Thursday, November 30, 2023

వైశాలి,నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసు పాత్రపై దర్యాప్తునకు పౌరహక్కులనేతల డిమాండ్

వైశాలి – నవీన్ రెడ్డీల హింసాత్మకమైన ప్రేమ – పెళ్లి (?)పై – నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ – పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రము [PUCL -TS, (14 & 15-12-2022)] 

Adibatla BDS Student Kidnap Case Main Culprit Naveen Reddy Arrested Send To  Remand DNN | Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు, ప్రధాన  నిందితుడు నవీన్ రెడ్డి అరెస్టు!
నవీన్ రెడ్డి(కుడివైపు), ఇతరులు

తెలంగాణ రాష్ట్రంలోని రంగా రెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ప్రాంతంలో 09-12-2022 న సుమారుగా 100 మంది ఇంట్లోకి జొర్రి వైశాలి (24) అనే మహిళా దంత వైద్యురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆందోళన కలిగించే వార్త అన్ని మాధ్యమాలలో ప్రచురించబడింది. అన్ని వర్గాల నుండి ఈ ఏహ్యమైన చర్యను వ్యతిరేకిస్తూ, పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. అయినప్పటికీ రాచకొండ డివిజన్ పోలీసులు వైశాలి ఆచూకీని కనిపెట్టలేక పోయారు. చివరికి ప్రేమించాను అని చెపుతున్న నవీన్ రెడ్డే ఇంటికి దగ్గరలో వదిలేసారు అని బాధితురాలు చెపుతున్నది. కానీ, రాచకొండ డివిజన్ పోలీసులు “ఎత్తికెళ్లిన వారిని ఛేదించి” పట్టుకున్నట్లు మీడియా కథనాలలో వచ్చిన వార్త.  మేము క్షేత్ర స్థాయిలో విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కనుక్కోగా పోలీసులు చెప్పిన విషయం కూడా అదే.

అయితే, వైశాలికి జరిగిన అవమానకరమైన సంఘటనపై రోజురోజుకూ ఒక కొత్త విషయం, అనగా బలవంతంగా ఎత్తుకెళ్లిన నవీన్ రెడ్డి, అతని గ్యాంగ్ పై ప్రజలలో సానుభూతి వచ్చేవిధంగా మీడియాలో – టీవీలలో, వార్తా పత్రికలలో వార్తలు వస్తున్నాయి. నవీన్ రెడ్డిని రాచకొండ డివిజన్ (ఆదిభట్ల పోలీస్ స్టేషన్) పోలీసులు గోవాలో 12-2022 న అరెస్ట్ చేసిన రోజు గంట నిడివితో కూడిన ఒక వీడియో అంతర్జాలంలో నవీన్ రెడ్డి రిలీజ్ చేసినట్లు వైరల్ అయ్యింది.  

విరుద్ధమైనటువంటి వార్తలు ప్రచురణ కావటం ఒకటి, బాధితురాలు, బాధిత కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నారు, నవీన్ రెడ్డి, నవీన్ రెడ్డి కుటుంబాల స్థితి ఏంటనే విషయాలపై క్షేత్ర స్థాయిలో నిజాలను కనుక్కొనే PUCL -TS ప్రయత్నంలో భాగంగా జయ వింధ్యాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఇక్బాల్ ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పౌరహక్కుల ప్రజా సంఘం, యాఖుబ్, పౌర హక్కుల ప్రజా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సలీం జంట నగరాల శాఖ పౌర హక్కుల ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి, సుజాత, జంటనగరాల శాఖ కార్యవర్గ సభ్యురాలు మరియు గడ్డం అశోక్, ఓయు జాక్ ఛైర్మెన్ సభ్యులుగా నిజనిర్ధారణ కమిటీ గా ఏర్పడి విచారణ చేయగా …

వైశాలి దంత వైద్యురాలి కుటుంబ నేపథ్యము: దామోదర్ రెడ్డి, నిర్మల తల్లి తండ్రులు, ఒక అన్న. తండ్రి ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి వలస వచ్చారు. మన్నెగూడలో ఇల్లుకట్టుకొని ఉంటున్నారు.

నవీన్ రెడ్డి మిస్టర్ టీ (ఫ్రాంచైయస్) యజమాని కుటుంబ నేపథ్యము: కోటి రెడ్డి, నారాయణమ్మ  తల్లి తండ్రులు. వ్యవసాయ కుటుంబం.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోషపల్లి గ్రామ నివాసితుడు. నవీన్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ -CA చదువుకొని రంగా రెడ్డి జిల్లాలోని హస్తినాపురంలో మిష్టర్ టి (ఫ్రాంచైయస్) వ్యవస్థాపకుడు – యజమాని. ఈ రోజు దేశం మొత్తంలో 400 పై చిలుకు మిస్టర్ టి బంకులు ఉన్నట్లు ప్రకటించుకున్నారు. పెద్ద వ్యాపారవేత్త గా కీర్తించబడుతున్న వ్యక్తి. ప్రస్తుత నివాసం హస్తినాపురం.

వైశాలి – నవీన్ రెడ్డి ల పరిచయం: బ్యాడ్మెంటం ఆడే క్రమంలో బెంగళూర్ లో పరిచయం. ఈ విషయాన్ని ఇద్దరూ ఒప్పుకుంటున్న, చెపుతున్నారు. ఇందులోకి ఎవరైనా దూరి సూక్ష్మ పరిశీలన చేయాలి అనుకుంటే, అవసరానికి మించి దూరినట్లే.

ప్రేమ – పెళ్లి :

వైశాలి చెప్పే విషయం అమ్మ నాన్నలు అంగీకరిస్తేనే పెళ్లి, లేకపోతే ప్రేమ – పెళ్లి అనేది నాకు ఇష్టంలేని సబ్జెక్ట్ అని కరాఖండిగా చెప్పినాను అని ఆమె చెపుతున్నది.

నవీన్ రెడ్డి చెప్పే విషయం మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి ని తల్లి తండ్రులు ఒప్పుకోవటం లేదు అని తన ప్రకటన. వైశాలి కోసం చాలా ఖర్చు చేసినట్లు, వైశాలి తల్లి తండ్రిలు పెళ్లి చేస్తామనే పేరుతో తన నుండి డబ్బును వాడుకున్నట్లు, వారి అవసరం తీరాక తనను వదిలేసినట్లు చెపుతున్నారు. రంగా రెడ్డి కోర్టులో పిటిషన్ వేసినట్లు కుడా చెపుతున్నారు.   

నవీన్ రెడ్డి తల్లి చెపుతున్న విషయం ఏమంటే .. నా కొడుకు ఆ పిల్ల కలిసి బ్యాడ్మెంట్ ఆడవాళ్లు, ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు అని తనకు తెలిసింది.లేక తాను భావించుకున్నది లేక కొడుకు చెప్పి (ఉండ వచ్చు) నది, తనకు అర్ధం అయినది, విన్నది, చూసినది చెపుతున్నారు. ఆ పిల్ల కోసం తన కొడుకు చాలా ఖర్చు పెట్టాడని అంటున్నారు.  

వైశాలి తల్లి తండ్రి చెపుతున్నది ఏమంటే …(1). మా పిల్లకు పెళ్లి కోసం మంచి సంబందం చూస్తున్నాము.  ఈ వెతుకులాటలో భాగంగా వారి కుటుంబ స్నేహితులైన బుచ్చి రెడ్డి నివసిస్తున్న ప్రాంతంలోనే నివసిస్తున్న ఒక కుటుంబంలోని అబ్బాయి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి గురించి మంచి చెడులను తెలుసుకొమ్మని బుచ్చి రెడ్డికి ఆ అబ్బాయి చిరునామ ఇచ్చాను అనియు, మంచి చెడ్డలను కనుక్కొనే ప్రయత్నంలో నేనుండగా బుచ్చి రెడ్డి నవీన్ రెడ్డి ప్రస్తావన తీసుక వచ్చారని … ఎందుకంటె

(2). గతంలో మా కుటుంబము – బుచ్చి రెడ్డి కుటుంబము కలిసి అరకు, గోవాలు కలిసి పర్యటించినట్లు తెలుపుతున్నారు. ఈ టూర్ పోవటానికే ముఖ్య కారణం బుచ్చి రెడ్డి, బుచ్చి రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం ఎక్కువగా ఉండటం, పదే – పదే ఒత్తిడి చేయటం చేత వెళ్ళాము అని అంటున్నారు. ఆ రెండు టూర్లలో బుచ్చి రెడ్డి షడ్డకుడి కొడుకు జయంత్ రెడ్డి, నవీన్ రెడ్డి లు చేరారు. అలా మా కుటుంబానికి నవీన్ రెడ్డి, జయంత్ రెడ్డి పరిచయం.

(3). ఆ టూర్లలో నా కుటుంబానికి (3) ఎంత ఖర్చు వచ్చిందో అంతే నేను క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు పెట్టటం, పే చేయటం జరిగింది.

(4). కూతురు వైశాలికి కుటుంబ స్నేహితుడైన బుచ్చి రెడ్డి నివసిస్తున్న కాలనీలో నుండి వచ్చిన పెళ్లి సంబంధం గురించి విచారణలో భాగంగా బుచ్చి రెడ్డి తో షేర్ చేసుకోవటం చేత నవీన్ రెడ్డి గురించి బుచ్చి రెడ్డి ప్రపోజల్ పెట్టినట్లు, అప్పుడు నవీన్ రెడ్డి గురించి ఆలోచించామని వైశాలి తండ్రి చెపుతున్నారు.

(5). నవీన్ రెడ్డి గురించి బుచ్చి రెడ్డి ప్రపోజల్ పెట్టకముందునుండే వైశాలి ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలాన్ని లీజ్ కు తీసుకొని షెడ్ వేసినట్లు,  టి పాయింట్ కూడా నవీన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నట్లు, అక్కడ మధ్య రాత్రి వరకు పెద్ద హంగామాగా యువకులు ఉండేవారనియు వైశాలి తండ్రి చెపుతున్నారు.

(6). కాలనీ వాసులు అందరూ కలిసి, ఆ ఖాళీ స్థలం యజమానికి హంగామాతో వస్తున్న ఇబ్బందులను వివరించినట్లు, యజమాని టి పాయింట్ ను ఎత్తి ఏపించినట్లు, షెడ్ మాత్రం రన్నింగ్ లోనే ఉన్నట్లు వైశాలి తండ్రి చెపుతున్నారు.

(7). ఇలాంటి పరిస్థితులలో బుచ్చి రెడ్డి నవీన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. వైశాలి తండ్రి తల్లి రెండు రోజుల సమయం తీసుకొని, బుచ్చి రెడ్డితో తన కూతురుకు తగిన వరుడు / భర్త నవీన్ రెడ్డి సరిపోడు అని తిరస్కరించాను అని చెపుతున్నారు.

(8). బుచ్చి రెడ్డి … నవీన్ రెడ్డి గురించి పదే – పదే గా “నవీన్ రెడ్డి మంచి సంపాదనా పరుడనియు, ఒక్కడే కొడుకు అనియు, మంచి సంబంధం అనియు చెవ్విలో జోరీగలా, చెప్పులో రాయిలా బుచ్చి రెడ్డి తయారయ్యారనియు, అందుకే బుచ్చి రెడ్డి తో మాటలు తగ్గించినట్లు చెపుతున్నారు.

(9). బుచ్చి రెడ్డి తో మాటలు తగ్గించటం చేతనో, మరి ఎందుకో అర్ధం కాలేదు … రాజా గోపాల్ రెడ్డి PA సతీష్ రెడ్డి, కొప్పుల నరసింహ రెడ్డి, మరి ఇద్దరు ఇంటికి వచ్చి నవీన్ రెడ్డి కి నా కూతురును ఇచ్చి పెళ్లి చేయమని ఒత్తిడి తెచ్చారు. నా కూతురికి – నవీన్ రెడ్డి కి సెట్ కాదు కాబట్టి పెళ్లి జరిపించలేను అని వారికీ నా బాధను చెప్పుకున్నట్లు చెపుతున్నారు.

(10). నా బిడ్డకు పెళ్లి సంబంధాలను వెతకటం ఆపలేదనియు, నవీన్ రెడ్డి ఏమో నా బిడ్డను వేధించటం ఎక్కువ చేశాడు, వచ్చి పోయే దారిలో కాపుకాసి నా బిడ్డతో చెడుగా ప్రవర్తించటం కూడా ఎక్కువయ్యింది. అందుకే  17-09-2022 నా బిడ్డతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేపించాననియు, పోలీసులు 354-D, 506 ఐపీసీ కింద కేసు పెడుతూ FIR నంబర్ 367/2022 ను జారీ చేశారని చెపుతున్నారు.

(11). పోలీసులు కూడా నవీన్ రెడ్డి కే సపోర్ట్ గా నిలిచారనియు, ఉచిత సలహాగా పోలీసులు … ఇద్దరికీ పెళ్లి చేస్తే ఈ సమస్య ఉండదు, పోలీస్ స్టేషన్ కు వచ్చే సమస్య కూడా ఉండదని పోలీసులే మధ్యవర్తిత్వం చేశారనియు .. పోలీసుల తీరుకే ఈ రోజు నా బిడ్డ చావుకు దగ్గరగా పోయి వచ్చింది అని చెపుతున్నారు. ఇప్పుడేమో 09-12-2022 న పొలీసులు FIR No. 486/2022, U/s 147,148,307, 324, 363, 427,506,452,380,R/w 149 IPC కింద రిజిష్టర్ చేసారు ఆని చెపుతున్నారు.

సాధారణ ప్రజల అభిప్రాయం: (1). నవీన్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందనియు,  2. పోలీసుల తీరు ఏం బాగాలేదనియు, 3. పోలీసులు తక్షణమే తగిన చర్యలు తీసుకొని ఉంటె ఈ రోజు వైశాలి కిడ్నాప్ అయ్యేది కాదనియు, ఆ పిల్లకు ఈ గతి వచ్చేది కాదనియు, 4. మరో దిశ కాకుండా బ్రతికి బయట పడ్డది అనియు.. పోలీసులపై ననే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనియు…

ఈ విధంగా సాధారణ ప్రజల నుండి వెంటనే వచ్చిన స్పందన. అయితే మీడియాలో రోజూ వెల్లువలా వైశాలి – నవీన్ రెడ్డి గురించి వస్తున్న వార్తలతో, నవీన్ రెడ్డి పై సానుభూతి పెరుగుతూ వచ్చింది .. ఏమో ఆ పిల్లది కూడా తప్పుండవచ్చు, అంతలేనిదే ఇంతగా జరుగుతుందా .. నవీన్ రెడ్డికి ఏం తక్కు ఉంది .. కూతురుని ఇచ్చి పెళ్లి చేయవచ్చు కదా … అంతలేనిదే టూర్లకు వెళ్లి వస్తారా, ఒకే సామాజిక వర్గం పెళ్లి చేయవచ్చు కదా అని, టూర్లో ఆ పిల్లోడే ఖర్చు పెట్టుకున్నాడట, అయ్య ! ఎంత మోసం జరిగింది అంటూ ఉన్నారు,… ఇలా అర్ధం – పర్ధం లేని మాటలు వినిపిస్తున్నాయి.

మా పరిశీలన – ప్రశ్నలు – సూచనలు : 1. నవీన్ రెడ్డి – వైశాలి మధ్య పరిచయం ఉన్నది. ఆ పరిచయం ఎంత అంటే … నవీన్ రెడ్డి, వైశాలితో “నిన్ను ప్రేమిస్తున్నాను – పెళ్లి చేసుకుంటాను” అనేంతగా, వైశాలి.. అమ్మ – నాన్నలు చూసే సంబంధం – వారికి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది. కాబట్టి ప్రేమ కుదురదు అని సున్నితంగానే తిరస్కరించింది.

2. నవీన్ రెడ్డి అనుకున్నాడు … వైశాలి తల్లి తండ్రిని ఒప్పిస్తే వైశాలితో పెళ్లి జరిగి పోతుంది అని భావించాడు. అందుకు బుచ్చి రెడ్డి కుటుంబాన్ని ఎంచుకున్నాడు. బుచ్చి రెడ్డి కి ఇద్దరు కూతుర్లు. అందులో ఒక కూతురు తో వైశాలికి మంచి స్నేహం. ఇద్దరూ కలిసి బ్యాడ్మెంట్ ఆడేందుకు వెళ్తారు. జయంత్ రెడ్డికి – నవీన్ రెడ్డికి కూడా స్నేహం. సో, బుచ్చి రెడ్డికి ఏదో ఆశ కలిగింది. ఇద్దరూ కలిసి ప్రణాలికను సిద్ధం చేసుకున్నారు. ప్రణాళికలో భాగంగానే వైశాలి ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు.

3. ప్రణాళికలో భాగంగానే అరకు – గోవా టూర్లకు బుచ్చి రెడ్డి, వైశాలి కుటుంబాన్ని తయారు చేశారు. విజయవంతంగానే ఈ ప్రయాణం సాగింది. బుచ్చి రెడ్డి – నవీన్ రెడ్డిల ప్లాన్ విజయం అయ్యింది.

4. వైశాలి ఇంటికి ఎదురుగా వేసిన షెడ్ తో, అక్కడ జరుగుతున్న తంతును బట్టి నవీన్ రెడ్డికి డబ్బుంది – చదువుంది, కానీ బుద్ది – గుణం ‘పద్దతిలో’ లేదని వైశాలి తల్లికి – తండ్రికి తెలిసి వచ్చింది. అయితే నవీన్ రెడ్డి చేష్టలు కొంత వరకు వైశాలికి హీరోయిజంగా అనిపించింది. అందుకే అమ్మ – నాన్నలకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరుగును అని చెప్పింది. అందుకే నవీన్ రెడ్డి వైశాలి అమ్మ – నాన్నలను ఒప్పించే భాగంలో బుచ్చి రెడ్డి & కంపెనీ ఇచ్చే సలహాలను, సూచనలను అనుసరించారు.

5. నవీన్ రెడ్డి భావించాడు … నాకేం తక్కువుంది. డబ్బు ఉంది – వయసుతో వచ్చిన అందం ఉంది, నన్ను కాదనే దమ్ము ఎవ్వరికీ లేదనే ప్రతీ పురుషుడిలో ఉండే “లేకి బుద్ది” నవీన్ రెడ్డిలో ఇంకాస్త ఎక్కువుంది. ఇదే, వైశాలి – నవీన్ రెడ్డి ల పెళ్ళికి అడ్డుగా నిలిచింది. దీనికి తోడు బుచ్చి రెడ్డి & కంపేనీల ఉచిత సలహాలు పెళ్లి విఘాతానికి మరో కారణం.

6. వైశాలి కుటుంబం “ఆర్మీ” నేపథ్యం. ఈ నేపథ్యం కలిగి ఉన్నవారు సాధారణంగా ‘ఒక సిస్టం’ లో ఒదిగి ఉంటారు. డబ్బు – డాంబికాలకు పోయే ఛాన్సెస్ బహు తక్కువ. ఆ తక్కువకోవలోకి వైశాలి కుటుంబాన్ని తీసుకోవాలి. ఇది నవీన్ రెడ్డికి – బుచ్చి రెడ్డి & కంపేనీకు అర్ధం కాలేదు. అర్ధం చేసుకోలేక పోయారు. డబ్బుకు – పలుకుబడికి లొంగుతారు అనే ఒక ‘రాంగ్ కాన్సెప్ట్’ ను వారి ప్లాన్ లో భాగం చేసుకున్నారు. ఒకే సామాజిక వర్గం అయినప్పటికినీ, ‘రాంగ్ కాన్సెప్ట్’ .. ఇదే పెళ్లి బెడిసిపోవటానికే మూల కారణం.

7. నవీన్ రెడ్డి కి ఉన్న డబ్బుకు – పలుకు బడికి పోలీసులు బానిసలుగా వ్యవహరించారు. రొటీన్ గానే తీసుకున్నారు. 17-09-2022 నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే “తమాష” ను చూస్తున్నట్లు చూశారు. వీరి అలసత్వంకు రోజూ అమాయకులే బలైతున్నారు. దౌర్జన్యకారుల పంచన చేరి “ఒక లాంటి ప్రోత్సాహం” ఇస్తున్నారు. ఈ ప్రోత్సాహం, ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నది. ఇది చాల తీవ్రమైన విషయం. ఇలాంటి ప్రవర్తన తీవ్రమైన విషయం అనేది వీరికి గాని, వీరి బాసులకు కానీ బుర్రలలోకి పోవట్లేదు. వీరి ఇలాంటి ప్రవర్తన, మీడియా కథలు – కథలుగా ప్రచురణలు చేస్తూ … నవీన్ రెడ్డి లాంటి జీవితాలు జైళ్లల్లో మగ్గుటకు కారకులు అవుతున్నారు.

8. నవీన్ రెడ్డి షెడ్ వేయటం, బుచ్చి రెడ్డి & కంపేనీలు రెచ్చిపోయి నవీన్ రెడ్డిని లూటీ (డబ్బు ను, మానసికంగా) చేసేటందుకు .. వీరందరూ కలిసి వైశాలి కుటుంబంను రోడ్డుపైకి లాగేసేటందుకు కారకులు పోలీసులే. పోలీసులు ‘చేతనం’ ను కోల్పోయారు. సాధారణ మనుషులుగా వారి ఆలోచనలు సాగాయి.  

9. ఒక వర్గం మీడియా ఒక “పేయిడ్ మీడియా” గా అవతారం ఎత్తినప్పటి నుండి డబ్బు – పలుకుబడికి అమ్ముడు పోతూనే ఉంది. ఇది పౌర సమాజానికి హాని కలిగిస్తున్న విషయాన్నే గమనంలోకి తీసుకోకుండా .. వారి స్వార్ధానికే బాధితులను వాడేస్తుంది. అందుకే నవీన్ రెడ్డిని” విలన్ అతనే – హీరో అతనే ” అని టైటిల్ ఇచ్చి రాస్తున్నాయి. రెండు జీవితాలు, రెండు కుటుంబాల బ్రతుకులు ముడిపడి ఉన్న విషయాన్ని గుర్తించకుండా, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి వారి రాతలు, వీడియోలు వస్తున్నాయి. వీరి రాతలతో పౌర సమాజం .. స్పర్శను కోల్పోయింది. దీనికి మొత్తం కారణం పోలీసుల తీరు, మూడు నెలల కిందటనే నవీన్ రెడ్డి షెడ్ వేయటంపై , బుచ్చిరెడ్డి & కంపేనీపై సరి అయిన చర్యలు ఉండి నుంటే వైశాలి కుటుంబం, నవీన్ రెడ్డి కుటుంబం రోడ్డుకు వచ్చేవి కావు.

10. వైశాలి అపహరణ కేసులో మొదటి ముద్దాయిగా SHO, ఆదిబట్ల PS వారిని, రెండవ ముద్దాయిగా బుచ్చి రెడ్డి & కంపేనీను, మూడవ ముద్దాయిగా నవీన్ రెడ్డి లను ఈ క్రమ సంఖ్యలో కేసు సాగాలి. అప్పుడే నేరం చేపించే వ్యక్తులలో, వ్యవస్థలలో మార్పు వస్తుంది. నేర ప్రవృత్తి ని కలిగిన వారితోనే పౌర సమాజం చాలా నష్టపోతూ వస్తుంది. నవీన్ రెడ్డి లాంటి వాళ్ళు నేర ప్రవృత్తి వారి చేతులకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతారు. వైశాలి లాంటి దంత వైద్యులు నష్టపోతూనే ఉంటారు. కుటుంబాలు – కుటుంబాలు అవమానాలకు గురౌతూనే ఉంటాయి.

11. ప్రజా ప్రతినిధులు సమస్యను సమస్యగా చూడటం అలవర్చుకోవాలి. పార్టీ ఫండ్ కోసమో, ఎన్నికల్లో ఉపయోగపడుతారనియో .. పద్ధతి తప్పిన పనులు చేయటం ఆపాలి. సతీష్ రెడ్డి లాంటి వ్యక్తులు జోక్యం చేసుకొని సమస్యను జటిలం చేశారు. నవీన్ రెడ్డికి డబ్బు ఉండవచ్చు – పలుకుబడి ఉండవచ్చు, అయినంత మాత్రాన ప్రేమకు – పెళ్ళికి కొలమానికం అవే అని మీరెలా నిర్ణయిస్తారు? పోలీసులు ఇలాంటి వాళ్ళను బయట వదిలి పెట్టి ఉంచటమే పోలీసులు చేస్తున్న పెద్ద నేరం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం ప్రకారం, ఇండియన్ పోలీస్ కోడ్ ప్రకారం మీరు కూడా నేరస్థులే అవుతారని తెలుసుకోవాలి.

12. వైశాలికి, వైశాలి కుటుంబ సభ్యులకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రభుత్వం జరిపించాలి. వైశాలి కుటుంబానికి పూర్తిస్థాయి భద్రతను ప్రభుత్వం కలిపించాలి.

13. ప్రేమ పేరుతో ఆగడాలకు, దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్న వ్యక్తుల, సమూహాల, ప్రేరేపించే వారు … వీటి విషయాలపై గ్రౌండ్ రియాలిటీని ప్రభుత్వం చెక్ చేయాలి, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, నేరం జరగక ముందే ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే యువత యొక్క విలువైన జీవితాలకు ఎలాంటి భద్రతను ఇవ్వాలి అనే తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెకింగ్ చేయాలనీ, ఎంతటి వారైనా శిక్ష నుండి తప్పించుకోలేరనే మెసేజ్ ప్రభుత్వం నుండి పౌర సమాజంలోకి వెళ్ళవలసిన అవసరం నేడు “అత్యంత అవసరంగా” ఉంది.

14. ఇలాంటి కేసులను మిగతా చట్టాలతో కాకుండా ప్రత్యేకమైన చట్టాలతో… అనగా కౌన్సిలింగ్ తో సహా ఒక ప్రత్యేకమైన మెకానిజం నేడు అవసరం ఉంది. ప్రభుత్వాలు అటువైపు ప్రయాణించి, వ్యక్తిగత చట్టాలతో ముడి పెట్టకుండా, ప్రత్యేక చట్టం రాజ్యాంగం పరిధిలో ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రభుత్వాలు – ప్రజలు భద్రంగా ఉంటాయి.

ముగింపు : ఈ మొత్తం ఏపిసోడ్ ఇలా జరిగేంత వరకు పొలీసులు ఎందుకు తమాషా లెక్కలు వేస్తూ కూర్చున్నారు. ఏదో బలమైన కారణం ఉందని మా అభిప్రాయం. కావున దీని విషయంలో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలి.

జయ వింధ్యాల, టీమ్ లీడర్

నిజ నిర్ధారణ కమిటీ 

9440430263 / 9494869731

#16-8-913/D, Malakapet X Road,

Hyderabad, Telangana State, India

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles