Tuesday, June 25, 2024

ప్ర‌ణాళికాబ‌ద్ధ కృషికి పుర‌స్కారం.. బీజేపీ సిగ‌లో దుబ్బాక

ఎస్‌.. అది క‌చ్చితంగా ప్రోత్సాహాన్నిచ్చే గెలుపే. సందేహం లేదు. కానీ, అది ఎలా సంభ‌వ‌మైంది? అప్ప‌టిక‌ప్పుడు సాధించిన గెలుపు కాదిది. ఎంతో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చేసిన కృషికి ఇది బ‌హుమ‌తి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి అందిన పుర‌స్కారం. దీనివెనుక భార‌తీయ జ‌నతా పార్టీ సోష‌ల్ మీడియా బృందం కృషి ఉంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను జెట్ స్పీడుతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయడంలో అకుంఠిత దీక్ష ఉంది. ఇదంతా ఒక ఎత్త‌యితే, వ్యూహక‌ర్త‌ల‌ది మ‌రో పాత్ర‌.

రామ్ మాధవ్ ట్వీట్

దుబ్బాక ఓట్ల లెక్కింపు పూర్త‌యిన రెండు గంట‌ల‌కు బీజేపీ జాతీయ నేత రామ్ మాధ‌వ్ ఒక ట్వీట్ చేశారు. దుబ్బాక‌లో ఎన్నిక‌ల కౌంటింగ్ చాలా ఉత్కంఠ‌భ‌రితంగా జ‌ర‌గ‌బోతోంద‌ని. ఎంతో సునిశిత ప‌రిశీల‌న చేస్తే త‌ప్ప ఈ విష‌యం అవ‌గ‌తం కాదు. దీనికి కార‌ణం ఉంది. దుబ్బాక ప్రాథ‌మికంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి అడ్డా. ఎన్నిక ఏదైనా సారు పేరు మార్మోగాల్సిందే. కారు జోరుగా ప‌రుగుతీయాల్సిందే. మంత్రి హ‌రీశ్ రావు నేతృత్వంలో సాగిన ప్ర‌చారం అలాంటిది మ‌రి.

ఊహకు అందని విషయం

దుబ్బాక‌లో టిఆర్ఎస్ ఓట‌మి పాల‌వుతుంద‌నే అంశం ఎవ‌రి ఊహ‌కూ అంద‌లేదు. ఈ ఒక్క అంశమే చాలు టిఆర్ఎస్ ప్ర‌చార హోరు గురించి చెప్పుకోవ‌డానికి. అయినా టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్క‌డ అభ్య‌ర్థి ప్ర‌ధానం కాదు. పార్టీ అంతే. దుబ్బాక‌లో ప్ర‌చారాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌న భుజాన‌కెత్తుకున్నారు. ర‌క‌ర‌కాల ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డానికి అధికార పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. అయినా ఫ‌లితం లేక‌పోయింది. బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో స‌మ‌ర‌శీలంగా ప‌నిచేశారు. తాడో పేడో అన్న‌ట్లుగా క‌దం తొక్కారు. ఫ‌లితంగా దుబ్బాక‌లో కాషాయ జెండాను ఎగుర‌వేశారు.

వాట్సాప్ ప్రచారం

నియోజ‌క‌వ‌ర్గ‌వ్యాప్తంగా  వాట్సాప్ మొత్తం ఓట‌ర్ల మొబైల్ నెంబ‌ర్ల‌ను సేక‌రించుకున్నారు. ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హించారు. ఎప్ప‌టిక‌ప్పుడు కీల‌క‌మైన అంశాల‌ను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఓట‌ర్ల‌కు చేర‌వేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాల‌కు స‌త్వ‌ర ప్ర‌చారాన్ని క‌ల్పించారు. ముఖ్యంగా త‌మ‌కు వ్య‌తిరేకంగా సాగే అంశాల‌కు ఉదాహ‌ర‌ణ‌కు ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంటిపై పోలీసుల దాడి, హైద‌రాబాద్‌లో స్వాధీనం చేసుకున్న కోటి రూపాయ‌లు బీజేపీవేన‌ని పోలీసులు ప్ర‌క‌టించ‌డం, బండి సంజ‌య్ అరెస్టు త‌ద‌నంత‌ర ప‌రిణామాలు త‌దిత‌రాలు.  అన్నిటికంటే ప్ర‌ధానంగా కార్య‌క‌ర్త గంగుల శ్రీ‌నివాస్ ఆత్మ‌హుతి తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది. ఈ అంశాల‌న్నింటినీ బీజేపీ బ‌లంగా ప్ర‌జ‌ల‌లోకి వేగంగా తీసుకెళ్ళ‌గ‌లిగింది. ఇవ‌న్నీ క‌లిసి, ఓట‌ర్ల‌లో ఆలోచ‌న‌ను రేకెత్తింప‌జేసి ఉంటాయి.

రఘునందన్ కు ఓటు బ్యాంక్

దీనికి తోడు దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ రెండు సార్లు పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ అంశం కూడా ఓట‌ర్ల‌ను ఆలోచింప‌జేసి ఉండ‌వ‌చ్చు. ర‌ఘునంద‌న్‌కు దుబ్బాక‌లో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉందా అనేది సందేహ‌మే. బంధు బ‌ల‌గం మాత్రం ఉంది. బ‌లీయ‌మైన ప్ర‌త్య‌ర్థిని మ‌రింత దృఢ నిశ్చ‌యంతో ఎదుర్కొన్నారు ర‌ఘునంద‌న్ రావు బృందం. ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగ‌న‌ప్ప‌టికీ, రామ్‌మాధ‌వ్ వంటి నేత‌లు తెర‌చాటు మంత్రాంగం న‌డిపారు. ఈశాన్య రాష్ట్రాల‌ను బీజేపీ ఖాతాలో చేరడం వెనుక రామ్‌మాధవ్ కృషిని కాద‌న‌లేం. అలాంటి వ్యూహ చ‌తురుడు వెన‌క నిల‌బ‌డితే…కొండంత బ‌ల‌మే క‌దా! అయితే, బీజేపీ శ్రేణులు ఈ గెలుపును దుబ్బాక‌కే ప‌రిమితం చేసుకోవాలి.

తొడలు కొట్టడం మానాలి

టీఆర్ఎస్ ప‌త‌నానికి ఇదే నాంది అంటూ తొడ‌లు కొట్ట‌డం మానాలి. గ్రేట‌ర్‌లో పాగా వేయ‌డం మాట అటుంచి ఏకంగా ఇది 2023లో త‌మ పార్టీ గెలుపున‌కు సూచిక అని కొంద‌రు నేత‌లు ప్ర‌క‌టించుకోవడం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. దుబ్బాక‌లో వ‌చ్చింది కేవ‌లం వెయ్యి ఓట్ల పైచిలుకు ఆధిక్య‌త‌. అంత‌కు ముందు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ సాధించిన ఆధిక్య‌త 62వేలు. అంత కాక‌పోయినా అందులో సంగం ఆధిక్య‌త తెచ్చుకుని అసెంబ్లీ ఫ‌లితాల‌కు అన్వ‌యించుకుంటే బాగుండేది. ఇలాంటి అత్యుత్సాహాలు మొద‌టికే మోసాన్ని తెస్తాయి. ప్ర‌త్య‌ర్థి ఎంత బ‌ల‌వంతుడో బీజేపీకి తెలియ‌క కాదు. ఈ ప్ర‌క‌ట‌న‌ల వెనుక కేసీఆర్ మనోనిబ్బ‌రాన్ని దెబ్బ‌తీయ‌డ‌మ‌నే వ్యూహం ఉండి ఉండ‌వ‌చ్చు. కానీ ఆ స్థాయి ప్ర‌చారానికి ఇంకా స‌మ‌యం రాలేదని బీజేపీ శ్రేణులు గుర్తెర‌గాలి. ఒక్క విష‌యం మాత్రం వాస్త‌వం. ఏ ఎన్నిక‌లోనైనా ఇక బీజేఈ ఇదే త‌ర‌హా ప్ర‌చార వ్యూహాన్ని అనుస‌రించ‌బోతోంద‌న్న‌ది నిజం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles