Friday, September 29, 2023

చమత్కారం… ‘పింగళీయం’

పింగళి వారి పేరు వినగానే మాటల మాంత్రికుడని అలవోకగా అనేసేవారు అనేస్తారు. ఆయన చేసిన పద ప్రయోగాలు, పాత్రలకు పెట్టిన పేర్లు, సంభాషణల్లో చతురోక్తులు అలాంటివి మరి. వర్తమానంలో కొందరు రాజకీయవేత్తలను, కొందరు రచయితలను అలా ముద్దుగా  సంబోధించుకుంటున్నా పింగళి నాగేంద్రరావు భాషలో జీవం ఉంటుంది.  నేడు `పంఛ్`లుగా చెప్పుకునేవే మాటల మాంత్రికత్వమైతే ఆయన దానికి అతీతులుగా చెప్పాలి. పాత్రలకు ఆయన పెట్టే పేర్లు, వాడిన భాష, మాటలు, పాటలలోని పల్లవులు లోకోక్తులుగా, చతురోక్తులుగా, సూక్తులుగా ప్రసిద్ధి పొందాయి. వీటి వల్ల ఇతరుల  మనోభావాలను కించపరిచే ఊసే ఉండదు. ఆయన పాటలోని పల్లవులు, చరణాలే సినిమా పేర్లుగా స్థిరపడిపోయాయి. దివంగత దర్శక రచయిత జంధ్యాల తన చిత్రాలకు పింగళి వారి  పదబంధాలనే `చూపులు కలసిన శుభవేళ`, ‘అహ నా పెళ్లంట`, `వివాహభోజనంబు`,`హైహై నాయక` అని  పేర్లు పెట్టారు. `ఎంత ఘాటు ప్రేమయో`, `రావోయి చందమామ`, `సాహసం శాయరా ఢింభకా`,`లాహిరి లాహరి లాహిరిలో`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే` సినిమా పేర్లు  కూడా పింగళి పాట పల్లవులలోనివే.

‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్

భావం భాషకు బందీ కాకూడదు. భావం తన అవసరానికి భాషను వాడుకుంటుంది. భావం బాగుంటుందనుకున్నప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంలో తప్పు లేదు. సమాసాలు కూడా మడికట్టుకుని పేర్చుకోనక్కర్లేదు` అన్నది ఆయన  భావన, వాదన. ‘ఎంతఘాటు ప్రేమయో`(పాతాళభైరవి) దుష్ట సమాసమనీ, భావప్రకటన కూడా చేతకాదని విమర్శించారనీ, కానీ  ఆ చిత్రంలోని కథానాయకుడు తోటరాముడి పాత్రను బట్టి అతని ప్రేమ ఘాటైనది కనుకే యువరాణితో అలా పాడుకున్నాడని  వివరించారు పింగళి. కొత్తపదాలు తయారు చేయడం, ఉన్నవాటిని హ్రస్వీకరించడం సరదా. `యుగయుగాలు` అంటారు కానీ `జగజగాలు` (పెళ్లి చేసి చూడు`)అనరు. కానీ పింగళి వారు అనిపించేశారు. `ఉర్రూతలూగించిన`  అనేది `ఊగించిన, ఉర్రూగించిన` అని  అనేశారు.`పదాలను ప్రయోగించడంలో బాగుంటుందనుకుంటున్నప్పుడు వేసేయడమే. అశ్లీలం ధ్వనించనంత వరకు అభ్యంతరం   ఏముంటుంది?` అని అనేవారు

`గర్భగుడి` లాంటివి ఎన్నోమాటలు వాడుకలోకి వచ్చినప్పుడు ఇంకా అభ్యంతరాలెందుకు? మడికట్టడం ఎందుకు? సామాన్యులకు వినోదం పంచడమే ప్రధానం. అందుకే `ఎవరూ పుట్టించకపోతే మాటలెలాపుడతాయ్?`(మాయాబజార్) ప్రశ్నించాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ప్రశ్నించిన తరవాతనే పుంఖానుపుంఖాలుగా మాటలు పుట్టాయి. కొన్నిమాటలు కొత్తవిగా ఉన్నా, మరికొన్నిటిని ఉన్నవాటినే వెలికి తెచ్చి వాడాను తప్ప కొత్తగా పుట్టించలేదనేవారు. `హలా`అంటే  సంబోధన, `డింగరీ`అంటే సేవకుడు/భక్తుడూ, `గిడిగిడి` అంటే నమస్కారం అని వివరించారు. ఆయన మాట ప్రకారమే అవి అప్పటికే ఉన్నప్పటికీ   జనం నాలుకల మీదికి తెచ్చిన ఘనత మాత్రం పింగళి కవిదే.

ఉద్యోగం చదువు     

ఉత్తరాంధ్రలోని రాజాంలో 1901 డిసెంబర్ 29న పింగళి గోపాలకృష్ణయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన నాగేంద్రరావు సర్కార్ జిల్లా (కృష్ణా)లోని బందరులో చదువు సాగించారు. తల్లిగారిది దివిసీమ కావడంతో బందరు జాతీయ కళాశాలలో చదివారు. అప్పట్లో ప్రతిష్ఠాత్మకమైన ఆ  కళాశాలలో తొలి విద్యార్థి కావడం, డాక్టర్ ముట్నూరు కృష్ణారావు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోపల్లె హనుమంతరావు వంటి గొప్పవ్యక్తుల పరిచయ భాగ్యం కలిగింది. చదువుపూర్తయి న వెంటనే (1918)లో ఖరగ్ పూర్ రైల్వే వర్క్ షాపులో అప్రెంటీస్ గా చేరారు. ప్రముఖ వ్యాయామవేత్త బులుసు రామజోగారావు ఖరగ్ పూర్ సందర్శన సందర్భంగా ఇచ్చిన  జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాలతో  యువరక్తం ఉప్పొంగి ఆ ఉద్యోగాన్ని రెండేళ్లలోపే వదిలేసి  సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడి వాతావరణ నచ్చి అక్కడే ఉండిపోవాలనుకున్నారు. కానీ అశ్రమ నిర్వాహకులు అందుకు సమ్మతించక `కాంగ్రెస్ సంస్థలో చేరి దేశసేవ చేయాల`ని సూచించి, ఆశ్రమ నిర్వాహకుడు కాకా కలేల్కర్ కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు ధన్వాడ రామచంద్రరావుకు సిఫారుసు లేఖ రాసిచ్చారు. అలా వేతనంతో  కాంగ్రెస్ ఆర్గనైజర్ గా ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు బందరు వచ్చిన డాక్టర్ పట్టాభి అక్కడ పింగళిని చూసి `ఆర్థిక స్థోమత ఉన్నవారే  కాంగ్రెస్ పార్టీకి సేవ చేయగలరు. బతుకు తెరువు కోసం పార్టీపై ఆధారపడితే భారమవుతుంది` అని చెప్పడంతో  ఆయన సలహా మేరకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

పాత్రికేయుడిగా…నాటకకర్తగా

కాంగ్రెస్ ఆర్గనైజర్ పదవికి రాజీనామా చేసిన తరువాత డాక్టర్ పట్టాభి చొరవతోనే  కౌతా రామశాస్త్రి ఆధ్వర్యంలోని  `శారద` పత్రికలో (1923) కుదురుకున్నారు. సంస్కృతాంధ్రభాషల్లో మంచి ప్రవేశం కలిగిన పింగళి తొలుత నాటకకర్త. `వింధ్యా రాణి, నారాజు, క్షాత్రహిందూ, ఒకే కుటుంబం, జేబున్నీసా` లాంటి నాటకాలు రాశారు. `ఒకే కుటుంబం` నాటకానికి `  నవ్యసాహితీ సమితి` 1939లో ఉత్తమ  బహుమతిని ప్రకటించింది.`శారద`లో  పనిచేస్తున్నప్పుడే  డీఎల్ రాయ్ నాటికలు `మేవాడిపతన్`, `పాషాణి` ని తెలుగులోకి అనువదించి కృష్ణాపత్రికలో ప్రచురించారు.  `జేబున్నిసా`,`వింధ్యారాణి`నాటకాలు కృష్ణాపత్రికలోనూ,`నారాజు` భారతిలోనూ ప్రచురితమయ్యాయి. మరో రెండేళ్లకు `శారద` పత్రిక మూతపడడంతో పాత్రికేయానికి స్వస్తి చెప్పి ప్రముఖ రంగస్థలనటుడు డీవీ సుబ్బారావు సొంత సంస్థ (ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ)లో కార్యదర్శిగా చేరారు. ఆయన నాటకాలను డీవీ తమ సంస్థ ద్వారా ప్రదర్శించేవారు. `వింధ్యారాణి`ఎక్కుసార్లు ప్రదర్శితమై. ఆ నాటకం సినిమాగా వచ్చేంతవరకు (1948)  సంస్థలోనే ఉన్నారు. వినోదం, చమత్కారం ఉంటే ప్రేక్షకులు ఏ నాటకాన్నైనా,  ఏ కళారూపాన్నైనా అదరిస్తారని అప్పడే ప్రేక్షకుల నాడి తెలిసిందట. కథ ఏదైనా వినోద ప్రధానంగా ఉండాలని, విషాదం, బరువైన సన్నివేశాల వెనుక వినోదం ఉండాలని, అప్పుడే ప్రదర్శనలు రక్తికడతాయని భావించేవారు. అటు తరువాత గుణసుందరికథ, పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, శ్రీకృష్ణార్జునయుద్ధం…ఇలా ఎన్నో వినోద ప్రధానమైన చిత్రాలు ఆయన కలం నుంచి జాలువారాయి.

ప్రధానంగా నాటక రచయిత

పింగళి సినీకవి కంటే ముందు ప్రధానంగా నాటక రచయిత. ప్రతిపాత్రకు స్వభావానికి తగినట్లు మాటలు ఉండాలనేవారు. భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీశంకరుల కథ` చిత్రాల్లో  కథానుగుణంగా కోయపాత్రల కోసం వారి భాషను,  కళింగాంధ్ర యాసను ప్రయోగించడం అందుకు ఓ ఉదాహరణ. పాటల్లో కూడా  తేలిక  పదాలు ఉండాలని, పాట వినగానే  భావం వెంటనే తెలియాలన్నది ఆయన  నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కువగా వాడుకభాషలో, తెలుగు నుడికారంతో పాటలు  రాశారు. తానూ అలా రాయడానికి  పింగళి వారు  స్ఫూర్తి అనే వారు ఆచార్య ఆత్రేయ. మొదటే చెప్పుకున్నట్లు ఇద్దరూ  నాటకరచయితలు కావడం సామీప్యం.

సినీప్రస్థానం

`భలేపెళ్లి, తారుమారు` అనే జంటచిత్రం (1942) చిత్రంతో పింగళి సినీ ప్రస్థానం మొదలైంది.  ఆ సినిమాతో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చేవేమో కానీ అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధంతో చిత్రనిర్మాణం కుంటుపడింది. దాంతో ఆయన బందరు తిరుగు ముఖం పట్టి నాటకల్లో నిమగ్నమయ్యారు. అక్కడే ఉన్న కమలాకర కామేశ్వరరావు గారు ఆయన ప్రతిభ విశేషాలను గుర్తించి మద్రాసుకు రప్పించడం, యుద్ధవాతావరణ సమసిపోవడంతో పింగళి కథ, మాటలు,పాటలు అందించిన `వింధ్యారాణి` (1948) చిత్రీకరణ మొదలైంది. అది నిర్మాణంలో ఉండగానే కమలాకర కామేశ్వరరావు గారు పింగళిని కేవీరెడ్డి గారికి పరిచయం చేశారు. అప్పటికే `గుణసుందరి కథ` చిత్రం తీయాలనుకుంటున్న కేవీరెడ్డి ఆ రచన బాధ్యతలను పింగళికి అప్పగించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ. చిత్రంలోని మాటలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. `కింగ్ లియర్` నాటకం ఆధారంగా రాసిన  `గుణసుందరికథ`తో ఆయనకు ఎనలేని ప్రేక్షకాదరణ పెరిగింది.  ఆ సమయంలోనే విజయా సంస్థ ప్రారంభం కావడంతో `త్రిమూర్తులు` (కేవీ, కమలాకర, పింగళి)అందులో చేరారు.  పింగళి విజయాకు ఆస్థాన కవిగా ఉంటూనే ఇతరుల చిత్రాలకు పనిచేశారు. మొదటి జంటచిత్రం (భలేపెళ్లి, తారుమారు)నుంచి చివరి చిత్రం (చాణక్య చంద్రగుప్త) వరకు మూడున్నర దశాబ్దాలలో కేవలం 28 చిత్రాలకు పనిచేశారు (`నాగసుందరి కధ స్ర్కిప్ట్  రాశాక నిర్మాణం ఆగిపోయంది).`  వాటిలో 19 చిత్రాలకు కథ, మాటలు, పాటలు; ఒక చిత్రానికి కథ, మాటలు; నాలుగు చిత్రాలకు మాటలు, పాటలు; నాలుగు చిత్రాలకు కేవలం పాటలే అందించారు.  `రాశి కన్నా వాసి మిన్న` అన్నట్లు ఆయన ప్రతిమాట, ప్రతి పాట, ప్రతిపదం రసగుళికే.

పింగళి `పాత్రల` పేర్లు

నాగేంద్రరావు గారు సృష్టించిన పాత్రల్లోనే డ్రామా ఉంటుంది. సన్నివేశంతో నిమిత్తం లేకుండానే ఆయా పాత్రలే కలకలంగా గుర్తుండి పోతాయి. తన పాత్రలకు పెట్టిన పేర్లు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. హరమతి, కాలమతి (గుణసుందరి కథ), సదాజప, అంజిగాడు, తోటరాముడు, రాణిగారి తమ్ముడు (పాతాళభైరవి), ఎంతచెబితేఅంతగాళ్లు, నిక్షేపరాయుడు  (చంద్రహారం), ఏకాశ, రెండు చింతలు, త్రిశోకానందుడు  (జగదేకవీరునికథ) .`శ్రీకృష్ణార్జునయుద్ధం`లో యతి వేషంలో న్న అర్జునుడికి ఆయన దశనామాల నుంచి ఒక్కొక్క అక్షరాన్ని ఏరి `అజబీదఫపా విశ్వేసకి  స్వాములవారు` అని నామకరణం చేశారు. వినడానికి విచిత్రంగా, గంభీరంగా అనిపిస్తుంది. ఇలా పాత్రలు పేర్లు, ఊతపదాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు.

అంత్యదశలో అనారోగ్యం

జీవితాంతం బ్రహ్మచారిగా  ఉన్న పింగళి గారు  రామమూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. చివరి రోజుల్లో  ఉబ్బసం, క్షయ వ్యాధితో బాధపడుతూ 1971 మే 6వ తేదీన `నాగేంద్రహారుడి`లో లీనమయ్యారు.  ఆయన కథ, మాటలు, పాటలు రాసిన  `శ్రీకృష్ణ సత్య`, మాటలు, పాట అందించిన `నీతినిజాయతీ`, కథ, మాటలు రాసిన `చాణక్య చంద్రగుప్త` ఆయన స్వర్గస్తులయ్యాకనే విడుదలయ్యాయి.

(మంగళవారం,  డిసెంబర్ 29న పింగళి జయంతి)

Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles