున్న ఉక్రేయిన్ మహిళలు

యుద్ధం ఆపేయాలంటూ వేలమంది రష్యన్ల ప్రదర్శనలు

అటు రష్యాలో వేలవేల మంది రష్యన్ పౌరులు యుద్ధం వద్దని – ఆపేయాలని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలిస్తున్నారు. బలవంతంగా పుతిన్ ప్రభుత్వం ఎంతమంది గొంతు నొక్కేయగలదూ? ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలనెస్కీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సైనికులలో సైనికుడిగా, పౌరులలో పౌరుడిగా తిరుగుతూ – అటు సైన్యాన్నీ, ఇట ప్రజలనూ ఉత్సాహపరుస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడ్డ ఉక్రేయిన్ యువకులంతా స్వచ్ఛందంగా స్వదేశరక్షణ కోసం వచ్చి – ఆయుధాలు పట్టుకున్నారు. రాజకీయ నాయకులతో సహా స్త్రీలు, పురుషులు అందరూ ఆయుధాలుపట్టారు. చైతన్యవంతుల దేశం అది. అణ్వస్త్రాలు గల బలమైన దేశం అయినా కూడా, ప్రపంచ శాంతి కోసం ఉక్రేయిన్ వాటిని వదిలేసింది. ఇంతకు మించిన మానవవాదం మరొకటి ఉంటుందా? అలాంటి దేశంపై యుద్ధం ప్రకటించడమంటే, అది మానవత్వంపై ప్రకటించిన యుద్ధంగానే భావించాలి! ఆ ఆత్మస్థైర్యం, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత దేశాలకైనా, వ్యక్తులకైనా తప్పని సరికదా? తమ సైన్యాలు దాడి చేయగానే ఉక్రేయిన్ అధ్యక్షుడు భయంతో ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకంటాడనీ, తమ సైనిక బలగాల మీద ఉక్రేయిన్ పౌరులు పూలవర్షం కురిపించి స్వాగతం పలుకుతారని బహుశా పుతిన్ కలలుగని ఉంటాడు. ఇంత తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఊహించి ఉండడు. ప్రపంచ దేశాలు ఏకమై అతణ్ణి ఏకాకిని చేస్తాయని కూడా  ఊహించి ఉండడు.  జెలనెస్కీని హీరోగా నిలబట్టడానికే పుతిన్ ఈ యుద్ధం చేస్తున్నట్లుంది. ఒకప్పటి రీల్ హీరో ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. ఆయుధాలు లేకుండా పౌరులు గుంపులుగా వెళ్ళి ప్రాణాలకు తెగించి రష్యన్ టాంకులను ఆపడం అంటే మాటలు కాదు. ‘రండి. భోజనం చేసి వెనక్కిపొండి’ అని ఉక్రేనియన్ పౌరులు హితవు పలికారు. అలా చెప్పడానికి ఎంతటి ఔదార్యం, ఎంతటి మానవత్వం కావాలి? అందుకు భిన్నంగా రష్యన్ బలగాలు చేసిందేమిటీ? మిలటరీ కేంప్ ల కు పరిమితమై పోకుండా, సామాన్య పౌరులుండే అపార్ట్ మెంట్ ల మీద, ఆసుపత్రుల మీద, విద్యాలయాల మీద బాంబులు కురిపించాయి. అందే యుద్ధనీతి?

Also read: విశ్వసించలేని విశ్వాసం – ఆత్మద్రోహమే

దేశాధినేతలకు ఇంగితం ఉండాలి

దేశాధ్యక్షులయినా, దేశ ప్రధానులయినా ఇంగిత జ్ఞానం, విచక్షణ, హేతుబద్ధత లేకపోతే జనం ‘మూర్ఖులు’ అని ముద్ర వేస్తారు. దేశంలోని అంతర్గత సమస్యలైనా, సరిహద్దు సమస్యలైనా, విదేశాంగ విధానాలైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందాలుండాలి. అప్పుడే మానవ సమాజం వికసిస్తుంది. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడతాయి. అంతే గాని, యుద్ధం వినాశనానికి తప్ప దేనికీ ప్రత్యామ్నాయం కాదు. మానవ వినాశనం కోరుకునే పిరికి నియంతలు మాత్రమే తమ డెప్యూటీలను కూడా అనుమానిస్తారు. పది అడుగుల దూరం ఉంచి మాట్లాడుతారు. మానవ శ్రేయస్సు కోసం పాటుపడేవారు నిరంతరం ప్రజలలోనే ఉంటారు. యుద్ధం వద్దని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలిస్తున్న రష్యా పౌరులే తమ ప్లకార్డుల మీద పుతిన్ పేరు ఇలా రాశారు – ‘‘పుట్-ఇన్’’ అని! వారేం కోరుకుంటున్నారో అందులో ఉంది. ప్రపంచ మానవవాదులంతా ఆకాంక్షించేది కూడా అదే! ‘మనిషి’ని బతికించుకోవడమే మానవాళి ధ్యేయం కావాలి! పిరికివాడు డిక్టేటర్ కావచ్చు. మనిషి కావాలంటేనే సాహసవంతుడై ఉండాలి.

Also read: అంధవిశ్వాసాలను త్యజిస్తూ, విజ్ఞానపథంలోకి పయనిస్తూ… 

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles