Tuesday, March 19, 2024

తెలుగు చ‌ల‌న‌చిత్రాల‌లో ప్ర‌గ‌తి కిర‌ణాలు!

కృష్ణాంజనేయయుద్ధం నాటకంలో ఒక దృశ్యం

75 ఏళ్ళ పరిశీలన

“ఆధునిక సందేశం అభ్యుద‌య దృక్ప‌థం అదే ప్ర‌గ‌తి కిర‌ణం!“

“ప్ర‌గ‌తి“ అంటే అభ్యుద‌యం.

“అభ్యుద‌య ప‌రంప‌రాభివృద్ధిర‌స్తు“ అని అనేక ప్రాచీన కావ్యాల‌లోనూ ఉద‌హ‌రించ‌డం జ‌రిగింది. అంటే స‌మాజ శ్రేయ‌స్సు – జ‌న హితం కోరుకునేది అని ప్ర‌గ‌తికి అర్థం చెప్పుకోవ‌చ్చు. ప్ర‌గ‌తి అనేది పాజిటివ్ దృక్ప‌థం క‌ల‌ది అని, ప్ర‌గ‌తి సాధించిన ఎన్నో రంగాలు రుజువు చేసిన నిజం!

ఒక క‌థ‌లో, కావ్యంలో, మ‌రే ఇత‌ర క‌ళా ప్ర‌క్రియ‌లో అయినా స‌మాజాన్ని జాగృతం చేసే భావాలు ఉన్న ఇతివృత్తం ఉంటే, అది ప్ర‌గ‌తిభావ‌పూర‌క మైన‌ది అని చెప్ప‌డానికి అభ్యంత‌రం ఉండ‌కూడ‌దు.

ప్ర‌గ‌తి అనేది ఇవాళ కొత్త‌గా వ‌చ్చిన ప‌ద ప్ర‌యోగం కాద‌ని, ప్రాచీన కావ్యాలు చ‌దివిన వారికి తెలిసిందే అని పైన మ‌న‌వి చేసినా, మ‌రి కాస్త వివ‌రంగా, విపులంగా, విస్తృతంగా చ‌ర్చించుకున్న‌ప్పుడు-

ప్ర‌గ‌తి అనేది వ్య‌క్తిగ‌త అభివృద్ధిక‌న్నా “వ్య‌వ‌స్ధ“ అభివృద్ధికి దోహ‌దం చేసేదిగా ఉండాలి. అయితే సామాజిక దృక్ప‌థం లోపించిన‌ప్పుడే, ఎవ‌రికైనా వ్య‌క్తిగ‌త అభివృద్ధి మీద ఆలోచ‌న మొద‌లు అవుతుంది. కానీ దాన్ని ప్ర‌గ‌తి అని నిర్ధారించ‌డం స‌మంజ‌సం కాదు. ఈ అభిప్రాయంతో నిజ‌మైన ప్ర‌గ‌తివాదులు ఏకీభ‌విస్తార‌న‌డంలో సందేహం లేదు!

దేనికి? – అస‌లు ప్ర‌గ‌తి దేనికి? ఎందుకు జ‌ర‌గాలి? ఎవ‌ర‌యినా ఎందుకు ఆశించాలి? ఈ ప్ర‌శ్న‌లు స‌హ‌జంగా వ‌స్తాయి. ఇందుకు జ‌వాబు విస్తృతంగా ఉంటుంది. అంటే, ఒక‌ర‌కంగా మూలాల‌లోకి, ఇంకా వివ‌రంగా చెప్పాలంటే మ‌న ప్రాచీన స‌మాజం గురించి కొంత‌లో కొంత‌యినా తెలుసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది!

ప్రాచీన నాగ‌రిక‌త: ఆదిమాన‌వులు సంచ‌రించిన కాలం అని చెప్పుకోవ‌చ్చు. ప్రాచీన నాగ‌రిక‌త‌ని. మ‌రి ఈ ప‌దంలో నాగ‌రిక‌త ఎలా వ‌చ్చింది అన్న సందేహం క‌ల‌గ‌డం స‌హ‌జం!

ఏ స‌మాజంలో అయినా, అప్ప‌టి కాలంలో ఉన్న ఆచార వ్య‌వ‌హారాలు, సాంస్కృతిక వికాసాలు, ఇవ‌న్నీ క‌లిపి చూసిన‌ప్పుడు, వాటిని ప‌రిశీలించిన‌ప్పుడు మ‌న‌కు నాటి నాగ‌రిక‌త ల‌క్ష‌ణాలు ఇవి అని తెలియ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంది. అలా ప్రాచీన కాలంలో విస్త‌రిల్లిన పోక‌డ‌ల‌ను వారి నాగ‌రిక‌త‌గా అనుకోవ‌డంలో ఆక్షేప‌ణ ఉండ‌క్క‌ర్లేదు.

మ‌రి ఆనాటి ప్రాచీన నాగ‌రిక‌త‌లో, నాటి జ‌నులు, ఆహార‌, విహారాలు, వ‌స్త్ర‌ధార‌ణ‌, భాష ఇంకా ఇత‌ర క‌ళా ప్ర‌క్రియ‌ల‌ను మ‌నం గ‌మ‌నించిన‌ప్పుడు క్ర‌మంగా పైన చెప్పిన అన్నిటితో కాలానుగుణ‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం తెలుస్తుంది.

అంటే నాటి నాగ‌రిక‌త‌, కొల‌మానాలు కాలంతో మారుతూ రావ‌డాన్నే “ప్ర‌గ‌తి“ అని చెప్పుకోవ‌చ్చు.

అలా దేశ కాల మాన ప‌రిస్ధితుల‌లోని వైవిధ్యం అనండి, స‌హ‌జ ప‌రిణామం అనండి, ఏ మాట ప్ర‌యోగించినా ఉప‌యోగించినా అది ప్ర‌గ‌తి అవుతుంది అన‌డం నిస్సందేహం! మ‌రి దీనినిబ‌ట్టి తెలుస్తున్నదేమిటంటే మ‌నం చ‌ర్చించుకుంటున్న ప్ర‌గ‌తి అనేది ఏ రంగంలోనైనా అంటే తిండి – బ‌ట్ట – ఆవాసం – సాంస్కృతిక కార్య‌క‌లాపాలు, వీట‌న్నిటిలోను, ప్ర‌గ‌తిని సూచించే మార్పు, ప్ర‌గ‌తిని వ్య‌క్తం చేసే ప‌రిణామం, ఒక్క‌సారిగా రూపుదిద్దుకోలేదు అని తెలుస్తోంది.

ఒక గొంగ‌ళి పురుగు అంద‌మైన సీతాకోక‌చిలుక‌గా మార‌డానికి ఎన్నో ద‌శ‌ల‌ను దాట‌వ‌ల‌సి వ‌చ్చి ఆఖ‌రికి ఓ సుంద‌ర రూపం దాల్చుతుంది. ఇది ఆ జీవి జీవితంలోని ప్ర‌గ‌తి ప‌రిణామంగా భావించ‌వ‌చ్చు. అది ప్ర‌కృతి ధ‌ర్మం అని భావించ‌డం విజ్ఞ‌త‌కు సూచిక‌!

ఇప్పుడు అస‌లు ప్ర‌గ‌తి ఎందుకు అన్న మూల ప్ర‌శ్న‌కు వ‌చ్చిన‌ప్పుడు, దానికి జ‌వాబు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

సృష్టిలోని ప్ర‌తి ప్రాణి, పుట్టిన ద‌గ్గ‌ర్నుంచీ గిట్టేవ‌ర‌కూ ఒకే స్వ‌రూపం – ఒకే స్వ‌భావంతో ఉండ‌వు! అలా ఉండ‌లేని త‌నం, ప్ర‌కృతి విధించిన ధ‌ర్మం అనుకోవ‌చ్చు.

అంటే ఉన్న‌దానిక‌న్నా అంత‌కంత‌కూ మెరుగైన జీవితం కావాల‌నుకోవ‌డం, ప్ర‌దేశాలు, ప‌రిస్ధితులు మారాల‌నుకోవ‌డం అనేటువంటివి ప్ర‌గ‌తి మూల స్వ‌భావం.

ఈ మార్పు కొన్నిసార్లు తెలిసి కోరుకున్నా, తెలియ‌క కోరుకున్నా జ‌రిగే తీరుతుంది అనేది విశ్వ‌స‌త్యం. ఈ మార్పునే ప్ర‌గ‌తి అన్నా అభ్యంత‌రం ఉండ‌కూడ‌దు మ‌రి.

ఇంత‌కు ముందు మ‌న‌వి చేసిన‌ట్టు వ్య‌క్తిగ‌త‌మైన మార్పుక‌న్నా వ్య‌వ‌స్థీకృతమైన మార్పు స‌మాజానికి మేలు చేస్తుంది. స‌మాజ పురోగ‌తికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. అటువంటి స‌మాజంలో మాన‌వ‌త్వం, స‌మాన‌త్వం ప‌రిమ‌ళిస్తాయి.

అస‌లు ప్ర‌గ‌తి భావ‌న ఎందుకు?

ఈ ప్ర‌శ్న చ‌ర్విత చ‌ర్వ‌ణం కాద‌ని మ‌న‌వి. ఎందుకంటే ప్ర‌గ‌తి ఎలా వ‌స్తుందో అని చెప్పుకున్న‌ప్పుడు అది ప్ర‌కృతి ధ‌ర్మం అని వివ‌రించ‌డం జ‌రిగింది.

అయితే మ‌నిషికి త‌న‌కంటూ ఓ స్వ‌భావం, స‌హ‌జ‌సిద్ధ‌మైన ధ‌ర్మం (ఇక్క‌డ ధ‌ర్మం అంటే మ‌త‌ప‌ర‌మైన‌ది కాదు)  ఉంటాయి.

ప్రాచీన నాగ‌రిక‌త‌, క్ర‌మంగా మారుతూ వ‌స్తూ ప‌రిణామంలో ఎన్నో సాంఘిక‌, సాంస్కృతిక ద‌శ‌ల‌ను అధిగ‌మిస్తూ వ‌చ్చి ఒక స్వ‌రూపాన్ని (అప్ప‌టికి) సంత‌రించుకున్న స్థితికి వ‌చ్చింది.

అప్ప‌టికి అంటే ఆ స్థితికి వ‌చ్చే స‌మ‌యానికి జీవ‌న విధానంలో నాగ‌రిక‌మైన మార్పులు రావ‌డం, దాంతోపాటు జీవ‌న విధానంలో భాగ‌మైన సాంస్కృతిక కార్య‌క‌లాపాల్లోనూ, ఆహ్వానించ‌ద‌గిన మార్పులు చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా ల‌లిత క‌ళ‌ల్లోని సాహిత్య రంగంలోనూ, వినోద ప్ర‌క్రియ‌ల్లోనూ అంటే మాన‌సిక ఉల్లాసం క‌లిగించే క‌ళారూపాల్లోనూ చెప్పుకోద‌గిన మార్పులు సంభ‌వించ‌డానికి అవ‌కాశం క‌లిగింది.

వాటి ఫ‌లిత‌మే క్ర‌మంగా వినోద ప్ర‌క్రియ‌ల్లో వ‌చ్చిన నూత‌న మార్పుల‌ను, నాటి స‌మ‌కాలీన స‌మాజం, ప్ర‌గ‌తి భావాలుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రిగింది.

ఏమిటీ ప్ర‌గ‌తి భావాలు?

ఈ ప్ర‌శ్న వేసుకున్నప్పుడు ముందుగా మ‌న‌కి క‌లిగే ఆలోచ‌న ఏమిటంటే అంత‌వ‌ర‌కూ ఉన్న సాంస్కృతిక నిబంధ‌న‌ల‌కు, ఒకే మూస‌లో వ‌స్తున్న క‌ళారూపాల‌కు భిన్నంగా ఒక నూత‌న రూపంతో రావ‌డం అని చెప్పుకోవ‌చ్చు.

ఇలాంటి ప్ర‌గ‌తి పూరిత ప‌రిణామం నాటి క‌ళారూపాల్లో ఒక‌టైన నాట‌క రంగంలో (థియేట‌ర్ స్టేజ్‌) జ‌రిగింది.

ఎలా జ‌రిగింది? శారీర‌క‌మైన శ్ర‌మ‌ను మ‌రిపించేవి ల‌లిత‌క‌ళ‌లు. అవి క‌లిగించే మాన‌సిక ఆనందంతో శారీర‌క శ్ర‌మ‌ను మ‌రిచిపోయే అవ‌కాశం ఉండ‌డంతో సామాన్య ప్ర‌జానీకం అటువంటి వినోద కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇది నేటికీ వ‌ర్తించే సూత్రం.

ఇటువంటి వినోద కార్య‌క్ర‌మాల‌లో ముఖ్యంగా నాట‌కాల‌లో, తొలిరోజుల్లో ఎక్కువ‌గా పౌరాణిక ఇతివృత్తాలున్న ప్ర‌ద‌ర్శ‌న‌లే ఉండేవి.

అలాంటి నాట‌కాల‌కు ఉదాహ‌ర‌ణ‌లుగా శ్రీ‌కృష్ణ‌తులాభారం, స‌త్య‌హ‌రిశ్చంద్ర‌, పాండ‌వోద్యోగ విజ‌యాలు, రుక్మిణీ క‌ళ్యాణ‌ము, సారంగ‌ధ‌ర‌, శ‌కుంత‌ల‌, రామాంజ‌నేయ యుద్ధం ఇలా మ‌రికొన్ని పౌరాణిక నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు విరివిగా ప్ర‌ద‌ర్శించే వారు. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అంత‌లా ఉండేది. ఈ ఆద‌ర‌ణ‌కు కార‌ణం మ‌రొక‌టి ఏమిటంటే ఈ నాట‌కాల్లోని క‌థ‌ల‌న్నీ అంద‌రికీ తెలిసిన‌వి కావ‌డం. ఆ క‌థ‌ల్లోని పాత్ర‌ల‌ను రంగ‌స్థ‌లం మీద ప్రావీణ్యం క‌లిగిన న‌టీన‌టులు న‌టిస్తుండ‌డంతో పౌరాణిక నాట‌కాల‌కు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌డం జ‌రిగింది.

మ‌రో ముఖ్య కార‌ణం ఆ నాట‌కాల్లోని ప‌ద్యాలు. సంగీత జ్ఞానం ప్రాధ‌మికంగా కూడా లేనివారు సైతం ఆ ప‌ద్యాల‌ను, రాగాల‌ను వింటూ ఆనందించే వారు. పైగా పౌరాణిక నాట‌కాల‌లో వ‌చ‌నంక‌న్నా ప‌ద్యాల సంఖ్య ఎక్కువ‌గా ఉండేది. దాదాపు నూరు, నూట యాభై ప‌ద్యాలున్న నాట‌కాల‌ను సుమారుగా నాలుగైదు గంట‌ల‌పాటు ప్ర‌ద‌ర్శించే వాళ్లు. ఆర‌క‌మైన నాట‌కాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవాళ్లు అంటే అతిశ‌యోక్తి కాదు. అలా ఆ త‌ర‌హా నాట‌కాలు ఒక ద‌శ‌లో రాజ్య‌మేలినాయి అని చెప్ప‌వ‌చ్చు.

అయితే ప్ర‌గ‌తి అంటే ప‌రిణ‌తి దిశ‌గా మార్పు అని క‌దా!

ఆ సూత్రం ప్ర‌కారం పౌరాణిక నాట‌కాల స్ధానంలో క్ర‌మంగా సాంఘిక నాట‌కాలు చోటు చేసుకోవ‌డం ప్రారంభించాయి. ఈ సాంఘిక నాట‌కాల రాక ఓ గొప్ప మార్పుకి, అంటే ప్ర‌గ‌తి దిశ‌గా అడుగులు వేయ‌డానికి దారితీసింది అని చెప్ప‌వ‌చ్చు. త‌రువాతి కాలంలో ఇది నిజ‌మ‌ని రుజువు అయింది!

ఇక్క‌డొక ముఖ్య విష‌యం చెప్పుకోవాలి. పౌరాణిక నాట‌కాల ప్ర‌భావం వాటి ఆర్ధిక ఫ‌లితాలు చిత్ర నిర్మాత‌ల‌కు, అంటే పెట్టుబ‌డిదారుల‌కు, చాలా ఆశాజ‌న‌కంగా అనిపించి, ప్ర‌సిద్ధిచెందిన పౌరాణిక నాట‌కాల‌నే చిత్రాలుగా తీసేవారు నిర్మాత‌లు!

అలా వ‌చ్చిందే టాకీ పులి శ్రీ హెచ్ ఎం రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాణ‌మైన భ‌క్త‌ప్ర‌హ్లాద (1931) తొలి టాకీ చిత్రంగా పేరు తెచ్చుకుంది.

ఇక ఆ త‌రువాత ఎన్నో పౌరాణిక నాట‌కాలు, వెండితెర‌కెక్కాయి. వాటిలో చాలా భాగం సొమ్ము చేసుకున్నాయి.

అయితే పైన చెప్పిన‌ట్టు సాంఘిక చిత్రాల రాక‌తో పౌరాణిక చిత్రాల వెల్లువ త‌గ్గింద‌నాలి. ఇక్క‌డ సాంఘిక చిత్రాల విష‌యానికి వ‌స్తే  ఓ చిత్ర‌మైన విష‌యం చెప్పుకోవాలి.

తొలి సాంఘిక చిత్రం “ప్రేమ విజ‌యం“ ప‌రాజ‌యం పాల‌యింది. దాంతో ఆర్ధిక సూత్రాల‌ను న‌మ్ముకున్న నిర్మాత‌లు, మ‌ళ్లీ పౌరాణిక చిత్రాల వైపు చూపు సారించారు. అయితే ఈ ధోర‌ణి ఎంతో కాలం సాగ‌లేదు.

సాంఘిక ఇతివృత్తాల‌తో ఆనాటి ప్రేక్ష‌కులు ఊహించ‌ని చిత్రాలు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఆ చిత్రాలు ఇప్ప‌టికి దాదాపు 75 ఏళ్ల క్రిత‌మే విడుద‌ల‌వ‌డం, కొన్ని చిత్రాలు “ప్ర‌గ‌తి“ భావాల‌కు ద‌ర్ప‌ణంలా ఉండ‌టం, ఆశ్చ‌ర్య‌మే కాదు, ఆహ్వానించ‌ద‌గిన విష‌యంగా ఉండ‌టం గ‌మ‌నార్హం!

అస‌లు అప్ప‌టి సాంఘిక క‌ట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు ముప్పేట‌గా ముసురుకున్న వాతావ‌ర‌ణంలో అభ్యుద‌య (ప్ర‌గ‌తి) భావాల క‌థా క‌థ‌నాల‌తో చిత్రాలు నిర్మించ‌డం, చాలా సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గా భావించ‌వ‌చ్చు. ఇంకా విపులీక‌రిస్తే చిత్ర వ్యాపార కోణంలో ఏటికెదురీద‌డ‌మే అన‌వ‌చ్చు. అప్ప‌టి చిత్ర వాతావ‌ర‌ణాన్ని విశ్లేషించుకుంటే ఒడ్డు తెలియ‌ని ఒడిదుడుకులు, ప‌ట్టుద‌ల‌తో ప్ర‌గ‌తి దిశ‌గా వేసిన అడుగులు, ఆ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌వి అంటే అక్ష‌ర స‌త్యం అవుతుంది.

(ఏమిటా చిత్రాలు?  ఈ సంగతులు వివరంగా చర్చించుకుందాం ఈ ధారావాహికలో)

Yadavalli
Yadavalli
Yadavalli is a versatile writer in Telugu. He has been writing lyrics, script, screenplay for South Indian films and also directed a few of them.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles