Tuesday, November 28, 2023

కాంగ్రెస్ లోపం దేశానికి శాపం

“ఆకర్షించి, సమ్మోహనం చేసే నాయకులు కాంగ్రెస్ లో లేకపోవడమే ప్రధాన వైఫల్యం” అని సాక్షాత్తు కాంగ్రెస్ దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం తాజాగా విడుదల అయ్యింది. ఈ మాటలు రాజకీయ లోకంలో, కాంగ్రెస్ శ్రేణుల్లో చక్కర్లు కొడుతున్నాయి. 2014లో పార్టీ ఘోర వైఫల్యంపై ఆయన ఈ విధంగా అభిప్రాయపడ్డారు. సుస్థిరంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడపే  ప్రజ్ఞాపాటవాలు కలిగిన నెహ్రూ వంటి నేతలు నేడు పార్టీలో లేకపోవడం పట్ల ప్రణబ్ ఆవేదన చెందారు. అసాధారణమైన నేతలు లేకపోవడం వల్ల తర్వాత వచ్చిన  పాలకులు సగటు ప్రభుత్వాన్ని మాత్రమే అందించ గలిగారని  అసంతృప్తిని వ్యక్తం చేశారు. బహుశా ఈ విమర్శలు మన్ మోహన్ సింగ్ పాలనపై అయ్యి ఉండవచ్చు. పీవీ సంస్కరణల పట్ల, పీవీ పట్ల ప్రణబ్ కు మంచి గౌరవమే ఉంది. అది అనేక సందర్భాల్లో వ్యక్తమైంది  కూడా.

ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు

ఎటొచ్చీ 2014 నుండి పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన ఉద్దేశ్యం. ప్రధానంగా, పార్టీని నడిపి, ప్రజలను సమ్మోహన పరచగల  ప్రధాన నాయకుడు లేడని ప్రణబ్ చేసిన వ్యాఖ్యతో అందరూ ఏకీభవిస్తున్నారనే చెప్పాలి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీయే కరువులో ఉంది. మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మధ్యనే బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందింది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆ మధ్య ఉత్తరం రాసి సంచలనం సృష్టించిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. దేశమంతా ” చింతన్ భైఠక్ ” నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

ప్రక్షాళన ఎప్పుడు?

బూత్ స్థాయి నుండి పార్టీని ప్రక్షాళన చెయ్యాలనుకున్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు.  అధినాయకత్వాన్ని తీసుకోడానికి రాహుల్ గాంధీ కూడా మెత్తపడ్డాడు. కానీ, ఇంతవరకూ ఇవ్వేమీ కార్యరూపం దాల్చలేదు. కొంతమంది పుట్టుకతోనే  నాయకత్వపు లక్షణాలతో ఉంటారు. కొంతమందికి అదృష్టవశాత్తు నాయకత్వం చేతికి వస్తుంది. కొందరు తమ శ్రమ, మేధతో నాయకులవుతారు. ఇందులో రాహుల్ గాంధీ రెండవ కోవకు చెందినవారు. నెహ్రూ, గాంధీ కుటుంబమనే ట్యాగ్ ఉన్నా, దాన్ని అందిపుచ్చుకోలేక పొయ్యారు. దానికి  ఎవరేం చేస్తారు? ప్రణబ్ ముఖర్జీ నుండి చిదంబరం వరకూ అందరిదీ ఒకటే బాధ. సరియైన నాయకత్వం కాంగ్రెస్ కు దొరకడం లేదని అందరి వేదన. ఇది ఎప్పుడు తీరుతుందో అనే అనుమానంలోనే కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి.

బీజేపీ దూసుకుపోతోంది

అధికార బిజెపి పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. దాని అధినాయకుడు నరేంద్రమోదీ అప్రతిహతంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సత్తా చూపగలమనే అచంచల విశ్వాసంతో బిజెపి ఉంది.2023 ప్రాంతంలో జమిలి ఎన్నికలకూ శంఖం పూరిస్తోంది. ఉత్తరాదిలో మొదలు పెట్టి, దక్షిణాదిలోనూ తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి జవనాశ్వంలా బిజెపి దుముకుతోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికలలోనూ ఊహాతీతమైన ఫలితాలను దక్కించుకొని విజయగర్వంతో ముందుకు వెళ్తోంది. ఈ దూకుడుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సాగుతోంది. తెలంగాణ అధ్యక్షుడి  ఎంపికలోనూ అదే నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది.

సేదతీరుతున్న రాహుల్ గాంధీ

సంస్థాగతమైన పార్టీ వ్యవహారాలు వదిలి, కొత్త సంవత్సరం వేడుకలంటూ సేద తీరడానికి రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లిపోయిన వైనమే దీనికి అద్దం పడుతోంది. నిన్నటి బీహార్ ఎన్నికల ఫలితాలను చూసిన దేశ ప్రజలకు బిజెపి విజయాల బాటలోనే వెళ్తుంది అనే విశ్వాసం రెట్టింపు అయ్యింది. రాహుల్ గాంధీ తీరు, కాంగ్రెస్ వైనం చూసి, ఆ పార్టీ భవిష్యత్తు పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. నాయకత్వ పటిమ లేక,  ఎన్నికల్లో గెలిచే విద్య తెలియక, నాయకత్వ బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటున్న రాహుల్ కు అసలు రాజకీయాల పట్ల పూర్తిగా ఆసక్తి  ఉందా? లేదా? గ్రహించ లేక కాంగ్రెస్ పార్టీ  సతమతమవుతోంది.

ప్రియాంకగాంధీ పలచనైనారు

అధికార పక్షం బలం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలం రోజురోజుకూ తగ్గుతోంది. మొన్నటి వరకూ కాస్త సమ్మోహన శక్తిగా  ప్రియాంకా గాంధీ ఉండేది. అది కూడా నేడు తగ్గిపోయిందనే చెప్పాలి. సోనియాగాంధీకి ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీని నడిపే శక్తి ఆమెకు లేదు. రాహుల్ గాంధీయే పార్టీని నడపాలి, ప్రధానమంత్రి కావాలి అనే కోరిక ఆమెలో ఇసుమంత కూడా తగ్గలేదు. పోనీ రాహుల్ గాంధీని  పార్టీ వ్యవహారాల్లో కుదురుగా కూర్చోబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ కు నేతల కరువే కాదు, వ్యూహకర్తల కరువు కూడా తోడయ్యింది.

అహ్మద్ పటేల్ లేని లోటు కనిపిస్తోంది

మొన్నటి వరకూ అహ్మద్ పఠేల్ ఉండేవారు. ఆయన దివంగతులయ్యారు. అటువంటి వ్యక్తులు  ప్రస్తుతం ఎవ్వరూ కనిపించడం లేదు. చిదంబరం, కపిల్ శిబ్బల్ వంటి వారికి రాహుల్ తో పెద్దగా పడడం లేదు. కాంగ్రెస్ అగ్రనేతల మధ్య తరాల అంతరం ఎట్లాగూ కాలుతూనే ఉంది. వీటన్నిటినీ సమన్వయం చేసే నేతలు కావాలి. తాజాగా బీహార్ ఎన్నికల పర్యటనలో తేజస్వి యాదవ్ కు వచ్చిన జనం ముందు రాహుల్ సభకు వచ్చిన జనం వెలవెల పోయారు. ఒక పక్క అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతూ వుంటే రాహుల్ గాంధీ సేద తీరడానికి సిమ్లా వెళ్లారని ఆర్ జె డి నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో ఇటలీ వెళ్లారు. సేద తీరడానికి ఏ స్వేదం చిందించారని సొంత పార్టీవాళ్లే  విమర్శ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు.

నాయకత్వం లేదు

దేశంలో కాంగ్రెస్ పార్టీకి నవ నాయకత్వం లేనే లేదు. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం లేదు. చాలా రాష్ట్రాలకు సరియైన నేతలే లేరు. దేశాన్ని పాలించాలంటే నెహ్రూ గాంధీ కుటుంబమే కానవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటే ఏ వారసత్వాలు అవసరం లేదని సొంత పార్టీకి చెందిన పీవీ నరసింహారావు అప్పుడే నిరూపించారు. ఇప్పుడు బిజెపి నుండి నరేంద్రమోదీ నిరూపిస్తున్నారు. వారసత్వానికి కాలం చెల్లిన రోజులు ఎప్పుడో వచ్చేశాయని కాలమే నిర్ణయించింది. ఈ తత్త్వం ఇంకా సోనియాగాంధీకి, కాంగ్రెస్ లోని కొందరు బడా నాయకులకు అర్ధం కాలేదేమోనని అనిపిస్తోంది. దేశంలో సరియైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల బిజెపికి  విశ్వాసం పెరిగింది, ప్రజల్లోనూ పెంచుతోంది.

కాలమే సమాధానం చెప్పాలి

ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో, పార్టీలో విశ్వాసాన్ని పెంచుకోడానికి, నాయకత్వపు బలాన్ని చూపించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి. దేశంలోని ప్రజలంతా బిజెపికి జేకొట్టే పరిస్థితులు లేవు. ఆ శూన్యత ఉంది. దాన్ని సమర్ధవంతంగా కాంగ్రెస్ అందిపుచ్చుకోకపోతే, కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే అవుతుంది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల, అధికార పక్షంలో  నియంతృత్వ ధోరణులు పెరిగిపోతాయని, అవి  ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో  నష్టం కలిగిస్తాయని రాజకీయ పండితులు తలలు బాదుకుంటున్నారు. ఈ  కరువు నుంచి కాంగ్రెస్ ఎప్పుడు కోలుకుంటుందో?

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles