Monday, January 30, 2023

రాజకీయపార్టీల సంస్థాగత ఎన్నికలు విధిగా జరగాలంటే ఏం చేయాలి?

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనీ, పార్టీ అధ్యక్షుడినీ, కార్యవర్గాన్నీ ఎన్నుకోవాలనీ 23 మంది సీనియర్ పార్టీ నాయకులు కొన్ని మాసాలుగా మొత్తుకుంటున్నారు. ముఖ్యమంత్రులను తొలగించడం, నియమించడం (పంజాబ్) వంటి నిర్ణయాలు ఒకే ఒక కుటుంబ సభ్యులు కూడబలుక్కొని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులు నాయకులు చేయలగలిగింది ఏమీ లేదు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ దయదలచి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తే తప్ప ఎన్నికలు జరిపించేందుకు మరో మార్గం లేదు. కోర్టుకు వెళ్ళినా చెల్లదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలు జరుపుకోవాలని రాజ్యాంగం ఎక్కడా పేర్కొనలేదు. రాజ్యాంగాన్ని అన్వయించడమే కోర్టుల బాధ్యత కనుక ఎన్నికలు విధిగా జరపాలని ఆదేశించే అవకాశం లేదు.  అసలు రాజకీయ పార్టీల ప్రస్తావనే సుదీర్ఘమైన భారత రాజ్యాంగంలో పెద్దగా లేదు.

భారతీయ జనతా పార్టీలోనూ ఎన్నికలు తంతుగానైనా జరగడం లేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ, దేశీయాంగమంత్రి అమిత్ షా ఏది చేయాలనుకుంటే అది చేయవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపాణీని తొలగించి పటేల్ ను పెట్టాలనుకుంటే ఆ పని అవలీలగా చేయవచ్చు. పంజాబ్ ముఖ్యమంత్రిగా వైదొలగమంటే కెప్టెన్ అమరీంద్రసింగ్ తప్పుకొని హుంకరిస్తున్నారు కానీ రూపాణీ రాజీనామా సమర్పించడమే కాదు అన్నీ దిగమింగి పటేల్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు. అంతా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మార్పించిన పద్ధతిలోనే జరిగిపోయింది. పటేల్ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి అయినా పర్వాలేదు. సంస్థాగత ఎన్నికలు, పారదర్శకత, ముఖ్యమంత్రుల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కూ, బీజేపీకి తేడాలేదు. బీజేపీకి మార్గదర్శనం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరెవరో ముఖ్యమంత్రులు అవుతారంటూ మీడియా ఊహాగానాలు చేసింది. కానీ ఆర్ఎస్ఎస్ నిర్ణయించిన యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి తాపీగా లక్నో వెళ్ళి సింహాసనంపైన దర్జాగా అధిష్ఠించారు.

ప్రాంతీయ పార్టీలు అధ్వానం

రెండు జాతీయ పార్టీల సంగతే ఇలా ఉన్నప్పుడు ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీల సంగతి అంతకంటే అధ్వానంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? బీజేపీలో వంశపాలన లేదు. మోదీ తర్వాత యోగి ప్రధాని కావచ్చు కానీ మోదీ ఎంపిక చేసిన వారసుడు కాగల అవకాశాలు తక్కువ. కాంగ్రెస్ లో అయితే నూటికి నూరుపాళ్ళూ వంశపాలనే. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, ఆయన మరణం తర్వాత వెంటనే పదవి స్వీకరిస్తే బాగుండదని సోనియా కొంతకాలం ఆగాలి అనుకున్నారు కనుక పీవీ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు. దుఃఖం నుంచి కోలుకున్నాకు పార్టీ అధ్యక్ష పదవిని సీతారామ్ కేసరి చేతుల్లోనుంచి లాగివేసుకున్న తర్వాత సోనియాగాంధీ వెనక్కి తిరిగి చూడలేదు. 2004లో తనకు ‘తూ సెవెంతీ తూ’ (272) స్థానాలు ఉన్నాయనీ, ప్రధాని అవుతాననీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళారు. కారణాంతరాల వల్ల ప్రధాని కాలేకపోయారు. కానీ రెండు దశాబ్దాలకు పైగా పార్టీని ఆమె గుప్పిటలో పెట్టుకొని చరిత్ర సృష్టించారు.

మిగిలిన రాజకీయ పార్టీలు మతం లేదా కులం ప్రాతిపదికగా ఏర్పడి వర్థిల్లుతున్నాయి. ప్రాతిపదిక ఏదైనా కుటుంబం ఆధిపత్యం అనివార్యం. రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్ పీ) బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ (మమతాబెనర్జీ తర్వాత ఆవిడ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సిద్ధంగా ఉన్నాడు). ఆల్ ఇండియా మజ్లీస్ –ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎవరో ఒక ఒవైసీ), ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, డిఎంకె, జెడీ(ఎస్), తెలుగుదేశం, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ వగైరా పార్టీలలో దేనికీ మినహాయింపు లేదు. మహానాడు, పార్టీల సర్వసభ్య సమావేశాలు అంటూ తంతు నిర్వహిస్తారు కానీ చివరికి అధికార కుటుంబం పెద్ద  చెప్పినట్టు జరగాల్సిందే. నాయకత్వం మారితే సదరు కుటుంబంలో మరొకరు మర్యాదగానో, అమర్యాదగానో పార్టీ పగ్గాలు స్వీకరించవలసిందే. బయటివారికి ఎన్నికల ద్వరా అవకాశం రాదు.

ఈ దేశం కుటుంబ పాలనతో, మత, కుల పార్టీల పెత్తనంతో కునారిల్లవలసిందేనా? ఏదైనా మోక్షం ఉన్నదా? ఈ రొంపిలో నుంచి బయటపడి సిసలైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. అది రాజకీయ పార్టీలను రాజ్యాంగబద్ధం చేయడమే. రాజకీయ పార్టీల స్థాపన, నిర్వహణ రాజ్యాంగవిహితంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే విధంగా చూసుకోవడమే. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. అది అంత తేలిక కాదు. రాజకీయ పార్టీలను రాజ్యాంగానికి లోబడి పని చేసే విధంగా శాసించాలి. రాజకీయ పార్టీల స్థాపన, నిర్వహణ విషయంలో మనం అమెరికా, బ్రిటన్ లో అమలులో ఉన్న వ్యవస్థలను అనుసరిస్తున్నాం. కానీ ఆ దేశాలలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మనకు లేదనే అంశం పట్టించుకోవడం లేదు.

అమెరికా, బ్రిటన్ ల స్థాయి వేరు

బ్రిటన్ లో, అమెరికాలో చాలా ఉన్నతమైన, పారదర్శకమైన అంతర్గత ప్రజాస్వామ్యం వర్థిల్లుతోంది. బ్రిటన్ లో కన్సర్వేటివ్ పార్లీకి నేషనల్ కన్సర్వేటివ్ కన్వెన్షన్ ఉంది. అది అత్యున్నత సంస్థ. దానికి సెంట్రల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నాయి. సెంట్రల్ కౌన్సిల్ కు అధ్యక్షుడినీ, ఉపాధ్యక్షులనూ ఎన్నుకుంటారు. కన్వెన్షన్ సమావేశం ప్రతి ఏటా జరిగి తీరుతుంది. అందులోఎన్నికలు విధిగా నిర్వహిస్తారు. సెంట్రల్ కమిటీ వార్షిక సభలో ఎన్నుకునే ఎగ్జిక్యుటీవ్ కమిటీ (కార్యవర్గం) నెలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. అధ్యక్షుడికి ఇష్టం ఉన్నా, లేకపోయినా సమస్త విషయాలూ చర్చకు వస్తాయి. సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మన పార్లమెంటులో లాగా ప్రతిపక్షం గొడవ చేస్తే సస్పెండ్ చేసి లేదా ప్రతిపక్షం వాకౌట్ చేసినప్పుడు గబుక్కున నాలుగు బిల్లులను అరగంటలో ఆమోదించడం అమెరికా, బ్రిటన్ లో అనూహ్యం. కన్సర్వేటివ్ పార్టీలాగానే లేబర్ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పటిష్టంగా అమలు జరుగుతోంది.

అమెరికాలో డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండింటికీ నేషనల్ కమిటీలు ఉన్నాయి. అవే అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలు. అధ్యక్ష ఎన్నికలోనూ, ఇతర ప్రాధమ్యాల నిర్ణయంలోనూ నేషనల్ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. రాజకీయ పార్టీల ఉనికిని అమెరికా రాజ్యంగం గుర్తించదు. బ్రిటన్ లోనూ అంతే. చట్టాలకీ, రాజకీయ పార్టీలకీ సంబంధం లేదు. ఐవర్ జెన్నింగ్స్ రచించిన ‘ద బ్రిటిష్ కాన్ స్టిట్యూషన్’ అనే గ్రంథంలో “A realistic survey of the British Constitution today must begin and end with parties and discuss them at length in the middle (ఈ రోజున బ్రిటిష్ రాజ్యాంగాన్నికనుక సమీక్షిస్తే రాజకీయ పార్టీలతో చర్చ ప్రారంభించి, రాజకీయ పార్టీ ప్రసక్తి కొనసాగిస్తూ రాజకీయ పార్టీలతోనే ముగించవలసి ఉంటుంది)” అని రాశారు (ద హిందూ, 01 అక్టోబర్ 2021, ఓపెడ్ పేజ్, ఫైజల్ సీకె వ్యాసం ‘మేకింగ్ పార్టీస్ కాన్ స్టిట్యూషనల్). ఈ రెండు ప్రవృద్ద ప్రజాస్వామ్య దేశాలలో అత్యున్నత స్థాయి విలువలు కొనసాగుతున్నాయి. అక్కడ కులాల కుంపట్లు లేవు. మతాల ఉన్మాదాలు లేవు. వంశపాలన లేదు. ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తి లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం అమలై తీరాలి. అటువంటి పరిస్థితులు లేని భారత దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, ప్రవృద్దం, పటిష్టం కావాలంటే మనకు జర్మనీ రాజ్యాంగాన్ని అనుసరించడం క్షేమదాయకం.

జర్మనీ రాజ్యాంగం అత్యుత్తమం

ఫెడరల్ రిపబ్లిక ఆఫ్ జర్మనీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత హిట్లర్ పీడ విరగడైన తర్వాత జర్మనీ రెండుగా చీలిపోయింది. పశ్చిమ జర్మనీ కొత్త రాజ్యాంగాన్ని 1949లో బేసిక్ లా పేరుతో తయారు చేసుకున్నది. 8 మే 1949లో బాన్ లో పశ్చిమ జర్మనీ పార్లమెంటు ఆమోదిస్తే 12మే లో పశ్చిమ జర్మనీని ఆక్రమించుకున్న అమెరికా, బ్రిటన్, తదితర పాశ్చాత్య దేశాలు సమ్మతి తెలియజేశాయి.  23 మే 1949 నుంచి అమలులోకి వచ్చింది. తూర్పు జర్మనీ విలీనమైన తర్వాత సమైక్య జర్మనీలో అదే రాజ్యాంగం కొనసాగుతోంది. జర్మనీ రాజ్యాంగం ప్రకారం అక్కడ రాజకీయ పార్టీలకు రాజ్యాంగపరమైన హోదా ఉన్నది. బేసిక్ లా 21వ అధికరణలో రాజకీయ పార్టీల స్థాపన, నిర్వహణ గురించి సవిస్తరంగా ఉంది. రాజకీయ పార్టీల అంతర్గత వ్యవస్థ ప్రజాస్వామ్య సూత్రాలను విధిగా పాటించాలని రాజ్యాంగంలో రాసుకున్నారు. ఏ పార్టీ అయినా అంతర్గత ఎన్నికలు నిర్వహించకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు. ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తుంది రాజ్యాంగంలో ఉన్నది కనుక. ఫెడరల్ కాన్ స్టిట్యూషనల్ కోర్టు ఈ వ్యవహరాలను పకడ్బందీగా చూసుకుంటుంది. రాజకీయ పార్టీలు తు.చ. తప్పకుండా రాజ్యాంగం చెప్పిన విధంగా అంతర్గత ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ పాటిస్తున్నాయో లేదో చూస్తుంది. ఇండియాలోలాగా సంవత్సరాలూ, దశాబ్దాల తరబడి సంస్థాగత ఎన్నికలు జరపకుండా వాయిదా వేసే అవకాశం జర్మనీలో  ఏ మాత్రం లేదు.

సమగ్రమైన చర్చ అవసరం

భారత రాజ్యాంగంలో 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29ఏ(5) సెక్షన్ మాత్రం రాజకీయ పార్టీల ప్రస్తావన టూకీగా ఉంది. సహకార సంఘాల గురించి వివరమైన చట్టాలు ఉన్నాయి కానీ రాజకీయ పార్టీల విషయంలో నిబంధనలు కానీ మార్గదర్శకాలు కానీ ఏ మాత్రం లేకపోవడం విశేషం. అది పెద్ద లోపం. చాలా రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రాసుకున్నాం. కానీ ఈ విషయంలో బ్రిటన్, అమెరికాలను అనుసరించాలని రాజ్యాంగ నిర్మాతలు చేసిన నిర్ణయం భారతీయుల మనస్తత్వానికి సరిపోలేదని అనుకోవచ్చు. రాజ్యాంగాన్ని ఎట్లాగూ అనేక దఫాలు సవరించుకున్నాం కనుక మరోసారి సవరించుకుంటే నష్టం లేదు. రాజకీయపార్టీలు ఖర్చులనూ, ఆదాయాలనూ, ఆస్తులనూ పారదర్శకంగా చూపించాలనీ, రాజకీయ నాయకులు ఆదాయవ్యయాల వివరాలు బహిరంగపరచాలనీ, సంస్థాగత ఎన్నికలు క్రమం తప్పకుండా జరగాలనీ, అనువంశిక పాలన ఉండకూడదనీ, ఒక వ్యక్తి రెండు లేదా మూడు టరమ్ ల కన్నా ఎక్కువ అదే పదవిలో కొనసాగకూడదనీ రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. కనీసం ఉభయ సభల సంయుక్త సమావేశాలను నిర్వహించి ఎన్నికల సంస్కరణలపైన సమగ్రమైన చర్చ జరిపి అవసరైన సవరణలు చేసుకోవలసిన అగత్యం ఉన్నది. ఒక రాజకీయ నాయకుడు ప్రచారార్భటితో, తన పార్టీ సహకారంతో, ప్రభుత్వ సహాయంతో నియంతగా మారే అవకాశం లేకుండా రాజ్యాంగంలో ఎటువంటి సవరణలు చేయాలో కూడా ఆలోచించాలి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కాబోతున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు (1952) జరిగి డెబ్బయ్ సంవత్సరాలు కాబోతున్నాయి. ఎన్నికల సంస్కరణలకు ఇంతకంటే మించిన సముచితమైన సందర్భం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క పార్లమెంటులోనే కాదు దేశ వ్యాప్తంగా సాధ్యమైనన్ని వేదికలపైన రాజకీయ పార్టీలలో సంస్కరణలు తీసుకురావడానికి రాజ్యాంగాన్ని ఎట్లా సవరించుకోవాలో చర్చ జరగాలి. సుదీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశం. వాయిదా వేయకూడని ముఖ్యమైన విషయం.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles