Friday, April 19, 2024

పంజాబ్ కాంగ్రెస్ లో ఆగని కుమ్ములాట

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి పట్టుమని ఆరు నెలల సమయమే ఉంది. వచ్చే ఫిబ్రవరి / మార్చిలో ఎన్నికలు జరగాల్సి వుంది. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు శృతి మించిపోతున్నాయి. దూకుడుకు కేర్ అఫ్ అడ్రస్ లాంటి నవజోత్ సింగ్ కు అధిష్టానం ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు కూడా అప్పచెప్పింది. అసలే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు – సిద్ధూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.  ఇప్పుడు ఏ గడ్డి వేయకపోయినా  మంటలు మండే పరిస్థితి వచ్చింది. వెనకాల పొగబెట్టేవారూ పెరుగుతున్నారు. ఈ మంటలు చల్లారకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బూడిదే మిగులుతుందని స్వపక్షీయులే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.  నిన్నటి దాకా ముఖ్యమంత్రి అమరీందర్ కు సలహాదారుడుగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేడోరేపో జాతీయ కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వింటున్నాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోపెట్టడానికి ఆయనదైన శైలిలో కృషి చేస్తారని చెప్పుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా వచ్చే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహమైన ఫలితాలు వస్తేనే  కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. అందులో పంజాబ్ ఒకటి. అక్కడ గెలిచితీరడం పార్టీకి అత్యంత అవసరం.

Also read: నిలిచి వెలిగేది తెలుగే!

పంజాబ్ లో విజయం కాంగ్రెస్ కు అవసరం

ఈ దిశగా కాంగ్రెస్ వేసే ప్రతి అడుగూ అత్యంత కీలకం. సిద్ధూ -అమరీందర్ సింగ్ మధ్య సయోధ్య కుదర్చడం తక్షణ కర్తవ్యం. ఆ సయోధ్య ఎన్నికలు ముగిసేంత వరకూ ఉండేలా చూసుకోవడం ఇంకా ముఖ్యం. ఇద్దరి మధ్యా రాజీ కుదురుస్తానని పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జ్ హరీష్ రావత్ దిల్లీలో తాజాగా  ప్రకటించారు. గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఈ దిశగా ప్రయత్నించారని, దాని పర్యవసానమే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా సిద్ధూ నియామకమని ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అవేమీ ఫలించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు రావత్ మాటలు కూడా ఏ మేరకు ఫలిస్తాయో చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి కావాలని సిద్ధూ అనుకుంటున్నారు. రేపటి ఎన్నికలు మళ్ళీ అమరీందర్ సింగ్ నాయకత్వం లోనే జరుగుతాయాని అధిష్టానం ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని సిద్ధూ మొండి పట్టు పడుతున్నారు. అటు అమరీందర్ సింగ్ ను ఒదులుకోలేక- ఇటు సిద్ధూను కాదనలేక కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకొని కూర్చుంది. పంజాబ్ లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, 117 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 59 సీట్లను గెలుచుకోవాలి. ప్రస్తుతం 77 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. అందులో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధూ మద్దతుదారులే. వారిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలోపే అమరీందర్ ను దించి సిద్ధూను పీఠం ఎక్కించాలని వీరందరూ నానా యాగీ చేస్తున్నారు. ఇప్పటికీ ఇటు పార్టీలోనూ – అటు ప్రజల్లోనూ అమరీందర్ దే పైచేయిగా ఉంది. సిద్ధూ బలమైన రెండో నాయకుడుగా ఉన్నారు. అమ్ ఆద్మీ పార్టీ వారు పార్టీలోకి లాక్కోవలని చూస్తున్నారు. తెరవెనుక బిజెపి కూడా ప్రయత్నం చేస్తోందేమో ఇంకా బయటకు పొక్కలేదు. ఇవ్వన్నీ చూపిస్తూ  పార్టీపై స్వారీ చేసే ప్రయత్నంలో సిద్ధూ ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అమరీందర్ కు వయసు మళ్ళుతోంది.

Also read: రాణే-ఠాక్రే సంచలనాత్మక సమరం

కొత్త తరం నాయకుడికి ప్రోత్సాహం

కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే, సిద్ధూకు అధ్యక్ష పదవిని కట్టపెట్టడం, అతని దూకుడును భరించడం జరుగుతోంది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే అమరీందర్ సింగ్ మద్దతు తప్పనిసరిగా ఉండాలి. అమ్ అద్మీ పార్టీ 20 సీట్లతో రెండో స్థానంలో ఉంది. శిరోమణి అకాలీ దళ్ కు 15 సీట్లు ఉన్నాయి. బిజెపికి కేవలం మూడే సీట్లు ఉన్నాయి. వ్యవసాయ బిల్లుల విషయంలో, బిజెపితో విభేదించి శిరోమణి అకాలీ దళ్ బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ కు 38.50 శాతం ఓటు బ్యాంక్ ఉంది. 25.71 శాతంతో అకాలీ దళ్ రెండో స్థానంలో ఉంది. సీట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న అమ్ అద్మీ పార్టీ 23.71 శాతంతో మూడో స్థానంలో ఉంది. అటు సీట్ల పరంగానూ -ఇటు ఓట్ల పరంగానూ బిజెపి చాలా బలహీనంగా ఉంది. కాంగ్రెస్ లో కుమ్ములాటలు పెరిగితే  అధికారాన్ని ఎవరో ఒకరు తన్నుకు పోతారు. పంజాబ్ లో పరువు నిలబెట్టుకోకపోతే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో  కాంగ్రెస్ కు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

Previous article
Next article
Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles