Sunday, June 26, 2022

ప్రార్ధన

ఆధునిక భేతాళ కథలు –2

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే   మౌనంగా  స్మశానం వైపు నడవసాగాడు .

అప్పుడు శవంలోని భేతాళుడు – “రాజా కష్టపడితే పడ్డావు కానీ నీకు కష్టం తెలియకుండా ఉండటానికి “ప్రార్ధన” అన్న ఓ కథ చెబుతాను “అంటూ  చెప్పసాగాడు.

“కిరణ్ ఓ న్యాయవాది. యువకుడు .అతనికి ఇరువై సంవత్సరాలు ఉంటాయి. అతను ఓ రోజు వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళినాడు. వాళ్ల బావ ఓ సీనియర్ పోలీసు అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. వాళ్ళ బావకి  ఉర్దూ బాగా వచ్చు. ఆయన  చదువుకున్నది ఉర్దూ మీడియంలో. అప్పటి  పాఠ్య పుస్తకాలు ఇంకా వాళ్ల బావ దగ్గర ఉన్నాయి. కిరణ్ వెళ్ళినపుడు టీపాయ్ మీద అప్పటి పాఠ్య పుస్తకాలు కనిపించాయి. 1940-45 ప్రాంతంలోని పాఠ్యపుస్తకాలు అవి. ఓ పుస్తకాన్ని తీసి తిరగేశాడు. అది చాలా పాతబడిపోయి ఉంది. దాన్ని మొదటి నుంచి చివరి దాకా చూశాడు. ఇప్పటి పాఠ్యపుస్తకాల్లో మాదిరిగా ఇందులో ఓ ప్రార్థన గీతం కనిపించింది. ‘ప్రతిజ్ఞ’లాంటిది. అది ఉర్దూలో ఉండడం వల్ల కిరణ్ దాన్నిఅర్థం చేసుకోలేకపోయాడు. చదవలేకపోయాడు కూడా. కిరణ్ కి ఉర్దూ రాదు. అప్పుడు ప్రార్థన ఏ రకంగా ఉండేదో తెలుసుకోవాలని అనిపించింది.

తెలుగులో దాని సారాంశాన్ని చెప్పమని వాళ్ళ బావని కోరినాడు కిరణ్. దాన్ని తెలుగులో తర్జుమా చేసి చదివి వినిపించాడు వాళ్ళ బావ. అది ఇలా ఉంటుంది-

“ఈ సృష్టి ఉన్నంత వరకూ మీ రాజ్యం కొనసాగాలని సృష్టికర్త ఆశీర్వదిస్తాడు.

ఓ ఉస్మాన్-

మిమ్మల్ని మంచిగా, ఆరోగ్యంగా ఉంచుతాడు

వంద సంవత్సరాలు గౌరవంగా జీవించేలా చేస్తాడు.

ఆ భగవంతుని దయవల్ల మీరు ఎంతో మందికి ఆదర్శంగా,గర్వంగా నిలుస్తారు.

అదేవిధంగా మీ పాలనని విశిష్టంగా ఉంచుతాడు.

మీ సంతానానికి ఖిజ్రీ వంటి సుదీర్ఘ జీవితాన్ని ఆ దేవుడు ప్రసాదిస్తాడు.

వారసత్వంగా మీ పాలన కొనసాగేలా ఆశీర్వదిస్తాడు.

మీ ముందు హాకీం దాతృత్వం  పాలిపోయి ఉంటుంది.

మీ న్యాయభావం ఖుస్రోని కూడా అధిగమిస్తుంది.

మీ శ్రేయోభిలాషులు పుష్పాల్లాగా నిండుగా వికసిస్తారు.

మీ శత్రువులు మీ పరాక్రామాన్ని చూసి దాసోహం అవుతారు

ఓ ఉస్మాన్-

మీ చావిడిని  ఆ దేవదేవుడు 

ఆనంద పారవశ్య నివాసంగా మారుస్తాడు .”

ఇది అ ప్రార్ధన తెలుగులో అని చెప్పాడు వాళ్ళ బావ. నేను సరిగ్గానే అనువాదం చేశానని అనుకుంటున్నాను అని కూడా అన్నాడు.

కిరణ్ కి విషయం అర్థమైంది,  అయితే ‘భారత దేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు’ అన్న పైడిమర్రి వెంకట సుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ లాంటివే ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ ఉస్మాన్ కాలంనాటి ప్రార్థనలు కనిపించడం లేదు ఎందుకనో అని అనుకున్నాడు. అలాంటి ప్రార్ధనలు ఎందుకు ఇప్పటి పాఠ్య పుస్తకాల్లో లేవో కిరణ్ కే కాదు. నాకు కూడా అర్థం కాలేదు. కారణం ఏమిటి ..?’’

ఈ సందేహాలకు సమాధానాలు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు భేతాళుడు.

దానికి విక్రమార్కుడు- “భేతాళా, ఇప్పుడు కాలం మారిపోయింది. రాజులు సంస్థానాధీశులు ఇప్పుడు లేరు. ప్రజాస్వామ్య ముసుగులో రాజ్యపాలనలు కొనసాగుతున్నాయి. ఏ మాత్రం శ్రద్ధగా గమనించినా ఈ విషయము నీకు బోధపడుతుంది. కానీ అలాంటి ప్రార్థనలు  ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉంచడం భావ్యం కాదని నేటి పాలకులు భావించారు. నిజానికి అలా ప్రార్ధించాలని వాళ్ళ మనస్సులో వుంటుంది. అయినా ఆ ప్రార్థనలని  ప్రత్యక్షంగా పాఠ్యపుస్తకాల్లో పెట్టలేదు. కానీ నిగూఢంగా ఆ ప్రార్థనలు ఉన్నాయి. పరోక్షంగా పాలకులు గమనిస్తూనే వున్నారు. అధికారులూ, పదవుల్లో ఉన్న వ్యక్తులు, నాయకులు రోజు ఉదయాన్నే కాదు అనుక్షణం ఆ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. వాళ్ల  తమ ట్వీట్ల ద్వారా, హావభావాల ద్వారా, శుభాకాంక్షల ద్వారా ప్రార్ధనలని చేస్తూనే వున్నారు. కొంచం శ్రద్ధగా మనం ఆ కోణంలో చూస్తే చాలు. ఆ ప్రార్థనలు మనకూ వినిపిస్తాయి.  అంతే ! ” జవాబు చెప్పాడు భేతాళుడు.

విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు  శవంతో సహా మాయమై చెట్టు ఎక్కేసాడు.

@@@@

Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

3 COMMENTS

  1. నమస్కారం అభినందనలు మంచి కథ పాలకుల మనస్తత్వం తెలిపారు

  2. మంచి కథలు రాస్తున్నారు సార్ బాగున్నాయి.. అభినందనలు

  3. MSR Swamy. కధలు, గాధలు, కవితలు, మానవత్వం సూచిస్తున్నవి, మానవత్వం వైపు నడిపిస్తున్నవి. అనారోగ్యం వలన షుమారు ఒక నెల నుంచి ఏమి చూడలేకపోయినాను. దయచేసి మీరు మీ పోస్టులన్నిటిని ఎప్పటిలాగా పంపవలసిన దిగా అభ్యర్థన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles