Monday, April 22, 2024

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మంత్రతంత్రాలు

  • తనకు ఔట్ సోర్స్ చేసిన పార్టీ విజయానికి అపరిమితమైన కృషి
  • గెలుపే ప్రధానంగా రాజకీయ విన్యాసాలు, ఎత్తుగడలు
  • ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వం చేయవలసిన పనులలో అత్యధిక భాగం పీకే బృందం చేస్తుంది
  • అభ్యర్థుల ఎంపిక, వారి విజయానికి సోపానాలు వేయడం పీకే బృందం బాధ్యత

ప్రశాంత్ కిశోర్ విభిన్నమైన లక్ష్యాలను ఛేదించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలలో నాయకత్వ స్థానంలో శూన్యత ఉన్నట్టు ఆయన గ్రహించినట్టున్నారు. ఆ రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం శక్తిమంతుడైన అధినాయకుడిని అధికారం నుంచి తొలగించడమే. అంతకు ముందు యోగేంద్రయాదవ్, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్, తదితరుల రాజకీయ ప్రస్థానం గురించి ప్రశాంత్ కిషోర్ (పీకే)కి తెలియకుండా ఉంటుందని అనుకోను. ప్రజాభిప్రేయ సేకరణ రంగంలో చాలా సంవత్సరాలు పని చేసి, ఎన్నికల ఫలితాలను అంచనావేయడంలో దిట్టగా పేరుప్రఖ్యాతులు గడించిన యోగేంద్రయాదవ్ రాజకీయ నాయకుడుగా నిలదొక్కుకోలేకపోయారు. చాలామంది ఎన్నికల ప్రవీణులకంటే యోగేంద్రయాదవ్ కు క్షేత్రవాస్తవికత క్షుణ్ణంగా తెలుసు.

Also read: పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?

ఒకే దశాబ్దంలో ఆరు రాష్ట్రాలలో పరస్పర సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన ఏడు రాజకీయ పార్టీలకు పని చేసిన అనుభవం, విశ్వసనీయత పీకేకి ఉన్నాయి. ఆయనే ఒక సరికొత్త పోకడకు ప్రతినిధిగా ఎదిగారు. ఎన్నికల సర్వేలు జరపడం, రాజకీయాలలో కొంతమంది ఎన్నికల ప్రవీణులు ప్రవేశించడం మినహా పీకేతో పోల్చదగిన ఎన్నికల వ్యూహకర్తలు ఎవ్వరూ ఇండియాలో ఇంతకు ముందు లేరు. పీకేని ఎన్నికల ప్రవీణుడు అని కానీ సర్వేనిపుణుడు అని కానీ పిలవడం లేదు. ఆయనను ఆయన కోరుకునే విధంగానే ‘‘ఎన్నికల వ్యూహకర్త (ఎలక్షన్ స్ట్రాటజిస్ట్)’’ అని పిలుస్తున్నారు. ఎన్నికల సమయంలో సర్వేలు నిర్వహించడం, ప్రజాభిప్రాయం సేకరించడం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ఈ రంగంలో గత ఇరవై అయిదు సంవత్సరాలుగా అనేక మార్పులు సంభవించి అంతిమంగా ఎన్నికలను బయటి సంస్థకు అప్పగించే (ఔట్ సోర్స్) విధంగా పరిణమించింది.

సైద్ధాంతిక సారూప్యం లేకపోయినప్పటికీ తన సేవలు వినియోగించుకున్న (క్లయింట్స్) రాజకీయ ధురందరులు మోదీ, రాహుల్, జగన్, కెప్టెన్ అమరీందర్ సింగ్ లతో పీకే

సర్వేసర్వత్రా సర్వేలు

ఎన్నికల సమయంలో సర్వేలు చేయడం అనే ప్రక్రియ నలభై ఏళ్ళ కిందట ప్రారంభమైంది. అది స్వతంత్రంగా చేసిన వ్యాపకం. తర్వాత సర్వేలను పత్రికలూ, టీవీ చానళ్ళూ చేయించడం ప్రారంభించాయి. 1988 తర్వాత రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం సర్వేలు జరిపించడం మొదలుపెట్టారు. అటువంటి సర్వేల ఫలితాలు అన్నీ వార్తాపత్రికలలో వచ్చేవి కావు. రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ తమ అవగాహన కోసం చేయించుకున్న సర్వేల ఫలితాలకు ప్రచారం ఇచ్చేవారు కాదు. ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎంత శాతం ఓట్లు వస్తాయో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఎన్నికలలో ఓటర్లపైన ప్రభావం వేసే అంశాలు ఏమిటో సర్వేల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. పత్రికలూ, టీవీ చానళ్ళూ చేసే లేదా చేయించే సర్వే ఫలితాలు కేవలం పాఠకుల లేదా వీక్షకుల సమాచారం నిమిత్తమే.

Also read: పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది

‘‘పొల్ సర్వేస్ ఇన్ న్యూస్ మీడియా’’ అనే టైటిల్ తో నేను రాసిన పుస్తకం (ఎన్ బిటీ – నేషనల్ బుక్ ట్రస్ట్- 2011లో ప్రచురించింది)లో అప్పటికి రెండు దశాబ్దాలుగా నేను చేసిన సర్వేల అనుభవం ప్రాతిపదికగా ఇండియాలో ఎన్నికల సర్వేలు ఏ విధంగా జరుపుతారో, ఎవరు జరుపుతారో, దాని ఖర్చు ఎవరు భరిస్తారో, ఎటువంటి విధానాన్ని (మెథడాలజీ) వినియోగిస్తారో వివరించాను. అటువంటి సర్వేలు చూపించే ప్రభావం గురించి మీడియా, ఓటర్లు కూడా ఎట్లా స్పందించాలనే విషయంలో హెచ్చరికలు కూడా చేశాను. సర్వేల వల్ల ప్రమాదాల గురించి, ఓటర్ల భావాలపైన ప్రభావం వేసే విధంగా జరిగే మతలబుల గురించీ ఇటీవలనే ప్రచురించిన నా మరో పుస్తకం ‘ద థర్డ్ ఐ ఆఫ్ ద గవర్నమెంట్’ లో తెలియజేశాను.

Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి

లక్ష్యాలు ఛేదించడం ప్రధానం

ఔట్ సోర్సింగ్ విధానంలో పీకే చేపట్టే సర్వేలూ, వ్యూహాలూ ఫలానా పార్టీ విజయం సాధించడం కోసం ఆ పార్టీ నాయకుడు లేదా నాయకురాలు పనికట్టుకొని ఫీజు చెల్లించి చేయించుకుంటున్న సేవలు. విజయ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఏమేమి చేయాలో, ఎట్లా చేయాలో అనే విషయాలు సమస్తం ఎన్నికల వ్యూహంలో అంతర్భాగం. ఈ సంక్లిష్టమైన, బహుముఖీనమైన సేవలు అధినాయకుడి బాధ్యతలను పంచుకోవడం వరకూ వెళ్ళవచ్చు. ఎన్నికలలో నిలబెట్టాలని భావించిన, నిలబడాలని అభిలషిస్తున్న  అభ్యర్థుల జాబితా తయారు చేసుకొని, వాటిని అవసరమైనంత మేరకు  కుందించి, చివరికి అభ్యర్థులను ఎంపిక చేయడం వరకూ వ్యూహకర్త చేయవలసిన లేదా నిర్వహించవలసిన బాధ్యతలే. అదే విధంగా ఎన్నికల ప్రచారానికి రూపకల్పన చేయడం, ప్రచార వ్యూహాలను అమలు చేయడం, ఎన్నికల ప్రణాళికారచనకు అవసరమైన ముఖ్యమైన అంశాలను  సమకూర్చడం, ఎన్నికల ప్రచారంలో వక్తల ఉపన్యాసాలకు అవసరమైనన ప్రస్తావనాంశాలు అందించడం, పార్టీ విధేయతతో నిమిత్తం లేకుండా ఎన్నికలను ప్రభావితం చేయగల కీలకమైన పార్టీలతో, వ్యక్తులతో సమాలోచనలు జరపడం, క్షేత్రం నుంచి అందుతున్న సమాచారాన్ని అధ్యయనం చేయడం, ఎన్నికల సర్వేల ఫలితాలనూ, పత్రికలూ, టీవీలూ, సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ, విశ్లేషణలనూ, అభిప్రాయాలనూ తాను పని చేస్తున్న పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేయడం ఎన్నికల వ్యూహకర్త విధులు. తనకు ఔట్ సోర్స్ చేసిన పార్టీ అధినాయకుడికి అనుకూలమైన వాతావరణాన్ని ఎన్నికల సమయంలో సృష్టించడం అత్యంత ప్రధానం.

తన క్లయింట్స్ నితీశ్ కుమార్, మమతాబెనర్జీ, స్టాిలిన్, అరవింద్ కేజ్రీవాల్ తో పీకే

పీకేకి తోడ్పడిన 5 కీలకాంశాలు

ఎన్నికల రంగంలో హీరోగా పీకే ఎదగడానికి అయిదు అంశాలు తోడ్పడ్డాయి. 1. దేశంలోని ప్రతి లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలలో పోలైన ఓట్లను బూతులవారీ, పార్టీలవారీగా సమస్త సమాచారాన్నివిశ్లేషణలతో సహా ఎన్నికల కమిషన్ ఆన్ లైన్ లో అందజేయడం చాలా ముఖ్యమైన పరిణామం. గత ఎన్నికలలో ఓటింగ్ తీరుతెన్నులు (ఓటింగ్ ట్రెండ్స్) ఏమిటో ఎన్నికల కమిషన్ సాధికారికంగానే అందజేస్తున్నది. 2. ఆధార్ కార్డుల వివరాలూ, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలూ, ఫోన్, కారూ, టీవీ ఉన్నవారికి వాటి వివరాలూ, తదితర అంశాలపైన సమగ్రమైన సమాచార నిధి అందుబాటులో ఉండడం. 3. ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకొని, పాత అంకెలనూ, సర్వేలలో వస్తున్న కొత్త అంకెలనూ బేరీజు వేసి, ఓటర్లను వివిధ అంశాల ప్రాతిపదికగా విభజించి వచ్చే ఎన్నికలలో ఏ వర్గం, ఏ పార్టీకి, ఎందుకోసం, ఏమి ఆశించి ఓటు చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని రాజకీయ పార్టీ అధినేతలకు అరటిపండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా ఎన్నికల రంగాన్ని విశ్లేషించి చెప్పడానికి దోహదం చేసే అద్భుతమైన సాఫ్ట్ వేర్ (ప్రోగ్రామింగ్ టూల్స్) అభివృద్ధి చెంది అందుబాటులో ఉండటం 4. సోషల్ మీడియా అనూహ్యంగా విస్తరించడం, ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ మొదలైన యాప్ లు అందుబాటులోకి రావడం, బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సదుపాయం అందరికీ ఎల్లవేళలా అపరిమితంగా నమ్మకంగా అందుబాటులో ఉండటం, వీటి వల్ల అత్యంత వేగంగా వార్తలను తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ప్రచురించే విధంగా ప్రయత్నించడం లేదా టెలికాస్ట్ చేయించుకోవడం, బూటకపు (మేనిప్యులేటెడ్ లేదా ఫేక్) వీడియోలను తయారు చేయించి జనంమీదికి వదలడం వంటి పనులు సునాయాసంగా చేయగలగడం. 5. తనకు ఎన్నికల వ్యూహాన్ని ఔట్ సోర్స్ చేసిన పార్టీ అధినేత పార్టీ కార్యకర్తలకు ఫలానా సంస్థను ఎన్నికల వ్యూహరచన, అమలు కోసం నియమించామనీ, ఆ సంస్థవారితో సహకరించమనీ చెప్పడం. పీకే ని నియమించిన విషయాన్ని కొందరు నాయకులు బహిరంగంగా ప్రకటించకుండా నర్మగర్భంగా ఉంటే మరికొందరు తమ పక్కనే కూర్చోబెట్టుకొని తమ పార్టీ నాయకులకూ, కార్యకర్తలకూ వ్యూహకర్త ఎంత ముఖ్యుడో, ఎంత ప్రతిభావంతుడో చెప్పారు. దీనివల్ల వ్యూహకర్త నాయకత్వంలో పని చేస్తున్న సంస్థకి క్షేత్రస్థాయి సమాచారం తేలికగా, వేగంగా అందుతుంది. స్థానికంగా ఓటర్లలో ప్రాబల్యం కలిగిన నాయకులతో పార్టీలోని ఇతర పెద్దలకూ, నాయకులకూ తెలియకుండా వ్యూహకర్త లేదా అతడి ప్రతినిధులు సంప్రదింపులు జరపడం కూడా తేలిక అవుతుంది. ఇవి వ్యూహకర్తకు మాత్రమే తెలిసి జరిగే రహస్య సమాలోచనలు. అంతా పార్టీ మేలు కోసమే, విజయం సాధించడం కోసమే.

Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

అగమ్యగోచరమైన యువ ఓటర్ల వైఖరి  

ఓటర్లలో యువజనుల శాతం బాగా పెరిగిపోయింది. నాయకత్వ స్థానాలలో ఉన్నవారి పట్ల, పార్టీ నాయకుల పట్ల విశ్వాసం అంతగా లేకపోవడంతో నాయకత్వ స్థాయిలోనూ, రాజకీయ వాతావరణంలోనూ ఒకరకమైన శూన్యం ఏర్పడుతోంది. దీనివల్ల ఓటర్లు ఎటు ఓటు వేస్తారనే విషయంలో అనిశ్చితి చోటు చేసుకున్నది. పార్టీ అధినాయకులకూ భయసందేహాలు ఉంటున్నాయి. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని నెలకోసారో, వారానికోసారో, కొన్ని సందర్భాలలో ప్రతిరోజూ సర్వేలు నిర్వహించి రిలే సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు ఔట్ సోర్స్ చేసిన పార్టీకి అనుకూలంగా మార్చడం అనే ‘ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రక్రియ(ట్రాకింగ్ మెథడాలజీ)’ని ఉధృతంగా ప్రయోగిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడానికి బాగా ముందుగానే ప్రారంభం అవుతుంది. ప్రత్యర్థుల వ్యూహాలను ముందుగానే గ్రహించి సూక్ష్మ స్థాయిలోనూ, విస్తృత ప్రాతిపదికపైనా వాటికి విరుగుడు కనిపెట్టి ప్రయోగించడం, తమ అభ్యర్థుల ఆత్మవిశ్వాసం పెంచడానికి రిలే సర్వే అనే ప్రక్రియను విరివిగా వినియోగించడం, ఈ సర్వేలలో వేల, లక్షల మంది (శాంపిల్స్) నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటిని క్రోడీకరించి, ఫలితాలు అధ్యయనం చేసిన తర్వాత  అవసరమని భావిస్తే ఎన్నికల ప్రచారంలో మార్పులు, చేర్పులూ చేయడం వంటి అనేక పనులు వ్యూహకర్త, అతని బృందం చేయాలి. అవసరమైతే సాక్ష్యాలను సృష్టించి, కల్పించి సాక్ష్యాధారంగా సర్వే చేసినట్టు నమ్మించడం కూడా పీకే ఎత్తుగడలలో భాగం.

Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

శోధించి సాధించడం

క్షేత్రస్థాయి సర్వేలలో, నిఘాలో స్థానికంగా ఎవరు ఓటర్లపైన ప్రభావం వేయగలరో గుర్తిస్తారు. ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా ఎవరిని నిలబెడితే విజయావకాశాలు ఉంటాయో కూడా గమనిస్తారు. తాను పని చేసే పార్టీ అభ్యర్థికి అవసరమైన అదనపు ఓట్లు సాధించడానికి పీకే ఇటువంటి స్థానిక వ్యక్తులతో స్వయంగా కానీ తన ప్రతినిధుల ద్వారా కానీ సమాలోచనలు జరిపి వారిని తాను పని చేస్తున్న పార్టీ వైపు ఆకర్షిస్తారు. అందుకు ఏ మూల్యం చెల్లించాలంటే అది చెల్లిస్తారు. తమ పార్టీ అభ్యర్థుల బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లపైన ప్రభావం వేసేవారిని పట్టుకొని వారిని తమ పార్టీకి అనుకూలంగా తిప్పుకోవడానికి శోధించి సాధించే (ఎక్స్ ప్లోర్, ఎక్స్ ప్లాయిట్) విన్యాసాలలో పీకేకి ప్రత్యేక నేర్పు ఉంది. తమ పార్టీకి ఎక్కడ ప్రాబల్యం తక్కువ ఉన్నదో ముందే తెలుసుకొని ఆ నియోజకవర్గాలలో, విభాగాలలో, వార్డులలో, బూత్ లలో ఈ వేట (బ్యాక్ ట్రాక్ చేజ్) ప్రారంభిస్తారు. ఆశించిన ఫలితం సాధించేందుకు వీధులవారీగా కూడా ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు ఏమి చేయాలో అది చేస్తారు. ఓటర్లకే పరిమితం కాకుండా పీకే మధ్యవర్తులపైన కూడా దృష్టి పెట్టారు. తమ బృందం జరిపే సర్వేల నివేదికలను రాజకీయ నాయకులు చదవి, వారు స్పందించే వరకూ ఆగకుండా (చాలామంది రాజకీయ నాయకులు సర్వే నివేదికలు చదవరని పీకేకి తెలుసు), సమయం వృథా కాకుండా, పార్టీలోని అంతర్గత కలహాలూ, వ్యక్తిగత విధేయతలతో నిమిత్తం లేకుండా తన బృందం సభ్యుల ద్వారానే ఎన్నికల ప్రచారంలో కావలసిన మర్పులు చేస్తారు. ఎక్కడ జోక్యం చేసుకోవలసిన అవసరం ఉన్నదని భావిస్తారో అక్కడ నేరుగా జోక్యం చేసుకుంటారు. గ్రూపులను తయారు చేయడం, గ్రూపుల సభ్యులను క్రియాశీలం చేయడం, వారిని కార్యోన్ముఖుల్ని చేయడం పీకే బృందం అమలు చేసే మరో ప్రక్రియ. తన పార్టీ అభ్యర్థుల, నాయకుల ఇమేజ్ (ప్రతిష్ఠ)ను పెంపొందించేందుకు అవసరమైన సాధనసంపత్తిని వినియోగిస్తారు.

Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

వ్యూహకర్తగా పీకే రకరకాల పాత్రలు పోషిస్తారు. ఎన్నికల ప్రవీణుడి (పోల్ స్టర్)గా, ప్రచారధురంధరుడు (కాన్వాసర్)గా, కార్యక్రమాల నిర్వాహకుడు (ఈవెంట్ మేనేజర్)గా, చర్చలూ, బేరసారాలూ జరిపే వ్యక్తి (నెగోషియేటర్)గా, పబ్లిక్ రిలేషన్స్ మాన్ (ప్రజాసంబంధాల ప్రవీణుడు)గా, విశ్లేషకుడు (ఎనలిస్ట్)గా, తిమ్మినిబమ్మిని చేసే నైపుణ్యం కలిగిన వ్యక్తి(మ్యానిప్యులేటర్)గా, ఎన్నికల ప్రచార వ్యూహం అమలులో సంచాలకుడు (ఆపరేషన్ డైరెక్టర్)గా విభిన్నమైన పాత్రలు పోషించారు. ఇదంతా రాజకీయ నాయకుడు చేసే కృషికి అదనంగా లేదా సమాంతరంగా జరుగుతుంది. నినాదాలు తయారు చేయడానికి, పాటలు రాయడానికి సృజనశక్తి కలిగిన రచయితలనూ, కాపీ రైటర్లనూ, జర్నలిస్టులనూ పీకే నియమిస్తారు. ఆయా రంగాలలో ప్రసిద్ధులను సంప్రదిస్తారు. ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) బృందంలో ఉన్న పరిశోధకులు కంప్యూటర్ పైన సాఫ్ట్ వేర్ సహాయంతో డేటా విశ్లేషణ చేస్తారు. వారు చేసే కృషికి మరింత బలం జోడించేందుకు నినాదాలూ, పాటలూ, తదితరాలూ సమీకరిస్తారు. అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియపైన ఆధారపడటానికి బదులు చాలా రాష్ట్రాలలో చాలా పార్టీల అధినేతలు పీకే మంత్రం కోసం అంగలార్చుతున్నారు.

కీలకమైన రాజకీయ విధులు

బొత్తిగా బయటి వ్యక్తికి, వందలకోట్ల రూపాయలు ఖర్చు చేయించే వ్యక్తికి, ఎటువంటి బాధ్యతా, పూచీ కానీ ఆ ప్రాంతం పట్లా, ఆ ప్రాంతంలోని ప్రజలపట్లా ఎటువంటి ప్రేమాభిమానాలు కానీ లేని వ్యక్తికి ఒక పార్టీలో కీలకమైన విధులను అప్పగించడం వల్ల కలిగే పరిణామాలు మనం అనుసరిస్తున్న ఎన్నికల వ్యవస్థనే దెబ్బతీస్తాయి. శాసనసభలకూ, పార్లమెంటుకూ స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా జరగవలసిన ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలను ఎన్నికల సంఘం ఉపేక్షించి ప్రేక్షకపాత్ర పోషించజాలదు. పీకే చేసి చూపించినట్టు ఎన్నికల వ్యూహాలను బయటివారికి ఔట్ సోర్సింగ్ చేసి అప్పగించడం ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులే ఆలోచించుకోవడం అన్నిటికంటే ప్రధానం. అటువంటి ఔట్ సోర్సింగ్ వల్ల కొందరు రాజకీయ నాయకులకు ప్రయోజనం కలగవచ్చునేమో కానీ రాజకీయ పార్టీలకు కానీ పార్లమెంటరీ డెమాక్రసీకి కానీ ప్రయోజనం చేకూరదని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

(డాక్టర్ ఎన్. భాస్కరరావు భారత దేశంలో ఎన్నికల సర్వేల నిర్వహణలో, ప్రజాభిప్రాయ సేకరణలో వైతాళికులు, అగ్రగణ్యులు)

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

1 COMMENT

  1. మంచి ఇన్ఫర్మేషన్, అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్న గ్యాంబ్లింగ్ కొంత కాలం క్రితం ముఖ్యమైన వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం ఆత్సర్యం వేసింది… ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ కి మద్దతు ఇస్తారో, ఆ పార్టీ వ్యతిరేక పార్టీల వారు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బును పంచుతారు అది ఎంత అంటే ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేసే పార్టీ వాళ్ళకన్న ఎక్కువనే ఓటర్లకు డబ్బు ఇస్తారు, కానీ గెలవరు. ముఖ్యులు చెప్పిన కారణం
    ప్ర.కి. “బాక్సుల” కు డబ్బు కడతాడట, అదే కొనేస్తాడట!!!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles