Thursday, March 28, 2024

మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

అతనొక నిత్యచైతన్య ఉద్యమ తరంగం. పేరు – దేవగుప్త పేరలింగం. రాజమండ్రిలో ఒక సాధారణ కార్మికుడు. ఎక్కువగా చదువుకోలేదు. కానీ, ఆయన కృషి గురించి తెలుసుకుంటే గొప్ప గొప్ప విద్యావేత్తలు సైతం సిగ్గుతో తలదించుకోవల్సిందే! ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు. జీవిత కాలమంతా ఒంటరిగానే సైన్సు-హేతువాద ప్రచారంలో తలమునకలై గడిపారు. తన సైకిల్ కి ‘‘హేతువాద చైతన్య రథం’’- అని బోర్డు తగిలించుకుని వెనక సీటు మీద పుస్తకాల సంచి పెట్టుకొని, గోదావరి జిల్లాలలో ఊరూరా తిరిగేవారు. గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలు తగ్గించడానికి జీవితాన్ని దారపోశారు. నిక్కరు, ఆఫ్ షర్టూ వేసుకొని, కాళ్ళకు స్లిప్పర్స్ తో సైకిల్ మీద మారుమూల గ్రామాలన్నీ తిరిగే పేరలింగాన్ని ఆ ప్రాంతంలో అందరూ గుర్తుపడతారు.

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

దేవగుప్తపు పేరలింగం 06 సెప్టెంబర్ 1942న ఒక పేద వడ్రంగి కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో వారికి చదువుకునే అవకాశం లేదు. అయినా, అంతర్గతంగా అక్షరాల పట్ల పొంగుకొచ్చిన ప్రేమాభిమానాల వల్ల తెలుగు అక్షరాలు నేర్చుకోగలిగారు. ఉన్నత విద్య సాధించలేకపోయినా, తన పరిమితమైన పరిజ్ఞానంతోనే ప్రశ్నించడం నేర్చుకున్నారు. ప్రశ్న – ఆయనలోని శోధనశక్తిని తట్టిలేపింది. ఆ ప్రశ్నతో, ఆ శోధనతో – హేతువాదిగా మారారు.

సెప్టెంబర్ 4న రాజమండ్రిలో దేవగుప్త పేరలింగం, ఆయన సతీమణికి జీవనసాఫల్య పురస్కారం అందజేసినప్పటి చిత్రం

1980లలో రాజమండ్రి హేతువాదానికి మంచి కేంద్రంగా ఉండేది.  రావిపూడి వెంకటాద్రి, పెన్మత్స సుబ్బరాజు, కత్తి పద్మారావు మొదలైన వారంతా రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో సభలు నిర్వహించేవారు. వేల సంఖ్యలో జనం హాజరయ్యేవారు.  ఆ వేలమందిలో ఈ డి. పేరలింగం ఒకరు. ఆ ఒక్కడు ఒక్కడిగా మిగిలిపోలేదు. ఒక్క దీపం వందల వేల దీపాలు వెలిగించినట్టు – ఆ ఒక్కడే, తను సముపార్జించిన హేతువాద పరిజ్ఞానం ఊరూరా తిరిగి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో గాలి శేషగిరిరావు అనే ప్రసిద్ధ ప్రవచనకారుడు ఉండేవారు. హేతువాదులంతా కలిసి, అదే సుబ్రహ్మణ్యం మైదానంలో ఆ ప్రవచనకారుడి బండారం ప్రజల ముందు పెట్టారు. అది కళ్ళారా చూసిన పేరలింగం తన ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. ఒక సారి అనారోగ్యంతో  కదలకుండా ఇంటిపట్టున ఉండాల్సివస్తే, ఆయన ఆ సమయాన్ని పుస్తక పఠనానికి, అధ్యయనానికి వినియోగించారు. సమయం వృధా చేయకుండా తన ధ్యేయానికి అనువుగా మలుచుకున్నారు.

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. అది అబద్ధాలకు లొంగకూడదు అని నిర్ణయించుకుని, జనంలో తిరగడానికి, హేతువాద ప్రచారానికి ఉద్యమించారు. తనకు తెలిసిన, తను తెలుసుకున్న అంశాలు సరళమైన తెలుగులో  రాయడానికి కూడా ప్రయత్నించారు. అలా కొన్ని చిన్నచిన్న పుస్తకాలు తయారయ్యాయి. అయితే, అవి అచ్చేయడం ఎలాగో, అవి జనానికి అందించడం ఎలాగో ఆయనకు అప్పటికి తెలియదు. అందుకు కావల్సిన డబ్బు కూడా ఆయన దగ్గర లేదు. ఒక సారి రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియం మండల కేంద్రంలో హేతువాదులు కలుస్తున్నారని పేరలింగానికి తెలిసింది. అంతే – ఆయన హూటాహుటిన అక్కడికి వెళ్ళారు. సైకిల్ మీద ఊరూరూ తిరిగి హేతువాదం ప్రచారం చేస్తున్న ఈ పెద్దమనిషిని అక్కడ కొందరు గుర్తించారు. తను కొన్ని చిరుపొత్తాలు రాశానని అవి ఎలా ఎక్కడ అచ్చేయాలో తనకు తెలియదని ఆయన సభలో చెప్పారు. వెంటనే అక్కడున్న యువకులంతా స్పందించారు. ఉన్నఫళంగా నలభై వేల రూపాయలు పోగుచేసి ఇచ్చారు. ప్రజాపత్రిక సంపాదకుడు సుదర్శన్, ఆయన శ్రీమతి దేవి ముందుకొచ్చారు. ప్రచురణ బాధ్యత తమ మీద వేసుకున్నారు. ప్రూఫ్ లన్నీ స్వయంగా సుదర్శన్ గారే చూసేవారు. ఆ రకంగా దేవగుప్త పేరలింగం అనే హేతువాద కార్యకర్త జనానికి రచయితగా పరిచయమయ్యాడు.నలభై ఏళ్ళ క్రితమే తెలుగు నాట మనిషి కేంద్రంగా గొంతెత్తిన గళంగా, కలంగా ఆయన నిలబడిపోయారు. ఆరు ఏడేళ్ళ కాలంలో పదికి పైగా పుస్తకాలు ప్రచురించారు.

ఆయన పుస్తకాల శీర్షికలు కొన్ని ఇలా ఉన్నాయి….

  1. ప్రాచీన కుల సంస్కృతి – సామాజిక ప్రగతి.
  2. ఓ మహిళా నీకు మతమెందుకమ్మా?
  3. సైన్సు ప్లస్ మూడనమ్మకాలు
  4. బైబిల్ – శాస్త్రీయ విశ్లేషణ
  5. ఆది మానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గువల్ల కాదు.
  6. మతతత్వం స్త్రీ వ్యక్తిత్వం
  7. పట్టువదలని హేతువాది విక్రమార్కుడు పేరలింగం-స్వగతం (జీవిత చరిత్ర)
  8. మంత్రాల్లో దాగి ఉన్న బూతుల మర్మం
  9. వరూధిన వివాహం – హేతువాద సూక్తులు
  10. శ్రీవెంకటేశ్వర సుప్రభాత శృంగారం
  11. పాకలపాటివారి సంక్షిప్త చరిత్ర.

ఈ పుస్తకాల శీర్షికలు చూస్తేనే ఆయన ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం కొంతలో కొంత అర్థమవుతుంది. ఆయనకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అభ్యుదయ ప్రజాసంఘాల ఐక్య సమాఖ్య – రాజమహేంద్రవరం (ఫోన్ : 9032094492/9502654774)వారు రాజమండ్రిలోని ప్రదీప్ కేర్ హాస్పిటల్లో 04 సెప్టెంబర్ 2022న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఇలాంటి నిస్వార్థజీవుల్ని గుర్తించి గౌరవించుకోవడం మన కర్తవ్యం. ఎటు నుండి ఏ ఆధారమూ లేని పేరలింగంగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పెన్సన్ తో ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి కూడా నేటి కేంద్ర ప్రభుత్వం పెద్దలు పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని ఎదుర్కుని నిలబడడం మాటలు కాదు కదా?

పేరలింగం జీవన సాఫల్య పురస్కారం సందర్భంగా జరిగిన సభ

ఎక్కువగా చదువుకోనందుకు, వంగ్రంగి కార్మికుడిగా జీవనం సాగిస్తున్నందుకు, దయనీయమైన స్థితిలో ఉండి కూడా హేతవాదం మాట్లాడుతున్నందకు భూస్వాములు, దనవంతులు, అగ్రవర్ణాలవారి నుండి ఎన్నో అవమానాలు ఎదురయ్యేవి. ఓపికగా పేరలింగం అన్నింటినీ సహించారు. నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమయ్యేవారు. తలవంచుకుని వెళ్ళిపోయేవారు. విద్యావంతులైన మూర్ఖుల్ని ఎదుర్కుని చలాకీగా తిప్పిగొట్టగల సామర్థ్యం లేనందువల్ల – వక్తగా, రచయితగా గుర్తింపు పొందే అవకాశం లేక చాలా కాలం కార్యకర్తగానే జనంలో ఉండిపోయారు. అలా కూడా ఎన్నో దాడులకు, బెదిరింపులకు గురయ్యారు. అయినా గత మూడు దశాబ్దాలుగా ఆయన ఎన్నడూ అధైర్యపడలేదు. వెనకడుగు వేయలేదు. అమాయక గ్రామీణుల మెదళ్ళలో ప్రశ్నలు మొలిపిస్తూ సనాతన సంప్రదాయాల మోసాలు బట్టబయలు చేస్తూ, తన చైతన్యారథాన్ని ముందుకు దూకించేవారు. నిజానికి అది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మనం అనుసరించాల్సిన అంశం ఇదే. పేరలింగంగారి వలె గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు విస్తృతంగా తిరిగి, విద్యార్థుల్ని, అక్కడ పౌరుల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఉపన్యాస కార్యక్రమాలు, ఆన్ లైన్ లెక్చర్లు ప్రధాన పత్రికల్లో వ్యాసాలు రాయడం వంటి పనులు చేస్తూనే మూఢనమ్మకాల నిర్మాలనకు పనికి వచ్చే అంశాల్ని జనానికి ప్రత్యక్షంగా ప్రదర్శించాల్సిందే! విడమరిచి చెప్పాల్సిందే!! అనాగరికుల్నినాగరికులుగా మలచడం ఒక ఎత్తయితే, నాగరిక మూర్ఖుల్ని వివేకవంతుల్ని చేయడం మరొక ఎత్తు. అందరూ అన్ని పనులు ఒకే సామర్థ్యంతో చేయలేరు. అందుకే సైన్సు-హేతువాద ప్రచారరంగంలో పని చేయాలనుకునేవారు ఎవరికి వారు నిర్ణయించుకుని కర్తవ్యోన్ముఖులు కావాలి!

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

ఒకవైపు ఒక చక్కటి సైన్సు గ్రంథాలయం నెలకొల్పి, పది మందికి జ్ఞానం పంచుతూ, మరో వైపు దైవ మహిమలు చూపినవారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ఛాలెంజ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఏ మాత్రం నిలదొక్కుకోని జీవితంతో పోరాడుతూ, హేతువాద విషయం వచ్చే సరికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండగలగడం – ఆయన నిబద్ధతకు, నిజాయితీకి నిదర్శనం! —పేరలింగంగారు తన ముగ్గురు కొడుకులకు హేతువాద పద్ధతిలో వివాహాలు జరిపించారు. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, వినికిడి శక్తి బాగా కోల్పోయినా, ఆయనతన ధ్యేయం నుండి తన దృష్టిని మరల్చడం లేదు. ఒక ఆదర్శానికి కట్టుబడి జీవించడం మనం సమకాలీనంలో చాలా అరుదుగా చూస్తాం. అలాంటి అరుదైన వ్యక్తుల్లో చాలా అరుదైనవారు దేవగుప్తపు పేరలింగం సామాన్యుల్లో అసామాన్యుడు.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles